ఇది వర్షాకాలం.  కానీ వానలు లేవు.  నైరుతి రుతుపవనాల రాకతో ఈనెల మొదటి వారం నుంచే వర్షాలు పడాల్సి ఉండగా, ఒకట్రెండు వర్షాలు పడగానే కథ అడ్డం తిరిగింది.  ఈసారి గతంలో కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయని వాతావరణ పరిశోధకులు మే నెలలోనే తీపి కబురు అందించడంతో వర్షం పడకపోయినా పడినంత ఆనందం వ్యక్తం చేశారు అందరూ.  కానీ ఏవీ వర్షాలు? ఇదిగో వస్తున్నాయి.. అదిగో వచ్చేస్తున్నాయంటూ రుతుపవనాల గురించి ఏరోజుకారోజు జోస్యం చెబుతున్నారే తప్ప నిజానికి వర్షాల జాడే లేదు.  ఎందుకని ఈ పరిస్థితి?  కొంపదీసి 'ఎల్-నినో' ప్రభావం కాదు కదా?

చావు కబురు చల్ల గా చెప్పడమంటే ఇదేనేమో.. రుతుపవనాల రాకలో ఆలస్యానికి కారణం 'ఎల్-నినో' ప్రభావం అయి ఉండొచ్చంటూ ప్రపంచ మెటరోలాజికల్ ఆర్గనైజేషన్ తాజాగా అనుమానం వ్యక్తం చేస్తోంది.  అమెరికాకు చెందిన ఈ వాతావరణ సంస్థ ఈ ఏడాది 'ఎల్-నినో' ప్రభావం తలెత్తడానికి 50 శాతం కంటే ఎక్కువే అవకాశాలు ఉన్నాయని సెలవిస్తోంది.  ఈ సంస్థ అంచనాల ప్రకారం చూసుకుంటే జూన్ మొదటి వారలోనే నైరుతి రుతుపవనాలు మన దేశ తీరాన్ని తాకాల్సి ఉంది.  కానీ దాదాపు మూడు వారాలు గడిచినా రుతుపవనాల జాడ కనిపించడం లేదు.  మన దేశ ఆర్థిక వ్యవస్థ కాస్తో కూస్తో స్థిరంగా ఉందంటే అందుకు కారణం గత రెండు సీజన్‌లలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరగడమేనని ఆర్థిక నిపుణులు పేర్కొటున్నారు.  ఇక ముందు కూడా వ్యవసాయ రంగంలో ఈ పెరుగుదల రేటు ఇలాగే ఉండొచ్చని భావించిన వారంతా తాజాగా వరల్డ్ మెటరోలాజికల్ ఆర్గనైజేషన్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు.  
నిజానికి జూన్ మాసం మొదటి అర్థ భాగలో మన దేశంలో వర్షపాతం 39.5 మిల్లీమీటర్లుగా నమోదైంది.  నిజానికి సాధారణ వర్షపాతం 72.5 మిల్లీమీటర్లు.  సాధారణ వర్షపాతంతో పోల్చుకున్నా ఈ ఏడాది జూన్ మాసంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం 45 శాతం తక్కువే.  దేశంలో ఉన్న 36 వర్షపాత నమోదు కేంద్రాలలో దాదాపు 28 కేంద్రాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది.  
"గతంలో అనుభవాలతో పోల్చుకుని చూస్తే ఈసారి 'ఎల్ నినో' ప్రభావం తలెత్తేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  అయిదు నెలలుగా మారుతున్న వాతావరణ పరిస్థితులను గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది..'' అని భారత వాతావరణ పరిశోధనా సంస్థ నిపుణుడొకరు పేర్కొంటున్నారు.  
'ఎల్ నినో' అంటే...?
వాతావరణంలో కలిగే ఒక రకమైన మార్పునే 'ఎల్ నినో' ప్రభావంగా పేర్కొంటారు.  పసిఫిక్ మహాసముద్ర జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వేడెక్కడం వలన వాతావరణంలో ఈ ఎల్ నినో ప్రభావం ఏర్పడుతుంది.  ఇది లాటిన్ అమెరికా నుంచి ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలను అడ్డుకుని వాటి వేగాన్ని తగ్గిస్తుంది.  ఫలితంగా వర్షాలు సకాలంలో పడవు.  ఫలితంగా ఆ ఏడాది వ్యవసాయం దెబ్బతింటుంది.  అందుకే ఎల్ నినో ప్రభావం ఏర్పడిన సంవత్సరాన్ని 'బ్యాడ్ ఇయర్'గా పిలుస్తారు. 
ఏం చేస్తుంది?
మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు వేడెక్కేకొద్దీ ఆ ప్రాంతంలో ఉండే వాతావరణంలోని ఉష్ణోగ్రత కూడా విపరీతంగా పెరిగిపోతుంది.  ఫలితంగా అక్కడి వాతావరణంలో పొడిగా ఉండే గాలులు అధికమవుతాయి.  ఈ పొడి గాలులు ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో రుతుపవనాల గమనం మందగించి ఆయా దేశాలకు రుతు పవనాల రాక మరింత ఆలస్యమవుతుంది.  
గతంలో ఎప్పుడెప్పుడు?
2004 సంవత్సరంలో మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలను వాతావరణంలో ఏర్పడిన ఈ 'ఎల్ నినో' ప్రభావమే అడ్డుకుంది.  దీంతో ఆ ఏడాది మన దేశంలో సాధారణం కంటే 10 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. దీంతో సాంకేతికంగా 2004ను కరవు సంవత్సరంగా ప్రకటించారు.  
ఎందుకీ చింత?
అయిదు మాసాలుగా పసిఫిక్ సముద్రంలో జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతున్నాయి. దీంతో వాతావరణంలో 'ఎల్ నినో' ప్రభావం ఏర్పడి జూన్ మొదటి వారంలో వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి.  దీని ప్రభావం మన దేశ వ్యసాయంపై కచ్చితంగా ప్రతిఫలిస్తుంది.  నిజానికి మన దేశంలో ఖరీఫ్ సీజన్‌లో  రైతులు వేసే పంటల్లో 65 శాతం ఒక్క నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురవకపోతే లక్షల ఎకరాలలో  పంటలు దెబ్బతింటాయి.  చివరికి దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.  ఇప్పటికే బియ్యం ధరలు పెరిగిపోయాయంటూ గగ్గోలు పెడుతున్నాం.  ఇప్పుడీ 'ఎల్ నినో' ప్రభావం వీటి ధరలను చుక్కల దగ్గరికి చేరుస్తుందేమో!


0 comments:
Post a Comment