Thursday 20 May 2010

వాయేజర్‌-2 హైజాక్‌.. గ్రహాంతరవాసుల పనేనా?!

ముప్పై మూడేళ్ళ క్రితం ఆ మానవ రహిత వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. దాని లక్ష్యం.. విశ్వ రహస్యాలను సేకరించడం, గ్రహాంతర వాసుల ఆచూకీ కనుగొనడం! ఇన్నేళ్లూ అంతరిక్షంలో ప్రయాణిస్తూ భూమికి ఎంతో విలువైన సమాచారం చేరవేసిన ఆ వ్యోమనౌక నుంచి ప్రస్తుతం ఏమాత్రం అర్థం కాని రీతిలో సందేశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మన ప్రపంచంలోని ఏ భాషకూ ఆ సంకేతాలు సరిపోలడం లేదు. ఒకవేళ ఆ వ్యోమనౌక గ్రహాంతర వాసుల చేతికిగాని చిక్కిందా? ఆ సందేశాలు వారు పంపిస్తున్నవేనా? ఖగోళ శాస్త్రవేత్తల్లో ఇప్పుడు ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

ఈ అనంత విశ్వంలో కొంత భాగాన్నైనా శోధించాలని, ఒకవేళ గ్రహాంతర వాసులు ఉన్నట్లయితే, భూమి మీద ఉన్న మన ఉనికిని వారికి తెలియజేయాలన్న లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' 1977లో వాయేజర్‌ -2 అనే వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్న సంప్రదాయ సంగీతం, ప్రకృతి సహజమైన శబ్ద రీతులు, 55 భాషలలో శుభాకాంక్షల సందేశాలను, అనలాగ్‌ రూపంలో ఉన్న 115 చిత్రాలను బంగారు పూతతో కూడిన పన్నెండు అంగుళాల రాగి డిస్క్‌పై శబ్దం రూపంలో నిక్షిప్తం చేసి దానిని ఈ వ్యోమనౌకలో పొందుపరిచారు. ఈ సువిశాల విశ్వంలో నిజంగా గ్రహాంతర వాసులే గనక ఉండి ఉంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా వారికి వాయేజర్‌-2 వ్యోమనౌక గనుక తారసపడితే, ఆ వ్యోమనౌకను ఎవరు ప్రయోగించారో, ఏ లక్ష్యంతో ప్రయోగించారో అర్థం చేసుకునేందుకు ఈ సంగీతం, శుభాకాంక్షల సందేశాలు ఉపయోగపడతాయనేది నాటి నాసా శాస్త్రవేత్తల భావన. అంతేకాదు, ఈ వ్యోమనౌక వెలుపలి భాగంలో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్‌ పేరిట ఒక సందేశం కూడా ముద్రితమై ఉంటుంది.
సుధీర్ఘ కాలం సేవలు..
నిజానికి శాస్త్రవేత్తలు తొలుత నిర్ణయించిన ప్రకారం వాయేజర్‌-2 వ్యోమనౌక జీవిత కాలం నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఈ నాలుగేళ్ళలో ఇది శనిగ్రహం సమీపానికి వెళ్ళి ఆ గ్రహానికి సంబంధించిన సమాచారాన్ని భూమి మీదికి చేరవేయాల్సి ఉంటుంది. 1977లో తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది వరకు.. అంటే ముప్ఫై మూడేళ్ళపాటు వాయేజర్‌-2 భూమికి ఎంతో విలువైన సమాచారాన్ని చేరవేస్తూ వచ్చింది. ఒక్క శని గ్రహం గురించే కాదు, బృహస్పతి, యురెనస్‌, నెఫ్ట్యూన్‌ గ్రహాల సమీపంలోకి కూడా వెళ్లి ఆయా గ్రహాలకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని భూమ్మీదికి చేరవేసింది. మన సౌర కుటుంబం గురించి ఇప్పటి వరకు మనం చూడని, మనకు తెలియని ఎన్నో విషయాలను వాయేజర్‌-2 మనకు అందించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి వాయేజర్‌-2 వ్యోమనౌక మన సౌర కుటుంబం అంచులకు చేరుకుంది. ఇక్కడి నుంచి ఇది పంపించే సంకేతాలు మన భూమికి చేరడానికి పదమూడు గంటల సమయం పట్టేది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి హఠాత్తుగా దీని నుంచి వచ్చే సమాచారం ఆగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు దీన్నుంచి అర్థం పర్థం లేదని సంకేతాలు భూమి మీద ఉన్న నియంత్రణ కేంద్రానికి అందుతున్నాయి. ఆ సంకేతాలు ఏ భాషకు సంబంధించినవో ఖగోళ శాస్త్రవేత్తలు అంతుబట్టడం లేదు.
ఏం జరిగి ఉంటుంది?
వాయేజర్‌-2 వ్యోమనౌక నుంచి అర్థంకాని సంకేతాలు రావడం గురించి ఖగోళ శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా అందులో సాంకేతిక, విద్యుత్తు లోపం ఏదైనా ఏర్పడి ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆ వ్యోమనౌక గ్రహాంతర వాసుల ఆధీనంలోకి వెళ్లిపోయి ఉంటుందని, ప్రస్తుతం దాన్నుంచి వస్తున్న అర్థం పర్థం లేని సంకేతాలు బహుశా వారు పంపిస్తున్నవే అయి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. 2006 నవంబరు 30న జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీలోని కమాండ్‌ సెంటర్‌ నుంచి ఇచ్చిన ఆదేశాలను వాయేజర్‌-2 తప్పుగా అర్థం చేసుకుందని, ఫలితంగా అందులో ఉన్న మాగ్నెటోమీటర్‌కు సంబంధించిన హీటర్లు పని చేయడం మొదలెట్టాయని, ఇలా ఈ హీటర్లు 2006 డిసెంబర్‌ 4 వరకు పని చేస్తూనే ఉన్నాయని, దీంతో వాయేజర్‌-2 వ్యోమనౌకలోని ఉష్ణోగ్రత 130 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరిందని, బహుశా ఈ అధిక వేడి వల్లనే వాయేజర్‌-2 పనితీరు మారిపోయి ఉంటుందనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వాయేజర్‌-2 వ్యోమనౌక నుంచి అందుతున్న సంకేతాలను డీకోడ్‌ చేసే ప్రయత్నాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించగలమనే ధీమాను నాసా శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా సమాచారాన్ని భూమికి చేరవేసే 'ఫ్లయిట్‌ డేటా సిస్టం'లో ఏదైనా సమస్య తలెత్తి ఉండవచ్చని, వ్యోమనౌక నుంచి అర్థం పర్థం లేని సంకేతాలు అందడానికి కారణం ఇదే అయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అందుకే వాయేజర్‌-2 తనకు సంబంధించిన సమాచారాన్నే కొంత కాలంపాటు భూమికి చేరవేసేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
'ఇది వారి పనే..'
అయితే వాయేజర్‌-2 గ్రహాంతర వాసుల చేతికి చిక్కి ఉంటుందని, ప్రస్తుతం కమాండ్‌ సెంటర్‌కు చేరుతున్న సంకేతాలు వారు పంపుతున్నవే అయి ఉండొచ్చని జర్మనీకి చెందిన అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌ నిపుణుడు హార్ట్‌విగ్‌ హాస్‌డ్రాఫ్‌ వ్యాఖ్యానిస్తున్నారు. వాయేజర్‌-2లో అమర్చిన గోల్డ్‌ డిస్క్‌, అందులో ముప్ఫై మూడేళ్ల క్రితం మనం నిక్షిప్తం చేసిన సమాచారానికి బహుశా ఇది గ్రహాంతర వాసుల స్పందన అయి ఉండొచ్చని, అయితే ఇది నిజమో, కాదో తెలుసుకోడానికి మరికొద్దికాలం పడుతుందని ఆయన పేర్కొంటున్నారు.

Tuesday 11 May 2010

ఆకాశంలో 'లేజర్‌ మేఘాలు'!

ఆకాశం మేఘావృతం కావడం.. ఆపైన వర్షం పడడం మామూలే! మేఘాలు లేని చోట వర్షం కోసం కృత్రిమ మేఘాలను మనమే సృష్టించు కుంటున్నాం.. వర్షం కురిసేలా చేస్తున్నాం. దీనినే 'మేఘ మథనం' అని పిలుచు కుంటున్నాం. కానీ భవిష్యత్తులో మేఘమథనం ఇలా ఉండదు. ఆకాశాన్ని 'లేజర్‌ మేఘాలు' కమ్ముకుంటాయి. కావలసినంత వర్షాన్ని కురిపిస్తాయి.

వర్షాకాలంలో వర్షాలు కురవడం సర్వసాధారణం. అయితే ఎంత వర్షాకాలమైనా కొన్ని ప్రదేశాలలో వర్షం కురవదు. ఫలితంగా ఆ ప్రాంతంలో పంటలు పండవు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు, ఆయా ప్రదేశాలలో వర్షాలు కురిపించేందుకు వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా 'మేఘ మథనం' విధానాన్ని అవలంభిస్తున్నారు. అసలు వర్షమే కురవని చోట కృత్రిమంగా మేఘాలను సృష్టించి వర్షాలు కురిపించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం.
మేఘ మథనం ఇలా..
ఈ మేఘ మథనం అనేది చాలా ఏళ్లుగా జరుగుతున్నదే. ఈ విధానంలో మేఘాలను చల్లబరిచేందుకు సిల్వర్‌ అయొడైడ్‌ క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తారు. వాతావరణంలో చాలా ఎత్తున ఉండే మేఘాలపైన విమానాల ద్వారా ఈ సిల్వర్‌ అయొడైడ్‌ క్రిస్టల్స్‌ను చల్లగానే ఆ మేఘాలలో ఉండే నీటి ఆవిరి ఘనీభవించి నీరుగా మారుతుంది. ఆపైన అది వర్షంగా మారి కురుస్తుంది. అయితే ఈ విధానం నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని చెప్పలేం. ఒకోసారి మేఘమథనం జరిపినా వర్షం కురవదు. అప్పడేం చేయాలి?
ప్రత్యామ్నాయంగా.. 'లేజర్‌'!
తాజా పరిశోధనల్లో మేఘమథనానికి 'లేజర్‌ కిరణాలు' ఉపయోగించవచ్చని వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవాకు చెందిన పరిశోధకుడు జెరోమ్‌ కాస్పరియన్‌ తన సహ పరిశోధకులతో కలిసి లేజర్‌ కిరణాల ద్వారా వర్షాలు కురిపించే పద్ధతిని అభివృద్ధి చేశారు. తమ పరిశోధనలో భాగంగా కాస్పరియన్‌ బృందం ప్రయోగశాలలో కృత్రిమ మేఘాలను సృష్టించారు. అంతేకాదు, ఇటీవల జర్మనీ రాజధాని బెర్లిన్‌లోనూ లేజర్‌ ద్వారా విజయవంతంగా మేఘాలను సృష్టించగలిగారు. ఇందులో భాగంగా దాదాపు 60 మీటర్ల వరకు ఆకాశంలోకి వారు లేజర్‌ కిరణాలను పంపించారు. ఆ సమయంలో బెర్లిన్‌ నగరంపైన ఆకాశంలో ఏర్పడిన మేఘాలు కంటికి కనిపించకపోయినా వాతావరణాన్ని కొలిచే లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ (లిడార్‌) అనే పరికరం మాత్రం మేఘాలు ఏర్పడినట్లు, వాటిలో ఉన్న నీటి పరమాణువుల సాంద్రత, వాటి పరిమాణం పెరిగినట్లు గుర్తించింది.
ఎలా చేశారంటే..
తమ ప్రయోగంలో భాగంగా ప్రయోగశాలలో కాస్పరియన్‌ బృందం ఒక క్లౌడ్‌ ఛాంబర్‌ను రూపొందించారు. అందులో మైనస్‌ 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరిని ఉంచి, ఆపైన అందులోకి తక్కువ పౌనఃపున్యం కలిగిన ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్‌ కిరణాలను పంపించారు. ఈ లేజర్‌ కిరణాలు తొలుత క్లౌడ్‌ ఛాంబర్‌లోని నీటి ఆవిరి అణువుల నుంచి ఎలక్ట్రాన్‌లను విడగొట్టి, హైడ్రాక్సిల్‌ రాడికల్స్‌ను ఏర్పరిచాయి. ఇవి ఛాంబర్‌లోని వాతావరణంలో ఉన్న సల్ఫర్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌డయాక్సైడ్‌ వాయువులను నీటి పరమాణువులుగా మార్చివేశాయి. లేజర్‌ కిరణాల ప్రవాహాన్ని ఆపివేసిన తర్వాత ఛాంబర్‌లోకి తొంగి చూస్తే.. ఆ ఛాంబర్‌ చుట్టూ నీటి బొట్లు సగానికి సగం పెరిగి ఉన్నాయి.
బయటి వాతావరణంలో సాధ్యమేనా?
అయితే కాస్పరియన్‌ బృందం సాధించిన విజయం పట్ల ఇటు అభినందనలతోపాటు అటు విమర్శలు కూడా కురుస్తున్నాయి. "తక్కువ ఉష్ణోగ్రత వద్ద అధిక తేమను సృష్టించడం ప్రయోగశాలలో సాధ్యమేమో కానీ, బయట వాతావరణంలో సాధ్యం కాదు.. లేజర్‌ కిరణాలు ఉపయోగించి ప్రయోగశాలలో కొన్ని నీటి బొట్లు సృష్టించిన మాత్రాన.. బయటి వాతావరణంలోనూ అలాగే జరుగుతుందనుకుంటే పొరపాటు..'' అని జెరూసలేంలో ఉన్న హిబ్రూ యూనివర్సిటీకి చెందిన వాతావరణ పరిశోధకులు డానియెల్‌ రోసెన్‌ఫెల్డ్‌ వ్యాఖ్యానిస్తుండగా కాస్పరియన్‌ బృందం ఆయన మాటలను కొట్టివేస్తున్నారు. తమ ప్రయోగం బయటి వాతావరణంలోనూ సాధ్యపడుతుందని చెప్పడానికి బెర్లిన్‌ నగరంపై కమ్ముకున్న మేఘాలే నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు, కాస్పరియన్‌ బృందం ఇప్పుడు మరో ప్రయోగంలో నిమగ్నమయ్యారు. లేజర్‌ కిరణాల వేవ్‌ లెంగ్త్‌ను మరింతగా పెంచి, ఎక్కువ సేపు ఆకాశంలోకి వాటిని ప్రయోగించడం ద్వారా మేఘాలలోని నీటి ఆవిరి మరింత త్వరితగతిన ఘనీభవనం చెంది పెద్ద పెద్ద నీటిబొట్లుగా మారే ందుకు గల అవకాశాలను పరీక్షిస్తున్నారు.
ఇదే గనుక జరిగితే భవిష్యత్తులో ఎక్కడ కావాలంటే అక్కడ ఆకాశం నిండా లేజర్‌ మేఘాలు కమ్ముకోవడం.. చాలనేంత వరకు వర్షాలు కురవడం ఖాయం కదూ!

Saturday 1 May 2010

నవ్వించే ఓ వెబ్‌సైట్‌... 'కార్టూన్‌ కబుర్లు.ఇన్'


'నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలి..రా!' అని ఓ సినీ గీత రచయిత ఏనాడో సెలవిచ్చాడు. నవ్వుతూ చావకపోయినా కనీసం బతికినన్నాళ్లయినా నవ్వుతూ బతకొచ్చుకదా! పైగా నవ్వు.. నాలుగు కాలాలపాటు మనల్ని బతికిస్తుంది కూడా. అందుకే అందరినీ నవ్వించేందుకు ఓ కొత్త వెబ్‌సైట్‌ పుట్టుకొచ్చింది.  దీనిపేరు 'కార్టూన్‌ కబుర్లు.ఇన్'.   ఇక్కడ ఇచ్చిన కార్టూన్‌ చూశారు కదా.. ఇలాంటివి బోలెడు కార్టూన్లు www.cartoonkaburlu.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి. చదివి హాయిగా నవ్వుకోండి. ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనలో మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించండి. అంతేకాదు, ఈ 'కార్టూన్‌ కబుర్లు.ఇన్' గురించి మీ స్నేహితులకు, బంధువులకు.. అందరికీ తెలియజేయండి. ఒకవేళ మీలో ఎవరైనా కార్టూనిస్టులు, కార్టూన్‌ ఇష్టులు ఉన్నట్లయితే.. మీరు గీసిన కార్టూన్లు, మీకు నచ్చిన కార్టూన్లు, ఆయా కార్టూనిస్టులు గీసిన, మీరు చూసిన వివిధ కార్టూన్ల గురించి మీ అభిప్రాయాలు అన్నీ కూడా 'కార్టూన్‌ కబుర్లు.ఇన్'కు పంపించవచ్చు.

Thursday 29 April 2010

ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌

ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌ను ఎల్‌జి డిస్‌ప్లే కంపెనీ లిమిటెడ్‌ ఆవిష్కరించింది. దీని వెడల్పు 19 అంగుళాలు. అంటే దాదాపు ఎ3 సైజు న్యూస్‌పేపర్‌ లా ఉంటుందన్నమాట. విశేషం ఏమిటంటే.. ఈ ఈ-పేపర్‌ను మడతబెట్టేయొచ్చు లేదంటే చుట్టలా చుట్టి పట్టుకెళ్లవచ్చు. ప్రస్తుతం మనకు 6 అంగుళాల ఈ-బుక్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎల్‌జి డిస్‌ప్లే ఆవిష్కరించిన ఈ ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌ పరిమాణంలో చాలా పెద్దది. 0.3 మిల్లీమీటర్ల మందం ఉండే ఈ ఈ-పేపర్‌ కేవలం 130 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌ తయారీలో ఎల్‌జి డిస్‌ప్లే మెటల్‌ ఫాయిల్‌ మీద గాజుకు బదులుగా థిన్‌ ఫిల్మ్‌ ట్రన్సిస్టర్‌(TFT) ని ఉపయోగించింది. అందువల్లే దీన్ని ఎటు పడితే అటు మడతేయొచ్చు. అలాగే దీని తయారీలో గేట్‌ ఇన్‌ ప్యానల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీని ధర ఇతర వివరాలను ఎల్‌జి ఇంకా ప్రకటించలేదు. అయితే మొదట 11.5 అంగుళాల ఫ్లెక్సిబుల్‌ ఈ పేపర్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని, ఆ తరువాతే ఈ ఎ3 సైజ్‌ ఈ-పేపర్‌ను విడుదల చేయాలని ఎల్‌జి డిస్‌ప్లే కంపెనీ లిమిటెడ్‌ భావిస్తోంది.

ఎల్‌జి నుంచి 3జి మొబైల్స్‌!

ఎల్‌జి కంపెనీ భారత మార్కెట్‌లోకి తాజాగా రెండు థర్డ్‌ జనరేషన్‌(3జి) మొబైల్స్‌ను విడుదల చేసింది. వీటి పేర్లు GU285, GU220. వీటిలో ఎ్ఖ285 స్లయిడర్‌ ఫోన్‌. డ్యూయల్‌ కెమెరా విత్‌ వీడియో కాలింగ్‌, స్మార్ట్‌ మెమో, షెడ్యూల్‌ ఎస్సెమ్మెస్‌ తదితర ఫీచర్లు కలిగి ఉండగా, ఎ్ఖ220 మాత్రం సోషల్‌ నెట్‌వర్కింగ్‌, జస్ట్‌ క్రికెట్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ అప్లికేషన్లతోపాటుగా ఇమేజ్‌ ఎడిటింగ్‌ సౌకర్యాన్ని కలిగి ఉంది.

ఎల్‌జి GU285 మొబైల్‌ఫోన్‌లో 13 ఎంబి ఇంటర్నల్‌ మెమరీ ఉంటుంది. అవసరాన్ని బట్టి మైక్రో ఎస్‌డి కార్డ్‌ ద్వారా దీనిని 8 జిబి వరకు పెంచుకునే వీలుంది. ఈ ఫోన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఎంపి3 ప్లేయర్‌ విత్‌ 6 ఇన్‌బిల్ట్‌ ఈక్వలైజ్‌, ఎఫ్‌ఎం రేడియో ఉన్నాయి. ఇంకా యాంటీ థెఫ్ట్‌ మొబైల్‌ ట్రాకర్‌, ఎన్‌డి టివి యాక్టివ్‌, గూగుల్‌ సెర్చ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఎల్‌జి హెల్ప్‌డెస్క్‌, డేటావాలెట్‌, రాకీటాక్‌(సోషల్‌ నెట్‌వర్కింగ్‌), న్యూస్‌ హంట్‌ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, వినియోగదారులు 5 ఈ-మెయిల్‌ అకౌంట్లు సృష్టించుకోవచ్చు. హైస్పీడ్‌ 3జి డేటా నెట్‌వర్క్స్‌ ద్వారా క్షణాల్లో ఈ-మెయిల్‌ చెక్‌ చేసుకోవచ్చు. 10 గంటల టాక్‌టైం, 580 గంటల స్టాండ్‌బై టైమ్‌ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.6,500.

ఇక ఎల్‌జి GU220 మొబైల్‌ విషయానికొస్తే.. 5.6 సెం.మీ. వైడ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో వీడియో రికార్డింగ్‌ కోసం విజిఎ కెమెరా ఉంది. మెటాలిక్‌ డిజైన్‌తో చూడముచ్చటగా ఉండే ఈ స్లయిడర్‌ ఫోన్‌లో బేసిక్‌ మల్టీమీడియా ఫీచర్లు.. ఎంపి3 ప్లేయర్‌, ఎఫ్‌ఎం రేడియో విత్‌ ఎఫ్‌ఎం రికార్డింగ్‌ వంటివి ఉన్నాయి. ఇంటర్నల్‌ మెమరీ 4.5 ఎంబి మాత్రమే, కావాలంటే మైక్రో ఎస్‌డి కార్డ్‌ ద్వారా 2 జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో కూడా యాంటీ థెఫ్ట్‌ మొబైల్‌ ట్రాకర్‌ సదుపాయం ఉంది. ఇంకా న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఎన్‌డి టివి యాక్టివ్‌, అలాగే జి-టాక్‌, యాహూ ఇన్‌స్టంట్‌ మెసెంజర్స్‌కు అనుసంధానం అయ్యేందుకు రాకీ టాక్‌ అప్లికేషన్‌ ఉంది. అంతేకాదండోయ్‌, క్రికెట్‌ అభిమానుల కోసం జస్ట్‌ క్రికెట్‌ అనే అప్లికేషన్‌ కూడా ఉంది. దీనిసాయంతో ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా క్రికెట్‌మ్యాచ్‌ చూడడమేకాదు, స్కోర్‌ కూడా తెలుసుకోవచ్చు.
8 గంటల టాక్‌టైం, 500 గంటల స్టాండ్‌బై టైమ్‌ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.4,500.




సైబర్‌ ఎటాక్స్‌లో మనకు మూడోస్థానం!

సాఫ్ట్‌వేర్‌ రంగంలో సూపర్‌ పవర్‌గా ఎదిగేందుకు భారత దేశానికి మరో పదేళ్ల కాలం పట్టవచ్చేమోగానీ, సైబర్‌ ఎటాక్స్‌లో మాత్రం ఈ దేశం ఇప్పటికే మూడో స్థానంలో ఉన్నట్లు ప్రముఖ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సిమాంటెక్‌ ఇటీవలి తన ఇంటర్నెట్‌ సెక్యూరిటీ థ్రెట్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.

వెబ్‌ బేస్డ్‌ అటాక్స్‌ విషయంలో అమెరికా, బ్రెజిల్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్లు ఈ కంపెనీ తెలిపింది. 2008లో పదమూడో స్థానంలో ఉన్న భారత్‌ ఏడాది గడిచే సరికి మూడో స్థానంలో ఉండడం పట్ల సిమాంటెక్‌ విస్మయం వ్యక్తం చేసింది. అన్ని వెబ్‌ ఆధారిత మాలేషియస్‌ ఎటాక్స్‌తోపాటుగా స్పామ్‌(బోగస్‌ ఈ-మెయిల్స్‌) జనరేటింగ్‌లో సైతం ప్రపంచంలోని ఇతర దేశాలలోకెల్లా భారత్‌ మూడో స్థానంలో ఉందట. ప్రపంచం మొత్తంమ్మీద
పుట్టుకొస్తున్న స్పామ్‌ మెయిల్స్‌లో 4 శాతం ఒక్క భారత్‌ నుంచే పుడుతున్నాయట.
అంతేనా, సిమాంటెక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే మన దేశం ఘనత ఇంకా చాలా ఆసియా పసిఫిక్‌ అండ్‌ జపాన్‌ రీజియన్‌లోకొస్తే మన దేశమే నంబర్‌ ఒన్‌. ఈ ప్రాంతంలో పుడుతున్న స్పామ్‌మెయిల్స్‌లో మన దేశం వాటా 21 శాతం. కంప్యూటర్‌ అసలు యజమానికి తెలియకుండా దాన్ని తమ అదుపులోనికి తీసుకుని, దాన్నుంచి ఇతరులకు స్పామ్‌ మెయిల్స్‌ పంపేవారిని 'జాంబీ' అని పిలుస్తారు. ఈ జాంబీలు తాము జొరబడిన ఇతరుల కంప్యూటర్ల నుంచి వారి వారి పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్‌ నంబర్‌లు గ్రహించి ఆర్థిక నేరాలకు కూడా పాల్పడుతుంటారు. స్పామ్‌ మెయిల్స్‌ సృష్టించి, వాటిని ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్న కంప్యూటర్లకు పంపే వారిలో 6 శాతం, ఆసియా పసిఫిక్‌ అండ్‌ జపాన్‌ రీజియన్‌కు పంపేవారు 28 శాతం మన దేశంలోనే నివసిస్తున్నారట.
మరోవైపు ఫిషింగ్‌ కూడా అధిక మవుతుంది. ఇతరులు కంప్యూటర్లలోకి జొరబడి వారి వివరాలను తస్కరించడాన్ని భద్రతా నిపుణులు 'ఫిషింగ్‌'గా పేర్కొంటారు. ఫిషింగ్‌లో భాగంగా స్పామర్లు ఆయా వ్యక్తుల కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అవసరమైతే వారికి సంబంధించిన వివరాలతో వారికే మెయిల్స్‌ పంపుతారు. ఉదాహరణకు పేరు, చిరునామా, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు. తమకు సంబంధించిన వివరాలు కనిపించడంతో ఆయా వ్యక్తులు నిజమే అని భ్రమపడి వాటికి కింద ఉన్న లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా స్పామర్ల ఉచ్చులో పడిపోతారు.
అంతేకాదు, మన దేశం కంప్యూటర్‌ మాల్‌వేర్‌ వార్మ్స్‌, వైరస్‌ల విషయంలో మొదటి స్థానంలోను, ట్రోజన్‌ హార్స్‌ల విషయలో రెండోస్థానంలో ఉందట. ప్రతిరోజూ భారత దేశంలో 788 కంప్యూటర్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళుతున్నాయి. 2009 నాటికి దేశంలోని వివిధ ప్రాంతాలలో 62,623 కంప్యూటర్లు జాంబీల చేతుల్లోకి వెళ్లిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో సగం కంప్యూటర్లు ఒక్క ముంబై నగరంలోనే ఉన్నాయట. ఆ తరువాత జాబితాలో 13 శాతం కంప్యూటర్లతో ఢిల్లీ, 7 శాతం కంప్యూటర్లతో హైదరాబాద్‌, ఉన్నాయి.
సిమాంటెక్‌ నివేదిక ప్రకారం.. మాల్షీషియస్‌ కోడ్‌లలో అధిక భాగం ఫైల్‌ షేరింగ్‌, ఎక్జిక్యూటబుల్‌ (.exe ఫైళ్ళు) ఫైళ్ళ ద్వారానే వ్యాపిస్తున్నాయి. మిగిలినవి ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌, ఈ-మెయిల్‌ ఎటాచ్‌మెంట్స్‌, ఇన్‌స్టంట్‌ మెసెంజర్స్‌, డేటాబేస్‌, బ్యాక్‌డోర్స్‌ ద్వారా జొరబడుతున్నాయి.

Wednesday 21 April 2010

ఆ రేడియో సంకేతాలు ఎవరివి?!

అంతరిక్షంలో ఇప్పుడో అద్భుతం జరుగుతోంది. మన సౌర కుటుంబానికి సమీపంలో ఉన్న ఓ పాలపుంతలోంచి కొన్ని రేడియో తరంగాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి మనకు తెలియనివి.. ఇప్పటి వరకు మనం చూడనివి. అసలు ఇవి ఏ వస్తువు నుంచి పుట్టుకొస్తున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు.

రేడియో తరంగాలు.. ఈ పదం మనకు కొత్త కాదు. ఎందుకంటే అసలు వాటిని కనిపెట్టిందే మనం. భూమ్మీద మన అవసరాల కోసం, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో భాగంగా మనం ఆకాశంలో గుండా ఒకచోటి నుంచి మరో చోటికి రేడియో తరంగాలను ప్రసారం చేస్తుంటాం. అంతేకాదు, గ్రహాంతర వాసుల అన్వేషణలో భాగంగా ఇప్పటికి ఎన్నోసార్లు మనం భూమి నుంచి రోదసిలోకి రేడియో సంకేతాలు ప్రసారం చేశాం. 1974 నుంచి గత ఏడాది వరకు ఇలా మనం రేడియో తరంగాలను రోదసిలోకి పంపుతూనే ఉన్నాం. అయితే వాటికి అంతరిక్షంలోని ఏ ప్రాంతం నుంచి కూడా నేటి వరకు జవాబు అన్నది రాలేదు. కానీ ఇప్పుడు ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. మన సౌర కుటుంబానికి సమీపంలో ఉన్న M82 అనే పాలపుంతలోంచి కొన్ని రేడియో తరంగాలు నిర్విరామంగా ప్రసారమవుతున్నాయి. బ్రిటన్‌లోని మెక్‌లెస్‌ ఫీల్డ్‌కు సమీపంలో ఉన్న జోడ్రెల్‌ బాంక్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కొందరు ఈ రేడియో తరంగాలను గమనించారు. గత ఏడాది మే నెలలో బ్రిటన్‌లోని మెర్లిన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ రేడియో టెలిస్కోప్‌ల గుండా M82 పాలపుంతలో పేలుడును వీక్షిస్తున్న సమయంలో, ఈ పాలపుంత నుంచి రేడియో తరంగాలు వెలువడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
"అసలు అవి ఏమిటో మాకు అర్థం కాలేదు..'' అని జోడ్రెల్‌ బాంక్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకరైన టామ్‌ ముక్స్‌లో వ్యాఖ్యానిస్తున్నారు. మళ్లీ ఆయనే "మేం మొదట ఒక తెల్లని మచ్చను చూశాం. అది కొన్ని రోజులపాటు కొద్దికొద్దిగా పెద్దది కాసాగింది. సాధారణంగా సూపర్‌నోవా ఏర్పడిన సమయంలో కూడా ఇలాంటి తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి కొన్ని వారాలపాటు ప్రకాశించి, స్పెక్ట్రమ్‌ ఆఫ్‌ రేడియేషన్‌లో మార్పులు వచ్చే కొద్దీ క్రమక్రమంగా వెలుగు తగ్గి, కొన్ని నెలల వ్యవధిలో కనుమరుగవుతాయి. కానీ M82 పాలపుంతలో మేం చూసిన తెల్లని మచ్చ అలా లేదు. ఏడాది కాలంగా మేం దాన్ని గమనిస్తున్నాం. దాని వెలుగులో కొద్దిపాటి మార్పే తప్ప స్పెక్ట్రమ్‌ మాత్రం స్థిరంగా ఉంది..'' అని వివరిస్తున్నారు.

అమిత వేగంతో భూమి వైపు!
అంతేకాదు, ఈ రేడియో తరంగాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటి వేగం కూడా కాంతి వేగానికి నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి వేగం బ్లాక్‌హోల్స్‌ వద్ద మాత్రమే కనిపిస్తుంది. తమ చుట్టూ ఉండే ద్రవ్యరాశిని బ్లాక్‌హోల్స్‌ అమిత వేగంతో తమలోకి లాగేసుకుంటున్న సమయంలో కొంత ద్రవ్యరాశిని బయటికి గెంటుతూ ఉంటాయి. అప్పుడు అక్కడ జనించే వెలుగు ఈ రేడియో తరంగాలలోనూ కనిపిస్తోంది. ఈ తరంగాలు కూడా కొద్దిగా ఒంపుతో కూడి కాంతి వేగంతో మన భూమివైపే ప్రయాణిస్తున్నాయి.

అక్కడ బ్లాక్‌ హోల్‌ ఉందా?
M82 పాలపుంతలో బ్లాక్‌హోల్‌ ఉందా? ఆ బ్లాక్‌హోల్‌లోంచే ఈ రేడియో తరంగాలు పుట్టుకొస్తున్నాయా? ఇవన్నీ ఖగోళ శాస్త్రవేత్తల మదిని తొలుస్తున్న ప్రశ్నలే. బహుశా ఇతర పాలపుంతలలో మాదిరిగా M82 పాలపుంతలో కూడా ఏదైనా సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌హోల్‌ ఉండి ఉండవచ్చనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. లేదా అది చిన్న మైక్రోక్వాజర్‌ కూడా అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అతి పెద్ద నక్షత్రం ఏదైనా పేలినప్పుడు ఏర్పడే బ్లాక్‌ హోల్‌ను మైక్రోక్వాజర్‌గా పిలుస్తారు. ఇలా ఏర్పడిన మైక్రోక్వాజర్‌ ద్రవ్యరాశి మన సూర్యుడి ద్రవ్యరాశి కంటే కంటే 10 నుంచి 20 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ మైక్రోక్వాజర్లు కూడా రేడియో తరంగాలను వెలువరిస్తాయి. అయితే ఇప్పటి వరకు ఈ భూమ్మీద ఇంతటి వెలుగు, వేగంతో కూడిన రేడియో తరంగాలను మనం చూడలేదు. "అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఈ మైక్రోక్వాజర్లు ఒక్క రేడియో తరంగాలనే కాదు, ఎక్స్‌-రేలను కూడా వెలువరిస్తాయి. ఈ లెక్కకొస్తే మరి ఈ M82 పాలపుంతలోంచి రేడియో తరంగాలతోపాటు ఎక్స్‌-రేలు కూడా వెలువడాలి.. కానీ అలా జరగడం లేదు. బహుశా అందరూ భావిస్తున్నట్లుగా ఇది మైక్రోక్వాజర్‌ కూడా అయి ఉండకపోవచ్చు..'' అని ఖగోళ శాస్త్రవేత్త టామ్‌ ముక్స్‌లో అంటున్నారు.
అయితే ఈ సువిశాల విశ్వంలో ఎన్నో పాలపుంతలు, మరెన్నో బ్లాక్‌హోల్స్‌. మన సౌరకుటుంబం ఉన్న పాలపుంత మాదిరిగానే అన్ని పాలపుంతలూ ఉంటాయనుకోవడం మన భ్రమే. బహుశా M82 పాలపుంతలో కనిపించిన ఈ పరిణామాలు బహుశా ఆ పాలపుంతలో సహజమేమో! ఏదేమైనా మనకు తెలియని, మనం చూడని రేడియో తరంగాలు ఈ అనంత విశ్వంలో సుదూరాన ఉన్న పాలపుంత నుంచి వెలువడడం మాత్రం ఇప్పటికి విచిత్రమే!

మీ కంప్యూటర్‌లో సమస్య ఉందా?

మీ కంప్యూటర్‌ పని చేయనని మొరాయిస్తుందా? సీరియస్‌గా పని చేసుకుంటున్నప్పుడు చటుక్కున హ్యాంగ్‌ అవుతుందా? కీబోర్డు పని చేయడం లేదా? మానిటర్‌పైన ఉండే డెస్కటాప్‌ ఉన్నట్లుండి కనిపించకుండా పోతుందా? ఇవే కాదు, ఇంకా ఎలాంటి సమస్యనైనా సరే.. ఓ చిన్న సాప్ట్‌వేర్‌ సాయంతో గుర్తించవచ్చు. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇన్‌కార్పొరేషన్‌ ఇటీవల 'ఫిక్స్‌ ఇట్‌ సెంటర్‌' పేరుతో ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీనిని మీ సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. మీ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లలో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన సమస్యలను పసిగట్టి మీకు తెలియజేస్తుంది. మీకిష్టమైతే మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి మైక్రోసాఫ్ట్‌ సపోర్ట్‌ సహాయం తీసుకోవచ్చు.
ప్రస్తుతం 'ఫిక్స్‌ ఇట్‌ సెంటర్‌ ఆన్‌లైన్‌' బీటా వెర్షన్‌ కంప్యూటర్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీనిని ఉచితంగా మీ సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం స్క్రీన్‌ మీద కనిపించే మెసేజెస్‌ను ఫాలో అవుతూ ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయవచ్చు. ఇది విండోస్‌ ఎక్స్‌పి, విస్టా, సర్వర్‌, విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టంలను సపోర్ట్‌ చేస్తుంది. 'ఫిక్స్‌ ఇట్‌ సెంటర్‌' సాఫ్ట్‌వేర్‌ గురించిన మరిన్ని వివరాలకు, ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు http://fixitcenter.support.microsoft.com/Portal/GetStartedను చూడొచ్చు.

బ్లాగరూ.. మీ 'రేటింగ్‌' ఎంత?

మీరు బ్లాగరా? అయితే మీ బ్లాగ్‌ రేటింగ్‌ ఎంతో మీకు తెలుసా?

ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్‌లో బ్లాగ్‌లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. రానురాను ఇవి వెబ్‌సైట్లను మించిపోతున్నాయి. 'కాదేదీ బ్లాగ్‌కు అనర్హం..' అన్నట్లుగా తయారైంది పరిస్థితి. మరి ఇంత పెద్ద బ్లాగ్‌లోకంలో మీ రాతలను ఎందరు చదువుతున్నారు? నిజానికి చాలామంది బ్లాగర్లు 'నాకూ ఓ బ్లాగ్‌ ఉంది..' అని చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారని బ్లాగులపై ఇటీవల జరిపిన ఓ అధ్యయనం పేర్కొంటోంది. ఇటీవల జరిగిన బ్రిటీష్‌ సైకలాజికల్‌ సొసైటీ సాంవత్సరిక సమావేశంలో భాగంగా ఈ అధ్యయనం జరిగింది. బ్రిటన్‌కు చెందిన పరిశోధకుడు సుసాన్‌ జామిసన్‌-పావెల్‌ ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన 75 మంది బ్లాగర్లు, వారి బ్లాగుల గురించి ఈ అధ్యయనం జరిపారు. ఆనక ఆయన తన అధ్యయన విశేషాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఇంటర్నెట్‌లో బ్లాగులు ఎక్కువేకానీ, తమ బ్లాగ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువట.

అదే ప్రామాణికం..
బ్లాగులోకంలో బ్లాగ్‌ ఉండడం ప్రామాణికం కాదని, దాన్ని ఎంత తరచుగా అప్‌డేట్‌ చేస్తున్నారన్నది ప్రామాణికమని బ్రిటన్‌ పరిశోధకుల కొత్త అధ్యయనం తెలుపుతోంది. మీ బ్లాగ్‌ ఎంత అందంగా ఉన్నా, ఎంత విలువైనదైనా ఉపయోగం ఏముంది అందులో కొత్త పోస్టింగ్‌లు లేనప్పుడు? తన అధ్యయనంలో భాగంగా పావెల్‌ ఒక్కో బ్లాగర్‌కు మొత్తం ఎన్ని బ్లాగులు ఉన్నాయి? వాటిల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? సదరు పోస్టుల్లో ఉన్న మొత్తం పదాలు ఎన్ని? ఆయా పోస్టులకు ఎన్ని కామెంట్లు వచ్చాయి? వాటిలో పాజిటివ్‌ కామెంట్‌లు ఎన్ని? నెగిటివ్‌ కామెంట్‌లు ఎన్ని? అనే విషయాలపై అధ్యయనం జరిపారు. అంతేకాకుండా బ్లాగర్లందరిచేత ఇతర బ్లాగర్లకు పరస్సరం రేటింగ్స్‌ కూడా ఇప్పిచారు. చివరికి ఈ అధ్యయనంలో 'స్నేహితులు ఎక్కువగా ఉన్న బ్లాగర్లే తమ బ్లాగుల్లో తరచూ కొత్త పోస్టింగ్‌లు ఉంచుతున్నారని, వీరి బ్లాగులే అందరినీ ఆకట్టుకుంటున్నాయి..' అని తేలింది.
ఇంకేం, మీరూ ఓసారి మీ స్నేహితుల జాబితా చూసుకోండి మరి!

Saturday 10 April 2010

గార్మిన్‌-ఆసస్‌ M10 స్మార్ట్‌ఫోన్‌

గార్మిన్‌ కంపెనీ ఆసస్‌తో కలిసి సంయుక్తంగా ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని పేరు గార్మిన్‌-ఆసస్‌M10. మైక్రోసాఫ్ట్‌ తాజా మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌ మొబైల్‌ 6.5.3, క్యూయల్‌కామ్‌ 7227 ప్రాసెసర్‌ ఆధారంగా పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ 3.5 అంగుళాల WVGA ఫుల్‌ టచ్‌స్క్రీన్‌, 5 మెగా పిక్సెల్‌ కెమెరా విత్‌ ఆటోఫోకస్‌ తదితర సదుపాయాలను కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్‌, 512 ఎంబి రామ్‌ ఇంటర్నల్‌ మెమరీని కలిగి ఉడే ఈ ఫోన్‌ 4జిబి ఎస్‌డి కార్డ్‌ సహితంగా లభిస్తుంది. కావాలంటే మైక్రోఎస్‌డి కార్డ్‌ ద్వారా ఈ మెమరీని 32జిబి వరకు పెంచుకునే వీలుంది. అంతేకాదు ఇందులో నావిగేషన్‌ మ్యాప్స్‌తోపాటు ఇంగ్లీషు, హిందీ భాషల్లో వాయిస్‌ గైడెన్స్‌ సదుపాయం కూడా ఉంది. అలాగే ఎ-జిపిఎస్‌, ఫుల్‌ ఇ-మెయిల్‌, క్యాలెండర్‌, ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌, వైఫై తదితర సౌకర్యాలు కూడా ఉన్నాయి. రెండు నెలల క్రితమే భారత్‌లో అధికారికంగా విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.19,990.

సామ్‌సంగ్‌ కొత్త టచ్‌స్క్రీన్‌ ఫోన్‌ S5620 Monte

సామ్‌సంగ్‌ తాజాగా భారత్‌లో తన టచ్‌స్క్రీన్‌ ఫోన్ల శ్రేణికి మరో ఫోన్‌ను చేర్చింది. దీనిపేరు S5620 Monte. 3 అంగుళాల టిఎఫ్‌టి కెపాసిటివ్‌ టచ్‌స్క్రీన్‌ కలిగి ఉన్న ఈ ఫోన్‌ సామ్‌సంగ్‌ సొంత ఆపరేటింగ్‌ సిస్టం టచ్‌విజ్‌ 2.0 ఇంటర్‌ఫేస్‌ ఆధారంగా పనిచేస్తుంది. 200 ఎంబి ఇంటర్నల్‌ మెమరీ కలిగిన ఈ థర్డ్‌ జనరేషన్‌ (3G) ఫోన్‌ 3.2 మెగాపిక్సెల్‌ కెమెరా, ఎఫ్‌ఎం రేడియో, ఎంపి3 ఆడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, వీడియో ప్లేయర్‌, బ్లూటూత్‌, ఎ-జిపిఎస్‌ తదితర సౌకర్యాలను కలిగి ఉంది. కావాలంటే మైక్రో ఎస్‌డి కార్డ్‌ ద్వారా ఫోన్‌ మెమరీని పెంచుకోవచ్చు. పైగా ప్రీలోడెడ్‌ గూగుల్‌ మ్యాప్స్‌ సౌకర్యం కూడా ఉంది. సామ్‌సంగ్‌ తాజా సంచలనం కార్బీకి ప్రత్యామ్నాయంగా ఇన్ని ఫీచర్లు, సౌకర్యాలు కలిగి ఉన్న మరో ఫోన్‌ ఇది. పైగా 3G ఫోన్‌. ధర మాత్రం కేవలం రూ.8850.

Wednesday 7 April 2010

'ఐప్యాడ్‌'కు.. ఎందుకింత క్రేజ్‌!

యాపిల్‌ కంపెనీ అమెరికాలో ఐఫోన్‌ను విడుదల చేసినప్పుడు.. దాని కోసం యాపిల్‌ స్టోర్‌ ఎదురుగా అక్కడి జనం పెద్ద క్యూ కట్టారు. కొంతమంది ముందురోజు రాత్రే వచ్చి క్యూలో నిలబడ్డారు. ఒక్క ఐఫోన్‌కే కాదు, యాపిల్‌ కంపెనీ ఏ ఉత్పత్తి మార్కెట్‌లోకి తీసుకొచ్చినా దానికి బోలెడంత క్రేజ్‌ ఉంటోంది. ఇప్పుడు యాపిల్‌ తాజా ఉత్పత్తి.. ఐప్యాడ్‌కు కూడా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన స్పందన కనిపిస్తోంది. అసలు ఐప్యాడ్‌లో అంత గొప్పతనం ఏముంది అనుకుంటున్నారా? చూడండి.. మీరే!

మ్యాక్‌, ఐపాడ్‌, ఐఫోన్‌.. ఇప్పుడు ఐప్యాడ్‌. యాపిల్‌ కంపెనీ తనకు మాత్రమే సాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానంతో యావత్‌ ప్రపంచాన్నే అలరిస్తోంది. ఐపాడ్‌ తరవాత అక్షరం మార్పుతో యాపిల్‌ సృష్టించిన 'ఐప్యాడ్‌' తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఇదొక టచ్‌స్క్రీన్‌ టాబ్లెట్‌ కంప్యూటర్‌. కంప్యూటర్‌ చేసే అన్ని పనులూ ఇది చేయగలదు. అంతేకాదు, ఇదొక ఈ-రీడర్‌ కూడా. దీని సాయంతో బోలెడన్ని ఈ-పుస్తకాలను చదువుకోవచ్చు. అందుకే యాపిల్‌ ఐప్యాడ్‌కు ప్రపంచమంతా నీరాజనం పలుకుతోంది. ఐప్యాడ్‌లోని ప్రత్యేకతలు ఏమిటంటే..
సులువుగా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌
ఐప్యాడ్‌లో నెట్‌ బ్రౌజింగ్‌ గొప్ప వినోదాన్ని అందిస్తుంది. వేళ్ల కదలికలతో వెబ్‌ పేజీలను ఎలా కావాలంటే అలా తిరగేయొచ్చు. దీని మల్టీ టచ్‌స్క్రీన్‌లో పేజీ మొత్తం అడ్డంగా, నిలువుగా కూడా కనిపిస్తుంది. మీ చేతి వేళ్లతో పేజీలను పైకీ, కిందకీ కదపొచ్చు. వెబ్‌ పేజీలో ఉండే ఫొటోపై వేలితో రాస్తే చాలు.. ఫోటో పెద్ద సైజుకు మారిపోతుంది. ఐప్యాడ్‌లో బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు మీరు చూసిన వెబ్‌ పేజీలన్నీ పక్కనే థంబ్‌నెయిల్స్‌ వ్యూలోకి చేరుతుంటాయి. అవసరమైనప్పుడు ఏ పేజీ కావాలనుకుంటే ఆ పేజీని వేలితో టచ్‌ చేయడం ద్వారా మళ్లీ మళ్లీ చూడొచ్చు.
ఈ-మెయిల్‌.. భలే!
ఐప్యాడ్‌లో ఈ-మెయిల్‌ అనుభవం గురించి చెప్పడం కాదు, చూడాల్సిందే! మీకు అవసరమైన మెయిల్‌ను జస్ట్‌ వేలి కొనతో తాకితే చాలు.. అది పెద్దగా మారి స్క్రీన్‌ అంతటా కనిపిస్తుంది. స్ల్పిట్‌ స్క్రీన్‌ వ్యూ.. అంటే ఐప్యాడ్‌ స్క్రీన్‌ రెండు భాగాలుగా విడిపోయి, ఒక వైపు మీ ఇన్‌బాక్స్‌లోని మెయిల్స్‌, మరోవైపు మీరు ఓపెన్‌ చేసిన మెయిల్‌ దర్శనమిస్తాయి. ఐప్యాడ్‌ను నిలువుగా తిప్పితే చాలు, అటోమేటిక్‌గా మీ మెయిల్‌ స్క్రీన్‌ అంతటా పరుచుకుంటుంది. కంపోజ్‌ మెయిల్‌ బటన్‌పైన వేలి కొన ఉంచడమే ఆలస్యం.. స్క్రీన్‌పైన పెద్ద క్యూవెర్టీ కీబోర్డు ప్రత్యేక్షమవుతుంది. ఇన్‌బాక్స్‌లోని ఏదైనా ఈ-మెయిల్‌ డిలీట్‌ చేయాలనుకుంటే మళ్ళీ చిన్న 'టచ్‌'.. అంతే! మెయిల్‌ ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. ఎవరైనా ఈ-మెయిల్‌ ద్వారా మీకు ఫోటోలు పంపితే, మెయిల్‌తోపాటుగా ఫోటోనీ చూసేయొచ్చు. ఇంకా బిల్ట్‌ ఇన్‌ ఫొటోస్‌ అప్లికేషన్‌ సాయంతో ఏదైనా ఫొటోను ఈ-మెయిల్‌లో నేరుగాసేవ్‌ చేయొచ్చు.
ఫొటోలన్నీ ఒక్క 'టచ్‌'తో!: ఐప్యాడ్‌కున్న పెద్ద స్క్రీన్‌, దానిలోని సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఫొటోలు చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తాయి. ఫొటోలన్నీ కలిసి ఒక అల్బం మాదిరిగా కనిపిస్తాయి. చూడాలనుకున్నప్పుడు ఆల్బంపైన వేలితో టచ్‌ చేస్తే చాలు.. ఆ ఆల్బంలో ఉన్న ఫోటోలన్నీ థంబ్‌నెయిల్‌ వ్యూలో కనిపిస్తాయి. అంతేకాదు, మీరు కోరిన ఫొటోను వేలితో అటూ ఇటూ తిప్పొచ్చు. చిన్నగా, పెద్దగా చేసుకోవచ్చు. కావాలనుకుంటే స్లైడ్‌ షో చూడొచ్చు. చార్జింగ్‌ సమయంలో మీ ఐప్యాడ్‌ ఒక ఫొటోఫ్రేమ్‌గా కనిపిస్తుంది. మీ డిజిటల్‌ కెమెరాలోని ఫొటోలన్నింటినీ యాపిల్‌ కెమెరా కనెక్షన్‌ కిట్‌ సాయంతో ఐప్యాడ్‌లోకి లాక్కోవచ్చు.
వీడియో.. చూసి తీరాల్సిందే!
హై డెఫినిషన్‌ మూవీస్‌ దగ్గర్నించి టీవీ షోల వరకు, పాడ్‌కాస్ట్స్‌ నుంచి మ్యూజిక్‌ వీడియోల వరకు ఏ వీడియోనైనా సరే.. ఐప్యాడ్‌కుండే పెద్దదైన, హై రిజల్యూషన్‌ స్క్రీన్‌మీద మీరు చాలా స్పష్టంగా వీక్షించవచ్చు. జస్ట్‌ రెండుసార్లు వేలి కొనతో తాకితే.. వైడ్‌ స్క్రీన్‌ కాస్తా ఫుల్‌స్క్రీన్‌గా మారిపోతుంది. అంతేకాదు, ఐప్యాడ్‌లో యూట్యూబ్‌ వీడియోలను వీక్షించడం చాలా సులభం. చూస్తున్నప్పుడు ఐప్యాడ్‌ను అడ్డంగా తిప్పితే చాలు.. ఆటోమేటిక్‌గా వీడియో ఫుల్‌స్క్రీన్‌కు మారిపోతుంది.
వీనులవిందైన సంగీతం
ఐప్యాడ్‌లో ఉండే ఐపాడ్‌ అప్లికేషన్‌ ఉపయోగించి మీ వేలికొనల సాయంతో వీనుల వీందైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఐప్యాడ్‌కు ఉండే బిల్ట్‌ ఇన్‌ స్పీకర్స్‌ మీకు శ్రావ్యమైన శబ్దాన్ని అందిస్తాయి. లేదంటే వైర్‌లెస్‌ బ్లూటూత్‌ సాయంతో ఇంట్లోని గదుల్లో తిరుగుతూ కూడా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఐప్యాడ్‌ స్క్రీన్‌ మీద ఆడియో సాంగ్స్‌ అన్నీ ఆల్బమ్‌, సాంగ్‌, ఆర్టిస్ట్‌ తదితర కేటగిరీల వారీగా మీకు కనిపిస్తాయి. ఏ పాటనైనా వినాలనుకుంటే జస్ట్‌ ఆ లింక్‌పైన వేలితో టచ్‌ చేస్తే చాలు.. సంగీతం మొదలవుతుంది.
ఐట్యూన్స్‌ స్టోర్‌లో కావలసినన్ని
ఆడియో, వీడియోల కోసం యాపిల్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఐట్యూన్స్‌ స్టోర్‌ ఐకాన్‌ మీ ఐప్యాడ్‌ స్క్రీన్‌పై ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ ఒక్క టచ్‌తో మీరు మీకిష్టమైన పాటలు, సినిమాలు ఈ స్టోర్స్‌ నుంచి కొనుక్కోవచ్చు. ఐట్యూన్స్‌ స్టోర్‌లో ఉండే లక్షలాది స్టాండర్డ్‌, హై డెఫినిషన్‌ ఆడియో, వీడియోల నుంచి మీకు కావలసిన వాటిని మీ ఐప్యాడ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని, మీకిష్టమైన వేళలో తీరికగా వినవచ్చు, వీక్షించవచ్చు. అలాగే మీ పీసీలోగాని, మ్యాక్‌లోగానీ ఐట్యూన్స్‌ లైబ్రరీలో ఉన్న ఆడియో, వీడియో కలెక్షన్‌ను మీ ఐప్యాడ్‌లోకి లోడ్‌ చేసుకోవచ్చు.
యాపిల్‌ స్టోర్‌లో బోలెడ న్ని అప్లికేషన్లు
మీ ఐప్యాడ్‌లో వినియోగించుకునేందుకు దాదాపు లక్షా నలభై వేల అప్లికేషన్లు ఎల్లప్పుడూ యాపిల్‌ అప్లికేషన్‌ స్టోర్‌లో సిద్ధంగా ఉంటాయి. గేమ్స్‌ మొదలుకొని బిజినెస్‌ అప్లికేషన్స్‌ వరకు వేటినైనా సరే మీరు ఈ స్టోర్‌ నుంచి కొనుక్కోవచ్చు. ఐప్యాడ్‌ స్క్రీన్‌పైన ఉండే అప్లికేషన్‌ స్టోర్‌ ఐకాన్‌పై టచ్‌ చేస్తే చాలు.. బోలెడన్ని అప్లికేషన్లు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా మీ ఐప్యాడ్‌కు సరిపోయే అప్లికేషన్లు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి.
ఈ-పుస్తకాలు అందించే ఐ-బుక్స్‌
యాపిల్‌ ఐప్యాడ్‌లో ఇదో సరికొత్త ఫీచర్‌. ఈ ఫీచర్‌ మీ ఐప్యాడ్‌ను ఈ-రీడర్‌గా మార్చేస్తుంది. దీని సాయంతో మీరు ఇంటర్నెట్‌లో దొరికే బోలెడు ఈ-బుక్స్‌ చదువుకోవచ్చు. అంతేకాకుండా యాపిల్‌ వారి ఐ-బుక్స్‌ స్టోర్‌లో క్లాసిక్స్‌ నుంచి బెస్ట్‌ సెల్లర్స్‌ వరకు కథలు, నవలలు కొనుక్కొని, మీ ఐప్యాడ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకున్నవన్నీ బుక్‌షెల్ఫ్‌ అనే ఫోల్డర్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఐప్యాడ్‌కు ఉండే హై రిజల్యూషన్‌, ఎల్‌ఇడి బ్యాక్‌ లైట్‌ స్క్రీన్‌మీద.. రాత్రిపూట కాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా అక్షరాలు, బొమ్మలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
ఎక్కడ ఏముందో చెప్పే మ్యాప్స్‌
ఐప్యాడ్‌లో ఉన్న మరో సౌకర్యం మ్యాప్స్‌. దీని సాయంతో మీరు ఉన్న చోటు నుంచి కదలకుండా ప్రపంచలో ఎక్కడ ఏముందో తెలుసుకోవచ్చు, చూడొచ్చు. హైరిజల్యూషన్‌ శాటిలైట్‌ ఇమేజస్‌ ద్వారా ఏ వీధిలో ఏముందో చాలా స్పష్టంగా చూడొచ్చు. అలాగే మీకు దగ్గర్లో ఎక్కడ రెస్టారెంట్‌ ఉందో, ఎక్కడ సినిమా థియేటర్‌ ఉందో.. ఇలాంటి వివరాలన్నీ జస్ట్‌ ఒక్క టచ్‌తో తెలుసుకోవచ్చు. మీ ఐప్యాడ్‌లోని మ్యాప్స్‌ అందించే టర్న్‌ బై టర్న్‌ డైరెక్షన్స్‌తో మీరు వెళ్లాలనుకున్న చోటికి క్షేమంగా చేరవచ్చు.
ఇవే కాకుండా ఇంకా యాపిల్‌ ఐప్యాడ్‌లో నోట్స్‌, క్యాలెండర్‌, కాంటాక్ట్స్‌, హోమ్‌ స్క్రీన్‌, స్పాట్‌లైట్‌ సెర్చ్‌ అనే ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే యాపిల్‌ ఐప్యాడ్‌కు ఇంత క్రేజ్‌ మరి!

Thursday 1 April 2010

టార్గెట్‌.. 'ఫోబోస్‌'?!

రాబోయే రోజుల్లో మీరు 'ఫోబోస్‌' అనే మాట తరచూ వింటారు.  అర్థం కాలేదా? ఫోబోస్‌ అనేది మార్స్‌(అంగారక గ్రహం) రెండు ఉపగ్రహాలలో ఒకటి.  మొన్నటి వరకు మార్స్‌పైన 'జీవం' జాడల కోసం అన్వేషించిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల చంద్రునిపై నీటి జాడలను గుర్తించగానే తమ దృష్టిని చంద్రునివైపు మరల్చారు.  అయినా మరోవైపు అంగారకుడ్ని మర్చిపోలేదు. అయితే ఏకాఎకిన అంగారక గ్రహంపై కాలు మోపే ముందు.. తొలుత దాని ఉపగ్రహాలలో పెద్దదైన ఫోబోస్‌పై దిగాలని, కొంతకాలం అక్కడే ఉండి, అంగారకుడి గుట్టుమట్లు తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  


అదే ఎందుకని?
అంగారకుడి రెండు ఉపగ్రహాలలో ఫోబోస్‌ చాలా చిన్నది.  పెద్ద ఆస్టరాయిడ్‌ అంత కూడా ఉండదు.  ద్రవ్యరాశి కూడా చాలా తక్కువ.  అంతేకాదు, ఫోబోస్‌పై వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి కూడా పెద్దగా ఉండవు.  నిజానికి మన భూమికి ఎంతో దగ్గరగా ఉండే  చంద్రునిపైకి వెళ్లాలన్నా, తిరిగి భూమికి చేరుకోవాలన్నా మనకు అత్యంత శక్తివంతమైన భారీ వ్యోమనౌకలు కావలసిందే.  అంగారకుడి విషయంలోనూ ఇదే సమస్య.  ఇంతకన్నా పెద్ద సమస్య అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడం.  నాసా తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అయ్యే ఖర్చు, నిధుల విడుదల విషయమై ఇటీవల అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఒక సమీక్షా సమావేశం జరిగింది.  ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ నార్మన్‌ అగస్టీన్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికలోని సూచనలపై ఈ సమావేశంలో చర్చించారు.  అదేమిటంటే.. భవిష్యత్తులో చంద్రునిపైకి, లేదంటే అంగారకుడిపైకి నాసా మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టడానికి ఏడాదికి 3 కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది.  అంగారక యాత్రకు అయ్యే ఖర్చుతో దగ్గరలో ఉన్న ఇతర గ్రహాలకు వెళ్లి, తిరిగి రావచ్చు.  పైగా భూమి నుంచి బయలుదేరి అంగారకుడిని చేరడానికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువ.  కాబట్టి అంగారకుడిపై కాలు మోపే ముందుగా దాని ఉపగ్రహాలలో ఏదో ఒక దానిపైకి చేరుకుని, అక్కడ కొంత కాలంపాటు ఉండి, అంగారకుడికి సంబంధించిన మరింత సమాచారం సేకరించవచ్చనేది దాని సారాంశం.  ఇందుకు ఫోబోస్‌ అన్ని విధాలా అనుకూలిస్తుందని, ఒక్కసారి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించాక ఫోబోస్‌పై దిగడం, అక్కడి నుంచి అంగారకుడిపైకి చేరడం సులువే కాక ఇదంతా తక్కువ ఖర్చులో  సాధ్యపడుతుందని ఆ నివేదిక పేర్కొంది.  మరో మాటలో చెప్పాలంటే.. మనం భూమి నుంచి చంద్రునిపైకి వెళ్లడానికి అయ్యే ఖర్చు కంటే భూమి నుంచి ఫోబోస్‌కు వెళ్లడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువన్నమాట!
దిగిన తర్వాత?
ఒక్కసారి ఫోబోస్‌పై దిగామంటే.. ఆ తర్వాత అంతా తేలికే.  అక్కడ్నించి అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ల సహాయంతో అంగారక గ్రహం గుట్టుమట్లు తెలుసుకోవచ్చు.  లేదంటే రిమోట్‌ కంట్రోల్‌ రోవర్లను అంగారకుడిపైకి పంపించి అక్కడి పరిస్థితులను మరింత క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.  అయితే ఇక్కడో చిన్న చిక్కు ఉంది.  అంగారకుడి రెండు ఉపగ్రహాలలో పెద్దదైన ఫోబోస్‌ గురించి మనకు పెద్దగా ఏమీ తెలియదు.  " ఇప్పటి వరకు మనం మన సౌర కుటుంబంలోని ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకున్నాం, ఒక్క ఫోబోస్‌ గురించి తప్ప.. అసలు అది ఎలా ఏర్పడిందో మనకు తెలియదు.. కానీ ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఏర్పడింది..'' అని కాలిఫోర్నియాలోని మఫెట్‌ ఫీల్డ్‌లో ఉన్న మార్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ పాస్కల్‌ లీ అభిప్రాయపడుతున్నారు.  
ఒక్కసారి ఫోబోస్‌పైకి చేరామంటే చాలు.. ఆ తర్వాత అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగిపోతాయి.  అక్కడ్నించి అంగారక గ్రహ కక్ష్యలోకి చేరేందుకు అవసరమైన కీలకమైన ప్రయోగాలు మొదలవుతాయి.  వీటిలో 'ఏరో బ్రేకింగ్‌' టెక్నిక్‌ ఒకటి.  దీని వల్ల వ్యోమనౌక వేగం చాలా వరకు తగ్గిపోతుంది.  భూమి మీద విమానంలో ప్రయాణించిన మాదిరిగా ఆ గ్రహపైనా ప్రయాణించవచ్చు.  ఆ తర్వాతేముంది?  వివిధ రాకెట్‌ పరికరాలు, రోబోటిక్‌ వాహనాలతో ఫోబోస్‌ ఉపగ్రహం కాస్తా మన అవసరాలు తీర్చే ఓ గోడౌన్‌ మాదిరిగా మారిపోతుంది.
అక్కడ్నించి డెమోస్‌కు?
నాసా తన 'ఫోబోస్‌ ప్రాజెక్టు'లో భాగంగా ఆ ఉపగ్రహంపై అద్భుతమైన, అత్యంత ఎత్తైన ఒక స్థూపాన్ని నిర్మించాలని భావిస్తోంది.  దీనిపేరు 'మోనోలిత్‌'.  ఫోబోస్‌ ఉపరితలం నుంచి 90 మీటర్ల ఎత్తు వరకు ఇది నిర్మింపబడుతుంది.  ఆ తరువాత మార్స్‌ వ్యోమనౌక ఫోబోస్‌ ఉపరితల వాతావరణంలో ఉన్న ఈ మోనోలిత్‌ స్థూపాన్ని పరీక్షిస్తుంది.  తర్వాత ఫోబోస్‌పైనే మరో ప్రదేశానికి చేరుకుని అక్కడి నమూనాలను సేకరించి, ఆనక మార్స్‌ ఉపగ్రహాలలో చిన్నదైన డెమోస్‌పైకి చేరుకుంటుంది.  అక్కడ కూడా అవసరమైన నమూనాలు సేకరించిన తర్వాత వ్యోమనౌక తిరిగి భూమిని చేరుకుంటుంది.  "ప్రాజెక్ట్‌ ఫోబోస్‌.. చాలా ఉత్కంఠభరితమైనది.  అవసరమైన నిధులు సమకూరగానే వచ్చే అయిదేళ్లలో ఈ ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాం.. అయితే ఈ ప్రాజెక్ట్‌ భవితవ్యం ఇప్పుడు శ్వేతసౌధం చేతుల్లో ఉంది.  అగస్టీన్‌ నివేదికలోని సూచనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది.  ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం గురించి అందరిలాగే నేనూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను..'' అని మార్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ పాస్కల్‌ లీ వ్యాఖ్యానిస్తున్నారు.  
మార్స్‌పైకి 2020లోనే.. 
"ఫోబోస్‌పైకి వెళ్లడమంటే ఒకరకంగా మార్స్‌ దగ్గరికి వెళ్లడమే.  కానీ మార్స్‌పైకి వెళ్లే యోచన ఇప్పట్లో లేదు.  అది 2020లోనే జరుగుతుంది.  అయితే అంత దూరం వెళ్లి తీరా మార్స్‌ని చేరకుండా, మార్స్‌పైన కాలుమోపకుండా తిరిగి భూమికి వచ్చేయడం కొంత వరకు రుచించని విషయమే.  కానీ తప్పదు.. ఎందుకంటే మా ప్రాజెక్ట్‌ మార్స్‌పైకి వెళ్లడం కాదు, అంతకన్నా ముందు దాని ఉపగ్రహాలలో పెద్దదైన ఫోబోస్‌ను చేర డం'' అని మాజీ వ్యోమగామి, అగస్టీన్‌ కమిటీ సభ్యుడైన చియావో పేర్కొంటున్నారు.    



జీవ రహస్యం.. నీటిలో ఉందా?!

ఈ సృష్టిలో అంతు చిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి.. నీరు! అవును, రసాయన శాస్త్రం ప్రకారం.. రెండు హైడ్రోజన్‌ పరమాణువులు, ఒక ఆక్సిజన్‌ పరమాణువు కలిస్తే.. ఒక నీటి పరమాణువు ఉద్భవిస్తుంది. ఇలా ఉద్భవించిన నీరు ఈ సృష్టిలో లభించే ఎన్నో రకాల పదార్థాలను తనలో ఇట్టే కలిపేసుకుంటుంది. మరికొన్ని పదార్థాలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుంది. ఇతర పదార్థాలతో పోల్చిచూస్తే.. నీటి భౌతిక, రసాయన ధర్మాలు అసాధారణమైనవి. ఎంత వేడినైనా, మరెంతటి చల్లదనాన్ని అయినా నీరు తనలో నిలుపుకోగలదు. అందుకే - ఇప్పుడు జీవశాస్త్రవేత్తల దృష్టి నీటిపై పడింది. నీరు - అంతుచిక్కని పదార్థమని, దీని వెనక దాగి ఉన్న రహస్యాలను కనుగొంటే 'జీవ రహస్యం' కూడా బయటపడవచ్చని వారు భావిస్తున్నారు.

ఇతర ద్రవాలకు, నీటికి చాలా తేడా ఉంటుంది. నీటి భౌతిక ధర్మాలను పరిశీలిస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. ఇది కొంత ఉష్ణోగ్రత వద్ద ఘన రూపం నుంచి ద్రవ రూపానికి, మరికొంత ఉష్ణోగ్రత వద్ద వాయు రూపానికి మారుతుంది. అలాగే అత్యంత అధిక ఉష్ణోగ్రతను, అత్యంత శీతలత్వాన్ని ఇది తనలో ఇముడ్చుకోగలదు. నీటి పరమాణువులు ఒకదానితో మరొకటి ప్రవర్తించే తీరు, ఆయా పరిస్థితులలో వాటి మధ్య ఏర్పడే సంబంధం గురించి తెలుసుకోగలిగితే భవిష్యత్తులో ప్రపంచంలో ఏర్పడే చాలా సమస్యలను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు.
పరిశోధన మొదలైందిలా..
'జీవుల మనుగడలో నీటి ప్రాముఖ్యత'పై ఇప్పటికే రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ ఫిజిక్స్‌ అండ్‌ బయాలజీకి చెందిన ప్రదీప్‌కుమార్‌ తన సహచర బృందంతో కలిసి అనేక పరిశోధనలు జరుపుతున్నారు. నీటి పరమాణువుల మధ్య ఏర్పడే సంబంధం, నీటి సహజ ధర్మాలు తదితర విషయాలపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. కొన్ని రకాల పదార్థాలు నీటిలో పూర్తిగా కరిగి, కలిసిపోతాయి. మరికొన్ని పదార్థాలు అసలేమాత్రం కరగవు. అసలు ఏదైనా పదార్థాన్ని తనలో పూర్తిగా కలిపేసుకునే శక్తి నీటికి ఎలా వచ్చింది? అలాగే కొన్ని పదార్థాలను నీరు తనలో కలుపుకోకపోవడానికి కారణమేమిటి? ఇలాంటి విషయాలను లోతుగా అధ్యయనం చేసే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అసాధారణ ధర్మాలు..
పరిశోధనలో భాగంగా కుమార్‌ అతడి సహచర బృందం తొలుత ఒక్కో నీటి పరమాణువును 'సూపర్‌ కూల్డ్‌' (అతి శీతల) స్థితికి గురిచేసి చూశారు. ఈ స్థితిలో నీటికి సంబంధించిన అనేక అసహజ ధర్మాలు బయటపడ్డాయి. "నీటిని ఘనీభవన స్థితికి చేర్చినా అది వెంటనే ఘనీభవన రూపం దాల్చదు. కొంత సమయం తీసుకుంటుంది. అత్యంత స్వచ్ఛమైన నీటిని తీసుకుని 230 డిగ్రీల కెల్విన్‌కు తీసుకెళ్లినా సరే.. అది తన భౌతిక ధర్మాన్ని మార్చుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది..'' అని కుమార్‌ వ్యాఖ్యానిస్తున్నారు. తమ పరిశోధనలో భాగంగా నీటి పరమాణువుల మధ్య ఏర్పడే సంబంధాన్ని గుర్తించేందుకు కుమార్‌ సహచర బృందం థియరాటికల్‌, కంప్యుటేషనల్‌.. రెండు రకాల పద్ధతులను ఉపయోగించింది.
ఆ గుణమే కాపాడుతుందా?
నీరు ద్రవస్థితిలో ఉన్నప్పుడు.. ప్రతి నీటి పరమాణువు తనకు సమీపంలో ఉన్న మరో నాలుగు పరమాణువులతో చతుర్ముఖీయ (టెట్రాహెడ్రాన్‌) బంధం ఏర్పరచుకోవడం.. నీటిలో ఉష్ణోగ్రత, ఒత్తిడి పెరిగే కొద్దీ మళ్లీ ఈ టెట్రాహెడ్రాన్స్‌ ఎక్కడిక్కడ విచ్ఛిన్నమైపోయి.. ప్రతి నీటి పరమాణువు తనకు సమీపంలో ఉన్న మరొక నీటి పరమాణువుతో జత కట్టడాన్ని పరిశోధక బృందం తమ అధ్యయనంలో గమనించింది. నీటి పరమాణువులకు ఉండే ఈ ధర్మమే అది తన స్వభావాన్ని త్వరితగతిన మార్చుకోనీయకుండా చేస్తోందని, అందుకే నీరు ఘన స్థితి నుంచి ద్రవస్థితికి, అక్కడ్నించి మళ్లీ వాయు స్థితికి చేరడానికి కొంత సమయం పడుతోందని, నీటికి ఈ గుణం ఉండడం వల్లే ఈ భూమ్మీద పర్యావరణ సమతౌల్యం అనేది సాధ్యమవుతోందని కుమార్‌ పేర్కొంటున్నారు.
సమ్మేళనం.. విచ్ఛినం!
ఈ పరిశోధన ద్వారా ఆయా ఉష్ణగ్రతల వద్ద నీటి పరమాణువు సహజ, అసహజ లక్షణాలు ఏమిటన్నది శాస్త్రవేత్తలకు తెలిసిపోయింది. అంటే.. నీరు ఒక్క భూమ్మీద మాత్రమే కాదు, విశ్వమంతటా నిండి ఉంది. ఘన, ద్రవ స్థితిలో కాకపోయినప్పటికీ వాయు స్థితిలో నీటి పరమాణువులు అనంత విశ్వంలో సంచరిస్తూనే ఉంటాయి. ఆయా ఉష్ణోగ్రతల వద్ద అవి చతుర్ముఖీయ బంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి. మళ్లీ విచ్ఛిన్నమై ఒకదానికొకటి జతకడుతూ ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే ఇది నిరంతరం జరిగే పుట్టుక, చావు (సమ్మేళనం, విచ్ఛిన్నం) ప్రక్రియ అన్న మాట. కుమార్‌ బృందం కనుగొన్న ఈ విషయం జీవ రహస్యాన్ని శోధించే విషయంలో అనేక దారులను ఏర్పరిచింది. ఇదే సిద్ధాంతాన్ని ప్రతి పదార్థానికి ఆపాదిస్తే.. చావు, పుట్టుకల రహస్యం తెలిసిపోయినట్లే కదా?
ఆ శక్తి ఎలా వచ్చిందో..
ఇక తెలియాల్సిన విషయం మరొకటి ఉంది. అదే - ఇతర పదార్థాలను తమలో కలిపేసుకునే శక్తి నీటి పరమాణువులకు ఎలా వచ్చిందనేది. ఇది తెలిస్తే.. నీటిలో కొన్ని పదార్థాలు ఎందుకని కరగవో కూడా తెలిసిపోతుంది. అలాగే నీటి పరమాణువుల నడుమ ఏర్పడే బంధాలు, అలాగే నీటిలో ప్రొటీన్ల సమ్మేళనం, విచ్ఛిన్నం ఎలా జరుగుతుందో గనక తెలుసుకుంటే ఈ సృష్టిలో నేటికీ అంతుచిక్కకుండా ఉన్న ఎన్నో విషయాలు ఇట్టే తెలిసిపోతాయని జీవ, భౌతిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. "నీటికి ఇతర పదార్థాలను శోషించుకునే శక్తి ఎలా వచ్చిందో అర్థం చేసుకోగలిగితే.. భవిష్యత్తులో ఒక్క జీవ, భౌతిక శాస్త్ర రంగాలలోనే కాదు, వైద్య, ఆరోగ్య రంగాలలోనూ గణనీయమైన మార్పులు చూడగలం..'' అని ఈ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన ప్రదీప్‌ కుమార్‌ వ్యాఖ్యానిస్తున్నారు.


Thursday 25 March 2010

ప్చ్‌.. ఎక్కడా ఎవరూ లేరేమో!?

ఈ అనంత విశ్వంలో లెక్కలేనన్ని నక్షత్రాలు.. ఎన్నెన్నో సౌర కుటుంబాలు.. ఒక్కో సౌర కుటుంబంలో ఎన్నెన్నో గ్రహాలు.. మళ్లీ వాటికి బోలెడు ఉపగ్రహాలు.  వాటిలో ఒక్కగానొక్క గ్రహం మన భూమి.  ఆ భూమిపై మనం. అంతేనా? ఇంకెక్కడా.. ఏ గ్రహం మీదా.. ఎవరూ లేరా? ఒకవేళ ఉంటే.. వారు మనలాగే ఉంటారా? నేటికీ ఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలివి.  ఎక్కడైనా, ఎవరైనా ఉన్నారేమో.. అనే చిన్న ఆశ ఇంకా మినుకుమినుకుమంటూనే ఉంది.  అందుకే ఏలియన్స్‌(గ్రహాంతర వాసులు)కు మన ఉనికిని తెలియజేసేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.  ఇంతకాలం గడిచినా వారి ప్రయత్నాలకు ఎలాంటి స్పందన కనిపించడం లేదు.  బహుశా ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేమో! ఇంకెక్కడా ఎవరూ లేరేమో!!
 గ్రహాంతర వాసులు, వారు తిరిగే ఎగిరే పళ్ళాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నో కథనాలు, సినిమాలు వచ్చాయి.  అయితే 'ఇదిగో తోక అంటే అదుగో పులి..' అన్నట్లుగా ఇవన్నీ ఒట్టి ఊహాగానాలుగా మిగిలాయే తప్ప, ఇప్పటి వరకు విశ్వంలో ఎక్కడా «గ్రహాంతర వాసులకు సంబంధించిన ఉనికి లభించలేదు. 
 
భూమ్మీదే ఉన్నారా?
గ్రహాంతర వాసులు ఉన్న మాట నిజమేనని, కోట్ల సంవత్సరాల క్రితమే వారు భూమ్మీదికి వచ్చారని, ఇప్పుడు భూమ్మీద ఉన్న జనాభా మొత్తం గ్రహాంతర వాసులనే వాదనలూ లేకపోలేదు. ఎగిరే పళ్ళాలతోపాటు కొంతమంది గ్రహాంతర వాసులను అమెరికా బంధించిందని, ఏరియా-51 అనే ప్రాంతంలో ఉంచి, రహస్యంగా పరిశోధనలు జరుపుతోందని అటు వెండితెరపైనా, ఇటు బుల్లితెరపైనా అనేక కథనాలు అప్పడప్పుడూ చూస్తూనే ఉన్నాం.
పోనీ మన ఉనికి తెలిపితే?గ్రహాంతర వాసుల గురించి మనం వెదికే బదులు, అసలు మన ఉనికే వారికి తెలియజేస్తే పోలా.. అనే వాదన శాస్త్రవేత్తల్లో బయలుదేరినప్పుడు అందరూ 'అవును, నిజమే..' అన్నారు.  అనడమే కాదు, ఆ దిశగా ప్రయత్నాలూ మొదలెట్టారు.  ఇందులో భాగంగా గత ముప్ఫై ఏళ్లుగా పలుమార్లు రేడియో సిగ్నల్స్‌, మెసేజ్‌లు అనంత విశ్వంలోని అనేక నక్షత్రాలు, గ్రహాలకు పంపించారు.  కానీ ఇప్పటి వరకు ఏ గ్రహాంతర వాసి ఈ మెసేజ్‌లకు స్పందించ లేదు.  వారి ఉనికి మనకు, మన ఉనికి వారికి తెలియలేదు.  అయినా ఈ నిరంతర వెదుకులాట సాగుతూనే ఉంటుంది.  
ఆ నమ్మకమే..
ఈ అనంత విశ్వంలో ఎక్కడో ఒకచోట గ్రహాంతరవాసులు ఉండే ఉంటారనే ఒక చిన్న నమ్మకమే ఖగోళ శాస్త్రవేత్తలను ఇంతకాలం ఉత్తేజపరుస్తూ వస్తోంది.  సువిశాల విశ్వంలో మన లాంటి సౌర కుటుంబాలు ఇంకా బోలెడు ఉన్నాయని తెలిసినప్పుడు, భూమ్మీది శక్తివంతమైన టెలిస్కోప్‌లకు అచ్చు భూమిని పోలిన గ్రహాలు చిక్కినప్పుడు, అంతులేని జలరాసులు నిండి ఉన్న గ్రహాల ఉనికి బయటపడినప్పుడల్లా  భూమ్మీది మానవుల్లో ఏదో తెలియని ఉత్కంఠ..  ఎక్కడైనా, ఎవరైనా ఉన్నారేమోనని.  బహుశా ఇదొక అంతులేని నిరీక్షణ కావచ్చు!  
ఎప్పుడెప్పుడు? ఏయే మెసేజ్‌లు?
1974 - Arecibo Message :
భూమి మీద మన ఉనికిని గ్రహాంతరవాసులకు తెలియజేసే మొట్టమొదటి మెసేజ్‌ ఇది. Arecibo రేడియో టెలిస్కోప్‌ ద్వారా దీనిని భూమికి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత 'గ్లోబులార్‌ క్లస్టర్‌ M13' కు పంపారు. ఇది అక్కడికి చేరేసరికి మనం 26,974 సంవత్సరంలో ఉంటాం.
1986 - పొయెటికా వెజినల్‌ :
బ్యాలే నృత్యకారిణుల పొత్తికడుపు కండరాల కదలికలు శబ్దాలు, మానవుల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చిత్రాలతో కూడిన మెసేజ్‌ ఇది. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన మిల్‌స్టోన్‌ హిల్‌ రాడార్‌ ద్వారా దీనిని మన భూమికి 10-12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న Epsilon Eridani, Tau Ceti అనే రెండు నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుని పంపించారు. ఈ మెసేజ్‌ Epsilon Eridani నక్షత్రానికి 1996లో చేరగా, Tau Ceti నక్షత్రానికి 1998లో చేరింది.
1999 - కాస్మిక్‌ కాల్‌ 1 :
ఇది ఇంటర్‌ స్టెల్లార్‌ రొసెట్టా స్టోన్‌ పరిజ్ఞానం కలిగిన, గణిత, సామాన్య శాస్త్రాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిన్న టెక్స్‌ట్‌ మెసేజ్‌. ఉక్రెయిన్‌లోని ఆర్‌టి-70 రేడియో ఆస్ట్రానామికల్‌ టెలిస్కోప్‌ ద్వారా దీనిని విశ్వంలోకి పంపించారు.
2001 - టీన్‌ ఏజ్‌ మెసేజ్‌ :
రష్యన్‌ ఆకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన రేడియో ఇంజనీర్‌ అలెగ్జాండర్‌ జెయిత్సెవ్‌ ఆధ్వర్యంలో రష్యాలోని కొంతమంది యువతీయువకులు పంపిన మెసేజ్‌ ఇది. మొత్తం ఆరు నక్షత్రాలకు చేరే విధంగా దీన్ని పంపించారు. వాటిలో ఒక నక్షత్రమైన 47 ఉర్సే మజొరిస్‌ మనలాంటి సౌర కుటుంబాన్ని కలిగి ఉంది. 2047లోగాని ఈ మెసేజ్‌ అక్కడికి చేరదు.
2003 - కాస్మిక్‌ కాల్‌ 2 :
ఇంటర్‌ స్టెల్లార్‌ రొసెట్టా స్టోన్‌ పరిజ్ఞానంతో కూడిన రెండో మెసేజ్‌ ఇది. టీమ్‌ ఎన్‌కౌంటర్‌ అనే కంపెనీ ఆర్థిక సాయం చేయగా, కొన్ని ఫొటోలు, మల్టీమీడియా ఫైల్స్‌తో కూడిన ఈ మెసేజ్‌ మరో అయిదు నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుని పంపించారు.
2005 - క్రెయిగ్స్‌ లిస్ట్‌ :
ఈ ప్రాజెక్టులో భాగంగా అక్షరాలు, బొమ్మలు కాకుండా ఏకంగా ఓ వెబ్‌సైట్‌నే విశ్వంలోకి పంపించారు. క్రెయిగ్స్‌ లిస్ట్‌ అనేది క్లాసిఫైడ్స్‌ సర్వీస్‌ అందించే వెబ్‌సైట్‌. డీప్‌ స్పేస్‌ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ అనే కంపెనీ అనేక మెసేజ్‌లతో కూడిన ఈ వెబ్‌సైట్‌ను ఫలానా నక్షత్రం, గ్రహం అని కాకుండా విశ్వంలోకి పంపించింది.
2008 - ఎక్రాస్‌ ది యూనివర్స్‌ :
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' ఆవిర్భవించి యాభై ఏళ్లు గడిచిన సందర్భంగా 2008 ఫిబవ్రరిలో ప్రముఖ పాప్‌ గాయక బృందం 'బీటిల్స్‌' ఆలపించిన గీతమే మెసేజ్‌గా విశ్వంలోకి పంపించింది. ఈ మెసేజ్‌ లక్ష్యం ధ్రువ నక్షత్రమైన 'పోలారిస్‌'. బీటిల్స్‌ పాట 2439వ సంవత్సరంలో అక్కడికి చేరుతుంది.
2008 - ఎ మెసేజ్‌ ఫ్రమ్‌ ఎర్త్‌ :
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ 'బెబో ' 2008లో ఎ మెసేజ్‌ ఫ్రమ్‌ ఎర్త్‌' పేరిట ఒక పోటీ నిర్వహించింది. సామాన్యులు మొదలుకొని అనేకమంది సెలబ్రిటీల వరకు ఈ పోటీలో పాల్గొన్నారు. మొత్తంమ్మీద ది బెస్ట్‌ అనిపించుకున్న 501 మెసేజ్‌లు ఎంపిక చేసి, వాటిని ఉపరితలాన అంతులేని జలరాసులతో, అచ్చు మన భూమిలాగే ఉన్న గ్రహం Gliese 581cను లక్ష్యంగా చేసుకుని, ఆర్‌టి-70 రేడియో ఆస్ట్రానామికల్‌ టెలిస్కోప్‌ ద్వారా ఈ మెసేజ్‌ను పంపించారు. ఇది అక్కడికి చేరడానికి మరో పద్ధెనిమిది ఏళ్లు పడుతుంది.
2008 - డోరిటోస్‌ అడ్వెర్ట్‌ :
ఆర్కిటిక్‌ సర్కిల్‌లోని రాడార్ల ద్వారా 6 గంటలపాటు ఈ మెసేజ్‌ను పంపించారు. దీని లక్ష్యం మనలాంటి సౌర కుటుంబాన్ని కలిగి ఉన్న 47 ఉర్సే మజొరిస్‌ అనే నక్షత్రం. మళ్లీ ఏడాది తరువాత ఏకంగా 'ది డే ది ఎర్త్‌ స్టుడ్‌ స్టిల్‌' అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను సుదూరాన ఉన్న నక్షత్ర సముదాయం 'ఆల్ఫా సెంటారీ'కి పంపించారు.
2009 - హలో ఫ్రమ్‌ ఎర్త్‌ :
గత ఏడాది ఆగస్టు నెలలో కాస్మోస్‌ అనే మ్యాగజైన్‌ ఒక పోటీ నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన అసంఖ్యాక మెసేజ్‌ల నుంచి కొన్నింటిని ఎంపిక చేయగా, వాటిని గుదిగుచ్చి భూమిని పోలిన మరో గ్రహం Gliese 581d ను లక్ష్యంగా చేసుకుని ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా డీప్‌ స్పేస్‌ కమ్యూనికేషన్‌ కాంప్లెక్స్‌ నుండి ఈ మెసేజ్‌ను పంపించారు. మరో తొమ్మిదేళ్ల తరువాత అంటే.. 2029లో ఈ మెసేజ్‌ ఆ గ్రహాన్ని చేరుతుంది.
2009 - రుబిస్కో మెసేజ్‌ :
గ్రహాంతర వాసులను కనుగొనడమే లక్ష్యంగా విశ్వంలోకి మొట్టమొదటి రేడియో మెసేజ్‌ను పంపి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రుబిస్కో మెసేజ్‌ను పంపించారు. RuBisCo అనేది భూమ్మీద మొక్కల్లో విరివిగా లభ్యమయ్యే ఒక ఎంజైమ్‌. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ఎంజైమ్‌ జెనెటిక్‌ కోడ్‌ను విశ్వంలోకి ట్రాన్స్‌మిట్‌ చేశారు.




Thursday 7 January 2010

ఈ టాబ్లెట్లు.. చూసుకునేవి!

2010 సంవత్సరాన్ని 'ఇయర్‌ ఆఫ్‌ ది టాబ్లెట్‌'గా చెప్పుకోవలసిందే. ఎందుకంటే ల్యాప్‌టాప్‌లకు క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. ఇప్పటికే వీటి స్థానాన్ని నెట్‌బుక్‌లు, స్మార్ట్‌బుక్‌లు భర్తీ చేస్తున్నాయి. భవిష్యత్తులో టాబ్లెట్‌ పిసిలు రాజ్యమేలనున్నాయి. ఇప్పటికే హ్యూలెట్‌ పాకార్డ్‌, తోషిబా, ఫ్యూజిత్సు, లెనొవో, డెల్‌, ఏసస్‌, శాంసంగ్‌, ఆర్మర్‌ తదితర కంపెనీలకు చెందిన టాబ్లెట్‌ పిసిలు మార్కెట్‌లో ఉండగా, ఈ రేసులో మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఫ్రీస్కేల్‌ వంటి కంపెనీలు పోటీకి దిగాయి. భవిష్యత్తులో టాబ్లెట్‌ పిసిల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అన్ని కంపెనీల దృష్టి వీటిపై పడింది. ఈ వారం అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో జరగనున్న 2010 ఇంటర్నేషనల్‌ కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో (ఐసిఇఎస్‌)లో చిప్‌ల తయారీ కంపెనీ ఫ్రీస్కేల్‌ సెమీకండక్టర్‌ ఇన్‌కార్పొరేషన్‌ కూడా తాజాగా స్మార్ట్‌ అప్లికేషన్‌ బ్లూ ప్రింట్‌ ఫర్‌ ర్యాపిడ్‌ ఇంజనీరింగ్‌ (ఎస్‌ఎబిఆర్‌ఇ) పేరిట ఓ టాబ్లెట్‌ పిసిని ఆవిష్కరిస్తోంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న యాపిల్‌ కంపెనీ కూడా తన టాబ్లెట్‌ పిసిని ఈ ప్రదర్శనలోగాని, లేదంటే ఈ నెలలో ఎప్పుడైనా గాని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని టాబ్లెట్‌ పిసిల గురించి మీకోసం...
పేరు : ఫ్రీస్కేల్‌ టాబ్లెట్‌
కంపెనీ : ఫ్రీస్కేల్‌ సెమీకండక్టర్‌ ఇన్‌కార్పొరేషన్‌
డిస్‌ప్లే : 7 అంగుళాల 3డి డెస్క్‌టాప్‌ టచ్‌స్క్రీన్‌ విత్‌ QWERTY కీబోర్డ్‌
ప్రాసెసర్‌ : ARM Cortex-A8 core ఆధారిత ఫ్రీస్కేల్‌ i.MX515 processor
ఆపరేటింగ్‌ సిస్టం : ఆండ్రాయిడ్‌, లైనక్స్‌.. రెండు ఆపరేటింగ్‌ సిస్టంలలో పని చేస్తుంది.
ర్యామ్‌ : 512 ఎంబి ఇన్‌బిల్ట్‌ డిడిఆర్‌2
స్టోరేజి సామర్థ్యం : 4 జిబి నుంచి 64 జిబి వరకు, మైక్రోఎస్‌డి కార్డ్‌ స్లాట్‌ కూడా ఉంది.
కెమెరా : 3.0 మెగా పిక్సెల్‌ (30 ఫ్రేమ్స్‌ పర్‌ సెకన్‌ VGA వీడియో రికార్డింగ్‌)
సెన్సర్స్‌ : 3్చ్ఠజీట యాక్సిలరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌
ఇతర ఫీచర్లు : 3జి కనెక్టివిటీ, బ్లూటూత్‌, జిపిఎస్‌, యుఎస్‌బి 2.0, యుఎస్‌బి మినీ పోర్ట్‌, ఆడోబ్‌ ఫ్లాష్‌ ప్లేయర్‌ ఎస్‌జిటిఎల్‌ 5000 ఆడియో కోడెక్‌, వైఫై తదితర సౌకర్యాలు.
ధర : రూ.9,223
యాపిల్‌ టాబ్లెట్‌
యాపిల్‌ కంపెనీ ఏళ్ల తరబడి ఊరిస్తున్న టాబ్లెట్‌ పిసి రూపం ఇలా ఉండొచ్చనేది విశ్లేషకుల ఊహ. ఐ-స్లేట్‌, ఐ-ప్యాడ్‌, ఐ-టాబ్లెట్‌ అనే మూడు పేర్లలో ఏదో ఒకటి దీని పేరు అయి ఉండొచ్చని వారు ఊహిస్తున్నారు. ఈ టాబ్లెట్‌ పిసి ఫీచర్లు బయటి ప్రపంచానికి తెలియకుండా యాపిల్‌ ఇన్‌కార్పొరేషన్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సోమవారం ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో దీని గురించి ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. ఇదొక హై- మల్టీమీడియా డివైజ్‌. 10 లేదా 11 అంగుళాల టచ్‌స్క్రీన్‌ కలిగి ఉండే ఈ టాబ్లెట్‌ పిసిలో సినిమాలు, టెలివిజన్‌ కార్యక్రమాలు తిలకించవచ్చు. ఇంటర్నెట్‌లో విహరించడం, గేమ్‌లు ఆడడం, ఎలక్ట్రానిక్‌ ఇ-బుక్స్‌తోపాటు న్యూస్‌పేర్లు కూడా చదువుకోవచ్చు. దీని ధర కూడా వెయ్యి డాలర్లు అంటే.. మన డబ్బులో రూ.46,180 ఉండొచ్చని ఊహిస్తున్నారు.
హెచ్‌పి పెవిలియన్‌ tx2500z
4 జిబి DDR2 మెమరీ సామర్థ్యం కలిగిన ఈ టాబ్లెట్‌ AMD Turion 64 X2 డ్యూయల్‌ కోర్‌ మొబైల్‌ టెక్నాలజీ ప్రాసెసర్‌ ఆధారంగా పని చేస్తుంది. 12.1 అంగుళాల WXGA టచ్‌స్క్రీన్‌ / యాక్టివ్‌ డిజిటైజర్‌ డిస్‌ప్లే, 160 జిబి హార్డ్‌డిస్క్‌, డ్యూయల్‌ లేయర్‌ డివిడి బర్నర్‌, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ తదితర ఫీచర్లు దీని సొంతం.
లెనొవో థింక్‌ప్యాడ్‌ X200
ఇంటెల్‌ కోర్‌ 2 డ్యూయల్‌ SL9600 ప్రాసెసర్‌, విండోస్‌ 7 ప్రొఫెషనల్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా పని చేస్తుంది. 12.1 అంగుళాల WXGA విత్‌ మల్టీటచ్‌ అండ్‌ Wacom LED Backlit డిస్‌ప్లే, 160 జిబి హార్డ్‌ డ్రైవ్‌, దీని ఫీచర్లలో కొన్ని మాత్రమే. పగటి పూట వెలుతురులో సైతం ఇమేజెస్‌, టెక్స్ట్‌ను స్పష్టంగా చూపించగలగడం దీని ప్రత్యేకత.
ఏసస్‌ ఈ పిసి T91
CPU Intel Atom Z520 ప్రాసెసర్‌, విండోస్‌ ఎక్స్‌పీ హోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా పని చేస్తుంది. దీని స్టోరేజి సామర్థ్యం 52 జిబి ( 16 జిబి సాలిడ్‌ స్టేట్‌ డ్రైవ్‌ + 16 జిబి ఎస్‌డి కార్డ్‌ + 20 జిబి ఈ-స్టోరేజి). 8.9 అంగుళాల ఎల్‌ఇడి బ్యాక్‌లిట్‌ విత్‌ రెసిస్టివ్‌ టచ్‌ ప్యానల్‌ కలిగి ఉంటుంది. ఇంకా 3.0 మెగా పిక్సెల్‌ వెబ్‌కామ్‌, 3 ఇన్‌ 1 మీడియా కార్డ్‌ రీడర్‌, వైఫై, బ్లూటూత్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి.


హెచ్‌పి ఎలైట్‌ బుక్‌ 2730p
ఇంటెల్‌ కోర్‌ 2 డ్యూయల్‌ 1.86 GHz LV ప్రాసెసర్‌, విండోస్‌ విస్టా బిజినెస్‌ ఆపరేటింగ్‌ సిస్టంల కలయికతో పని చేస్తుంది. 12.1 అంగుళాల Illumi-Lite, WXGA UWVA యాంటీ గ్లేర్‌ విత్‌ డిజిటైజర్‌ డిస్‌ప్లే కలిగిన ఈ టాబ్లెట్‌లో ఇంకా 3 జిబి ర్యామ్‌, 120 జిబి హార్డ్‌డ్రైవ్‌, యుఎస్‌బి 2.0, బ్లూటూత్‌, ఎక్స్‌ప్రెస్‌, ఎస్‌డి కార్డ్‌ స్లాట్స్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హెచ్‌పి టెక్‌ స్మార్ట్‌ tx2z
12.1 అంగుళాల WXGA హైడెఫినిషన్‌ హెచ్‌పి ఎల్‌ఇడి బ్రైట్‌ వ్యూ వైడ్‌ స్క్రీన్‌ విత్‌ ఇంటిగ్రేటెడ్‌ టచ్‌ డిస్‌ప్లే, 4 జిబి DDR2 ర్యామ్‌, 400 జిబి హార్డ్‌డ్రైవ్‌, వెబ్‌కామ్‌, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ విత్‌ హెచ్‌పి ఇంప్రింట్‌ ఫినిష్‌, వైర్‌లెస్‌ ఎన్‌-కార్డ్‌ విత్‌ బ్లూటూత్‌, లైట్‌ స్కైబ్‌ సూపర్‌ మల్టీ Ît 8X DVD+/-RW విత్‌ డబుల్‌ లేయర్‌ సపోర్ట్‌ డివిడి డ్రైవ్‌, హెచ్‌పి మినీ రిమోట్‌ కంట్రోల్‌, 5 ఇన్‌ 1 డిజిటల్‌ మీడియా రీడర్‌ తదితర ఫీచర్లు కలిగిన ఈ టాబ్లెట్‌ AMD Turion X2 అల్ట్రా డ్యూయల్‌ కోర్‌ మొబైల్‌ టెక్నాలజీ ప్రాసెసర్‌, విండోస్‌ విస్టా హోమ్‌ ప్రీమియం ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా పని చేస్తుంది.
సామ్‌సంగ్‌ Q1UP-V
ఈ అల్ట్రా-పోర్టబుల్‌ టాబ్లెట్‌ పిసిలో ఇంటెల్‌ కోర్‌ సోలో ప్రాసెసర్‌ ULV U1500ను ఉపయోగించారు. 7 అంగుళాల ఎల్‌ఇడి బ్యాక్‌లైట్‌ డిస్‌ప్లే కలిగిన ఈ టాబ్లెట్‌ విండోస్‌ విస్టా బిజినెస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా పని చేస్తుంది. ఇంకా ఇందులో
2 జిబి DDR2 ర్యామ్‌, 80 జిబి హార్డ్‌ డ్రైవ్‌, యుఎస్‌బి, బ్లూటూత్‌, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌, మల్టీ మీడియా, ఎస్‌డి కార్డ్‌ స్లాట్స్‌, డ్యూయల్‌ లేయర్‌ డివిడి రైటర్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి.
ఆర్మర్‌ X10
ఇంటెల్‌ కోర్‌ డ్యూయల్‌ మొబైల్‌ టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఈ టాబ్లెట్‌ పిసిలో 10.4 అంగుళాల సన్‌లైట్‌ రీడబుల్‌ టచ్‌ ఎల్‌సిడి డిస్‌ప్లే, 2.5 అంగుళాల హార్డ్‌ డ్రైవ్‌ ఉన్నాయి. ఇంకా క్విక్‌ బ్యాక్‌ డేటా రికవరీ సిస్టం, ఇంటిగ్రేటెడ్‌ వైఫై, బిల్టిన్‌ వైర్‌లెస్‌ లాన్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీని చుట్టూ ఉండే అల్యూమినియం కేసింగ్‌ దుమ్ము, ధూళి, నీటి నుంచి రక్షిస్తుంది.