Saturday 27 June 2009

మొన్న మొన్నటి వరకు... అంగారకుడిపై నీరు?!


అంగారక గ్రహంపై ఒకప్పుడు పుష్కలంగా నీరు ఉండేది. అక్కడ ఒకప్పుడు సముద్రాలు కూడా ఉండేవి.

అవును, ఇందులో కొత్తేం ఉంది? ఇది అందరికీ తెలిసిన విషయమే కదా!

నిజమేకానీ, ఎప్పుడో వందల, వేల కోట్ల సంవత్సరాల క్రితం కాదు.. 1.25 కోట్ల సంవత్సరాల క్రితం కూడా అక్కడ నీరు ప్రవహించింది. (గ్రహాల ఆవిర్భావం నాటితో పోల్చుకుంటే ఈ 1.25 కోట్ల సంవత్సరాలు అనేది మొన్నమొన్నటి కిందే లెక్క మరి). ఇదీ సరికొత్త విషయం!

ఆ...


ఏవిటీ ఆధారం?
మార్స్‌ రికొనైసెన్స్‌ ఆర్బిటార్‌ తాజాగా అందించిన ఛాయాచిత్రాలే ఇందుకు ఆధారం. అంగారక గ్రహంపై నీటి జాడలను పసిగట్టేందుకు నాసా శాస్త్రజ్ఞులు ప్రయోగించిన ఈ ఆర్బిటార్‌ ఇటీవల ఆ గ్రహం మీదుగా వెళుతూ అక్కడి భూమిని నిశితంగా గమనించింది. మార్స్‌ రికొనైసెన్స్‌ ఆర్బిటార్‌ ఇటీవల భూమికి పంపించిన ఛాయచిత్రాలను బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన జే డిక్సన్‌ బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ విషయం బయటపెట్టింది.

గతంలో ఏమైంది?
నిజానికి అంగారకుడిపై నీటి జాడలకు సంబంధించి రికొనైసెన్స్‌ ఆర్బిటార్‌ గతంలోనే కొన్ని ఛాయ చిత్రాలను పంపింది. వీటిని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు గతంలో ఆ గ్రహంపై నీరు పరవళ్లు తొక్కిందని, సముద్రాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని తేల్చిపారేశారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తే ఏర్పడే లోయలను బట్టి వారు ఈ రకమైన నిర్ధారణకు వచ్చారు. అంతేకాక నీరు ఉండే చోట 'జీవం' ఆవిర్భవానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి.. అంగారకుడిపై ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందనే అనుమానానికి బీజం పడింది. ఈ నేపథ్యంలో అంగారక గ్రహం ఉత్తర «ద్రువానికి నాసా శాస్త్రజ్ఞులు 'ఫీనిక్స్‌ ల్యాండర్‌'ను పంపించడం, అది తన మరచేయి సహాయంతో అక్కడి భూ ఉపరితలాన్ని తవ్వి కొన్ని సెంటీమీటర్ల లోపల ఉన్న మంచును గుర్తించడంతో శాస్త్రజ్ఞుల ఆలోచనలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

అయితే ఇప్పుడేమిటీ?
తాజాగా జే డిక్సన్‌ బృందం అంగారక గ్రహంలో.. లాయట్‌ అనే ప్రదేశంలో ఉన్న అతి పెద్దదైన లోయను గుర్తించారు. ఇందులో మళ్లీ దాదాపు 20 వరకు చిన్న చిన్న లోయలు ఉన్నాయి. ఉత్తర «ద్రువం వద్ద భూమికి కొన్ని సెంటీమీటర్ల దిగువున ఉన్న మంచు కరిగి, నీరుగా మారి ఈ ప్రాంతం వైపు ప్రవహించిన ఉంటుందని, అందువల్లే ఈ ప్రాంతంలో ఏటవాలుగా ఉండే ఈ లోయలు ఏర్పడి ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు 3.5 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు పుష్కలంగా ఉండేదని శాస్త్రజ్ఞులు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ గణాంకాలు మారాయి. జే డిక్సన్‌ బృందం జరిపిన అధ్యయనం మేరకు 1.25 కోట్ల సవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ నీరు ఉధృతంగా ప్రవహించింది. "మేం కనుగొన్న ఈ లాయట్‌ ప్రాంతం.. అంగారకుడిపై గతంలో నీరు ప్రవహించిందని చెబుతున్న ప్రాంతాల కంటే వయసులో చాలా చిన్నది.. అంటే.. బహుశా ఆఖరి బిలియన్‌ (కోటి) సంవత్సరాల క్రితం ఈ లోయలు ఏర్పడి ఉండొచ్చు..'' అని కూడా జే డిక్సన్‌ వ్యాఖ్యానిస్తున్నారు. మరి, ఈ లెక్కన నీరు ఉండే చోట 'జీవం' ఆవిర్భవానికి కూడా అవకాశం ఉంటుందన్న శాస్త్రజ్ఞుల వాదన సరైనదే అయితే బహుశా అంగారకుడిపై 1.25 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కూడా 'జీవం' ఉనికి ఉండేదేమో!


0 comments: