
సెల్‌ఫోన్, లాప్‌టాప్, వీడియో కెమెరా... ఏది పనిచేయాలన్నా వాటిలో 'పవర్' ఉండాల్సిందే. విద్యుత్తు సాయంతో వాటి బ్యాటరీలను ఛార్జింగ్ చేసి తీరాల్సిందే. లాప్‌టాప్, వీడియో కెమెరాల సంగతేమోగానీ, నోకియా కంపెనీ సెల్‌ఫోన్‌లకు మాత్రం.. ఇక మీదట ఛార్జర్ల అవసరం ఉండదు. ఎందుకంటే, వాటిలో ఉండే బ్యాటరీలు గాలిలోంచే తమకు అవసరమైన విద్యుత్తును గ్రహించి రీఛార్జ్ అయిపోతాయి మరి!
మనందరికీ తెలిసిన విషయం తీగ గుండా విద్యుత్తు ప్రవహిస్తుందని. అయితే తీగ లేకుండా కూడా విద్యుత్తును ప్రవహింపజేయవచ్చని ఇటీవలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చెబుతోంది. దీనిని 'వైర్‌లెస్ పవర్'గా పిలుస్తున్నారు. ఈ విధానంలో విద్యుత్తు కొంత దూరం వరకు కిరణాల రూపంలో ప్రవహిస్తాయి. మార్గంలో ఉండే లైట్లను వెలిగిస్తాయి.
అయితే సెల్‌ఫోన్ దిగ్గజం నోకియా ఒకడుగు కాదు, పది అడుగులు ముందుకేసింది. తన ప్రయోగాలతో భవిష్యత్తులో ఓ సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించబోతోంది. ఛార్జర్ అవసరం లేకుండా, గాలిలోని రేడియో తరంగాలలో ఉండే విద్యుదయస్కాంత శక్తిని గ్రహించి దానిని విద్యుత్తుగా మార్చుకుని సెల్‌ఫోన్ల బ్యాటరీలు వాటంతట అవే రీఛార్జ్ అయ్యేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రయోగాలు జరిపిన నోకియా ప్రస్తుతం గాలి నుంచి 5 మిల్లీ వాట్ల విద్యుత్తును సృష్టించగలిగింది. భవిష్యత్తులో దీనిని 20 మిల్లీ వాట్లకు, ఆపైన 50 మిల్లీ వాట్లకు పెంచే దిశగా ప్రయోగాలు చేస్తోంది.
ఇదే గనుక జరిగితే ఆ కంపెనీ తయారు చేసే సెల్‌ఫోన్లకు ఛార్జర్ల అవసరమే ఉండదు. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ నోకియా మాత్రం వెనుకంజ వేయడం లేదు. కనీసం తాను తయారు చేసే ఏ సెల్‌ఫోనూ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి 'స్విచ్‌డ్ ఆఫ్' మోడ్‌లోకి వెళ్లకపోతే అంతేచాలునని.. ఈ ప్రయోగంలో తాను విజయం సాధించినట్లేనని చెబుతోంది. దెన్, ఆల్ ద బెస్ట్ నోకియా!
0 comments:
Post a Comment