Thursday 25 June 2009

ఐ-టెక్‌ వర్చువల్‌ లేజర్‌ కీ-బోర్డు!


డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు ఉపయోగించే వారికి కీబోర్డులు సుపరిచితమే. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న కీబోర్డు భవిష్యత్తులో ఈ రూపంలో ఉండకపోవచ్చంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇప్పటికే వైర్‌లెస్‌ కీబోర్డులు, మౌస్‌లు ఉపయోగిస్తున్న వారు ఎందరో! రాబోయే తరాలలో సాంకేతిక విజ్ఞానం మరింత ముందంజ వేస్తుందనడానికి ఓ గుర్తు వర్చువల్‌ లేజర్‌ కీ బోర్డు. ఈ తరహా పరిజ్ఞానం ఇప్పటికే అభివృద్ధి చెందింది.

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ కీబోర్డులు భౌతికంగా ఉండేవి, పరిమాణంలో పెద్దవి. వర్చువల్‌ లేజర్‌ కీబోర్డుతో ఈ బాధ లేదు. చిన్న సెల్‌ఫోన్‌ పరిమాణంలో ఉండే దీనికి జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్క
డ కీబోర్డు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సాధారణ కీబోర్డులు చొచ్చుకొచ్చినంతగా ఇవి ఇంకా జనసామాన్యంలోకి రాలేదు. అయితే భవిష్యత్తు అంతా ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డులదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఐ-టెక్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఓ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. చూడడానికి చిన్న సెల్‌ఫోన్‌లా కనిపించే ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డు పరికరాన్ని ఆన్‌ చేయగానే దీని నుంచి కొన్ని లేజర్‌ కాంతి పుంజాలు బయటికొస్తాయి. ఇవి ఎదురుగా ఉన్న ప్రదేశంపై కీబోర్డును ఏర్పాటు చేస్తాయి. అంతేకాదు, మామూలు కీబోర్డుపై టైప్‌ చేసేటప్పుడు వచ్చే చప్పుడు ఈ వర్చువల్‌ కీబోర్డ్‌పై టైప్‌ చేసినప్పుడూ వస్తుంది. దీనివల్ల ఆయా కీలను సరిగా నొక్కామా? లేదా? అన్న సంశయం వినియోగదారులకు ఎంతమాత్రమూ కలగదు. ఎంత చీకట్లో అయినా సరే ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డుపై సులువుగా టైప్‌ చేయవచ్చు. బ్లూటూత్‌ సౌకర్యం కలిగిన ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డును బ్లాక్‌బెర్రీ, స్మార్ట్‌ఫోన్‌, పర్సనల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌, మ్యాక్‌, టాబ్లెట్‌ పీసీలకు సులువుగా అనుసంధానించుకోవచ్చు. కేవలం 80 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ కీబోర్డుకు బిల్టిన్‌ రీచార్జ్‌ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి పూర్తిస్థాయిలో చార్జి చేసుకుంటే ఏకధాటిగా రెండు గంటలసేపు టైప్‌ చేసుకోవచ్చు.

0 comments: