Wednesday 30 September 2009

భవిష్యత్తు.. చంద్రుడే!


ఖగోళ శాస్త్రవేత్తల అంచనా నిజమైంది. నలభై సంవత్సరాల వారి సుదీర్ఘ కృషికి ఫలితం లభించింది. మొత్తానికి 'జాబిల్లి' జల రహస్యం వీడిపోయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' చేపట్టిన చంద్రయాన్‌-1 ప్రయోగం చంద్రునిపై అపార జలరాసులు దాగున్నట్లు సమాచారం అందించింది. ఒక్క చంద్రుడిపైనే కాదు, మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలలో నీటి జాడలు కొనుగొనే దిశగా మరిన్ని పరిశోధనలు జరపడానికి ఇది స్ఫూర్తిదాయకం కానుంది. రాబోయే రోజుల్లో చంద్రమండలం ఒక్క మానవ ఆవాసంగానే కాదు, భవిష్యత్తులో గ్రహాంతర యానాలకు కేంద్ర బిందువుగా కూడా మారనుంది.

1969లో మానవుడు తొలిసారిగా చంద్రుడిపై కాలుమోపినప్పుట్నించి నేటివరకు చంద్రుడి గురించి అనేక పరిశోధన, అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి ఖగోళ శాస్త్రవేత్తలు మొన్నమొన్నటి వరకు జరిపిన ప్రయోగాలు చంద్రుడుకేవలం శిలా సమూహమనే సమాచారాన్నే వెల్లడించాయి. దీంతో చంద్రుడికి సంబంధించిన అనేక అంశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే 1994లో ప్రారంభించిన క్లెమెంటైన్‌ మిషన్‌, 1999లో ప్రయోగించిన 'కాసిని ఉపగ్రహం', 2008లో ప్రయోగించిన లూనార్‌ రికొనైసెన్స్‌ అబ్జర్వర్‌ ఉపగ్రహ ప్రయోగాలు చంద్రుడికి సంబంధించిన మరిన్ని వివరాలను మనకు అందించాయి. అయితే తాజాగా 'ఇస్రో' చేపట్టిన చంద్రయాన్‌-1 ప్రయోగం మాత్రం చంద్రుడిపై ఉన్న నీటి జాడలను పసిగట్టి ఆ వివరాలు అందించి ఇన్నాళ్లూ శాస్త్రవేత్తలలో చంద్రుడి గురించి ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది. చంద్రయాన్‌-1 తీసిన ఫొటోల ఆధారంగా చంద్రుడిపై ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకూ 10 డిగ్రీల పరిధిలో నీరు మందంగా పరుచుకుని ఉందని, పగటి వేళలో సూర్యుడి నుంచి వచ్చే అమిత వేడి కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న నీరు ఆవిరవుతోందని అర్థమవుతోంది. అలాగే సూర్యుడి వేడి సోకని ప్రాంతాలలో నీరు గడ్డకట్టి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ జాబిల్లి జల రాసులను ఇంటికి తెచ్చుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.

చంద్రుడిపై నీరు ఎలా?
చంద్రుడిపై జలరాసులు ఎలా ఏర్పడి ఉంటాయనే విషయంలో ఖగోళ శాస్త్రవేత్తలు రెండు వాదనలు వినిపిస్తున్నారు. 390 కోట్ల సంవత్సరాలకు పూర్వం తోకచుక్కలు, ఉల్కాపాతాలు భూమి, చంద్రుడి ని పెద్ద ఎత్తున ఢీకొడుతుండేవి. వీటి ద్వారానే చంద్రుడిపైకి నీరు చేరి ఉంటుందని, సూర్యుడి వేడి తీవ్రతకు అందులో కొంత శాతం ఆవిరైనప్పటికీ ఇంకా కొంత మిగిలి ఉంటుందనేది మొదటి వాదన. హైడ్రోజన్‌ ఐయాన్లు, ప్రొటాన్లతో కూడిన సౌర పవనాలు ఒక్క సెకనుకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టడం వల్ల రసాయన చర్య ద్వారా చంద్రుడిపై నీటి నిల్వలు ఏర్పడి ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల మరో వాదన.

'ఎం3'.. రియల్లీ గ్రేట్‌!
నీటి ఆచూకీ కనుక్కున్న చంద్రయాన్‌-1లోని 'ది మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ (ఎం3) పరికరాన్ని అమెరికాకు చెందిన 'నాసా' ప్రొపల్షన్‌ లాబొరేటరీ, బ్రౌన్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించాయి. చంద్రుడిపై వెలుగున్న ప్రాంతంలో నీటి నిల్వలను ఈ ఎం3 పరికరం పసిగట్టింది. నిజానికి చంద్రుడి గురించి ఇప్పటి వరకూ మనకు తెలిసిన సమాచారం కన్నా ఈ ఎం3 అందించిన సమాచారం మరింత స్పష్టమైనది. ఈ పరిశోధనా ఫలితాలను నాసా.. గతంలో తన ఉపగ్రహాలు అందించిన సమాచారంతో పోల్చి చూసి «ద్రువీకరించింది. ఈ విషయమై బ్రౌన్‌ యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రజ్ఞుడిగా పనిచేస్తున్న కార్లే పీటర్స్‌ మాట్లాడుతూ "ఈ విజయం ఇస్రోదే.. చంద్రయాన్‌ సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు..'' అని వ్యాఖ్యానించారు.

నీరు ఉంటే ఏంటి?
చంద్రుడిపై నీటి జాడలు బయటపడ్డాయి కదా, ఇక చంద్రమండలంపై మానవ నివాసం కూడా సాధ్యమవుతుందా? అంటే అది అనుకున్నంత సులువేం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే భూమిపై ఉన్నటువంటి వాతావరణం.. చంద్రుడిపై లేదు. పైపెచ్చు సూర్యుడి నుంచి వచ్చే అమితమైన వేడి నిరంతరం చంద్రుడిని తాకుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నివాసం అనుకున్నంత సులువేం కాదని, ఈ విషయలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందనేది వారి అభిప్రాయం. అయితే చంద్రుడిపై జలాన్ని హైడ్రోజన్‌ ఇంధనంగా, ప్రాణవాయువైన ఆక్సిజన్‌గా మార్చుకునే వీలుంది. ఇలా తయారైన ఆక్సిజన్‌ భవిష్యత్తులో అక్కడ నివాసం ఏర్పరుచుకునే మానవులకు ప్రాణాధారంగా మారుతుంది. అలాగే హైడ్రోజన్‌ రాకెట్లుకు ఇంధనంగా పనికొస్తుంది.

భవిష్యత్తు ప్రయోగశాల.. చంద్రుడే!
నేషనల్‌ స్పేస్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ సురేష్‌నాయక్‌ మాట్లాడుతూ "చంద్రుడిపై ఉన్న నీటిని రాకెట్‌కు అవసరమైన ఇంధనంగా మార్చుకోవచ్చు..'' అని చెబుతున్నారు. అంతేకాదు "భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి చాలా (1/6 వంతు)తక్కువ.. కాబట్టి ఇప్పుడు మనం భూమి నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాలను చంద్రుడిపై నుంచి ప్రయోగించడం చాలా తేలిక.. ప్రస్తుతం భూమిపై నుంచి ప్రయోగించే ఉపగ్రహాలు సెకనుకు 11 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళుతున్నాయి.. అదే చంద్రుడిపై నుంచి అయితే మరింత వేగంగా వెళ్లగలవు'' అని వివరిస్తున్నాయరాయన.

నేడు ఖగోళ శాస్త్రజ్ఞుల ముందున్నవి రెండు ప్రధాన లక్ష్యాలు. ఒకటి ప్రాణాధారమైన జలం. రెండు జీవనాధారమైన ఇంధనం. ఈ రెండింటి కోసమే మానవుడి నిత్యశోధన . జాబిల్లిపై జలరాసులను స్పష్టంగా గుర్తించడం ద్వారా ఈ అన్వేషణను చంద్రయాన్‌-1 సరికొత్త మలుపు తిప్పింది. ఇది భారతదేశ పరిశోధనా సామర్థ్యానికి ఒక ప్రతీక. నీటి నిల్వలను కనుక్కోవడం ద్వారా తన విధులను చంద్రయాన్‌-1 సమర్థవంతంగా నిర్వర్తించిందని ఆ ప్రాజెక్టు డైరెక్టర్‌ మైలస్వామి అన్నాదురై పేర్కొంటున్నారు. ఈ విజయం అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇతర దేశాలకు భారత్‌కు మధ్యనున్న సహకారానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

ఆకాశం నుంచి 'అరుదైన నేస్తం'!


రాత్రిపూట అలా రోడ్డుమీద నడిచి వెళ్తుంటే ఎక్కడో దూరాన ఆకాశంలోంచి ఓ చుక్క తెగి భూమ్మీద పడిపోతున్నట్లు అనిపిస్తుంది. 'అరే.. భలే ఉందే! ఇంతకీ అది ఎక్కడ పడి ఉంటుందో..' అనే ఆలోచనతో మనం నడుస్తూ వెళతాం. అయితే ఆ దృశ్యం మాత్రం మన మదిలో చాలారోజులు ఉండిపోతుంది. ఖగోళ పరిభాషలో వీటినే 'ఉల్కలు'గా వ్యవహరిస్తారు. కానీ ఇదే దృశ్యం ఖగోళ శాస్త్రవేత్తలకు కనిపిస్తే మాత్రం వారి ఆలోచనలు పరిపరివిధాలా సాగుతాయి. ఇంతకీ ఆ ఉల్క ఎక్కడి నుంచి వచ్చింది? భూమ్మీద పడి ఉంటుందా? పడితే ఎక్కడ పడి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు వారి మదిని తొలుస్తుంటాయి. ప్రసుతం ఆస్ట్రేలియాలో దొరికిన ఓ అరుదైన ఉల్కా శకలం కూడా శాస్త్రవేత్తల్లో సరిగ్గా ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది.

పశ్చిమ ఆస్ట్రేలియా ఏడారిలో లభించిన ఓ
అరుదైన ఉల్కా శకలం ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలకు పెను సవాల్‌గా మారింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే దీనిగురించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని ఈ పరిశోధన కు నాయకత్వం వహిస్తున్న లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ ఫిల్‌బ్లాండ్‌ పేర్కొంటున్నారు. ఇది సౌరకుటుంబంలో ఏ ప్రాంతం నుంచి వచ్చిందనే విషయం తెలుసుకోవడమే తమ ప్రస్తుత కర్తవ్యమని, అనంతరం దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి, వాటి ఆధారంగా.. అసలు ఈ ఉల్కాశకలం ఎలా ఏర్పడిందో తెలుసుకుంటామని, అంతకన్నా ముందు రోదసిలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండేవో తెలుసుకోగలిగితే.. సౌరకుంటుంబం రహస్యం వీడిపోతుందని, అసలు సౌరకుటుంబం ఏర్పడక ముందు, ఏర్పడిన కొత్తలో రోదసి ఎలా ఉండేదన్న కీలక ప్రశ్నకు సమాధానం లభించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొంటున్నారు.


ఇప్పటి వరకు 1100 ఉల్కలు
గత రెండు శతాబ్దాల్లో దాదాపు పదకొండు వందల ఉల్కలు ఇలా రోదసి నుంచి రాలి భూమిపై పడి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో కేవలం ఓ డజను ఉల్కా శకలాలు, వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా పశ్చిమ ఆ్రస్టేలియా ఎడారిలో లభించిన ఉల్కాశకలం చూసిన ఖగోళ పరిశోధకులు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఇది దాదాపు రాయిని పోలి ఉంది. దీంతో ఇప్పటి వరకు లభించిన ఉల్కా శకలాలలోకెల్లా ఇది అత్యంత అరుదైన ఉల్కా శకలంగా వారు పేర్కొంటున్నారు. దీని గురించిన వివరాలు ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే అయినా పరిశోధనల అనంతరం అన్ని విషయాలు బయటపడతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉల్కలను పట్టేద్దాం..
రోదసి నుంచి రాలి భూమ్మీద పడే ఉల్కా శకలాలను వెంట వెంటనే గుర్తించి, వాటిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించడం ద్వారా మన సౌర కుటుంబానికి చెందిన మరిన్ని రహస్యాలు తెలుసుకోగలమనేది శాస్త్రవేత్తల ఆలోచన. ఈ ఆలోచనతోనే 2006లో వారు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజి, చెక్‌ రిపబ్లిక్‌లోని అండ్రెజోవ్‌ అబ్జర్వేటరీ, ఆస్ట్రేలియన్‌ మ్యూజియంలతో సంయుక్తంగా ఉల్కాపాతాన్ని గుర్తించే ట్రయల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని నల్లార్‌బార్‌ ఎడారిలో అత్యంత శక్తివంతమైన కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలు అమర్చిన తరువాత శాస్త్రవేత్తలకు లభించిన మొట్టమొదటి ఉల్కా శకలం ఇదే కావడం గమనార్హం.

ప్రస్తుతం లభించిన ఉల్కా శకలం క్రికెట్‌ బాల్‌ పరిమాణంలో ఉంది. ఈ కెమెరాలను ఉపయోగించి భవిష్యత్తులోనూ భూమ్మీదికి వచ్చిపడే ఉల్కా శకలాలను గుర్తించడం, అవి సౌర కుటుంబంలోని ఏ ప్రదేశానికి చెందినవో తెలుసుకోవడం వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన మొట్టమొదటి రోజే ఈ ఉల్కా శకలాన్ని వీరు కనుగొనగలిగారు. కొన్ని పరికరాల సాయంతో ఉల్కా శకలం పడిన ప్రదేశాన్ని గుర్తించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని కూడా వారు పేర్కొంటున్నారు.

ఇదేం కొత్త కాదు..
ఆకాశం నుంచి దూసుకు వచ్చి భూమ్మీద పడే ఉల్కా శకలాలను గుర్తించే ఈ పరిజ్ఞానం కొత్తదేం కాదు. గతంలోనూ చాలామంది శాస్త్రవేత్తలు ఇలాంటి కెమెరాల నెట్‌ వర్క్‌ను ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. "అయితే మేం ఉపయోగించిన విధానం మాత్రం కొత్తది. గతంలో ఉపయోగించి పరిజ్ఞానానికి చిన్న చిన్న ఉల్కా శకలాలను గుర్తించే శక్తి ఉండేది కాదు. ఇప్పుడు మేం ఉపయోగించిన ట్రయల్‌ నెట్‌వర్క్‌కు ఆ శక్తి ఉంది. దీని ద్వారా ఎంత చిన్న పరిమాణంలో ఉన్న ఉల్కా శకలాలనైనా సులువుగా గుర్తించవచ్చు. అలాగే ఈ కెమెరాల నెట్‌వర్క్‌ ఏర్పాటుకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని నల్లార్‌బార్‌ ఎడారే సరైన ప్రదేశమని కూడా మేం భావించాం. మేం ఏర్పాటు చేసిన నెట్‌ వర్క్‌లోని కెమెరాలు ప్రతీరాత్రి ఆకాశాన్ని జల్లెడ పడతాయి. అరుదైన దృశ్యం ఏదైనా వాటి కంట పడితే వెంటనే ఫోటోలు తీస్తాయి..'' అని పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ బ్లాండ్‌ వివరించారు.

మన సౌర కుటుంబంలోనిదే..
ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలో కనుగొన్న ఉల్కా శకలం మన సౌర కుటుంబానికి చెందినదేనని, సూర్యుని చుట్టూ ఉన్న ఏదో ఓ ప్రాంతం నుంచి ఇది రాలి పడి ఉండొచ్చని ఖగోళ పరిశోధకులు భావిస్తున్నారు. ఇది అంగారక గ్రహం, బృహస్పతి గృహం మధ్యన ఉన్న ఆస్టరాయిడ్‌ బెల్ట్‌కు సంబంధించిన దై ఉండొచ్చని, ఇది క్రమంగా అక్కడి కక్ష్య నుంచి బయటకి వచ్చి సూర్యుని కక్ష్యలోకి ప్రవేశించి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ ఉల్కా శకలానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేదుకు గతంలో భూమ్మీదకొచ్చి పడిన పలు ఉల్కా శకలాల వివరాలతో వారు పోల్చి చూస్తున్నారు. మొత్తంమ్మీద పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో లభించిన ఉల్కా శకలం అత్యంత అరుదైనదేనని, ఎందుకంటే అది అగ్నిపర్వతంలో ఉండే శిల మాదిరిగా ఉందని వారు పేర్కొంటున్నారు.

మొత్తంమ్మీద నల్లార్‌బార్‌ ఎడారిలో తమ మొదటి అన్వేషణ ఫలించిందని, ఈ పరిశోధన భవిష్యత్తులో ఉల్కా పాతాలకు సంబంధించి మరిన్ని విజయాలను చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Thursday 24 September 2009

మైక్రోసాఫ్ట్‌ నుంచి మొబైల్‌ఫోన్లు!?

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్‌' త్వరలోనే రెండు స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల చేయనుందనే పుకార్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో షికార్లు చేస్తున్నాయి. వీటిల్లో నిజం ఎంతో తెలియదుకానీ, కొన్ని వెబ్‌సైట్లు ఓ అడుగు ముందుకేసి మరీ ఈ పుకార్ల షికారులో పాలుపంచుకుంటున్నాయి.

2010లో జరగనున్న 'ఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో'లో మైక్రోసాఫ్ట్‌ 'టర్టిల్‌', 'ప్యూర్‌' అనే పేర్లతో రెండు స్లయిడర్‌ స్మార్ట్‌ ఫోన్‌లతోపాటు ఒక 'సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి'ని కూడా ప్రదర్శించనుందని 'ఎన్‌గాడ్జెట్‌' అనే వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ 'పిసి వరల్డ్‌' తన వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఒక కథనాన్ని ఉంచింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ 'షార్ప్‌' భాగస్వామ్యంతో ఈ మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుందనేది ఆ పుకార్ల సమాచారం.

తన మొబైల్‌ఫోన్ల ప్రాజెక్టుకు మైక్రోసాఫ్ట్‌ ' ప్రాజెక్ట్‌ పింక్‌' అనే కోడ్‌నేమ్‌ పెట్టుకుందని కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మైక్రోసాఫ్ట్‌ 'ప్రాజెక్ట్‌ పింక్‌'కు సంబంధించిన పుకార్లు వెలువడ్డాయి. ఆమధ్య యాపిల్‌ కంపెనీ 'ఐ-ఫోన్‌' విడుదల చేయడంతో అందుకు ధీటుగా మైక్రోసాఫ్ట్‌ తన 'ప్రాజెక్ట్‌ పింక్‌'కు సన్నాహాలు ప్రారంభించిందని, అయితే 'విండోస్‌ మొబైల్‌ 7' సాఫ్ట్‌వేర్‌ ఇంకా విడుదల కాకపోవడంతో
ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే రూపుదిద్దుకోనున్న 'ప్రాజెక్ట్‌ పింక్‌' ఆలస్యం అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్‌ గతంలో హైటెక్‌ కంప్యూటర్స్‌ (హెచ్‌టిసి) భాగస్వామ్యంతో మొబైల్‌ఫోన్లు తయారు చేయాలని భావించిందని, కానీ తరువాత ఎందుకో ఆ ప్రతిపాదన విరమించుకుందని, ఇప్పుడు తాజాగా తన 'ప్రాజెక్ట్‌ పింక్‌' భాగస్వామిగా 'షార్ప్‌' కంపెనీని ఎంచుకుందని సమాచారం.

సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి కూడా..
2007 మే నెలలోనే మల్టీ టచ్‌ 'సర్ఫేస్‌' టేబుల్‌ పిసిని విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌ తాజాగా ఈ శ్రేణిలోనే ఒక 'టాబ్లెట్‌ పిసి' విడుదలకు కూడా సన్నాహాలు సాగిస్తోంది. ఒకేసారి అనేక మంది యూజర్లు ఉపయోగించగలిగే సర్ఫేస్‌ టేబుల్‌ తరహాలోనే ఈ మల్టీ టచ్‌ సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి కూడా ఉండొచ్చని టెక్‌ పరిశీలకులు ఊహిస్తున్నారు. యాపిల్‌ కంపెనీ 'వెబ్‌ టాబ్లెట్‌' పేరిట మల్టీటచ్‌ సదుపాయం కలిగిన కంప్యూటర్‌ను తయారు చేయబోతోందనే వార్త ఆమధ్య దావానలంలా వ్యాపించింది. ఇందుకు పోటీగానే మైక్రోసాఫ్ట్‌ మల్టీ టచ్‌ సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి రూపకల్పనకు నడుంబిగించిందని, పరిస్థితులు అనుకూలిస్తే.. 2010లో జరగనున్న 'ఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో'లో తన మొబైల్‌ ఫోన్లతోపాటు దీనిని కూడా ప్రదర్శించాలని మైక్రోసాఫ్ట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని టెక్‌ పరిశీలకులు పేర్కొంటున్నారు.

అయితే ఇవన్నీ కేవలం పుకార్లేనా? లేక సమీప కాలంలో నిజాలుగా మారే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

Wednesday 23 September 2009

పాతాళంలో కావలసినంత చమురు!



'కూర్చుని తింటుంటే కొండలైనా తరిగిపోతాయి' అనేది పెద్దల మాట. నిజమే ఈ మాట కేవలం మనం ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తిపాస్తులకే కాదు - ఈ భూమ్మీద ప్రకృతి సిద్ధంగా లభించే వనరులకు కూడా సరిపోలుతుంది.
అర్థం కాలేదు కదూ! అయితే మరి కాస్త లోతుగా ఆలోచిద్దాం.
ఇప్పుడు మనమేం చేస్తున్నాం? భూమిలోంచి ముడిచమురును వెలికితీసి దానిని శుద్ధి చేసి పెట్రోలు, డీజిలుగా మార్చుకుని మన కార్లలో పోసుకుని విలాసంగా తిరుగుతున్నాం. అయితే ఇలా ఎంత కాలం? ఇప్పటికే భూమిలోని బొగ్గు నిక్షేపాలు చాలా వరకు తరిగిపోయాయని, భవిష్యత్తులో భూమ్మీద బొగ్గు లభించకపోవచ్చని ఒకవైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దొరుకుతోంది కదా అని ఇలాగే యధేచ్ఛగా వాడుకుంటూ పోతే ఏదో ఒకనాటికి భూమిలోని ముడి చమురు కూడా పూర్తిగా అయిపోతుంది. అప్పుడేం చేస్తాం?

పెట్రోలు, డీజిలు వంటి ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే ముందు అసలు భూమిలో ముడి చమురు నిక్షేపాలు ఎలా తయారయ్యాయో తెలుసుకోవాలి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.. మనం వెలికి తీస్తున్న ముడిచమురు భూమిమీద, నీటిలో జీవించే ఆల్గే (నాచు), ప్లాంక్‌టన్‌ (పూలు పూయని నీటి మొక్కలు) చనిపోవడం ద్వారా తయారవుతోంది. ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోయిన తరువాత ఇవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురవుతాయి. ఇలా కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాలపాటు భూమి లోపలి పొరలలో జరిగే మార్పులకు లోనై హైడ్రోకార్బన్స్‌(ముడి చమురు అణువులు)గా రూపాంతరం చెందుతాయి.

హైడ్రోకార్బన్స్‌ అంటే...
హైడ్రోకార్బన్స్‌ అంటే.. ఉదజని, కర్బన సమ్మిళిత పదార్థం. ఇదే ముడి చమురుకు మూలం. మూడి చమురులో బ్యూటేన్‌, ప్రొపేన్‌ అనే పదార్థాలు ఉంటాయి. అయితే నేటి ఆధునిక యుగంలో.. మానవ మేధస్సు ఇంత పరిణితి చెందిన తరువాత.. అంగారక గ్రహాన్ని కూడా అందుకోవాలని ప్రయత్నిస్తున్న మానవుడు ఈ ముడి చమురును కృత్రిమంగా సృష్టించుకోలేడా? అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోవడం ద్వారా అవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురయి సహజసిద్ధంగా ఏర్పడే ముడి చమురు నిల్వలు పూర్తిగా అయిపోతే అప్పుడు మానవ జీవనమే స్తంభిస్తుంది. ఆ ప్రమాదం రాకమునుపే కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించేందుకు దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

ప్రత్యామ్నాయం ఇదిగో...
ఇలా ఇంధన వనరుల కృత్రిమ సృష్టికి ప్రయోగాలు చేస్తున్న వారిలో వాషింగ్టన్‌లోని కార్నెగి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ గన్‌చరోవ్‌ ఒకరు. ఈయన విశ్వవిద్యాలయంలోని జియో ఫిజికల్‌ లాబొరేటరీలో రష్యా, స్వీడన్‌కు చెందిన ఇతర శాస్త్రవేత్తలతో కలిసి సాగిస్తున్న ప్రయోగాలు కొంతమేర సత్ఫలితాలు ఇచ్చాయి. భూమిలోపలి పొరలలో దాదాపు 100 కిలోమీటర్ల లోతున మీథేన్‌ వాయువు(సహజ వాయువుకు ఇదే ప్రధానం)ను 1200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు తీసుకెళ్లడం ద్వారా కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించవచ్చని డాక్టర్‌ అలెగ్జాండర్‌ బృందం కనుగొంది. ఆ ఉష్ణోగ్రత వద్ద మీథేన్‌ వాయువు ఈథేన్‌, బ్యూటేన్‌, ప్రొపేన్‌, మాలిక్యులార్‌ హైడ్రోజన్‌, గ్రాఫైట్‌లుగా విడిపోవడం శాస్త్రవేత్తలు గమనించారు. మళ్లీ ఈథేన్‌ను లేజర్‌ కిరణాల ద్వారా అదే ఉష్ణోగ్రతకు తీసుకెళ్లినప్పుడు అది మీథేన్‌గా మారడం కూడా గమనించారు. వీటిలో బ్యూటేన్‌, ప్రొపేన్‌లు ముడి చమురుకు మూలమైన పదార్థాలు.
"మా ప్రయోగ ఫలితాలు చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. అంటే.. భూమి ఉపరితలం నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల లోతున ఉండే ఉష్ణోగ్రత వద్ద ఆల్గే, ఫ్లాంక్‌టన్‌లతో సంబంధం లేకుండానే హైడ్రోకార్బన్స్‌ తయారవుతాయి. అంతేకాదు, ఇలా తయారైన హైడ్రోకార్బన్స్‌ను అక్కడి క్రస్ట్‌ పొరలలో పగుళ్లు మధ్యన ఉండే తీవ్రమైన ఒత్తిడి పైకి నెట్టివేస్తూ ఉంటుంది. ఈ చమురు నిక్షేపాలనే వెలికితీసి, శుద్ధి చేసుకుని, దానిని మళ్లీ పెట్రోలు, డీజిలుగా మార్చుకుని మనం ఇన్నాళ్లూ ఉపయోగించుకుంటూ వస్తున్నాం..'' అని డాక్టర్‌ అలెగ్జాండర్‌ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీని ప్రకారం... భూమి మధ్యలోని 'కోర్‌' పొరలకు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల దిగువు నుంచి మొదలయ్యే 'క్రస్ట్‌' పొరలకు మధ్యన మరికొన్ని కిలోమీటర్లపాటు విస్తరించి ఉండే 'మాంటెల్‌' పొరల నడుమ ఉండే పగుళ్లలో అంతులేని చమురు నిల్వలు ఉండే అవకాశం ఉందన్నమాట.
అలాగే శాస్త్రవేత్తలు తమ ప్రయోగంలో మరో విషయాన్ని కూడా గమనించారు. అదేమిటంటే.. లేజర్‌ కిరణాల సాయంతో వేడిచేసినప్పుడు మీథేన్‌ వాయువు నుండి హైడ్రోకార్బన్స్‌తోపాటు చివరలో ఉద్భవించిన గ్రాఫైట్‌, మాలిక్యులార్‌ హైడ్రోజన్‌ తదితర పదార్థాలు కొన్ని రోజుల తరువాత వాటి ఉనికిని కోల్పోతున్నాయిగానీ, ఒక్క హైడ్రోకార్బన్స్‌ మాత్రం చెక్కు చెదరడం లేదు. దీని గురించి శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్‌ కుత్సెరోవ్‌ వ్యాఖ్యానిస్తూ.. "భూమిలోని మాంటెల్‌ పొరలలో ఉద్భవించే హైడ్రోకార్బన్స్‌ అక్కడి పొరలలో ఉండే విపరీతమైన ఒత్తిడి కారణంగా క్రస్ట్‌ పొరలలోకి చేరి చమురు, సహజ వాయు నిక్షేపాలుగా రూపాంతరం చెందుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ తదితర దేశాలలోని చమురు, సహజ వాయు నిక్షేపాలు ఇలా ఏర్పడినవే..'' అంటున్నారు.
అంతేకాదు, ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భూమిలోని మాంటెల్‌ పొరల వరకు గనుక మానవుడు వెళ్లగలిగితే అంతులేని చమురు నిక్షేపాలు సొంతమవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారాయన.