Saturday 31 October 2009

కంప్యూటర్‌ కాదు.. మొబైల్‌ఫోనే!


హైలైట్...
120 జిబి హార్డ్‌డిస్క్‌, 1జిబి ర్యామ్‌, 4.8 అంగుళాల డిస్‌ప్లే, పూర్తిస్థాయి టచ్‌స్క్రీన్‌, క్యూవెర్టీ కీబోర్డ్‌


ఇకమీదట మీరు మీ పనులన్నీ మొబైల్‌తోనే చక్కబెట్టుకోవచ్చు. మీ వ్యక్తిగత పనులు, ఆఫీసు పనులు అన్నీ జస్ట్‌.. మీ వేళ్ల కదలికలపై జరిగిపోతాయి. మరో మాటలో చెప్పాలంటే ఇది ఫోన్‌ కాదు.. బుల్లి కంప్యూటర్‌. ఇలాంటి మొబైల్‌ఫోన్‌ను చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీనిపేరు ఎక్స్‌పీ ఫోన్‌. ఇప్పుడు మొబైల్‌ఫోన్ల రంగంలో ఇదో పెద్ద సంచలనం.

చాలా కొద్దిరోజుల్లోనే మీరు ఓ పర్సనల్‌ కంప్యూటర్‌ను మీ జేబులో వేసుకుని తిరగొచ్చు. అది సరిగ్గా మీ మొబైల్‌ ఫోన్‌ సైజులో ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇంకా దీని గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టడం ఖాయం. చైనాకు చెందిన మొబైల్‌ఫోన్ల తయారీదారు ఇన్‌ టెక్నాలజీ గ్రూప్‌(ఐటిజి) కంప్యూటర్‌లాంటి ఈ అద్భుత మొబైల్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పర్సనల్‌ కంప్యూటర్లలో ఉండే అన్ని రకాల సదుపాయాలు ఈ 3జి (థర్డ్‌ జనరేషన్‌) ఫోన్‌లో ఉంటాయి. 4.8 అంగుళాల ఫుల్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ ప్రత్యేకత. అంతేకాదు.. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ల మాదిరిగా ఈ ఫోన్‌లో 120 గిగాబైట్‌ల స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది. అలాగే 1 జిబి ర్యామ్‌ కూడా. 'అబ్బ.. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఓ కీబోర్డు కూడా ఉంటే ఇంకా బాగుండేది..' అనుకుంటున్నారా? ఆగండి.. అక్కడికే వస్తున్నాం. ఈ స్లయిడర్‌ ఫోన్‌ అడుగుభాగాన 'క్యూవెర్టీ' కీబోర్డు కూడా అమర్చారు. ఇంకేం కావాలి? ఎంత పెద్ద మెసేజ్‌లైనా కంప్యూటర్‌ కీబోర్డుపై టకటకలాడించినట్లు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు.. చూపులకు చిన్నగా ఉన్నా పనితనంలో మాత్రం ఈ ఎక్స్‌పీ మొబైల్‌ యమ ఫాస్ట్‌. ఎలాగంటే కంప్యూటర్లలో ఉన్న మాదిరిగానే ఇందులో ఎఎండి ప్రాసెసర్‌, మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం ఉంటాయి మరి. అంతేనా? ఇంకా ఇందులో.. 1.3 మెగాపిక్సెల్‌ కెమెరా, జిపిఎస్‌ నావిగేషన్‌, బ్లూటూత్‌, యుఎస్‌బి అండ్‌ విజిఎ సపోర్ట్‌.. ఇలా ఆధునిక తరానికి కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయి. ఇవే కాకుండా.. హై స్పీడ్‌ డౌన్‌లింక్‌ పాకెట్‌ యాక్సెస్‌ (హెచ్‌ఎస్‌డిపిఎ), హై స్పీడ్‌ అప్‌లింక్‌ పాకెట్‌ యాక్సెస్‌ (హెచ్‌ఎస్‌డిపిఎ) తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకో సదుపాయం గురించి చెబితే మీరు ఎగిరి గంతేస్తారు. ఈ ఎక్స్‌పీ ఫోన్‌ను కేవలం జిఎస్‌ఎం వినియోగదారులు మాత్రమే కాదు.. సిడిఎంఎ వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌ రెండు రకాల నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుందన్నమాట. ఇక టాక్‌టైమ్‌ విషయనికొస్తే.. ఒకసారి బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుని అయిదు గంటలపాటు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. ఫోన్‌ను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచితే అయిదు రోజులపాటు ఉంటుంది. మరి ఇంతకన్నా అద్భుతమైన ఫోన్‌ ఇంకోటి ఉంటుందా? ప్రస్తుతం ఈ ఫోన్‌ ప్రి-ఆర్డర్‌ (ముందుగా ఆర్డర్‌ చేసి తెప్పించుకోవడం) ద్వారా మాత్రమే లభిస్తోంది. ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు, ఆర్డర్‌ చేసే విధానం తెలుసుకుకోవాలంటే http://www.xpphone.com/en/index.htmlలో చూడాల్సిందే.

ల్యాప్‌టాప్స్‌ విత్‌ Windows 7


డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనొవో తన థింక్‌ప్యాడ్‌ శ్రేణిలో కొత్తగా రెండు ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి విడుదల చేసిన 'విండోస్‌-7' ఆపరేటింగ్‌ సిస్టంను కలిగి ఉండడం ఈ ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకత. వీటి పేర్లు థింక్‌ప్యాడ్‌ ఎస్‌ఎల్‌ 410, థింక్‌ప్యాడ్‌ ఎస్‌ఎల్‌ 510. ఎస్‌ఎల్‌ 410 మోడల్‌ థింక్‌ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల డిస్‌స్లే స్క్రీన్‌ సైజుతో లభిస్తుండగా, ఎస్‌ఎల్‌ 510 మోడల్‌ ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ సైజు 15.6 అంగుళాలు. 3జి(థర్డ్‌ జనరేషన్‌) పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ల్యాప్‌టాప్‌లు రెండిట్లోనూ హై రిజల్యూషన్‌ కెమెరా నిక్షిప్తం చేయబడి ఉండడమేకాక ఎటి అండ్‌ టి మొబైల్‌ బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ కూడా ఉంటుంది. వ్యాపార వార్గాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ల్యాప్‌టాప్‌ల ధరలు వరుసగా రూ.23,457.. రూ.32,840.


ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు.. ఇలా!


ఏళ్ల తరబడి Windows Xp ఆపరేటింగ్‌ సిస్టంపై పనిచేసి బోర్‌ కొడుతుందా? సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవల విడుదల చేసిన కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7కు మారాలని భావిస్తున్నారా? అయితే Windows Xp నుంచి Windows 7కు ఎలా మారాలో మేం చెబుతాం. ఫాలో అవండి మరి!

ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోదారులందరూ ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌-7 విజయవంతంగా మార్కెట్లోకి విడుదలైంది. 2000 సంవత్సరంలో విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం విడుదల తర్వాత మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో సమర్ధమంతమైన ఆపరేటింగ్‌ సిస్టం మార్కెట్లోకి రాలేదనే చెప్పాలి. రెండేళ్ల క్రితం మరో ఆపరేటింగ్‌ సిస్టం Windows Vista వచ్చినా.. కంప్యూటర్‌ వినియోగదారులను ఆకట్టుకోవడంలో, వారి అవసరాలు తీర్చడంలో అది దాదాపు విఫలమైనట్లే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోగదారులందరూ మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌-7పైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టంను ఉపయోగిస్తున్న వారంతా కొత్తగా వచ్చిన విండోస్‌-7కు మారడానికి ఇదే సరైన తరుణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు ఎలా మారాలో చూద్దాం.

Memory ప్రధానం..
విండోస్‌-7 సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజి మీరు కొన్నట్లయితే, అందులో 32-బిట్‌, 64-బిట్‌ ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌లు రెండు ఉంటాయి. వీటిలో 64-బిట్‌ సాఫ్ట్‌వేర్‌ చాలా కంప్యూటర్లకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే మీ కంప్యూటర్‌లో కనీసం 4 జిబి మెమరీ ఉండాలి. అంత మెమరీ లేని వారు 32-బిట్‌ ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను ఎంచుకోవడం మంచిది.

ఇలా చెక్‌ చేయండి..
మీ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ గురించి మీకు కచ్చితంగా తెలియనప్పుడు, కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7 మీ కంప్యూటర్‌లో లోడ్‌ అవుతుందో లేదో తెలుసుకునేందుకు ఇలా చేయండి. మీ కంప్యూటర్‌ డెస్క్‌టాప్‌పైన కనిపించే My Computer ఐకాన్‌పై మీ మౌస్‌ పాయింటర్‌ను ఉంచి రైట్‌ బటన్‌ క్లిక్‌ చేసిPropertiesను సెలక్ట్‌ చేసుకోండి. అక్కడ కనిపించే సమాచారంలో "x64 Edition" అని కనిపిస్తే మీరు మీ కంప్యూటర్‌లో 64-బిట్‌ వెర్షన్‌ విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టంను ఉపయోగిస్తున్నారని అర్థం. లేదంటే మీ కంప్యూటర్‌ 32-బిట్‌ వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టంను కలిగి ఉందని అర్థం. అక్కడ మీకు ఏది కనిపిస్తే కొత్త ఆపరేటింగ్‌ సిస్టంలో కూడా దానికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను మాత్రమే ఎంచుకోండి. మీరు ఏ బిట్‌ వెర్షన్‌ ఉపయోగిస్తున్నారన్నదానిపై మీకు స్పష్టత లభించకపోతే మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి free Windows 7 Upgrade Advisorను మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని రన్‌ చేసి చూడండి. ఆపైన Windows 7కు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు మీ సిస్టంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో Upgrade Advisor మీకు తెలియజేస్తుంది.

Backup ముఖ్యం..
విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసుకునే ముందు మీ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్‌, ఫోల్డర్స్‌ను వేరొక లొకేషన్‌లో భద్రంగా పదిలపరచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. దీనికోసం Windows Easy Transfer Application ను మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్త ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత తిరిగి మీ బ్యాకప్‌ ఫైల్స్‌ను చాలా సులువుగా మీ కంప్యూటర్‌లోకి తీసుకురావచ్చు. ఈ పద్ధతి వద్దనుకుంటే మీ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్‌, ఫోల్డర్స్‌ అన్నింటినీ సీడీ, డివిడి, యుఎస్‌బి ఫ్లాష్‌డ్రైవ్‌, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌.. వీటిలో ఏదో ఒకదానిలో వాటిని భద్రపరుచుకోవచ్చు.

ఇంటర్నెట్‌ అవసరం..
కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7ను ఇన్‌స్టాలేషన్‌ చేసుకోవడానికి ముందుగానే మీ కంప్యూటర్‌ను ఇంటర్నెట్‌తో అనుసంధానించండి. ఆ తరువాతే మీ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజిలో ఉన్న 32-బిట్‌ లేదా 64-బిట్‌ ఈ రెండింటిలో మీ కంప్యూటర్‌కు ఏది సరిపోతుందో ఎంపిక చేసుకోండి.

ఇన్‌స్టాలేషన్‌ ఇలా..
ఎంచుకున్న విండోస్‌ 7 ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను మీ సిపియుకు ఉన్న డిస్క్‌డ్రైవ్‌లో ఉంచి సెటప్‌ను ఒకే చేస్తే ఇన్‌స్టాలేషన్‌ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే.. .. Start Menuలోకి వెళ్లి My Computer ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. వచ్చిన విండోలో కనిపించే డివిడి డ్రైవ్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. వచ్చే మరో విండోలో కనిపించే setup.exe ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. దీంతో ఇన్‌స్టాలేషన్‌ మొదలవుతుంది.
తరువాత Install Windows Page పేరుతో ఓ విండో ఓపెన్‌ అవుతుంది. అందులో కనిపించే Install Now అనే బటన్‌పై క్లిక్‌ చేయండి. వెంటనే ఎటువంటి ఇన్‌స్టాలేషన్‌ను మీరు కోరుతున్నారు? అనే ప్రశ్న వస్తుంది. అందులో Custom అనే ఆప్షన్‌ను ఎంచుకుని దానిపై క్లిక్‌ చేయండి. వచ్చే విండోలో Windows Xp Partition Containingను ఎంచుకుని, Next బటన్‌ను క్లిక్‌ చేయండి. మరో డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది. దానిపై OK బటన్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

బ్యాకప్‌ ఫైల్స్‌ను తెచ్చుకోవడం..
కొత్త ఆపరేటింగ్‌ సిస్టం ఇన్‌స్టాలేషన్‌ పూర్తయిన తర్వాత Windows Easy Transfer Applicationను మరోసారి రన్‌ చేసుకోండి. ఫైల్స్‌, సెట్టింగ్స్‌ను కంప్యూటర్‌లోకి తీసుకురండి. ఈ అప్లికేషన్‌ను రన్‌ చేసే ముందుగానే ప్రోగ్రామ్స్‌ను రీ-ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఎందుకంటే Windows Easy Transfer Application మీ ఫైళ్లను ఇంతకు మందు అవి ఏ ఏ ప్రోగ్రామ్స్‌లో అయితే ఉన్నాయో, అవే స్థానాల్లోకి తీసుకొస్తుంది. ఒకవేళ మీ బ్యాకప్‌ ఫైల్స్‌ ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌లో ఉన్నట్లయితే దాన్ని మొదట మీ కంప్యూటర్‌కు అనుసంధానించండి. తరువాత Start Menu లోకి వెళ్లి కడ My Computer ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. ఆపైన కనిపించే ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేసి దానిని ఓపెన్‌చేయండి. అందులో కనిపించే Windows Easy Transfer Application ను మరోసారి రన్‌ చేసి ఏఏ ఫైళ్లను ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు తీసుకురావాలో ఎంపిక చేసుకుని, వాటిని ఒకే చేసుకుంటే మీరనుకున్న పని పూర్తవుతుంది.

సెట్టింగ్స్‌, ఫైళ్లు కంప్యూటర్‌లోకి వచ్చిన వెంటనే ప్రోగ్రామ్స్‌ను రీ-ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఒకసారి అప్‌డేషన్‌ను చెక్‌ చేసుకోండి. దీంతో విండోస్‌ -7 ఆపరేటింగ్‌ సిస్టం ఇన్‌స్టాలేషన్‌ సంపూర్ణం అయినట్లే!


Wednesday 21 October 2009

ఇ-బుక్‌ రీడర్‌.. మీ దగ్గర ఉందా?


ఇ-బుక్‌ రీడర్లు పుస్తక ప్రియలకు చదవడాన్ని చాలా సులువైన ప్రక్రియగా మార్చేశాయి. చేతిలో ఇమిడిపోవడంతోపాటు చదువుతూనే పాటలు వినగలగడం ఇందులో ఉన్న ఆకర్షణీయమైన అంశాలు. పుస్తకం పాడైపోతుందన్న బాధలేదు. బరువు తక్కువ, వందలకొద్దీ పుస్తకాలను చిన్న పరికరంలో నిక్షిప్తం చేసుకోగల సౌలభ్యం.. వెరసి పాఠకులకు ఇదొక హాట్‌ పరికరంగా మారిందంటే ఆశ్యర్యం లేదు. అందుకే ఐదు ఉత్తమ ఇ-బుక్‌ రీడర్ల విశేషాలను మీకోసం అందిస్తున్నాం...

అమెజాన్‌ కిండిల్‌
ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీ 'అమెజాన్‌ డాట్‌కాం' రూపొందించిన వైర్‌లెస్‌ డిజిటల్‌ ఇ-బుక్‌ రీడర్‌ ఇది.
కిండిల్‌ సిరీస్‌లో ఇప్పటికే కిండిల్‌-1, కిండిల్‌-2, కిండిల్‌-ఈగీ విడుదల అయ్యాయి. ఇ-ఇంక్‌ స్క్రీన్‌ గల ఈ రీడర్‌ ఫొటోలను సహజమైన నాణ్యతతో చూపించగలుగుతుంది. అలాగే చదవడానికి చాలా సౌకర్యంగా ఉంటుందని అమెజాన్‌ పేర్కొంది.
కంప్యూటర్‌ అవసరం లేకుండానే డిజిటల్‌ పుస్తకాలు, మ్యాగజైన్లను ఇందులోకి డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. ఇ-పుస్తకాలను కూడా అమెరికా నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వికీ
పీడియాలాంటి ముఖ్యమైన సైట్లను బ్రౌజ్‌ చేసుకునే సదుపాయం మాత్రం ప్రస్తుతానికి ఇందులో లేదు. దీని ధర రూ.12,898. ఇంత «ధర అయితే కష్టం అనుకునే వారు 'రిఫర్‌బిష్‌డ్‌ కిండిల్‌' కొనుక్కోవచ్చు. అంటే.. ఒకసారి మార్కెట్‌లోకి వచ్చి ఏదైనా కారణం చేత తిరిగి కంపెనీకి చేరిన ఇ-పుస్తకమన్నమాట. ఇలాంటి వాటిలో లోపాలను సరిచేసి మళ్లీ కొత్త వాటిలా మార్చుతారు. కొత్త వాటికి ఇచ్చినట్లుగానే వీటికీ వారంటీ ఉంటుంది. ధర కూడా చాలా తక్కువ. ఈ రిఫర్‌బిష్‌డ్‌ ఇ-రీడర్ల ధరలు.. కిండిల్‌1-రూ.6,869, కిండిల్‌2-రూ.10,130, కిండిల్‌ ఈగీ -రూ.18,504.

సోనీ రీడర్‌ టచ్‌
మెటల్‌తో స్లిమ్‌గా రూపొందించారు. ఇది సోనీ నుంచి వెలువడిన తొలి టచ్‌స్క్రీన్‌ ఇ-బుక్‌ రీడర్‌. పేజీలను తేలికగా ముందుకు, వెనుకకు జరుపుకోవచ్చు. ఇమేజ్‌లను పెద్దవిగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు చదువుతూనే ఎంపి3 ట్యూన ్లను వినవచ్చు.
పుస్తకాలను సెర్చ్‌ చేసుకునే సదుపా
యం కూడా ఉంది. అయితే ఇందులోకి పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మాత్రం కంప్యూటర్‌ ఉండాల్సిందే. దీని ధర రూ.18,830.
కూల్‌-ఇఆర్‌
ఇది అనేక పుస్తకాల సమాహారం. అమెజాన్‌ కిండిల్‌, సోనీ రీడర్‌ కన్నా ఇది తక్కువ ధరలోనే లభిస్తుంది. ఇందులో కంట్రోల్‌ బటన్లు చాలా చిన్నవిగా ఉంటాయి. పేజీలను పూర్తిగా తిప్పుకోలేకపోవడం దీనిలో ఉన్న లోపం. కీబోర్డ్‌ సహకారం లేకుండా పుస్తకాల్లోని పేజీలను, పదాలను సెర్చ్‌ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సిందే. స్క్రీన్‌ నాణ్యత కూడా తక్కువ. దీని ధర మాత్రం రూ.14,311.

ఎలోనెక్స్‌ ఇ-రీడర్‌
చాలా స్టైల్‌గా ఉంటుందీ రీడర్‌. షేక్‌స్పియర్‌, డికెన్స్‌, ఆస్టెన్‌ తదితర రచనలు వంద వరకూ ఇందులో ముందుగానే నిక్షిప్తం చేయబడి ఉంటాయి. స్క్రీన్‌ కూడా అందంగా, చదవడానికి సౌకర్యంగా ఉంటుంది. అయితే ఎక్కువ రిజల్యూషన్‌ కలిగిన చిత్రాలు అంత నాణ్యంగా కనిపించకపోవడం
ఇందులోఉన్న లోపం. తక్కువ సమయంలో ఆన్‌ కావడం, బోలెడన్ని ఎంపి3 పాటలను స్టోర్‌ చేసుకోగల సామర్ధ్యం దీని అదనపు ఆకర్షణలు. దీని ధర రూ.12,802.

యాపిల్‌ ఐపాడ్‌ టచ్‌
ఇది మినీ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. వేలకొద్దీ అప్లికేషన్‌లను ఇందులో ఉపయోగించవచ్చు. 3.5 అంగుళాల కలర్‌ టచ్‌స్క్రీన్‌ దీని ప్రత్యేకత. ఇ-బుక్‌లను బ్రౌజ్‌ చేసుకోవడంతోపాటు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంపి3, వీడియో సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే స్క్రీన్‌ చిన్నగా ఉండడం ఇందులో ప్రధాన లోపం. దీని ధర రూ.11,221.

ఈ ఐదు ఇ-బుక్‌ రీడర్లలో యాపిల్‌ ఐపాడ్‌ టచ్‌ను మినహాయిస్తే మిగతావాటన్నింటిలో ఆరు అంగుళాల మోనోక్రోమ్‌ ఇ-ఇంక్‌ డిస్‌ప్లే ఉంది. సాధారణ ఎల్‌సిడి స్క్రీన్‌ కంటే ఇందులో చదవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
---------------------------------------------------------

HTC Touch2 వచ్చేసింది!



ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న HTC Touch2 మొబైల్‌ ఫోన్‌ భారత మార్కెట్‌లోకి రానే వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 6.5 అప్లికేషన్‌తో భారత దేశంలో విడుదలైన మొట్టమొదటి GSM ఫోన్‌ ఇది.

ఈ విండోస్‌ 6.5 అప్లికేషన్‌లో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మొబైల్‌ విత్‌ ఫ్లాష్‌ సపోర్ట్‌, మై ఫోన్‌ బ్యాకప్‌ సర్వీస్‌, మైక్రోసాఫ్ట్‌ ఎక్స్ఛేంజ్‌ సపోర్ట్‌, విండోస్‌ మార్కెట్‌ప్లేస్‌ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. 256 ఎంబి ర్యామ్‌, 512 ఎంబి రామ్‌ కలిగిన ఈ మొబైల్‌ 2.8 అంగుళాల థిన్‌ ఫిల్మ్‌ ట్రాన్సిస్టర్‌ లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే (TFT LCD) కలిగి ఉంటుంది. ఇందులో 3.2 మెగాపిక్సెల్‌ కెమెరా సాయంతో నాణ్యమైన చిత్రాలను తీసుకోవచ్చు. అంతేకాదు, మరో ప్రత్యేక ఫీచర్‌ ఇంటర్నల్‌ జిపిఎస్‌ ఏంటెన్నా మీరు ఫొటో తీసిన ప్రాంతాన్ని గుర్తిస్తుంది. బ్లూటూత్‌ 2.1, వైఫై, థర్డ్‌ జనరేషన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని 1100 mAh బ్యాటరీతో 2G పరిజ్ఞానం కలిగిన ఫోన్లతో ఏడున్నర గంటలపాటు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. అలాగే 3G పరిజ్ఞానం కలిగిన ఫోన్లతో అయితే ఆరు గంటలపాటు మాట్లాడుకోవచ్చు. కంప్యూటర్లలో ఉన్నట్లుగానే HTC Touch2 మొబైల్‌లో పాకెట్‌ ఆఫీస్‌ ఉంటుంది. దీని ద్వారా వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, ఒన్‌ నోట్‌, పిడిఎఫ్‌ వంటి అప్లికేషన్‌లు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌ అధీకృత సరఫరాదారు రిలయన్స్‌ మాత్రమే. అంటే కేవలం రిలయన్స్‌ మొబైల్‌ వారి వద్ద మాతమ్రే లభిస్తుందన్నమాట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ HTC Touch2 వ్యాట్‌ పెరిగిన కారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో రూ.24,490కు, మిగిలిన రాష్ట్రాలలో రూ.22,490కు లభిస్తుంది.

Wednesday 14 October 2009

భూగోళం భవిష్యత్తు..'350' గుప్పెట్లో!


వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం.. వర్షాకాలంలో వర్షాలు పడకపోవడం.. నదులు ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లను ముంచేయడం.. ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరగడం.. అక్కడి జంతుజాలం అంతరించిపోవడం.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలుసా? ఈ మార్పులన్నింటికీ కారణం వాతావరణ కాలుష్యమే. అవును, వాతావరణంలోకి నిరంతరాయంగా వెలువడుతున గ్రీన్‌హౌస్‌ వాయువుల కారణంగా భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ గ్రీన్‌ హౌస్‌ వాయువులలో కార్బన్‌డయాక్సైడ్‌ కూడా ఒకటి. వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ 350 పిపిఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉన్నంత వరకే మనం ఈ భూమిపై సురక్షితంగా జీవించగలం. కానీ ఇప్పుడు ఈ కార్బన్‌డయాక్సైడ్‌ 387 పిపిఎంకు చేరుకుంది. అంటే.. మనం నివసిస్తున్న ఈ భూగోళం పెను ప్రమాదంలో పడిందన్నమాట!
ఎందుకిలా?
వాతావరణంలో మార్పులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలంటే దానికంటే ముందు అసలు గ్రీన్‌హౌస్‌ వాయువులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. నీటి ఆవిరి, కార్బన్‌డయాక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, ఓజోన్‌, హైడ్రోఫ్లోరోకార్బన్స్‌, పర్‌ఫ్లూరోకార్బన్స్‌, సల్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌ తదితరాలను గ్రీన్‌హౌస్‌ వాయువులుగా పిలుస్తారు. వీటిలో కొన్ని వాయువులు సహజసిద్ధంగా గాలిలో కలుస్తుండగా, మరికొన్ని వాయువులు మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. చెత్తాచెదారం, వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలు, కలపతోపాటు చమురు, సహజ వాయువు, బొగ్గులను మండించడం వల్ల వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ మీథేన్‌ తదితర వాయువులు విడుదల అవుతున్నాయి.
గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ అంటే..
ఈ గ్రీన్‌ హౌస్‌ వాయువులు వాతావరణంలోని వేడిని గ్రహించడాన్ని 'గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌'గా వ్యవహరిస్తారు. అయితే ఈ వేడిని గ్రహించడంలో అన్ని వాయువుల సామర్థ్యం ఒకేలా ఉండదు. ఉదాహరణకు.. హైడ్రోఫ్లోరోకార్బన్స్‌, పర్‌ఫ్లూరోకార్బన్స్‌కు వాతావరణంలోని వేడిని గ్రహించే సామర్థ్యం అధికంగా ఉంటుంది. అయితే వాతావరణంలోకి సహజసిద్ధంగా వెలువడే వాయువులు అలా కాదు. కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు కంటే 270 రెట్లు అధికంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు వాతావరణంలోని వేడిని గ్రహిస్తుంది. అలాగే మీథేన్‌ వాయువు 21 రెట్లు అధికంగా వేడిని గ్రహిస్తుంది. విషాదం ఏమిటంటే.. వాతావరణంలో వేడిని గ్రహించే సామర్థ్యం అంతగా లేని కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు అధికంగా వాతావరణంలోకి చేరుతుండడం. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ 350 పిపిఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉన్నంత వరకే ఫర్వాలేదు. కానీ ఇప్పుడు దీని శాతం 387 పిపిఎంకు
చేరుకుంది.
అప్పుడేం జరుగుతుంది?
వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ పరిమాణం విపరీతంగా పెరిగిపోవడం వల్ల మొత్తం పర్యావరణం దెబ్బతింటుంది. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా ఇంకా పెరుగుతుంది. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు, వరదలు, కరువులు అధికమవుతాయి. కొత్త కొత్త బ్యాక్టీరియా, వైరస్‌లు పుట్టుకొస్తాయి. కొత్తకొత్త వ్యాధులు ప్రబలుతాయి. ఫలితంగా విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవిస్తుంది. భవిష్యత్తు తరాల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
ఇప్పుడేం చేయాలి?
ఈ భూమిపై నివసిస్తున్న ప్రతి మనిషి ముందున్న ప్రశ్న ఇది. దీనికి జవాబు ఒక్కటే. మళ్లీ వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ను వీలైనంత త్వరగా 350 పిపిఎం(పార్ట్స్‌ పర్‌ మిలియన్‌)కు తీసుకురావాలి. భవిష్యత్తులో అంతకంటే పెరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ దిశగా అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలలో ఆయా దేశాలు వేటికవే పలు రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా ఫలితం కానరావడం లేదు. దీంతో పర్యావరణ పరిరక్షణ కోసం కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధానం రూపొందించి దాన్ని అమలు చేసేందుకు వచ్చే డిసెంబర్‌లో ప్రపంచ దేశాల నాయకులు, మేధావులు కోపెన్‌హాగన్‌, డెన్మార్క్‌లలో సమావేశం కాబోతున్నారు. డిసెంబర్‌ 7 నుంచి 18 వరకు యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ ఆధ్వర్యంలో 15వ సదస్సు నిర్వహించనున్నారు. 2013-2020 మధ్య కాలానికి సంబంధించి కొత్త విధానానికి రూపకల్పన చేయడం, వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు విడుదల నుంచి భూగోళాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా దేశాల అధినేతలు, రాజకీయ నాయకులపై అవసరమైన ఒత్తిడి తీసుకురావడం వీరి ఉమ్మడి లక్ష్యం.

24న ఏం జరగబోతోంది?
ఈ నెల 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలలో 'గ్లోబల్‌ యాక్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌' పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మన దేశంలో ఈ బాధ్యతను ఇండియన్‌ యూత్‌ క్లైమేట్‌ నెట్‌వర్క్‌ (ఐవైసిఎన్‌) తన భుజస్కందాలపై వేసుకుంది. మన రాష్ట్రంలో ఈ సంస్థకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎపి చాప్టర్‌ వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ సురక్షిత స్థాయులకు గుర్తు అయిన '350'ని ఫోకస్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ప్రతి ఒక్కరి దృష్టి ఈ 350పైన పడేట్లు చేయాలని నిశ్చయించుకుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో చార్మినార్‌, బుద్ధ విగ్రహం, ఐమ్యాక్స్‌ థియేటర్‌, గోల్కొండ తదితర ప్రాంతాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నాలుగైదు రకాల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఇండియన్‌ యూత్‌ క్లైమేట్‌ నెట్‌వర్క్‌ (ఐవైసిఎన్‌) జాతీయ సమన్వయకర్త చైతన్య, ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ప్రాంతీయ సమన్వయకర్త ఎం.రంగప్రసాద్‌లు పేర్కొన్నారు. ఇందుకోసం తాము తొమ్మిదంచెల ప్రణాళికను రూపొందించామని, ప్రజలందరి దృష్టి 350 మీద పడేలా చేయడం, కార్బన్‌డయాక్సైడ్‌ కారణంగా వాతావరణంలో కలుగుతున్న మార్పుల పట్ల వారిని చైతన్యవంతులను చేయడం, భూగోళాన్ని కాపాడుకోవడంలో ఎవరికి వారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించేలా చేయడం అందులోని కొన్ని అంశాలని వారు వివరించారు. ఈ పర్యావరణ ఉద్యమానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు తమ వెబ్‌సైట్‌ www.ap350.orgను చూడవచ్చని, లేదంటే గూగుల్‌, యూట్యూబ్‌లలో 350 అని టైప్‌ చేస్తే చాలని చైతన్య, రంగప్రసాద్‌లు తెలిపారు.

ఇంతకీ అక్కడ నీరు ఉందా?


ఎన్నో విమర్శలు వెల్లువెత్తినప్పటికీ వాటన్నింటినీ పెడచెవిన పెట్టి ఈ నెల 9న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన ఎల్‌క్రాస్‌ రాకెట్‌తో చంద్రుని ఢీకొట్టించింది. అయితే ఈ ప్రయోగం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లభించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఈ ప్రయోగంలో రెండువేల రెండు వందల టన్నులు బరువున్న ఒక రాకెట్‌ను గంటకు తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి చంద్రుని దక్షిణ «ద్రువ ప్రాంతాన్ని ఢీకొట్టించారు. ఇంతవేగంతో ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా ఎగిసిపడే చంద్రధూళిని పరిశోధించి అందులో ఏమైనా మంచు
అవశేషాలు ఉన్నాయేమో గర్తించడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రయోగానికి ముందు రాకెట్‌ చంద్రుని ఢీకొట్టేటప్పుడు ఎగసిపడే చంద్రధూళిని భూమిపై నుంచి కూడా వీక్షించవచ్చని నాసా ప్రకటించడమే కాకుండా, ఈ ఢీకొట్టే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేస్తున్నామని ఎంతో గొప్పగా ప్రకటించింది. దీంతో ప్రపంచం మొత్తం ఈ ప్రయోగం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ వారందరికీ తీవ్ర నిరాశే మిగిలింది. ఎందుకంటే టెలీస్కోపులో తలదూర్చి రాకెట్‌ ఎప్పుడు చంద్రుని ఢీకొంటుందా అని ఆసక్తిగా చూసినవారికి ఏమీ కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో ఉపగ్రహం చంద్రుని ఢీకొట్టడంగానీ, ధూళి గానీ కనిపించలేదు.

రకరకాల విశ్లేషణలు
నిజానికి దీనికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతామని నాసా ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన విధంగా ఎల్‌క్రాస్‌ ఉపగ్రహం చంద్రుని ఢీకొట్టినప్పుడు ఊహించిన విధంగా చంద్రధూళి కనిపించకపోవడానికి కారణమేమై ఉంటుందన్న విషయాన్ని గురించి నాసాలోని కొంతమంది శాస్త్రవేత్తలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై వెలుతురు తక్కువగా ఉండడం వల్ల బహాశా ఈ ధూళి కనిపించి ఉండకపోవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే నాసాకు సంబంధించినంతవరకు ఈ చిత్రలు ముఖ్యమైనవేమీ కావని, ఢీకొట్టే సమయంలో ఎగసిపడిన ధూళిలో ఏమేం పదార్థాలు ఉన్నాయ్నదే ముఖ్యమని నాసా అంటోంది.

ప్రయోగం ఫ్లాప్‌ అయిందా..
'నేషనల్‌ జియోగ్రాఫిక్‌ న్యూస్‌' మాత్రం ఈ ప్రయోగం ఒక ఫ్లాప్‌ అని అంటోంది. నాసా టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసిన దాంట్లోగానీ, టెలీస్కోపుల సహాయంతో వీక్షించిన వారికీ దుమ్ము గానీ, అందులో ఉంటుందననుకున్న మంచుగానీ కనిపించలేదని కనిపించలేదు. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశ ం ఏదో అదే కచ్చితంగా నిర్థారణ కాలేద ని, కాబట్టి ఈ ప్రయోగం విజయవంతం అయిందని ఎలా చెప్పగలమని వాదిస్తోంది. మరోవైపు "ఈ ప్రయోగం ఫలితం తప్పకుండా ఉంటుంది. మేం క్రేటర్‌నూ చూశాం, దాని ప్రభావాన్నీ చూశాం'' అని ఎల్‌క్రాస్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ఆంథోని కొలాప్రేట్‌ అన్నారు. ఇంకోవైపు "ఈ ప్రయోగం ద్వారా మేం ఏం చూశాం అనేదాన్ని చెప్పడం కాస్త కష్టమైన పనే'' అని నాసా రీసెర్చ్‌సెంటర్‌ శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు.

అది మంచు కావచ్చు..
రాకెట్‌ చంద్రని ఢీకొట్టినపుపడు ఎగసిపడిన ధూళిలో కొన్ని తెల్లటి కణాలు కనిపించాయిని, బహుశా అది మంచు అయే ఉంటుందని, కాకపోతే దానిని నిర్థారించేముందు ఎల్‌క్రాస్‌ పంపిన చిత్రాలను విశ్లేషించాల్సి ఉంటుందని నాసా అంటోంది. నాసా వ్యాఖ్యలు ఈ విధంగా ఉండగా 'ఉతా'లోని 'సాల్ట్‌లేక్‌ ఆస్ట్రానామికల్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ వాదన మాత్రం మరోలా ఉంది. "మా దగ్గర 32 అంగుళాల వెడల్పైన టెలీస్కోపులు ఉన్నాయి. కళ్లు కాయలుకాసేలా చూసినా కూడా అందులోంచి ఏమీ కనిపించలేదు'' అనడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.
అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్న సందేహాలన్నింటినీ త్వరలోనే నాసా తీరుస్తుందని, వాస్తవాలను బయటపెడుతుందని ఆశిద్దాం.

కార్బన్‌ కొత్త ఫోన్లు K460, K560


బెంగళూరుకు సంబంధించిన యునైటెడ్‌ టెలీ లింక్స్‌, జైన గ్రూప్‌లకు చెందిన కార్బన్‌ మొబైల్‌ సంస్థ కొత్తగా రెండు మొబైల్‌ఫోన్లను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి పేరు K 460, K560.

వీటిలో ఓ460 డ్యూయల్‌ సిమ్‌(జిఎస్‌ఎం) స్లయిడర్‌ ఫోన్‌. ఎఫ్‌ఎం రేడియో, ఎఫ్‌ఎం రికార్డింగ్‌, ఎంపి3 ప్లేయర్‌, వీడియో ప్లేయర్‌, బ్లూటూత్‌, డిజిటల్‌ కెమెరా, వాప్‌, జిపిఆర్‌ఎస్‌, ఎంఎంఎస్‌ తదితర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ మెమరీని 8 జిబి వరకు పెంచుకోవచ్చు. 300 గంటల స్టాండ్‌బై టైమ్‌ దీనికొక అదనపు ఆకర్షణ. దీని ధర రూ.4,000.

ఇక ఓ560 విషయానికొస్తే.. ఇది 2.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే సదుపాయం కలిగిన డ్యూయల్‌ సిమ్‌(జిఎస్‌ఎం) మొబైల్‌ ఫోన్‌. ఓ460 లాగే ఇందులో కూడా ఎఫ్‌ఎం రేడియో, ఎఫ్‌ఎం రికార్డింగ్‌, ఎంపి3 ప్లేయర్‌, వీడియో ప్లేయర్‌, 2 మెగా పిక్సెల్‌ కెమెరా, ఎ2డిపి బ్లూటూత్‌, వాయిస్‌ ఛేంజర్‌, జిపిఆర్‌ఎస్‌, వాప్‌, ఎంఎంఎస్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ఎంపి3 ప్లేయర్‌లో ఉండే పర్సనల్‌ డిస్క్‌ ఇంటర్‌ఫేస్‌, ఉల్ఫ్‌సన్‌
కోడెక్‌ల ద్వారా అద్భుతమైన ఆడియో అనుభవం మీ సొంతమవుతుంది. ఈ ఫోన్‌ ధర రూ.5,000.

ఎప్సన్‌ నుంచి స్టయిలస్‌ ఆఫీస్‌ ఇంక్‌జెట్‌ ప్రింటర్‌


ప్రింటర్ల తయారీలో పేరొందిన ఎప్సన్‌ తన ఆఫీస్‌ ఇంక్‌ జెట్‌ ప్రింటర్ల శ్రేణికి కొత్తగా మరో ప్రింటర్‌ను జత చేసింది. దీనిపేరు స్టయిలస్‌ ఆఫీస్‌ టి1100 ఎ3+.

నాణ్యత కలిగిన ప్రింటింగ్‌ కోసం ఇందులో డ్యూరాబ్రైట్‌, మైక్రో పీజో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. డ్యూరాబ్రైట్‌ అల్ట్రా ఇంక్‌లో రెజిన్‌ కలిసి ఉంటుంది. కాగితంపై పడిన వెంటనే ఆరిపోయే గుణం ఈ ఇంక్‌కు ఉంటుంది. అందువల్ల ఈ ప్రింంటర్‌ నుంచి తీసిన చిత్రాలపై పొరపాటున నీళ్లు పడినా ఏం కాదు. ఎన్నేళ్లు గడిచినా ఫేడ్‌ అవడం అనేది ఉండదు. పైగా వేర్వేరు ఇంక్‌లకు వేర్వేరు కాట్రిడ్జెస్‌ ఉండడం వల్ల ఏ ఇంక్‌ అయిపోతే దాన్ని రీఫిల్‌ చేసుకునే వీలుంది.

ఇక మైక్రో పీజో సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా.. ప్రింటింగ్‌ సమయంలో ప్రింట్‌ హెడ్‌ గుండా ఇంక్‌ వివిధ రకాల పరిమాణాలలో ప్రవహిస్తుంది. దీనివల్ల 5760X1440 పిక్సెల్‌ రిజల్యూషన్‌ కలిగిన స్పష్టమైన, నాణ్యమైన ప్రింట్లు పొందవచ్చు. ఎనర్జీ స్టార్‌ ప్రమాణాలు కలిగిన ఈ ప్రింటర్‌ నిమిషానికి కేవలం 26 వాట్స్‌ విద్యుత్తును మాత్రమే ఉపయోగించుకుంటూ ఎ4 పరిమాణం కలిగిన 17 కలర్‌, 30 బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్రింట్లను ఇవ్వగలదు. డ్యూరాబ్రైట్‌, మైక్రో పీజో సాంకేతిక పరిజ్ఞానాలను రెండింటినీ ఏక కాలంలో ఉపయోగిచడం వల్ల ఈ ఎప్సన్‌ స్టయిలస్‌ ఆఫీస్‌ టి1100 ఎ3+ ఇంక్‌ జెట్‌ ప్రింటర్‌ ద్వారా అద్భుతమైన, స్పష్టమైన చిత్రాలను పొందవచ్చు.
దీని ధర రూ.14,999.

క్రియేటివ్‌ పోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌


పోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌లకు భారత మార్కెట్లో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. కొత్తగా ఎన్ని మోడల్స్‌ విడుదలవుతున్నా వినియోగదారులు ఆదరిస్తూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రియేటివ్‌ కంపెనీ కొత్త పోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌ను లాంఛనంగా విడుదల చేసింది. దీని పేరు Zen X-Fi2.

ఐపాడ్‌ కొనుగోలు చేసే స్థోమత లేని వారు ఈ టచ్‌స్క్రీన్‌ పోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌ను కొనుక్కోవచ్చు. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు సులభంగా ఆపరేట్‌ చేసే సౌలభ్యం దీని ప్రత్యేకత. మ్యూజిక్‌, ఫొటో, వీడియో ఆప్షన్లను ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది బాగా నచ్చుతుంది. గతంలో విడుదలైనపోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌ కంటే ఇది మరింత స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో ప్రాధాన్యాన్ని బట్టి మెనూ ఐకాన్స్‌ను అమర్చుకునే సౌలభ్యం ఉంది. వాయిస్‌ రికార్డింగ్‌ కోసం మైక్రోఫోన్‌ సౌకర్యం కూడా ఉంది. మ్యూజిక్‌ను ఇష్టపడే వారి కోసం ఉ్క 630 ఇయర్‌ ఫోన్స్‌ మరో ఆకర్షణ . క్రిస్టల్‌ క్లియర్‌ డిజిటల్‌ సౌండ్‌తో మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ మోడల్‌లో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే...
బరువు: 75 గ్రాములు
స్క్రీన్‌: 3 అంగుళాల TFTటచ్‌ స్క్రీన్‌ LCD
అడియో ఫార్మాట్‌:MP3, WMA(DRM9), AAC, FLAC, AUDIBLE4
వీడియో ఫార్మాట్‌: WMV9, MPEG4-SP, DIVX, XVID
ఫొటో ఫార్మాట్‌: JPEG, BMP
ఎక్స్‌పాన్షన్‌ స్లాట్‌: మైక్రో ఎస్‌డీ మెమొరీ కార్డ్‌ స్లాట్‌
వీడియో అడియో అవుట్‌: ్PAL OR NTSC ఇన్‌ స్టీరియో
ధర : 8జిబి-రూ.7,000, 16 జిబి-రూ.9,500, 32 జిబి ధర : రూ.12,000

Saturday 10 October 2009

టేబుల్‌ కాదు... కంప్యూటరే!

ఫోటోలో కనిపిస్తున్నదేంటో గుర్తుపట్టగలరా? కాసేపు ఆలోచించండి.. అయినా కనుక్కోలేకపోతున్నారు కదూ!  క్యారమ్స్‌ టేబుల్‌లా అనిపిస్తున్నప్పటికీ అది నిజానికి టేబుల్‌ కానేకాదు.. ఓ కంప్యూటర్‌. ఏంటలా చూస్తున్నారు? అది నిజంగా కంప్యూటరే. దీనిని 'మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌'గా వ్యవహరిస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురైదుగురు యూజర్లు ఏకకాలంలో దీనిని ఆపరేట్‌ చేయగలగడం దీని ప్రత్యేకత.  



సాధారణంగా ఇప్పుడున్న డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లను ఒక్కరే ఉపయోగించగలుగుతారు. కానీ ఒకేసారి ఏకకాలంలో నలుగురైదుగురు ఉపయోగించే వీలున్న ఈ కంప్యూటర్‌ ముందుముందు అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. దీనిలో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దీనికి మరో ప్లస్‌ పాయింట్‌. నేటి ఆధునిక యుగపు అద్భుతంగా పేర్కొనదగిన ఈ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్‌ ఇన్‌కార్పొరేషన్‌ తయారు చేసింది.  చూపులకు ఏదో గ్లాస్‌ టేబుల్‌లా కనిపించే ఈ కంప్యూటర్‌ పూర్తిగా టచ్‌ స్క్రీన్‌ సదుపాయం కలిగినది.  అంటే ఇక మౌస్‌ క్లిక్‌లు, వేళ్ల నొప్పులు ఉండవన్న మాట. అంతేకాదు గది ఉష్ణోగ్రతతోపాటు దీనిపై పెట్టిన వస్తువులను కూడా ఇది ఇట్టే గ్రహిస్తుంది. 


మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ అంటే..
ఇదొక మల్టీ టచ్‌ కంప్యూటర్‌. దీనికి మౌస్‌తో పనిలేదు. కేవలం చేతివేళ్ల స్పర్శ ద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు.అంటే పూర్తి టచ్‌ స్క్రీన్‌ అన్నమాట. ఏకకాలంలో నాలుగురైదుగురు యూజర్లు దీనిని ఉపయోగించవచ్చు. 


సాధారణ వినియోగదారుల కోసం 
మనకు కావలసిన సమాచారాన్ని చిన్నపాటి స్పర్శల ద్వారా పొందవచ్చు. అలాగే టచ్‌స్క్రీన్‌పైన సమాచారాన్ని ఒక చోట నుంచి మరోచోటకు కదిలించవచ్చు. అంటే కంప్యూటర్‌ స్క్రీన్‌పై దేనినైనా వేలుతో మీ వైపుకు లాగితే అది మీరు కూర్చున్న చోటికి వచ్చేస్తుంది.  అలాగే సమాచార బదిలీ కూడా.  రెండు మొబైల్‌ ఫోన్ల మధ్య ఎలాగైతే సమాచారాన్ని బదిలీ చేయవచ్చో.. అదే మాదిరిగా ఈ సర్ఫేస్‌పైన ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను ఉంచి అందులోని సమాచారాన్ని కంప్యూటర్‌లోకి, కంప్యూటర్‌లోని సమాచారాన్ని ఆ డివైజ్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. 


వ్యాపార లావాలదేవీల కోసం
కమ్యూనికేషన్స్‌ని వృద్ధి చేసుకునేందుకు ఈ 'సర్ఫేస్‌' ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. సమాచారాన్ని, వారి సేవలను వారి వారి క స్టమర్లకు చాలా సులభ ంగా అందించే వీలుకలుగుతుంది. ఒకేసారి ఎంతోమంది కలిసి పని చేసే వీలుండడం ఒక సరికొత్త అనుభూతిగా మిగులుతుంది. దీనివల్ల ఒకరికొకరు తమ తమ సమాచారాన్ని సులువుగా పంచుకోవచ్చు. 



ఎలా పనిచేస్తుంది?
ఇందులోఉండే కెమెరాలు చాలా సులభంగా వివిధ రకాలైన వస్తువులను, ఆకృతులను గుర్తిస్తాయి. అంటే.. ఇన్‌పుట్‌  ద్వారా గ్రహించిన సమాచారాన్ని కంప్యూటర్‌ ప్రాసెస్‌ చేసి  మనకు కావలసిన సమాచారాన్ని ఔట్‌పుట్‌ ద్వారా అందిస్తుంది.


దీని ప్రత్యేకతలు ఏమిటంటే...
మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌లో ప్రధానంగా నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి.  ఇవి సాధారణ డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించిన వారికి సరికొత్త అనుభవాన్ని, అనుభూతిని ఇస్తాయి.  అవేమిటంటే..


డైరెక్ట్‌ ఇంటరాక్షన్‌:  మౌస్‌ క్లిక్‌లకు స్వస్తి పలికి యూజర్స్‌ తమకు కావలసిన సమాచారాన్ని కేవలం సున్నితమైన స్పర్శల ద్వారా పొందవచ్చు. 
మల్టీ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌:  దీనికున్న 30 అంగుళాల పొడవైన స్క్రీన్‌ వల్ల ఒకేసారి దీనిచుట్టూ అనేకమంది కూర్చుని పనిచేసుకోచ్చు. దీంతో అందరూ ఒకేసారి ముఖాముఖిగా పనిచేసుకునే అనుభవం ప్రతీ ఒక్కరికీ సొంతమవుతుంది.
మల్టీటచ్‌:  అనేక స్పర్శలకు ఒకేసారి ఏకకాలంలో ప్రతిస్పందించడం దీనికున్న మరో ప్రత్యేకత. 
ఆబ్టెక్ట్‌ రికగ్నైజేషన్‌:  ఈ మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌పై ఏదైనా ఒక వస్తువుని ఉంచితే అది వెంటనే దానిని గుర్తించి దానితో అనుసంధానమవుతుంది. అలాగే ఇందులోని సమాచారాన్ని మొబైల్స్‌, ఎంపి3, ఎంపి4 ప్లేయర్లు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరాలు తదితర ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లలోకి బదిలీ చేసుకునే సదుపాయం ఉంది. 
ఇన్ని సదుపాయాలు కలిగిన ఈ మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ను 2007లోనే మైక్రోసాఫ్ట్‌ ఉపయోగంలోకి తీసుకొచ్చినా మన దేశంలో దీనికి తగినంత ప్రాచుర్యం లభించకపోవడానికి ఒక కారణం.. దీని ధర అయితే, మరో కారణం.. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు లభించే దుకాణాలలో లభ్యం కాకపోవడం.  ప్రపంచం మొత్తంమ్మీద  కేవలం కొన్ని దేశాలలో మాత్రమే ఈ మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ లభిస్తుంది.. అదీ ముందస్తు అర్డర్‌పైనే.  మరిన్ని వివరాలకు www.microsoft.com/surface/Pages/Product/WhatIs.aspx ను చూడండి.

'వైర్‌లెస్‌ కరెంట్‌' వచ్చేస్తోంది!

ఇప్పటి వరకు విద్యుత్తు ఒకచోట నుంచి మరొకచోటకు సరఫరా అవాలంటే వైరు తప్పనిసరి.  కానీ భవిష్యత్తులో ఏ వైరు లేకుండానే మీ ఇంట్లో లైటు వెలుగుతుంది.. ఫ్యాన్‌ తిరుగుతుంది.. టివి మోగుతుంది.. ఫ్రిజ్‌ పనిచేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.  'వైర్‌లెస్‌ కరెంట్‌' ద్వారా ఇది సాధ్యమవుతుంది.  ఇప్పటికే ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.  తాజాగా సోనీ కంపెనీ ఒక కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచింది.  దీనిపేరు 'ప్రొటోటైప్‌ పవర్‌ సిస్టం'.



మనం ఇప్పటి వరకు 'వైర్‌లెస్‌ డేటా ట్రాన్స్‌ఫరింగ్‌' చూశాం.  అంటే.. ఒక సెల్‌ఫోన్‌ నుంచి మరొక సెల్‌ఫోన్‌లోకి ఎలాంటి వైరు లేకుండానే సమాచార మార్పిడి జరగడం. బ్లూటూత్‌ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలా ఒక ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ నుంచి మరొక ఎలక్ట్రానిక్‌ డివైజ్‌కు సమచారాన్ని బదిలీ చేయడం సర్వసాధారణం అయింది. అయితే ఈ విధానంలో రెండు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు 'వర్కింగ్‌ మోడ్‌'లో ఉండేందుకు వాటికి విద్యుత్తు సరఫరా అనేది తప్పనిసరి.  ఈ విద్యుత్తు..  ఓ వైరు(ఆల్టర్నేట్‌ కరెంట్‌ -  దీనిని అఇగా వ్యవహరిస్తారు) ద్వారా సరఫరా కావచ్చు లేదంటే బ్యాటరీ(డైరెక్ట్‌ కరెంట్‌ - దీనిని ఈఇ అంటారు) ద్వారా అయినా సరఫరా కావచ్చు. పద్ధతి ఏదైనా సరే.. విద్యుత్తు సరఫరా జరగకుండా ఆ రెండు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు వర్కింగ్‌ మోడ్‌లోకి రావు.  వర్కింగ్‌ మోడ్‌లో లేకుండా సమాచార మార్పిడి అనేది సాధ్యం కాదు.  
ఇదే బ్లూటూత్‌ పరిజ్ఞానాన్ని విద్యుత్తు సరఫరాలో కూడా ఉపయోగిస్తే? అంటే.. టివి వైరు ప్లగ్‌లో పెట్టనక్కర్లేదు, కానీ టివి పనిచేస్తుంది.  అలాగే ఫ్రిజ్‌ వైర్‌ ప్లగ్‌లో పెట్టనక్కర్లేదు, అయినా ఫ్రిజ్‌ పనిచేస్తుంది.  ఇలా ఏ విద్యుత్తు ఉపకరణానికి వైరు ద్వారా విద్యుత్తు సరఫరా అవకుండానే అవి పనిచేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.  అలాగే ఇంట్లోని అన్ని గదుల్లో  ట్యూబ్‌లైట్లు, బల్బ్‌లు ఉంటాయి కానీ.. ఇంటికి ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అనేది చేయనక్కర్లేదు.  అయినా అన్ని గదుల్లో ట్యూబ్‌లైట్లు, బల్బ్‌లు వెలుగుతాయి.  ఇది సాధ్యమేనా అన్న అనుమానం మీకు అక్కర్లేదు.  ఎందుకంటే రాబోయే రోజుల్లో  ఈ అసాధ్యం అనుకుంటున్నది కాస్తా సుసాధ్యంగా మారనుంది. ఇప్పటికే  సోనీ కంపెనీ ఓ కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీని పేరు 'ప్రొటోటైప్‌ పవర్‌ సిస్టం'.
ఏమిటీ పరిజ్ఞానం?
ఈ పరిజ్ఞానం సహాయంతో ఎలాంటి వైరు ఉపయోగించకుండా గాలి ద్వారా విద్యుత్తును సరఫరా చేయవచ్చు. సోనీ కంపెనీ ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యుత్తును సరఫరా చేసి 22 అంగుళాల ఎల్‌సిడి టెలివిజన్‌ను 'వర్కింగ్‌ మోడ్‌'లోకి వచ్చేలా చేసింది.  అంటే.. 'ఆన్‌' అయ్యేలా చేసిందన్నమాట.  దీనికోసం 50 సెంటీమీటర్ల దూరం నుంచి 100 ఓల్టుల సంప్రదాయిక విద్యుత్తును ఆ టెలివిజన్‌కు సరఫరా చేసింది.  దీనికి కారణం మాగ్నటిక్‌ రెజోనెన్స్‌(అయస్కాంత అనునాదం).  ఇందుకోసం ముందుగా నలభై సెంటీమీటర్ల పొడవైన వైరును చతురస్రం ఆకారంలో అమర్చుతారు. దీనిని ప్రైమరీ కాయిల్‌ అంటారు. ఇప్పుడు ఈ వైరుగుండా విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా ఒక విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తారు. ఈ క్షేత్రంలోకి మరో వైరు(సెకెండరీ కాయిల్‌)ను తీసుకొచ్చినప్పుడు అందులోని విద్యుత్తు ఆ సెకెండరీ కాయిల్‌కు సరఫరా అవుతుంది. అయితే ఈ విధంనంలో  ప్రైమరీ, సెకెండరీ కాయిల్స్‌ రెండూ ఒకదానికి ఒకటి అభిముఖంగా ఉండాల్సిన అవసరమేం లేదు.  కాకపోతే వాటి రెజోనెన్స్‌ ఫ్రీక్వెన్సీ (అనునాద పౌనఃపున్యం) మాత్రం ఒకే స్థాయిలో ఉండాల్సి ఉంటుంది.  అంటే ఈ ఆయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఎలక్ట్రిక్‌ లేదా ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను ఉంచినప్పుడు ఆటోమేటిక్‌గా అది విద్యుత్తును గ్రహించి పనిచేయడం ప్రారంభిస్తుందన్నమాట.  ఈ విధానంలో సదరు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ఏదైనా లోహంతో తయారైనప్పటికీ అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక్క విద్యుత్తును మాత్రమే తీసుకుంటుంది తప్ప లోహంతో తయారైన దాని బాడీ ఏ మాత్రం వేడెక్కదు.  
మరిన్ని ప్రయోగాలు అవసరం..
అయితే సోనీ కంపెనీ అభివృద్ధి పరిచిన 'ప్రొటోటైప్‌ పవర్‌ సిస్టం'లో కొన్ని లోపాలు లేకపోలేదు. నూటికి నూరు శాతం కాకుండా ఎనభై శాతం సామర్థ్యం మాత్రమే ఈ పరిజ్ఞానానికి ఉంది. ఎందుకంటే విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడిన తరువాత అందులో అయిదో వంతు విద్యుత్తు వృథా అయిపోతోంది. మరికొంత ప్రైమరీ, సెకెండరీ కాయిల్స్‌ మధ్యన ఏర్పడే బంధంలో వృథా అవుతోంది.  దీంతో ఓరిజినల్‌గా ఎనభై శాతం విద్యుత్తు తయారైనా అందులో పదిహేను శాతం వరకు విద్యుత్తు వృథా అవుతోందన్నమాట.  అలాగే ప్రస్తుతం ఏదైనా ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరం విద్యుదయస్కాంత క్షేత్రానికి 50 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే దానికి విద్యుత్తు సరఫరా జరుగుతోంది.  ఈ దూరం పెరిగితే ఆగిపోతోంది.  అయితే సోనీ కంపెనీ ఈ దూరాన్ని మరింత పెంచేందుకు అవసరమైన పాసివ్‌ రిలే యూనిట్స్‌ను రూపొందించింది.  ఈ పాసివ్‌ రిలే యూనిట్‌ను ప్రైమరీ, సెకెండరీ కాయిల్స్‌కు మధ్యన ఉంచినప్పుడు ఈ దూరం 80 సెంటీమీటర్లకు పెరిగింది.  అంటే 80 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ డివైజ్‌కు వైరు లేకుండానే విద్యుత్‌ సరఫరా చేయవచ్చన్నమాట.  

ఎప్సన్‌ హోం ప్రొజెక్టర్స్‌తో మీ ఇల్లు.. సినిమా హాలే!



ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో పేరొందిన ఎప్సన్‌ కంపెనీ తాజాగా రెండు సరికొత్త హోమ్‌ ప్రొజెక్టర్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి పేర్లు.. 'పవర్‌లైట్‌ హోమ్‌ సినిమా 705 హెచ్‌డీ' , 'మూవీమేట్‌ 60'.  ఇంట్లోనే కూర్చుని థియేటర్‌ ఎఫెక్ట్స్‌తో సినిమాలు, ఇతర వీడియోలు చూడాలనుకునే వారికి ఈ ప్రొజెక్టర్స్‌ బాగా పనికొస్తాయి. 



మూవీమేట్‌ 60
మూవీమేట్‌ 60లో.. ప్రొజెక్టర్‌తోపాటు సీడీ/డీవీడీ ప్లేయర్‌, మైక్రోఫోన్‌ ఇన్‌పుట్‌, స్టీరియో స్పీకర్లు ఉంటాయి. ఇన్ని సదుపాయాలు కలిగి ఉండడమే దీని ప్రత్యేకత. సాధారణ 40 అంగుళాల టీవీ స్క్రీన్‌తో పోలిస్తే ఈ ప్రొజెక్టర్‌ సాయంతో దాదాపు ఎనిమిది రెట్లు పెద్దదైన చిత్రాన్ని చూడవచ్చు. చిత్రం అంతగా ఎన్‌లార్జ్‌ అయినప్పటికీ నాణ్యత ఏమాత్రం తగ్గకపోవడం మూవీమేట్‌ 60 ప్రొజెక్టర్‌ గొప్పతనమే. ఇందులో ఉన్న హెచ్‌డీఎమ్‌ఐ సపోర్ట్‌ వల్ల నేరుగా ప్లగ్‌కు పెట్టి పర్సనల్‌ కంప్యూటర్‌, వీడియో కెమెరా, డిజిటల్‌ కెమెరా, ఎమ్‌పీ-3 ప్లేయర్లను దీనికి అనుసంధానించుకోవచ్చు. 16:9 నిష్పత్తితో కూడిన స్క్రీన్‌ ద్వారా ఆరడుగుల దూరం నుంచి 60 అడుగుల చిత్రాన్ని, పన్నెండు అడుగుల దూరం నుంచి 120 అడుగుల చిత్రాన్ని ఇది ప్రొజెక్ట్‌ చేయగలదు. అలాగే మూవీమేట్‌ 60కి సంబంధించిన 5.1 డాల్బీ డిజిటల్‌ డీటీఎస్‌ స్పీకర్లు డాల్బీ డిజిటల్‌ సరౌండ్‌ సౌండ్‌ అందించి మీకు సరికొత్త ఆడియో అనుభవాన్ని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
"ప్రస్తుతం ప్రపంచంలోని చాలామంది ఏ కాస్త సమయం దొరికినా ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా చూస్తున్నా, గేమ్స్‌ ఆడుతున్నా కూడా సరికొత్త అనుభూతిని కోరుకుంటున్నారు. అలాంటి వారికి మేం అందిస్తున్న మూవీమేట్‌ 60 ప్రొజెక్టర్‌ సరికొత్త వినోదం అందించగలదు..''అని ఎప్సన్‌ సంస్థ సీనియర్‌ ప్రొడక్టు మేనేజర్‌ మార్గ్‌ ఏన్‌ వ్యాఖ్యానిస్తున్నారు. "ఈ ప్రొజెక్టర్‌ సాయంతో ఇంట్లోని ఏ గదిలో అయినా మీరు సినిమాలు తిలకించవచ్చు. బయట థియేటర్‌లో చూసిన అనుభూతి మీ సొంతమవుతుంది.. అందుకు మాదీ హామీ..'' అని ఆయన పేర్కొంటున్నారు.  


పవర్‌లైట్‌ హోమ్‌ సినిమా705హెచ్‌డీ  
ఈ ప్రొజెక్టర్‌ 3ఎల్‌సీడీ టెక్నాలజీ కలిగి ఉండడంతో పాటు హై డెఫినిషన్‌ సొల్యూషన్‌ వల్ల సినిమాలు, గేమ్స్‌, టీవీ,  స్పోర్ట్స్‌, వీడియో, మ్యూజిక్‌, యాపిల్‌ ఐపాడ్‌లలోని చిత్రాలను ఎంతో నాణ్యతతో అందిస్తుంది. పట్టపగలు కూడా ఎంతో నాణమైన చిత్రాలను వీక్షించే అవకాశం ఉండడం దీని మరో ప్రత్యేకత. అలాగే యూఎస్‌బి 2.0 సదుపాయం వల్ల ఫోటోలను స్లైడ్‌ షోగా చూసే అవకాశం ఉంది.  మొత్తంమ్మీద ఈ రెండు హోం ప్రొజెక్టర్స్‌తో వీడియో వీక్షణం ఇకమీదట ఓ మధురానుభూతిగా మారుతుందని వీటి తయారీదారులు పేర్కొంటున్నారు. 
ఈ నెలలోనే ఈ రెండు ప్రొజెక్టర్స్‌ మార్కెట్లోకి  రానున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.37,000, రూ.33,704.

పర్యావరణ పరిరక్షణలో 'నోకియా' టాప్‌



పర్యావరణ పరిరక్షణకు సంబంధించి గ్రీన్‌పీస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదిక 'గ్రీన్‌పీస్‌ కార్డ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌'లో నోకియా కంపెనీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో హానికారకాలను వినియోగించకుండా ఉండడం, పర్యావరణ హానికారకాల విడుదలను తగ్గించడం, వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేయడం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని గ్రీన్‌పీస్‌ ఏటా ఈ నివేదికను రూపొందిస్తోంది.  



గత త్రైమాసికంలో సాధించిన స్థానాన్ని నోకియా యథాతథంగా నిలబెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల కేంద్రాలను ఏర్పాటు చేసి వాడి పడేసిన మొబైల్‌ ఫోన్లను నోకియా సేకరిస్తుండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదికలో సామ్‌సంగ్‌ రెండో స్థానంలో నిలిచింది. సోనీ ఎరిక్సన్‌, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌, తోషిబా ఇంతకుముందు కంటే మెరుగైన స్థానాలు సాధించగా యాపిల్‌ కంపెనీ మాత్రం ఆఖరి వరుసలో నిలిచింది. ఈ నివేదిక సోనీఎరిక్సన్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. ఎందుకంటే హానికారక రసాయనాల వినియోగాన్ని తగ్గించడంలో ఆ కంపెనీ తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవని నివేదిక పేర్కొంది. అలాగే డెల్‌, హ్యూలెట్‌ప్యాకార్డ్‌, లెనెవో కంపెనీలు గత నివేదికలో కంటే ఒక్కో పాయింట్‌ను కోల్పోయాయి. ఫ్యూజీ కంపెనీ ఉత్పాదనలు ఏ ఒక్కటీ క్షేమకరం కాదని గ్రీన్‌పీస్‌ ఇంటర్నేషనల్‌ తాజా త్రైమాసిక నివేదిక స్పష్టం చేసింది.


ఆఖరి వరుసలో 'యాపిల్‌'!
అయితే గ్రీన్‌పీస్‌ నివేదిక పట్ల యాపిల్‌, లెనెవో కంపెనీలు సంతృప్తిగా లేవు. వాడి పడేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను తిరిగి సేకరించి శుద్ధి చేయడంలో యాపిల్‌ చర్యలు చాలా కనిష్ట స్థాయిలో ఉన్నాయని నివేదిక పేర్కొన్నప్పటికీ యాపిల్‌ కంపెనీ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. " హానికారక లోహాలైన మెర్క్యురీ, కాడ్మియం, హెక్సావాలెంట్‌ క్రోమియంలను నిషేధించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ మా కంపెనీ ఈ రంగంలో బలమైన స్థానంలోనే ఉంది. అలాగే మా ఉత్పత్తుల శ్రేణిలోంచి క్యాథోడ్‌ రే ట్యూబ్‌ (సిఆర్‌టి) మానిటర్ల వాడకాన్ని పూర్తిగా తొలగించేశాం'' అని యాపిల్‌ కంపెనీ ప్రతినిధి పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నివేదికపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరముందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.