Wednesday 27 July 2016

అరచేతిలో.. పుస్తక ప్రపంచం!



O కంప్యూటర్ అక్కర్లేదు.. మొబైల్ చాలు 
O భారతీయ భాషల్లో న్యూస్, ఈ-బుక్స్, ఎగ్జామ్ ప్రెప్
O  ఉచితం కొన్ని.. కొనుగోలుకు మరిన్ని
O అందరినీ ఆకట్టుకుంటున్న డైలీహంట్ యాప్ 
మీరు వార్తలంటే చెవి కోసుకుంటారా? పుస్తకాలంటే పడిచస్తారా? మీ జేబులో మొబైల్ ఉందా? అయితే ఇక ఆలస్యమెందుకు? వెంటనే అందులో డైలీహంట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..  అక్షర ప్రపంచంలోకి  అడుగిడండి. మీ భాషలోనే మీకు నచ్చిన దినపత్రికలన్నిటినీ వరసబెట్టి చదివేయండి. మీకు నచ్చినమీరు మెచ్చిన పుస్తకాలన్నీ ఓ పట్టు పట్టేయండి. వార, మాస పత్రికలు, పిల్లల పుస్తకాలు, పెద్దల పుస్తకాలు, డిటెక్టివ్ లు మొదలుకొని సాంఘిక నవలల వరకు ఒకటేమిటి.. బోలెడన్ని. మీరు ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా.. మీ అరచేతిలోనే పుస్తక ప్రపంచం.. ఆపైన కావలసినంత కాలక్షేపం! 
ఉదయాన్నే నిద్రలేచి.. అలా  వాకింగ్ కి వెళ్ళి.. ఓ గంట తర్వాత ఇంటికి తిరిగొస్తూ పాలప్యాకేట్  లేదా న్యూస్ పేపర్ తెచ్చుకునే వాళ్ళని మనం చూస్తుంటాం. ఒకవేళ పుస్తకాల పిచ్చి ఉంటే గనక, ఇంట్లో ఉన్న నవలలు, మ్యాగజైన్లను ఓ పట్టు పట్టేసి.. అవీ చాలక, పక్కింటి నుంచో.. ఎదురింటి నుంచో, లేదంటే లెండింగ్ లైబ్రరీ నుంచో పుస్తకాలు అరువు తెచ్చుకుని కాలక్షేపం చేసే వాళ్లు కూడా ఎందరో! ఇదంతా ఓల్డ్ ట్రెండ్. ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా సరే.. బోలెడు పత్రికలు, పుస్తకాలు వచ్చి మీ ఒళ్ళో వాలిపోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. జస్ట్ మీ చేతిలో మొబైల్.. అందులో  ‘డైలీహంట్ యాప్ ఉంటే చాలు.. !
ఏమిటీ అప్లికేషన్?
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న వెర్సె ఇన్నోవేషన్ ప్రయివేట్ లిమిటెడ్ వినూత్న ఆవిష్కరణే  డైలీహంట్ (గతంలో ‘న్యూస్ హంట్’ యాప్) మొబైల్ అప్లికేషన్. ఇదొక ఆన్ లైన్ న్యూస్ అండ్ ఈ-బుక్ స్టోర్.  ఇప్పటివరకు 12 భాషల్లో అన్ని ప్రముఖ,  ఓ మోస్తరు పేరున్న దినపత్రికలు, లక్షా అరవై వేలకుపైగా ఈ-పుస్తకాలు,  ఈ-పత్రికలు ఈ ఆన్ లైన్ బుక్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్క తెలుగు భాషకు సంబంధించే పది వేలకు పైగా ఈ-పుస్తకాలు, మ్యాగజైన్లు దర్శనమిస్తున్నాయి.  ఇప్పటివరకు 95 మిలియన్ల మంది.. అంటే 9.5 కోట్ల మంది ఈ  డైలీహంట్ అప్లికేషన్ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని వార్తా, పుస్తక దాహాన్నితీర్చుకున్నారు.   డైలీహంట్అప్లికేషన్ జె2ఎంఇ, సింబయాన్, బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్, ఐఒఎస్ తదితర ఆపరేటింగ్ సిస్టంలతో కూడిన అన్ని మొబైల్ ఫోన్లలో పనిచేస్తుంది.
కేటగిరీల వారీగా...
ఈ-పుస్తకాలన్నీ కూడా కేటగిరీల వారీగా మీకు దర్శనమిస్తాయి. కల్పన, ఉద్రేకం-ఉత్కంఠ, గూఢచారి కథలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, మతం-ఆధ్యాత్మికం, హాస్యం, ప్రేమ, జీవిత చరిత్రలు-జ్ఞాపకాలు, సాహిత్యం, సంగీతం-సినిమాలు-వినోదం, నాటకాలు-నాటికలు, చరిత్ర-రాజకీయాలు, కుటుంబం-సంబంధాలు, నవలలు, గ్రాఫిక్‌ నవలలు, జ్యోతిష్యం, పెద్దలకు మాత్రమే తదితర విభాగాల లో పెద్ద పెద్ద రచయితలు మొదలుకొని చిన్న రచయితల వరకు రాసిన పుస్తకాలు కొలువుదీరాయి. కేవలం పుస్తకాలే కాకుండా సరస సలిల, గృహశోభ, మాలిక పత్రిక, గో తెలుగు, కరంట్‌ అఫైర్స్‌, చంపక్‌, రామకృష్ణ ప్రభ, మన ఆరోగ్యం, వండర్-వండర్, ఫిలింసిటీ, బాలల బొమ్మరిల్లు, దైవశక్తి, కంప్యూటర్స్ ఫర్ యు, సినీస్కోప్, సినీ నెంబర్ వన్, సినీ సందడి, ఆహారం-ఆరోగ్యం, జ్యోతిషవాణి, హర్రర్ వంటి పత్రికలు కూడా  డైలీహంట్ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌లో మీకు లభిస్తాయి. 

ఉచితం కొన్ని.. కొనుగోలుకు మరిన్ని
డైలీహంట్ఆన్ లైన్ ఈ-బుక్ స్టోర్లో కొన్ని ఈ-పుస్తకాలు, ఈ-మ్యాగజైన్లు ఉచితంగా కూడా లభిస్తున్నాయి.  మరికొన్నితక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ఒక్క రూపాయికే మీకు నచ్చిన మ్యాగజైను లేదా పుస్తకం లభిస్తోందంటే కొనుక్కోనివాళ్లు ఉంటారా? పైగా ప్రతిరోజూ బోలెడన్ని ఆఫర్లు! బయట పుస్తకాల మార్కెట్లో రూ.60-90కి లభించే పుస్తకం  డైలీహంట్ఆన్ లైన్ బుక్ స్టోర్లో కేవలం రూ.6కే లభిస్తుందంటే ఆశ్చర్యం కాక మరేమిటి? పైగా మ్యాగజైను లేదా పుస్తకం ఓసారి డౌన్ లోడ్ చేసుకుంటే అది మీ మొబైల్ ఫోన్లలో ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు.. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ  మీరు యాప్ లోని ‘మై బుక్స్’ విభాగంలోకి వెళ్లి చదువుకోవచ్చు. 
చెల్లింపు అతిసులభం!
డైలీహంట్ఈ-బుక్‌ స్టోర్‌లో మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోవడం ఎంతో సులభం.  దీనికోసం మీరు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు వాడనక్కర్లేదు. ప్రీపెయిడ్‌ ఖాతాదారులైనా, పోస్ట్‌పెయిడ్‌ ఖాతాదారులైనా కేవలం మీ మొబైల్‌ బ్యాలెన్స్‌ ద్వారా చెల్లింపు జరపవచ్చు. మీ కొనుగోలు, చెల్లింపులను అత్యంత సులభతరం చేయడం కోసం  డైలీహంట్తన సొంత పేమెంట్‌ గేట్‌వే  ఐ-పేతో పాటుగా జస్‌ పే, ‘పేపాల్‌, ‘సిట్రస్‌ పే వంటి పేమెంట్‌ గేట్‌వేలను కూడా అందుబాటులో ఉంచింది. 

కొనుగోలు ఇలా... 
డైలీహంట్ఆన్‌లైన్‌ ఈ-బుక్‌ స్టోర్‌లో మీరు ఇష్టపడిన లేదా మీకు ఆసక్తి ఉన్న ఈ-పుస్తకం, లేదా ఈ-పత్రికను కొనుగోలు చేయడం చాలా తేలిక.  ఆ పుస్తకం లేదా పత్రికను మీ చూపుడు వేలితో తాకి చూడండి.  వెంటనే ఆ పుస్తకం లేదా పత్రిక పేరు, రచయిత లేదా రచయిత్రి పేరు, దాని అసలు ధర, తగ్గింపు ధర తదితర వివరాలు మీ మొబైల్‌ తెరపై ప్రత్యక్షమవుతాయి.  ఆ పుస్తకం గురించిన కొద్దిపాటి వర్ణన కూడా మీకు బుక్  డీటెయిల్స్ లో కనిపిస్తుంది.  పుస్తకం లేదా పత్రికను కొనుక్కోవాలని నిశ్చయించుకుంటే ధరతో కూడిన లేత ఆకుపచ్చ రంగు  ట్యాబ్‌పై చూపుడు వేతితో తాకండి. దీంతో మీరు నేరుగా పేమెంట్‌ గేట్‌వే పేజీలోకి వెళ్లిపోతారు.  అక్కడ మొబైల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. కింద మీ మొబైల్‌ నెట్‌వర్క్‌ గుర్తు కూడా మీరు గమనించవచ్చు. మీ కొనుగోలుకు సంబంధించి రసీదు పొందదలచుకుంటే నిర్ణీత గడిలో మీ ఈ-మెయిల్‌ ఐడిని టైప్‌ చేయండి.  లేదంటే నేరుగా పే సెక్యూర్‌లీ అనే అక్షరాలతో కూడిన లేత ఆకుపచ్చ రంగు  ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి. ఆ తరువాత మీ మొబైల్‌ఫోన్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఒటిపి) పంపబడుతుంది.  దాన్ని నిర్ణీత గడిలో ఎంటర్‌ చేయడం ద్వారా మీ సదరు ఈ-పుస్తకం, లేదా ఈ-పత్రిక  డైలీహంట్అప్లికేషన్‌లోని ‘నా పుస్తకాలు’ విభాగంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతారు.  మీరు ప్రీపెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులైతే పుస్తకం ధర మీ మొబైల్‌ బ్యాలెన్స్‌ నుంచి తగ్గింపబడుతుంది.  ఒకవేళ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులైతే ఆ ధర మీ నెలసరి బిల్లులో జమ అవుతుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది కాబట్టి మీకేమాత్రం అసౌకర్యంగా అనిపించదు.
ఇన్‌స్టాలేషన్‌ ఇలా... 
 డైలీహంట్మొబైల్‌ అప్లికేషన్‌ను మీ మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం కూడా చాలా తేలిక.  ఒకవేళ మీరు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే నేరుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లండి.  అక్కడ కనిపించే సెర్చ్‌ ఆప్షన్‌లో  డైలీహంట్ అని ఆంగ్లంలో టైప్‌ చేయండి. వెంటనే మీ మొబైల్‌ తెరపై  డైలీహంట్అప్లికేషన్‌ కనిపిస్తుంది. దానిపై మీ చూపుడు వేలితో ఒక్కసారి తాకండి.  అంతే.. క్షణాల వ్యవధిలో  మీ మొబైల్‌ ఫోన్‌లోని అప్లికేషన్ల జాబితాలో  డైలీహంట్అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. ఇతరత్రా అపరేటింగ్‌ సిస్టంలతో పనిచేసే మొబైల్‌ ఫోన్లలోనూ ఇదే మాదిరిగా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  మీ ప్రాధాన్య భాషను ఎంచుకునేటప్పుడు మాత్రం ఒకింత జాగ్రత్త వహించండి.  ఎందుకంటే ఆ తరవాత ఈ అప్లికేషన్‌ అంతా మీరు ఎంచుకున్న భాషలోనే మీకు కనిపిస్తుంది కాబట్టి.  వీలయినంత వరకు మీ మాతృభాషను ఎంచుకోవడమే ఉత్తమం.  
పోటీ పరీక్షల కోసం..
డైలీహంట్మొబైల్ యాప్ లోని మరో అత్యుత్తమ ఫీచర్ ‘ఎగ్జామ్ ప్రెప్’.  ఇది నిరుద్యోగ అభ్యర్థులకు తాము కోరుకుంటున్నప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేందుకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్ తోపాటు ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన మాక్ (నమూనా) పరీక్షలు కూడా  ఈ ‘ఎగ్జామ్ ప్రెప్’ విభాగంలో అందుబాటులో ఉంటాయి.  దీనికి సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా మరో సరికొత్త యాప్ ను దైలీహంట్ ఆవిష్కరించింది.  ఈ యాప్ కూడా ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందరికీ అందుబాటులో ఉంది. 
అరె! ఇదేదో బాగుందే.. అనుకుంటున్నారా? మరి ఆలస్యమెందుకు.. ఇప్పుడే మీ మొబైల్ లో డైలీహంట్’ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ‘అరచేతిలో.. పుస్తక ప్రపంచం’ అనుభవాన్ని ఆస్వాదించండి! మీకు నచ్చిన పుస్తకాలన్నీ ఓ పట్టు పట్టేయండి.. పనిలో పనిగా మీరు నిరుద్యోగులయితే ‘ఎగ్జామ్ ప్రెప్’ సాయంతో మంచి ప్రభుత్వ ఉద్యోగాన్నీ కొట్టేయండి!!