
చంద్రునిపై ఓ మొక్క మొలిచింది. ఏమిటీ విచిత్రం.. అనుకుంటున్నారు కదూ! మొలిచిన ఆ మొక్క కాస్తా పెరిగి పెద్దదైంది.. మొగ్గలు తొడిగి, పూలు కూడా పూసింది. 
'ఛ.. క తలు చెప్పొద్దు బాస్..' అంటారా? మీరే కాదు, ఎవరైనా అలాగే అంటారు.  కానీ చెప్పక తప్పదు.. 'మ్యాటర్' అలాంటిది మరి.  నమ్మకపోతే మీరే చదవండి...
ఈ భూమిపై జనాభా విస్ఫోటం పెరిగిపోతోంది.  ఇలా పెరుగుతూ పోతే తలదాచుకోడానికి కాస్త చోటు కూడా దొరక్కపోవచ్చు.  ఇప్పుడు కాకపోయినా కొన్ని వందల సంవత్సరాలకైనా సరే మనం ఈ భూమిని వదిలిపెట్టి మరో గ్రహానికి వెళ్లాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చు.  అంగారక గ్రహంపై ఒకవేళ 'జీవం' ఆవిర్భవించినా ఇప్పుడక్కడ జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు లేనేలేవు.  నవ గ్రహాలలో ఒక్క చంద్రుడు తప్ప మరో గ్రహమేదీ సులువుగా వెళ్లగలిగేంత చేరువలో లేదు.  ఇంకేం చేస్తాం.. ఎప్పటికైనా చంద్రమండలం వెళ్లక తప్పదు.  ఒకవేళ అక్కడికి వెళ్లి బతకాల్సిన పరిస్థితే వచ్చిందనుకోండి.. ఏం తిని బతుకుతారు? ప్రతిదీ భూమి నుంచే తీసుకెళతారా?? ఎన్నిసార్లు తిరుగుతారు భూమి నుంచి చంద్రుడికి - చంద్రుడి నుంచి భూమికి???
'వామ్మో.. ఇంత కథ ఉందా? నిజమే బాస్.. మాకీ ఆలోచనే రాలేదు..' అంటారా.. అనకండి.  ఎందుకంటే ఈ ఆలోచన వచ్చినా మీరు, మేము ఏం చేయలేం.. ఒక్క ఖగోళ శాస్త్రవేత్తలు తప్ప. వారికి మాత్రం ఈ ఆలోచన ఎప్పుడో వచ్చేసింది.  అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై ఇప్పుడే ఓ మొక్కను మొలిపించడం మంచిదనుకున్నారు.. అదీ 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్' ద్వారా. 
ఎవరిదీ ఆలోచన?
అంతరిక్ష ప్రయోగాలకు ప్రైవేటు సంస్థలు కూడా ఇప్పుడు 'సై' అంటున్నాయి.  స్పేస్ టూరిజంలో భాగంగా అంతరిక్ష నౌకల నిర్మాణానికి నడుం బిగించాయి.  ఆన్‌లైన్ దిగ్గజం 'గూగుల్' ప్రకటించిన పోటీతో ఈ ప్రయోగాలు మరింత ఊపందుకున్నాయి.  ఏ సంస్థ అయితే 2012 లోపల చంద్రమండలంపై రొబోటిక్ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి, చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్ల దూరం ల్యాండర్‌ను తిప్పి, అక్కడి ఫొటోలను భూమికి చేరవేయగలుగుతుందో ఆ సంస్థకు 2 కోట్ల డాలర్లు బహుమతిగా ఇస్తామంటూ గూగుల్ ప్రకటించడం పెద్ద సంచలనమైంది.  ఈ ప్రయోగంలో ఆరిజోనా రాష్ట్రంలోని టుక్సన్ నగరంలో ఉన్న ఒడెస్సీ మూన్ లిమిటెడ్ కూడా పోటీ పడుతోంది.  ఈ సంస్థ ఆధ్వర్యంలో 'లూనార్ ల్యాండర్' నిర్మాణం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.  పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే 2012 కల్లా ఈ సంస్థ పంపే 'లూనార్ ల్యాండర్' చంద్రమండలంపై కాలు మోపుతుంది.  
ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ సంస్థ అనేక ఇతర సంస్థల సహాయ సహ కారాలను కూడా తీసుకుంటోంది.  పనిలో పనిగా చంద్రునిపై 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్' ద్వారా ఓ మొక్కను కూడా మొలిపించేందుకు ఓడెస్సీ మూన్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది.  'లూనార్ ఒయాసిస్'గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు బాధ్యతలను ఆరిజోనాలోని టుక్సన్‌లోనే ఉన్న మరో ప్రైవేటు సంస్థ పారగాన్ స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించింది.   "ఏదో ఒక రోజు చంద్రమండలంపైకి మానవులు వెళ్లడం తథ్యం.. అయితే భూమిపై ఉండే వాతావరణానికి చంద్రునిపై ఉండే వాతావరణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.. అందుకే ముందుగా అక్కడికి ప్రాణం ఉన్న ఓ మొక్కను పంపించదలుచుకున్నాం..'' అని ఒడెస్సీ మూన్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ రిచర్డ్స్ వ్యాఖ్యానిస్తున్నారు.  

ఆ మొక్కే ఎందుకు?
చంద్రమండలంపైకి పంపే మినీ గ్రీన్ హౌస్ 'లూనార్ ఒయాసిస్' కోసం ఒడెస్సీ మూన్ లిమిటెడ్ కొన్ని వందల రకాల మొక్కలను పరిశీలించి చివరికి క్యాబేజి, కాలీఫ్లవర్ జాతికి చెందిన 'బ్రస్సికా' మొక్కను ఎంపిక చేసింది.  ఈ మొక్క జీవితం కాలం చాలా స్వల్పం.  కేవలం 14 రోజులు మాత్రమే.  ఈ పధ్నాలుగు రోజుల్లోనే అది మొలకెత్తడం, పెరగడం, మొగ్గలు తొడగడం, పూలు పూయడం అన్నీ జరిగిపోతాయి.  అమావాస్యకు, పౌర్ణమికి మధ్య వ్యవధి కూడా 14 రోజులే కాబట్టి చంద్రునిపై పౌర్ణమి రోజు నాటికి ఈ మొక్క పెరిగి పెద్దదై పూలు పూస్తుందనేది శాస్త్రవేత్తలు మరో ఆలోచన.  ఇంకా ఈ మొక్కను ఎంపిక చేసుకోవడానికి మరో కారణం ఏమిటంటే.. ఈ 'బ్రస్సికా' మొక్కను శాస్త్రవేత్తలు భూమి మీద కూడా రకరకాల ప్రయోగాలలో ఉపయోగిస్తుంటారు.  భూమి మీద  ఇది మొలకెత్తే విధానం, పెరిగే విధానం, మొగ్గొలు తొడిగి పూలు పూసే విధానం.. అన్నీ శాస్త్త్రవేత్తలు బాగా తెలుసు.  ఇదే మొక్క చంద్రమండలంపై ఎలా పెరుగుతుంది?  ఏమైనా 'తేడా' కనిపిస్తుందా? ఈ విషయాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు మరింత సులువు అవుతుంది కూడా. 
 "తప్పదు.. చంద్రమండలాన్ని మనం ఎనిమిదో ఖండంగా గుర్తించాల్సిందే.  మరి ఈ ఖండంలో బతకదలచుకున్న వారు తమకు అవసరమైన వాటినన్నింటినీ అక్కడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.. ఎందుకంటే భూమ్మీద నుంచి మనం ఏదీ ఎక్కువగా తీసుకెళ్లలేం కాబట్టి..'' అని చమత్కరిస్తారు బాబ్ రిచర్డ్స్.  
ఇప్పటి వరకు లూనార్ ల్యాండర్ ప్రయోగంలో ఈ గ్రీన్‌హౌస్‌తోపాటుగా చిన్న టెలిస్కోప్, మట్టిని విశ్లేషించే స్పెక్ట్రోమీటర్, మానవ చితాభస్మం వంటివి చేరాయి.  ప్రయోగం జరిగే నాటికి ఈ జాబితాలో మరిన్ని పరికరాలు కూడా చేరే అవకాశం ఉంది.   
ఇదేం కొత్త కాదు..
గ్రీన్‌హౌస్ పద్ధతిలో అంతరిక్షంలో మొక్కలు పెంచడం పారగాన్ స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కొత్త కాదు.  ఇప్పటికే ఈ సంస్థ రెండు గ్రీన్‌హౌస్‌లను అంతరిక్షంలోకి పంపింది.  వాటిలో ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండగా, మరొకటి మరో అంతరిక్ష నౌకలో ఉంది.  భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి కూడా గ్రీన్‌హౌస్‌ను పంపేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.  అంతేకాకుండా వ్యోమగాములు ధరించే 'అత్యంత ఆధునిక స్పేస్ సూట్‌లు' రూపొందించే కాంట్రాక్టును కూడా ఈ సంస్థ 'నాసా' నుంచి దక్కించుకుంది.  
నిజానికి ఓడెస్సీ మూన్ లిమిటెడ్ కూడా గూగుల్ పోటీకి ముందే చంద్రమండల యాత్ర ప్రయత్నాలలో మునిగి ఉంది.  ఎప్పుడైతే గూగుల్ 'లూనార్ ఎక్స్ ప్రైజ్' పోటీ ప్రకటించిందో అప్పుడు వెంటనే ఈ పోటీపై దృష్టి సారించింది.  "లూనార్ ల్యాండర్ ప్రాజెక్టుతోపాటుగా మేం  మరో నాలుగు చిన్న ప్రాజెక్టులను కూడా చేపట్టాం.. వీటికి సంబంధించిన పనులు కూడా ఏక కాలంలో జరుగుతున్నాయి.  అంతేకాదు, ప్రయోగం జరిగే నాటికి ఈ ప్రాజెక్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది..'' అని   ఒడెస్సీ మూన్ సిఇఒ బాబ్ రిచర్డ్స్ వివరిస్తున్నారు.  
గూగుల్ 'డెడ్‌లైన్' దాటితే...
అయితే గూగుల్  ప్రకటించిన 'లూనార్ ఎక్స్ ప్రైజ్' పోటీలో ఓ విచిత్రమైన షరతు ఉంది.  అదేమిటంటే.. 2012లోగా ఒడెస్సీ మూన్ లిమిటెడ్ 'లూనార్ ల్యాండర్'ను చంద్ర మండలంపై దింపక పోయినా, తీరా చంద్రమండలంపై కాలుమోపిన ల్యాండర్ కదలనంటూ మొరాయించినా, అక్కడి నుంచి ఒక్క ఫొటో కూడా భూమికి చేరకపోయినా.. ముందు ప్రకటించిన బహుమతి మొత్తంలో సగం తగ్గిపోతుంది.  అంటే.. బహుమతి కాస్తా 3 కోట్ల డాలర్ల నుంచి 1.5 కోట్ల డాలర్లకు తగ్గిపోతుంది.  ఈ పోటీలో ఈ షరతు కాస్త క్లిష్టమైంది. 
 "అందుకే ఇతర ప్రయోగాలకంటే 'లూనార్ ల్యాండర్' ప్రయోగంపైనే మేం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం.. పరిస్థితులు అనుకూలిస్తే 2011 ఆఖర్లోనే ల్యాండర్‌ను ప్రయోగిస్తాం.. నిజానికి మేం ఈ ప్రయోగం చేస్తున్నది గూగుల్ ఇచ్చే డబ్బు కోసం కాదు..  ఇదేదో నలుగురు వ్యామగాములను అంతరిక్షానికి పంపినంత సులువూ కాదు.. ఈ భూమ్మీద జీవిస్తున్న యావత్ మానవ జాతి భవిష్యత్తును నిర్దేశించే ప్రయోగం ఇది.. అందుకే ఇంత కష్టపడుతున్నాం..'' అని వ్యాఖ్యానిస్తున్నారు బాబ్ రిచర్డ్స్.


1 comments:
ఇదీ బావుంది. గూగుల్ వాడి ప్రైజుకి ఇంకా ఎవరు పోటీపడుతున్నారు?
ఒడెస్సీ మూన్ లిమిటెడ్ కాకుండా ఇంకా ఎవరెవరు ఇలాంటి పనుల్లో ఉన్నారు?
స్పేస్ మీద మరిన్ని విషయాలతో మీ బ్లాగు మొత్తం నింపెయ్యరూ! ప్లీజ్! నేనొచ్చి చదువుకుంటాను. ఇంకెవరన్నా రాస్తున్నట్టు మీకు తెలిసినా చెప్పండి. నాకు ఇంకా ఎవరూ తటస్ధ పడలేదు.
Post a Comment