Thursday 20 May 2010

వాయేజర్‌-2 హైజాక్‌.. గ్రహాంతరవాసుల పనేనా?!

ముప్పై మూడేళ్ళ క్రితం ఆ మానవ రహిత వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. దాని లక్ష్యం.. విశ్వ రహస్యాలను సేకరించడం, గ్రహాంతర వాసుల ఆచూకీ కనుగొనడం! ఇన్నేళ్లూ అంతరిక్షంలో ప్రయాణిస్తూ భూమికి ఎంతో విలువైన సమాచారం చేరవేసిన ఆ వ్యోమనౌక నుంచి ప్రస్తుతం ఏమాత్రం అర్థం కాని రీతిలో సందేశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మన ప్రపంచంలోని ఏ భాషకూ ఆ సంకేతాలు సరిపోలడం లేదు. ఒకవేళ ఆ వ్యోమనౌక గ్రహాంతర వాసుల చేతికిగాని చిక్కిందా? ఆ సందేశాలు వారు పంపిస్తున్నవేనా? ఖగోళ శాస్త్రవేత్తల్లో ఇప్పుడు ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

ఈ అనంత విశ్వంలో కొంత భాగాన్నైనా శోధించాలని, ఒకవేళ గ్రహాంతర వాసులు ఉన్నట్లయితే, భూమి మీద ఉన్న మన ఉనికిని వారికి తెలియజేయాలన్న లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' 1977లో వాయేజర్‌ -2 అనే వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్న సంప్రదాయ సంగీతం, ప్రకృతి సహజమైన శబ్ద రీతులు, 55 భాషలలో శుభాకాంక్షల సందేశాలను, అనలాగ్‌ రూపంలో ఉన్న 115 చిత్రాలను బంగారు పూతతో కూడిన పన్నెండు అంగుళాల రాగి డిస్క్‌పై శబ్దం రూపంలో నిక్షిప్తం చేసి దానిని ఈ వ్యోమనౌకలో పొందుపరిచారు. ఈ సువిశాల విశ్వంలో నిజంగా గ్రహాంతర వాసులే గనక ఉండి ఉంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా వారికి వాయేజర్‌-2 వ్యోమనౌక గనుక తారసపడితే, ఆ వ్యోమనౌకను ఎవరు ప్రయోగించారో, ఏ లక్ష్యంతో ప్రయోగించారో అర్థం చేసుకునేందుకు ఈ సంగీతం, శుభాకాంక్షల సందేశాలు ఉపయోగపడతాయనేది నాటి నాసా శాస్త్రవేత్తల భావన. అంతేకాదు, ఈ వ్యోమనౌక వెలుపలి భాగంలో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్‌ పేరిట ఒక సందేశం కూడా ముద్రితమై ఉంటుంది.
సుధీర్ఘ కాలం సేవలు..
నిజానికి శాస్త్రవేత్తలు తొలుత నిర్ణయించిన ప్రకారం వాయేజర్‌-2 వ్యోమనౌక జీవిత కాలం నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఈ నాలుగేళ్ళలో ఇది శనిగ్రహం సమీపానికి వెళ్ళి ఆ గ్రహానికి సంబంధించిన సమాచారాన్ని భూమి మీదికి చేరవేయాల్సి ఉంటుంది. 1977లో తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది వరకు.. అంటే ముప్ఫై మూడేళ్ళపాటు వాయేజర్‌-2 భూమికి ఎంతో విలువైన సమాచారాన్ని చేరవేస్తూ వచ్చింది. ఒక్క శని గ్రహం గురించే కాదు, బృహస్పతి, యురెనస్‌, నెఫ్ట్యూన్‌ గ్రహాల సమీపంలోకి కూడా వెళ్లి ఆయా గ్రహాలకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని భూమ్మీదికి చేరవేసింది. మన సౌర కుటుంబం గురించి ఇప్పటి వరకు మనం చూడని, మనకు తెలియని ఎన్నో విషయాలను వాయేజర్‌-2 మనకు అందించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి వాయేజర్‌-2 వ్యోమనౌక మన సౌర కుటుంబం అంచులకు చేరుకుంది. ఇక్కడి నుంచి ఇది పంపించే సంకేతాలు మన భూమికి చేరడానికి పదమూడు గంటల సమయం పట్టేది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి హఠాత్తుగా దీని నుంచి వచ్చే సమాచారం ఆగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు దీన్నుంచి అర్థం పర్థం లేదని సంకేతాలు భూమి మీద ఉన్న నియంత్రణ కేంద్రానికి అందుతున్నాయి. ఆ సంకేతాలు ఏ భాషకు సంబంధించినవో ఖగోళ శాస్త్రవేత్తలు అంతుబట్టడం లేదు.
ఏం జరిగి ఉంటుంది?
వాయేజర్‌-2 వ్యోమనౌక నుంచి అర్థంకాని సంకేతాలు రావడం గురించి ఖగోళ శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా అందులో సాంకేతిక, విద్యుత్తు లోపం ఏదైనా ఏర్పడి ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆ వ్యోమనౌక గ్రహాంతర వాసుల ఆధీనంలోకి వెళ్లిపోయి ఉంటుందని, ప్రస్తుతం దాన్నుంచి వస్తున్న అర్థం పర్థం లేని సంకేతాలు బహుశా వారు పంపిస్తున్నవే అయి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. 2006 నవంబరు 30న జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీలోని కమాండ్‌ సెంటర్‌ నుంచి ఇచ్చిన ఆదేశాలను వాయేజర్‌-2 తప్పుగా అర్థం చేసుకుందని, ఫలితంగా అందులో ఉన్న మాగ్నెటోమీటర్‌కు సంబంధించిన హీటర్లు పని చేయడం మొదలెట్టాయని, ఇలా ఈ హీటర్లు 2006 డిసెంబర్‌ 4 వరకు పని చేస్తూనే ఉన్నాయని, దీంతో వాయేజర్‌-2 వ్యోమనౌకలోని ఉష్ణోగ్రత 130 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరిందని, బహుశా ఈ అధిక వేడి వల్లనే వాయేజర్‌-2 పనితీరు మారిపోయి ఉంటుందనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వాయేజర్‌-2 వ్యోమనౌక నుంచి అందుతున్న సంకేతాలను డీకోడ్‌ చేసే ప్రయత్నాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించగలమనే ధీమాను నాసా శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా సమాచారాన్ని భూమికి చేరవేసే 'ఫ్లయిట్‌ డేటా సిస్టం'లో ఏదైనా సమస్య తలెత్తి ఉండవచ్చని, వ్యోమనౌక నుంచి అర్థం పర్థం లేని సంకేతాలు అందడానికి కారణం ఇదే అయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అందుకే వాయేజర్‌-2 తనకు సంబంధించిన సమాచారాన్నే కొంత కాలంపాటు భూమికి చేరవేసేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
'ఇది వారి పనే..'
అయితే వాయేజర్‌-2 గ్రహాంతర వాసుల చేతికి చిక్కి ఉంటుందని, ప్రస్తుతం కమాండ్‌ సెంటర్‌కు చేరుతున్న సంకేతాలు వారు పంపుతున్నవే అయి ఉండొచ్చని జర్మనీకి చెందిన అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌ నిపుణుడు హార్ట్‌విగ్‌ హాస్‌డ్రాఫ్‌ వ్యాఖ్యానిస్తున్నారు. వాయేజర్‌-2లో అమర్చిన గోల్డ్‌ డిస్క్‌, అందులో ముప్ఫై మూడేళ్ల క్రితం మనం నిక్షిప్తం చేసిన సమాచారానికి బహుశా ఇది గ్రహాంతర వాసుల స్పందన అయి ఉండొచ్చని, అయితే ఇది నిజమో, కాదో తెలుసుకోడానికి మరికొద్దికాలం పడుతుందని ఆయన పేర్కొంటున్నారు.

Tuesday 11 May 2010

ఆకాశంలో 'లేజర్‌ మేఘాలు'!

ఆకాశం మేఘావృతం కావడం.. ఆపైన వర్షం పడడం మామూలే! మేఘాలు లేని చోట వర్షం కోసం కృత్రిమ మేఘాలను మనమే సృష్టించు కుంటున్నాం.. వర్షం కురిసేలా చేస్తున్నాం. దీనినే 'మేఘ మథనం' అని పిలుచు కుంటున్నాం. కానీ భవిష్యత్తులో మేఘమథనం ఇలా ఉండదు. ఆకాశాన్ని 'లేజర్‌ మేఘాలు' కమ్ముకుంటాయి. కావలసినంత వర్షాన్ని కురిపిస్తాయి.

వర్షాకాలంలో వర్షాలు కురవడం సర్వసాధారణం. అయితే ఎంత వర్షాకాలమైనా కొన్ని ప్రదేశాలలో వర్షం కురవదు. ఫలితంగా ఆ ప్రాంతంలో పంటలు పండవు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు, ఆయా ప్రదేశాలలో వర్షాలు కురిపించేందుకు వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా 'మేఘ మథనం' విధానాన్ని అవలంభిస్తున్నారు. అసలు వర్షమే కురవని చోట కృత్రిమంగా మేఘాలను సృష్టించి వర్షాలు కురిపించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం.
మేఘ మథనం ఇలా..
ఈ మేఘ మథనం అనేది చాలా ఏళ్లుగా జరుగుతున్నదే. ఈ విధానంలో మేఘాలను చల్లబరిచేందుకు సిల్వర్‌ అయొడైడ్‌ క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తారు. వాతావరణంలో చాలా ఎత్తున ఉండే మేఘాలపైన విమానాల ద్వారా ఈ సిల్వర్‌ అయొడైడ్‌ క్రిస్టల్స్‌ను చల్లగానే ఆ మేఘాలలో ఉండే నీటి ఆవిరి ఘనీభవించి నీరుగా మారుతుంది. ఆపైన అది వర్షంగా మారి కురుస్తుంది. అయితే ఈ విధానం నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని చెప్పలేం. ఒకోసారి మేఘమథనం జరిపినా వర్షం కురవదు. అప్పడేం చేయాలి?
ప్రత్యామ్నాయంగా.. 'లేజర్‌'!
తాజా పరిశోధనల్లో మేఘమథనానికి 'లేజర్‌ కిరణాలు' ఉపయోగించవచ్చని వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవాకు చెందిన పరిశోధకుడు జెరోమ్‌ కాస్పరియన్‌ తన సహ పరిశోధకులతో కలిసి లేజర్‌ కిరణాల ద్వారా వర్షాలు కురిపించే పద్ధతిని అభివృద్ధి చేశారు. తమ పరిశోధనలో భాగంగా కాస్పరియన్‌ బృందం ప్రయోగశాలలో కృత్రిమ మేఘాలను సృష్టించారు. అంతేకాదు, ఇటీవల జర్మనీ రాజధాని బెర్లిన్‌లోనూ లేజర్‌ ద్వారా విజయవంతంగా మేఘాలను సృష్టించగలిగారు. ఇందులో భాగంగా దాదాపు 60 మీటర్ల వరకు ఆకాశంలోకి వారు లేజర్‌ కిరణాలను పంపించారు. ఆ సమయంలో బెర్లిన్‌ నగరంపైన ఆకాశంలో ఏర్పడిన మేఘాలు కంటికి కనిపించకపోయినా వాతావరణాన్ని కొలిచే లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ (లిడార్‌) అనే పరికరం మాత్రం మేఘాలు ఏర్పడినట్లు, వాటిలో ఉన్న నీటి పరమాణువుల సాంద్రత, వాటి పరిమాణం పెరిగినట్లు గుర్తించింది.
ఎలా చేశారంటే..
తమ ప్రయోగంలో భాగంగా ప్రయోగశాలలో కాస్పరియన్‌ బృందం ఒక క్లౌడ్‌ ఛాంబర్‌ను రూపొందించారు. అందులో మైనస్‌ 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరిని ఉంచి, ఆపైన అందులోకి తక్కువ పౌనఃపున్యం కలిగిన ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్‌ కిరణాలను పంపించారు. ఈ లేజర్‌ కిరణాలు తొలుత క్లౌడ్‌ ఛాంబర్‌లోని నీటి ఆవిరి అణువుల నుంచి ఎలక్ట్రాన్‌లను విడగొట్టి, హైడ్రాక్సిల్‌ రాడికల్స్‌ను ఏర్పరిచాయి. ఇవి ఛాంబర్‌లోని వాతావరణంలో ఉన్న సల్ఫర్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌డయాక్సైడ్‌ వాయువులను నీటి పరమాణువులుగా మార్చివేశాయి. లేజర్‌ కిరణాల ప్రవాహాన్ని ఆపివేసిన తర్వాత ఛాంబర్‌లోకి తొంగి చూస్తే.. ఆ ఛాంబర్‌ చుట్టూ నీటి బొట్లు సగానికి సగం పెరిగి ఉన్నాయి.
బయటి వాతావరణంలో సాధ్యమేనా?
అయితే కాస్పరియన్‌ బృందం సాధించిన విజయం పట్ల ఇటు అభినందనలతోపాటు అటు విమర్శలు కూడా కురుస్తున్నాయి. "తక్కువ ఉష్ణోగ్రత వద్ద అధిక తేమను సృష్టించడం ప్రయోగశాలలో సాధ్యమేమో కానీ, బయట వాతావరణంలో సాధ్యం కాదు.. లేజర్‌ కిరణాలు ఉపయోగించి ప్రయోగశాలలో కొన్ని నీటి బొట్లు సృష్టించిన మాత్రాన.. బయటి వాతావరణంలోనూ అలాగే జరుగుతుందనుకుంటే పొరపాటు..'' అని జెరూసలేంలో ఉన్న హిబ్రూ యూనివర్సిటీకి చెందిన వాతావరణ పరిశోధకులు డానియెల్‌ రోసెన్‌ఫెల్డ్‌ వ్యాఖ్యానిస్తుండగా కాస్పరియన్‌ బృందం ఆయన మాటలను కొట్టివేస్తున్నారు. తమ ప్రయోగం బయటి వాతావరణంలోనూ సాధ్యపడుతుందని చెప్పడానికి బెర్లిన్‌ నగరంపై కమ్ముకున్న మేఘాలే నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు, కాస్పరియన్‌ బృందం ఇప్పుడు మరో ప్రయోగంలో నిమగ్నమయ్యారు. లేజర్‌ కిరణాల వేవ్‌ లెంగ్త్‌ను మరింతగా పెంచి, ఎక్కువ సేపు ఆకాశంలోకి వాటిని ప్రయోగించడం ద్వారా మేఘాలలోని నీటి ఆవిరి మరింత త్వరితగతిన ఘనీభవనం చెంది పెద్ద పెద్ద నీటిబొట్లుగా మారే ందుకు గల అవకాశాలను పరీక్షిస్తున్నారు.
ఇదే గనుక జరిగితే భవిష్యత్తులో ఎక్కడ కావాలంటే అక్కడ ఆకాశం నిండా లేజర్‌ మేఘాలు కమ్ముకోవడం.. చాలనేంత వరకు వర్షాలు కురవడం ఖాయం కదూ!

Saturday 1 May 2010

నవ్వించే ఓ వెబ్‌సైట్‌... 'కార్టూన్‌ కబుర్లు.ఇన్'


'నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలి..రా!' అని ఓ సినీ గీత రచయిత ఏనాడో సెలవిచ్చాడు. నవ్వుతూ చావకపోయినా కనీసం బతికినన్నాళ్లయినా నవ్వుతూ బతకొచ్చుకదా! పైగా నవ్వు.. నాలుగు కాలాలపాటు మనల్ని బతికిస్తుంది కూడా. అందుకే అందరినీ నవ్వించేందుకు ఓ కొత్త వెబ్‌సైట్‌ పుట్టుకొచ్చింది.  దీనిపేరు 'కార్టూన్‌ కబుర్లు.ఇన్'.   ఇక్కడ ఇచ్చిన కార్టూన్‌ చూశారు కదా.. ఇలాంటివి బోలెడు కార్టూన్లు www.cartoonkaburlu.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి. చదివి హాయిగా నవ్వుకోండి. ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనలో మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించండి. అంతేకాదు, ఈ 'కార్టూన్‌ కబుర్లు.ఇన్' గురించి మీ స్నేహితులకు, బంధువులకు.. అందరికీ తెలియజేయండి. ఒకవేళ మీలో ఎవరైనా కార్టూనిస్టులు, కార్టూన్‌ ఇష్టులు ఉన్నట్లయితే.. మీరు గీసిన కార్టూన్లు, మీకు నచ్చిన కార్టూన్లు, ఆయా కార్టూనిస్టులు గీసిన, మీరు చూసిన వివిధ కార్టూన్ల గురించి మీ అభిప్రాయాలు అన్నీ కూడా 'కార్టూన్‌ కబుర్లు.ఇన్'కు పంపించవచ్చు.