Wednesday 24 June 2009

చైనా కంప్యూటర్లలో 'యాంటీ పోర్న్‌ సాఫ్ట్‌వేర్‌'!


ఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీ సైట్లకు ఉన్న డిమాండ్‌ తెలిసిందే. రోజురోజుకీ విస్తరిస్తున్న ఈ బూతు పురాణానికి అడ్డు కట్ట వేసేందుకు చైనా కృతనిశ్చయంతో ఉంది. చాలారోజుల క్రితమే అడల్ట్‌ వెబ్‌సైట్లు చైనాలో ఓపెన్‌ అవకుండా చేసింది. ఇంటర్నెట్‌లో చైనాకు చెందిన వ్యక్తులు, సంస్థలు ఇలాంటి వెబ్‌సైట్లు ఏమైనా నిర్వహిస్తున్నట్లయితే వాటిని బలవంతంగా మూసివేయించింది. అయినా సరే చైనీయులు నెట్‌ బ్రౌజింగ్‌ సమయంలో పోర్న్‌ వెబ్‌సైట్‌లను సెర్చ్‌ చేయడం గమనించి, అసలు 'పోర్న్‌', 'సెక్స్‌' అనే పదాలు కూడా ఇంటర్నెట్‌లో కనిపించకుండా చేయాలని సంకల్పించింది.

జూలై 1 నుంచి కంప్యూటర్‌ కొన్నప్పుడు దాంతోపాటు బండిల్‌గా ఇచ్చే సాఫ్ట్‌వేర్‌లలో ఇంటర్నెట్‌లో ఇలాంటి పదజాలం, బొమ్మలను, వీడియోలను వడపోసే సాఫ్ట్‌వేర్‌ కూడా తప్పనిసరిగా ఉండాలని పర్సనల్‌ కంప్యూటర్ల తయారీదారులను ఆదేశించింది. ఇప్పటికే జిన్‌ హుయి కంప్యూటర్‌ సిస్టం ఇంజనీరింగ్‌ కంపెనీ 'ది ఫ్రీ గ్రీన్‌ డామ్‌-యూత్‌ ఎస్కార్ట్‌ సాఫ్ట్‌వేర్‌' అనే ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఒకదానిని తయారు చేసినట్లు కూడా చైనా సాంకేతిక, సమాచార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇది ఇతర దేశాలకు చెందిన పర్సనల్‌ కంప్యూటర్ల తయారీదారులకు పెద్ద దెబ్బే. ఎందుకంటే, వారూ ఇంటర్నెట్‌లో బూతు పురాణాన్ని వడపోసే ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను బండిల్‌గా అందజేస్తే తప్ప వారు తయారు చేసిన కంప్యూటర్లను చైనాలో అమ్మలేవు మరి!

0 comments: