Saturday 27 June 2009

మొన్న మొన్నటి వరకు... అంగారకుడిపై నీరు?!


అంగారక గ్రహంపై ఒకప్పుడు పుష్కలంగా నీరు ఉండేది. అక్కడ ఒకప్పుడు సముద్రాలు కూడా ఉండేవి.

అవును, ఇందులో కొత్తేం ఉంది? ఇది అందరికీ తెలిసిన విషయమే కదా!

నిజమేకానీ, ఎప్పుడో వందల, వేల కోట్ల సంవత్సరాల క్రితం కాదు.. 1.25 కోట్ల సంవత్సరాల క్రితం కూడా అక్కడ నీరు ప్రవహించింది. (గ్రహాల ఆవిర్భావం నాటితో పోల్చుకుంటే ఈ 1.25 కోట్ల సంవత్సరాలు అనేది మొన్నమొన్నటి కిందే లెక్క మరి). ఇదీ సరికొత్త విషయం!

ఆ...


ఏవిటీ ఆధారం?
మార్స్‌ రికొనైసెన్స్‌ ఆర్బిటార్‌ తాజాగా అందించిన ఛాయాచిత్రాలే ఇందుకు ఆధారం. అంగారక గ్రహంపై నీటి జాడలను పసిగట్టేందుకు నాసా శాస్త్రజ్ఞులు ప్రయోగించిన ఈ ఆర్బిటార్‌ ఇటీవల ఆ గ్రహం మీదుగా వెళుతూ అక్కడి భూమిని నిశితంగా గమనించింది. మార్స్‌ రికొనైసెన్స్‌ ఆర్బిటార్‌ ఇటీవల భూమికి పంపించిన ఛాయచిత్రాలను బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన జే డిక్సన్‌ బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ విషయం బయటపెట్టింది.

గతంలో ఏమైంది?
నిజానికి అంగారకుడిపై నీటి జాడలకు సంబంధించి రికొనైసెన్స్‌ ఆర్బిటార్‌ గతంలోనే కొన్ని ఛాయ చిత్రాలను పంపింది. వీటిని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు గతంలో ఆ గ్రహంపై నీరు పరవళ్లు తొక్కిందని, సముద్రాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని తేల్చిపారేశారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తే ఏర్పడే లోయలను బట్టి వారు ఈ రకమైన నిర్ధారణకు వచ్చారు. అంతేకాక నీరు ఉండే చోట 'జీవం' ఆవిర్భవానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి.. అంగారకుడిపై ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందనే అనుమానానికి బీజం పడింది. ఈ నేపథ్యంలో అంగారక గ్రహం ఉత్తర «ద్రువానికి నాసా శాస్త్రజ్ఞులు 'ఫీనిక్స్‌ ల్యాండర్‌'ను పంపించడం, అది తన మరచేయి సహాయంతో అక్కడి భూ ఉపరితలాన్ని తవ్వి కొన్ని సెంటీమీటర్ల లోపల ఉన్న మంచును గుర్తించడంతో శాస్త్రజ్ఞుల ఆలోచనలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

అయితే ఇప్పుడేమిటీ?
తాజాగా జే డిక్సన్‌ బృందం అంగారక గ్రహంలో.. లాయట్‌ అనే ప్రదేశంలో ఉన్న అతి పెద్దదైన లోయను గుర్తించారు. ఇందులో మళ్లీ దాదాపు 20 వరకు చిన్న చిన్న లోయలు ఉన్నాయి. ఉత్తర «ద్రువం వద్ద భూమికి కొన్ని సెంటీమీటర్ల దిగువున ఉన్న మంచు కరిగి, నీరుగా మారి ఈ ప్రాంతం వైపు ప్రవహించిన ఉంటుందని, అందువల్లే ఈ ప్రాంతంలో ఏటవాలుగా ఉండే ఈ లోయలు ఏర్పడి ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు 3.5 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు పుష్కలంగా ఉండేదని శాస్త్రజ్ఞులు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ గణాంకాలు మారాయి. జే డిక్సన్‌ బృందం జరిపిన అధ్యయనం మేరకు 1.25 కోట్ల సవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ నీరు ఉధృతంగా ప్రవహించింది. "మేం కనుగొన్న ఈ లాయట్‌ ప్రాంతం.. అంగారకుడిపై గతంలో నీరు ప్రవహించిందని చెబుతున్న ప్రాంతాల కంటే వయసులో చాలా చిన్నది.. అంటే.. బహుశా ఆఖరి బిలియన్‌ (కోటి) సంవత్సరాల క్రితం ఈ లోయలు ఏర్పడి ఉండొచ్చు..'' అని కూడా జే డిక్సన్‌ వ్యాఖ్యానిస్తున్నారు. మరి, ఈ లెక్కన నీరు ఉండే చోట 'జీవం' ఆవిర్భవానికి కూడా అవకాశం ఉంటుందన్న శాస్త్రజ్ఞుల వాదన సరైనదే అయితే బహుశా అంగారకుడిపై 1.25 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కూడా 'జీవం' ఉనికి ఉండేదేమో!


చంద్రునికి ఓ 'మొక్క'!

చంద్రునిపై ఓ మొక్క మొలిచింది. ఏమిటీ విచిత్రం.. అనుకుంటున్నారు కదూ! మొలిచిన ఆ మొక్క కాస్తా పెరిగి పెద్దదైంది.. మొగ్గలు తొడిగి, పూలు కూడా పూసింది.
'ఛ.. క తలు చెప్పొద్దు బాస్‌..' అంటారా? మీరే కాదు, ఎవరైనా అలాగే అంటారు. కానీ చెప్పక తప్పదు.. 'మ్యాటర్‌' అలాంటిది మరి. నమ్మకపోతే మీరే చదవండి...

ఈ భూమిపై జనాభా విస్ఫోటం పెరిగిపోతోంది. ఇలా పెరుగుతూ పోతే తలదాచుకోడానికి కాస్త చోటు కూడా దొరక్కపోవచ్చు. ఇప్పుడు కాకపోయినా కొన్ని వందల సంవత్సరాలకైనా సరే మనం ఈ భూమిని వదిలిపెట్టి మరో గ్రహానికి వెళ్లాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చు. అంగారక గ్రహంపై ఒకవేళ 'జీవం' ఆవిర్భవించినా ఇప్పుడక్కడ జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు లేనేలేవు. నవ గ్రహాలలో ఒక్క చంద్రుడు తప్ప మరో గ్రహమేదీ సులువుగా వెళ్లగలిగేంత చేరువలో లేదు. ఇంకేం చేస్తాం.. ఎప్పటికైనా చంద్రమండలం వెళ్లక తప్పదు. ఒకవేళ అక్కడికి వెళ్లి బతకాల్సిన పరిస్థితే వచ్చిందనుకోండి.. ఏం తిని బతుకుతారు? ప్రతిదీ భూమి నుంచే తీసుకెళతారా?? ఎన్నిసార్లు తిరుగుతారు భూమి నుంచి చంద్రుడికి - చంద్రుడి నుంచి భూమికి???

'వామ్మో.. ఇంత కథ ఉందా? నిజమే బాస్‌.. మాకీ ఆలోచనే రాలేదు..' అంటారా.. అనకండి. ఎందుకంటే ఈ ఆలోచన వచ్చినా మీరు, మేము ఏం చేయలేం.. ఒక్క ఖగోళ శాస్త్రవేత్తలు తప్ప. వారికి మాత్రం ఈ ఆలోచన ఎప్పుడో వచ్చేసింది. అందుకే భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై ఇప్పుడే ఓ మొక్కను మొలిపించడం మంచిదనుకున్నారు.. అదీ 'గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌' ద్వారా.

ఎవరిదీ ఆలోచన?
అంతరిక్ష ప్రయోగాలకు ప్రైవేటు సంస్థలు కూడా ఇప్పుడు 'సై' అంటున్నాయి. స్పేస్‌ టూరిజంలో భాగంగా అంతరిక్ష నౌకల నిర్మాణానికి నడుం బిగించాయి. ఆన్‌లైన్‌ దిగ్గజం 'గూగుల్‌' ప్రకటించిన పోటీతో ఈ ప్రయోగాలు మరింత ఊపందుకున్నాయి. ఏ సంస్థ అయితే 2012 లోపల చంద్రమండలంపై రొబోటిక్‌ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి, చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్ల దూరం ల్యాండర్‌ను తిప్పి, అక్కడి ఫొటోలను భూమికి చేరవేయగలుగుతుందో ఆ సంస్థకు 2 కోట్ల డాలర్లు బహుమతిగా ఇస్తామంటూ గూగుల్‌ ప్రకటించడం పెద్ద సంచలనమైంది. ఈ ప్రయోగంలో ఆరిజోనా రాష్ట్రంలోని టుక్సన్‌ నగరంలో ఉన్న ఒడెస్సీ మూన్‌ లిమిటెడ్‌ కూడా పోటీ పడుతోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 'లూనార్‌ ల్యాండర్‌' నిర్మాణం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే 2012 కల్లా ఈ సంస్థ పంపే 'లూనార్‌ ల్యాండర్‌' చంద్రమండలంపై కాలు మోపుతుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ సంస్థ అనేక ఇతర సంస్థల సహాయ సహ కారాలను కూడా తీసుకుంటోంది. పనిలో పనిగా చంద్రునిపై 'గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌' ద్వారా ఓ మొక్కను కూడా మొలిపించేందుకు ఓడెస్సీ మూన్‌ లిమిటెడ్‌ శ్రీకారం చుట్టింది. 'లూనార్‌ ఒయాసిస్‌'గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు బాధ్యతలను ఆరిజోనాలోని టుక్సన్‌లోనే ఉన్న మరో ప్రైవేటు సంస్థ పారగాన్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. "ఏదో ఒక రోజు చంద్రమండలంపైకి మానవులు వెళ్లడం తథ్యం.. అయితే భూమిపై ఉండే వాతావరణానికి చంద్రునిపై ఉండే వాతావరణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.. అందుకే ముందుగా అక్కడికి ప్రాణం ఉన్న ఓ మొక్కను పంపించదలుచుకున్నాం..'' అని ఒడెస్సీ మూన్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బాబ్‌ రిచర్డ్స్‌ వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ మొక్కే ఎందుకు?
చంద్రమండలంపైకి పంపే మినీ గ్రీన్‌ హౌస్‌ 'లూనార్‌ ఒయాసిస్‌' కోసం ఒడెస్సీ మూన్‌ లిమిటెడ్‌ కొన్ని వందల రకాల మొక్కలను పరిశీలించి చివరికి క్యాబేజి, కాలీఫ్లవర్‌ జాతికి చెందిన 'బ్రస్సికా' మొక్కను ఎంపిక చేసింది. ఈ మొక్క జీవితం కాలం చాలా స్వల్పం. కేవలం 14 రోజులు మాత్రమే. ఈ పధ్నాలుగు రోజుల్లోనే అది మొలకెత్తడం, పెరగడం, మొగ్గలు తొడగడం, పూలు పూయడం అన్నీ జరిగిపోతాయి. అమావాస్యకు, పౌర్ణమికి మధ్య వ్యవధి కూడా 14 రోజులే కాబట్టి చంద్రునిపై పౌర్ణమి రోజు నాటికి ఈ మొక్క పెరిగి పెద్దదై పూలు పూస్తుందనేది శాస్త్రవేత్తలు మరో ఆలోచన. ఇంకా ఈ మొక్కను ఎంపిక చేసుకోవడానికి మరో కారణం ఏమిటంటే.. ఈ 'బ్రస్సికా' మొక్కను శాస్త్రవేత్తలు భూమి మీద కూడా రకరకాల ప్రయోగాలలో ఉపయోగిస్తుంటారు. భూమి మీద ఇది మొలకెత్తే విధానం, పెరిగే విధానం, మొగ్గొలు తొడిగి పూలు పూసే విధానం.. అన్నీ శాస్త్త్రవేత్తలు బాగా తెలుసు. ఇదే మొక్క చంద్రమండలంపై ఎలా పెరుగుతుంది? ఏమైనా 'తేడా' కనిపిస్తుందా? ఈ విషయాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు మరింత సులువు అవుతుంది కూడా.

"తప్పదు.. చంద్రమండలాన్ని మనం ఎనిమిదో ఖండంగా గుర్తించాల్సిందే. మరి ఈ ఖండంలో బతకదలచుకున్న వారు తమకు అవసరమైన వాటినన్నింటినీ అక్కడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.. ఎందుకంటే భూమ్మీద నుంచి మనం ఏదీ ఎక్కువగా తీసుకెళ్లలేం కాబట్టి..'' అని చమత్కరిస్తారు బాబ్‌ రిచర్డ్స్‌.

ఇప్పటి వరకు లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగంలో ఈ గ్రీన్‌హౌస్‌తోపాటుగా చిన్న టెలిస్కోప్‌, మట్టిని విశ్లేషించే స్పెక్ట్రోమీటర్‌, మానవ చితాభస్మం వంటివి చేరాయి. ప్రయోగం జరిగే నాటికి ఈ జాబితాలో మరిన్ని పరికరాలు కూడా చేరే అవకాశం ఉంది.

ఇదేం కొత్త కాదు..
గ్రీన్‌హౌస్‌ పద్ధతిలో అంతరిక్షంలో మొక్కలు పెంచడం పారగాన్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు కొత్త కాదు. ఇప్పటికే ఈ సంస్థ రెండు గ్రీన్‌హౌస్‌లను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండగా, మరొకటి మరో అంతరిక్ష నౌకలో ఉంది. భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి కూడా గ్రీన్‌హౌస్‌ను పంపేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా వ్యోమగాములు ధరించే 'అత్యంత ఆధునిక స్పేస్‌ సూట్‌లు' రూపొందించే కాంట్రాక్టును కూడా ఈ సంస్థ 'నాసా' నుంచి దక్కించుకుంది.

నిజానికి ఓడెస్సీ మూన్‌ లిమిటెడ్‌ కూడా గూగుల్‌ పోటీకి ముందే చంద్రమండల యాత్ర ప్రయత్నాలలో మునిగి ఉంది. ఎప్పుడైతే గూగుల్‌ 'లూనార్‌ ఎక్స్‌ ప్రైజ్‌' పోటీ ప్రకటించిందో అప్పుడు వెంటనే ఈ పోటీపై దృష్టి సారించింది. "లూనార్‌ ల్యాండర్‌ ప్రాజెక్టుతోపాటుగా మేం మరో నాలుగు చిన్న ప్రాజెక్టులను కూడా చేపట్టాం.. వీటికి సంబంధించిన పనులు కూడా ఏక కాలంలో జరుగుతున్నాయి. అంతేకాదు, ప్రయోగం జరిగే నాటికి ఈ ప్రాజెక్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది..'' అని ఒడెస్సీ మూన్‌ సిఇఒ బాబ్‌ రిచర్డ్స్‌ వివరిస్తున్నారు.

గూగుల్‌ 'డెడ్‌లైన్‌' దాటితే...
అయితే గూగుల్‌ ప్రకటించిన 'లూనార్‌ ఎక్స్‌ ప్రైజ్‌' పోటీలో ఓ విచిత్రమైన షరతు ఉంది. అదేమిటంటే.. 2012లోగా ఒడెస్సీ మూన్‌ లిమిటెడ్‌ 'లూనార్‌ ల్యాండర్‌'ను చంద్ర మండలంపై దింపక పోయినా, తీరా చంద్రమండలంపై కాలుమోపిన ల్యాండర్‌ కదలనంటూ మొరాయించినా, అక్కడి నుంచి ఒక్క ఫొటో కూడా భూమికి చేరకపోయినా.. ముందు ప్రకటించిన బహుమతి మొత్తంలో సగం తగ్గిపోతుంది. అంటే.. బహుమతి కాస్తా 3 కోట్ల డాలర్ల నుంచి 1.5 కోట్ల డాలర్లకు తగ్గిపోతుంది. ఈ పోటీలో ఈ షరతు కాస్త క్లిష్టమైంది.

"అందుకే ఇతర ప్రయోగాలకంటే 'లూనార్‌ ల్యాండర్‌' ప్రయోగంపైనే మేం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం.. పరిస్థితులు అనుకూలిస్తే 2011 ఆఖర్లోనే ల్యాండర్‌ను ప్రయోగిస్తాం.. నిజానికి మేం ఈ ప్రయోగం చేస్తున్నది గూగుల్‌ ఇచ్చే డబ్బు కోసం కాదు.. ఇదేదో నలుగురు వ్యామగాములను అంతరిక్షానికి పంపినంత సులువూ కాదు.. ఈ భూమ్మీద జీవిస్తున్న యావత్‌ మానవ జాతి భవిష్యత్తును నిర్దేశించే ప్రయోగం ఇది.. అందుకే ఇంత కష్టపడుతున్నాం..'' అని వ్యాఖ్యానిస్తున్నారు బాబ్‌ రిచర్డ్స్‌.

Friday 26 June 2009

టూర్‌ వెళుతున్నారా?.. ఒక్క నిమిషం!

ప్రయాణాలంటే కొందరికి చాలా ఇష్టం. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని.. సరదాగా నాలుగు రోజులు గడిపి సరికొత్త అనుభూతులు మూటకట్టుకోవాలని భావిస్తుంటారు. మీరూ ఇలాంటి పర్యాటకాభిలాషులైతే ప్రయాణాలలో మీకు అవసరమైనవి, మీరు అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా...

ఖర్చెంత?
ఏ ప్రయాణానికైనా ఇదే ముఖ్యమైన అంశం. మొత్తం ప్రయాణంలో ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే ఒక అవగాహన ఉండాలి. టూర్‌ మొత్తంలో వసతి, ఆహారం, రానుపోను ఛార్జీలు.. ఇలా రోజువారీ ఎంతెంత ఖర్చు అవుతుందో తెలిసుంటే మరీ మంచిది. సరిపడా డబ్బు జేబులో లేకపోయినా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్నాయి కదా అనే ధైర్యంతో కొందరు టూర్‌లకు సిద్ధమవుతారు. అయితే మీరు వెళ్లే ప్రదేశంలో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయా? అన్నది ముందుగానే తెలుసుకోవడం మంచిది. లేకుంటే కొత్త ప్రదేశంలో జేబులో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఏం తీసుకెళ్లాలి?
ప్రయాణం అనగానే చాలు కొంతమంది అవీ, ఇవీ సూట్‌కేస్‌ లేదా ట్రావెల్‌బ్యాగ్‌లో కుక్కేస్తుంటారు. ఇంత అవసరమా? అని ప్రశ్నిస్తే.. 'ఏమో ఎక్కడ.. ఏది.. ఎప్పుడు.. ఎందుకు అవసరమవుతుందో తెలియదు కదా!..' అంటూ సమర్థించుకుంటారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. సరదాగా టూర్‌కు వెళుతున్నప్పుడు లగేజి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. లేకుంటే ఆ 'మోత బరువు' మీ ఆనందాన్ని హరించి వేస్తుంది. కాబట్టి చిన్న చిన్న వస్తువులు వదిలేసి, 'మరీ ముఖ్యమైనవి, వెళ్లే ప్రదేశంలో దొరకవు..' అనుకున్న వస్తువులను మాత్రమే బ్యాగ్‌లో సర్దుకోవాలి.

వసతి ఎక్కడ?
ఇది కూడా చాల ముఖ్యమైన విషయమే. వెళుతున్నది కొత్త ప్రదేశమైతే.. అక్కడ ఉండడానికి అనువైన వసతి సౌకర్యాన్ని ముందుగానే అరేంజ్‌ చేసుకోవడం చాలా మంచిది. తీరా అక్కడికి వెళ్లాక వసతి దొరకకపోతే అవస్థలు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణానికి ముందుగానే ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా మీరు ఏ రోజున ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారన్నది మీకు వసతి కల్పించే వారికి కూడా ముందుగానే తెలియజేయాలి.

కమ్యూనికేషన్‌ ముఖ్యం
ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్లినా మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో 'కమ్యూనికేషన్‌ ' కొనసాగించడం చాలా మంచిది. సెల్‌ఫోన్లు వచ్చాక ఈ కమ్యూనికేషన్‌ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కొన్ని సుదూర ప్రాంతాలలో నేటికీ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేవు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలతోనైనా సంబంధాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరెవరు, ఏ పనిమీద ఆ ప్రదేశానికి వచ్చారు.. అనే కనీస వివరాలైనా అక్కడి వారికి తెలియడం మీకు చాలా మంచిది.

గైడ్‌ బుక్స్‌ ఉండాలి
కొత్త ప్రదేశాలకు వెళుతున్నప్పుడు మీ ట్రావెల్‌ బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుల్లో ఇదొకటి. మీరు వెళుతున్న ప్రదేశాలకు సబంధించిన గైడ్‌ బుక్స్‌ మీ వద్ద ఉండటం క్షేమకరం. కొత్త ప్రదేశంలో ఏ రోడ్డు ఎక్కడికి వెళుతుంది, ఎక్కడెక్కడ ఏమేం దొరుకుతాయి అన్నది మీకు ఈ గైడ్‌బుక్స్‌ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. వీలైతే ప్రయాణానికి ముందే ఈ గైడ్‌బుక్స్‌తో కుస్తీ పట్డండి. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లిన తరువాత మీ పని మరింత సులువు అవుతుంది.
సో, ఆల్‌ ద బెస్ట్‌ అండ్‌ హ్యాపీ జర్నీ!

Thursday 25 June 2009

ఇది 'ఎల్‌ నినో' ప్రభావమేనా?

ఇది వర్షాకాలం. కానీ వానలు లేవు. నైరుతి రుతుపవనాల రాకతో ఈనెల మొదటి వారం నుంచే వర్షాలు పడాల్సి ఉండగా, ఒకట్రెండు వర్షాలు పడగానే కథ అడ్డం తిరిగింది. ఈసారి గతంలో కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయని వాతావరణ పరిశోధకులు మే నెలలోనే తీపి కబురు అందించడంతో వర్షం పడకపోయినా పడినంత ఆనందం వ్యక్తం చేశారు అందరూ. కానీ ఏవీ వర్షాలు? ఇదిగో వస్తున్నాయి.. అదిగో వచ్చేస్తున్నాయంటూ రుతుపవనాల గురించి ఏరోజుకారోజు జోస్యం చెబుతున్నారే తప్ప నిజానికి వర్షాల జాడే లేదు. ఎందుకని ఈ పరిస్థితి? కొంపదీసి 'ఎల్‌-నినో' ప్రభావం కాదు కదా?

చావు కబురు చల్ల గా చెప్పడమంటే ఇదేనేమో.. రుతుపవనాల రాకలో ఆలస్యానికి కారణం 'ఎల్‌-నినో' ప్రభావం అయి ఉండొచ్చంటూ ప్రపంచ మెటరోలాజికల్‌ ఆర్గనైజేషన్‌ తాజాగా అనుమానం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు చెందిన ఈ వాతావరణ సంస్థ ఈ ఏడాది 'ఎల్‌-నినో' ప్రభావం తలెత్తడానికి 50 శాతం కంటే ఎక్కువే అవకాశాలు ఉన్నాయని సెలవిస్తోంది. ఈ సంస్థ అంచనాల ప్రకారం చూసుకుంటే జూన్‌ మొదటి వారలోనే నైరుతి రుతుపవనాలు మన దేశ తీరాన్ని తాకాల్సి ఉంది. కానీ దాదాపు మూడు వారాలు గడిచినా రుతుపవనాల జాడ కనిపించడం లేదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ కాస్తో కూస్తో స్థిరంగా ఉందంటే అందుకు కారణం గత రెండు సీజన్‌లలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరగడమేనని ఆర్థిక నిపుణులు పేర్కొటున్నారు. ఇక ముందు కూడా వ్యవసాయ రంగంలో ఈ పెరుగుదల రేటు ఇలాగే ఉండొచ్చని భావించిన వారంతా తాజాగా వరల్డ్‌ మెటరోలాజికల్‌ ఆర్గనైజేషన్‌ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు.

నిజానికి జూన్‌ మాసం మొదటి అర్థ భాగలో మన దేశంలో వర్షపాతం 39.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. నిజానికి సాధారణ వర్షపాతం 72.5 మిల్లీమీటర్లు. సాధారణ వర్షపాతంతో పోల్చుకున్నా ఈ ఏడాది జూన్‌ మాసంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం 45 శాతం తక్కువే. దేశంలో ఉన్న 36 వర్షపాత నమోదు కేంద్రాలలో దాదాపు 28 కేంద్రాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది.
"గతంలో అనుభవాలతో పోల్చుకుని చూస్తే ఈసారి 'ఎల్‌ నినో' ప్రభావం తలెత్తేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయిదు నెలలుగా మారుతున్న వాతావరణ పరిస్థితులను గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది..'' అని భారత వాతావరణ పరిశోధనా సంస్థ నిపుణుడొకరు పేర్కొంటున్నారు.

'ఎల్‌ నినో' అంటే...?
వాతావరణంలో కలిగే ఒక రకమైన మార్పునే 'ఎల్‌ నినో' ప్రభావంగా పేర్కొంటారు. పసిఫిక్‌ మహాసముద్ర జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వేడెక్కడం వలన వాతావరణంలో ఈ ఎల్‌ నినో ప్రభావం ఏర్పడుతుంది. ఇది లాటిన్‌ అమెరికా నుంచి ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలను అడ్డుకుని వాటి వేగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వర్షాలు సకాలంలో పడవు. ఫలితంగా ఆ ఏడాది వ్యవసాయం దెబ్బతింటుంది. అందుకే ఎల్‌ నినో ప్రభావం ఏర్పడిన సంవత్సరాన్ని 'బ్యాడ్‌ ఇయర్‌'గా పిలుస్తారు.

ఏం చేస్తుంది?
మధ్య పసిఫిక్‌ మహాసముద్రంలోని జలాలు వేడెక్కేకొద్దీ ఆ ప్రాంతంలో ఉండే వాతావరణంలోని ఉష్ణోగ్రత కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా అక్కడి వాతావరణంలో పొడిగా ఉండే గాలులు అధికమవుతాయి. ఈ పొడి గాలులు ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో రుతుపవనాల గమనం మందగించి ఆయా దేశాలకు రుతు పవనాల రాక మరింత ఆలస్యమవుతుంది.

గతంలో ఎప్పుడెప్పుడు?
2004 సంవత్సరంలో మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలను వాతావరణంలో ఏర్పడిన ఈ 'ఎల్‌ నినో' ప్రభావమే అడ్డుకుంది. దీంతో ఆ ఏడాది మన దేశంలో సాధారణం కంటే 10 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. దీంతో సాంకేతికంగా 2004ను కరవు సంవత్సరంగా ప్రకటించారు.

ఎందుకీ చింత?
అయిదు మాసాలుగా పసిఫిక్‌ సముద్రంలో జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతున్నాయి. దీంతో వాతావరణంలో 'ఎల్‌ నినో' ప్రభావం ఏర్పడి జూన్‌ మొదటి వారంలో వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. దీని ప్రభావం మన దేశ వ్యసాయంపై కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. నిజానికి మన దేశంలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వేసే పంటల్లో 65 శాతం ఒక్క నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురవకపోతే లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటాయి. చివరికి దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే బియ్యం ధరలు పెరిగిపోయాయంటూ గగ్గోలు పెడుతున్నాం. ఇప్పుడీ 'ఎల్‌ నినో' ప్రభావం వీటి ధరలను చుక్కల దగ్గరికి చేరుస్తుందేమో!

గుడ్‌బై.. ఇంక సెలవు!

రాక్షస బల్లులు.. గండభేరుండ పక్షులు.. ఇలాంటి భారీ జంతువులు, పక్షుల గురించి సింద్‌బాద్‌ సాహసయాత్రలు వంటి కథల పుస్తకాలలో చదువుకున్నాం. స్పీల్‌బర్గ్‌ పుణ్యమాని రాక్షస బల్లుల(డైనోసార్‌లు)ను ఆ మధ్యన 'జురాసిక్‌ పార్క్‌' సినిమాలో చూసి .. హాశ్చర్యపోయాం. అయితే ఇన్నాళ్లూ ఈ భూమ్మీద ఉన్న సముద్ర జలాలలో తిరుగాడిన «ద్రువపు ఎలుగుబంటి, వాల్‌రస్‌ వంటి జీవులను కూడా భవిష్యత్తులో మనం "ఇదిగో.. «ద్రువపు ఎలుగుబంటి అంటే ఇదే.. అదేమో వాల్‌రస్‌''.. అంటూ పాఠ్య పుస్తకాల్లో చూడాల్సి వచ్చేటట్టుంది. ఎందుకంటే ఈ రెండు జీవులు కూడా త్వరలోనే డైనోసార్‌ల దగ్గరికి వెళ్లిపోతున్నాయి మరి!

««ద్రువపు ఎలుగబంట్లను ఆంగ్లంలో పోలార్‌ బేర్స్‌ అంటారు. ఇవి రెండు రకాలు. అలస్కాలో.. కెనడాను అనుకుని ఉండే దక్షిణ బే ఫోర్ట్‌ సముద్ర
పరీవాహక ప్రాంతంలో కనిపించేవి ఒక రకమైతే, రష్యాను ఆనుకుని ఉన్న చుక్చీ/బేరింగ్‌ సముద్ర పరీవాహక ప్రాంతంలో కనిపించేవి మరో రకం. ఇక పసిఫిక్‌ వాల్‌రస్‌ (అతి పెద్ద చేపల్లా ఉంటాయి) జీవులు మాత్రం రష్యాని అనుకుని ఉండే చుక్చీ/బేరింగ్‌ సముద్ర పరీవాహక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి.

అయితే ఏంటి?
దక్షిణ బే ఫోర్ట్‌ ప్రాంతంలో కనిపించే ««ద్రువపు ఎలుగుబంట్ల సంఖ్య 1397. వీటిలో మానవ కృతకాల వల్ల ప్రతియేటా 54 మరణిస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చర్యల ద్వారా బతికి బయటపడుతున్నవి 22. బేరింగ్‌ సముద్ర ప్రాంతంలో వీటి సంఖ్య 2000. ప్రతీయేటా మానవ చర్యల ద్వారా
మరణించేవి 37. అలాగే రష్యాలో ప్రతీయేటా వేటగాళ్ల బారిన పడి మరణిస్తున్న ఎలుగుల సంఖ్య 150 నుంచి 250 వరకూ ఉంటోంది. సంరక్షక చర్యల ద్వారా బతికి బయటపడుతున్నవి 30.
ఇక పసిఫిక్‌ వాల్‌రస్‌ల జనాభా 15,164. వీటిలో 4 వేల నుంచి 5,500 వరకూ మానవుల జిహ్వ చాపల్యానికి మూల్యం చెల్లించుకుంటున్నాయి.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా ఏటా 607 జీవాల వరకూ మృత్యుపాశం నుంచి బయటపడగలుగుతున్నాయి.

ఎందుకిలా?
ఆర్కిటిక్‌ ఐకాన్‌లుగా పిలుచుకునే «ద్రువపు ఎలుగుబంట్లు, వాల్‌రస్‌ చేపల జీవన విధానం అంతా అక్కడి సముద్రంలోని మంచుగడ్డలతోనే ముడిపడి ఉంది. ఇప్పుడు అక్కడి మంచు పూర్తిగా కరిగిపోయే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఈ జీవుల పాలిట పెనుశాపంగా పరిణమించింది. గ్లోబల్‌ వార్మింగ్‌ (భూ తాపం) ఈ జీవాల పాలిట మృత్యుపాశంలా తయారైంది మరి. అంతేకాక, ఆర్కిటిక్‌ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణ, చేపల వేట, బోటింగ్‌, షిప్పింగ్‌, మిలిటరీ కార్యక్రమాలు.. ఇలాంటివన్నీ కూడా «ద్రువపు ఎలుగుబంటి, వాల్‌రస్‌ల మనుగడకు ప్రతికూల పరిస్థితులు కల్పిస్తున్నాయి. వాతావరణంలో రోజురోజుకు పెరుగుతున్న కార్బన్‌డయాక్సైడ్‌ భూ తాపాన్ని విపరీతంగా పెంచుతోంది. పర్యవసానంగా పెరుగుతున్న వేడిసెగల కారణంగా «ద్రువ ప్రాంతాలలోని మంచు సైతం కరిగి నీరవుతోంది. దీనికి తోడు వాటి ఆవాస ప్రాంతం అలస్కాలో చమురు, గ్యాస్‌ నిక్షేపాల కోసం
జరుగుతోన్న అన్వేషణ కూడా అక్కడి జీవాల అంతానికి కారణమవుతోంది.

అమెరికా వన్యప్రాణుల సంరక్షణ, చేపల అభివృద్ధి సేవల సంస్థ తాజా నివేదిక ప్రకారం.. «ద్రువపు ఎలుగుబంట్ల జనాభా క్రమేణా తగ్గిపోతోంది. వాల్‌రస్‌ చేపలైతే అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. "«ద్రువపు ఎలుగుబంట్లు, వాల్‌రస్‌లు అంతరించిపోయే జీవుల జాబితాలోకి వచ్చేశాయి. గ్రీన్‌హౌస్‌ కాలుష్యం, సముద్రంలో చమురు నిక్షేపాల అన్వేషణ, వెలికితీత వంటి చర్యలు వీటి మనుగడను క్లిష్టంగా మార్చేశాయి. వీటి మనుగడకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో «ద్రువపు ఎలుగులు, వాల్‌రస్‌లు మనకు కనిపించవు..'' అని సెంటర్‌ ఫర్‌ బయొలాజికల్‌ డైవర్సిటీకి చెందిన ఓషన్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ బ్రెండన్‌ కమ్మింగ్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏం చేయలేమా?
«ద్రువపు ఎలుగు, వాల్‌రస్‌, వేల్స్‌, డాల్ఫిన్స్‌, సీల్స్‌ తదితర సముద్ర క్షీరదాల సంఖ్య కేవలం అంచనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇవి సముద్ర జలాలలో, మంచుగడ్డలపై నివసిస్తూ అప్పుడప్పుడు బయటికి కనిపిస్తుండడంతో వీటి కచ్చిత జనాభా సంఖ్యను తెలుసుకోవడం కష్టం. అయితే గతంలోకంటే వీటి సంఖ్య బాగా తగ్గిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. సముద్ర క్షీరదాల సంరక్షణ చట్టం అమల్లో ఉన్నా.. ఏ యేటికాయేడు వీటి సంఖ్య తగ్గిపోతోంది. ప్రతీయేటా అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్న సముద్ర క్షీరదాల జనాభా వివరాలను సేకరించాల్సిన బాధ్యత ఆయా సంస్థలదే. వేల్స్‌, డాల్ఫిన్స్‌, సీల్స్‌ సంరక్షణ బాధ్యత నేషనల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ సర్వీసెస్‌ది కాగా, «ద్రువపు ఎలుగుబంట్లు, వాల్‌రస్‌ చేపలు తదితర జీవుల సంరక్షణ బాధ్యతలు ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వీసెస్‌ ఏజెన్సీది.

సముద్ర జీవుల జనాభా వివరాల సేకరణ, వెల్లడి, సంరక్షణ విషయాలలో ఈ రెండు ఏజెన్సీలు వాటి బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, దీంతో చాలా సముద్ర జీవులు అంతరించిపోయే జీవుల జాబితాలోకి వచ్చేశాయని సెంటర్‌ ఫర్‌ బయొలాజికల్‌ డైవర్సిటీ వ్యాఖ్యానిస్తోంది. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ధ్రువపు ఎలుగులు, వాల్‌రస్‌లు అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకునే దిశగా ఇది పావులు కదుపుతోంది.

గాలిలోంచే 'ఛార్జింగ్‌'!

సెల్‌ఫోన్‌, లాప్‌టాప్‌, వీడియో కెమెరా... ఏది పనిచేయాలన్నా వాటిలో 'పవర్‌' ఉండాల్సిందే. విద్యుత్తు సాయంతో వాటి బ్యాటరీలను ఛార్జింగ్‌ చేసి తీరాల్సిందే. లాప్‌టాప్‌, వీడియో కెమెరాల సంగతేమోగానీ, నోకియా కంపెనీ సెల్‌ఫోన్‌లకు మాత్రం.. ఇక మీదట ఛార్జర్ల అవసరం ఉండదు. ఎందుకంటే, వాటిలో ఉండే బ్యాటరీలు గాలిలోంచే తమకు అవసరమైన విద్యుత్తును గ్రహించి రీఛార్జ్‌ అయిపోతాయి మరి!

మనందరికీ తెలిసిన విషయం తీగ గుండా విద్యుత్తు ప్రవహిస్తుందని. అయితే తీగ లేకుండా కూడా విద్యుత్తును ప్రవహింపజేయవచ్చని ఇటీవలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చెబుతోంది. దీనిని 'వైర్‌లెస్‌ పవర్‌'గా పిలుస్తున్నారు. ఈ విధానంలో విద్యుత్తు కొంత దూరం వరకు కిరణాల రూపంలో ప్రవహిస్తాయి. మార్గంలో ఉండే లైట్లను వెలిగిస్తాయి.

అయితే సెల్‌ఫోన్‌ దిగ్గజం నోకియా ఒకడుగు కాదు, పది అడుగులు ముందుకేసింది. తన ప్రయోగాలతో భవిష్యత్తులో ఓ సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించబోతోంది. ఛార్జర్‌ అవసరం లేకుండా, గాలిలోని రేడియో తరంగాలలో ఉండే విద్యుదయస్కాంత శక్తిని గ్రహించి దానిని విద్యుత్తుగా మార్చుకుని సెల్‌ఫోన్ల బ్యాటరీలు వాటంతట అవే రీఛార్జ్‌ అయ్యేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రయోగాలు జరిపిన నోకియా ప్రస్తుతం గాలి నుంచి 5 మిల్లీ వాట్ల విద్యుత్తును సృష్టించగలిగింది. భవిష్యత్తులో దీనిని 20 మిల్లీ వాట్లకు, ఆపైన 50 మిల్లీ వాట్లకు పెంచే దిశగా ప్రయోగాలు చేస్తోంది.

ఇదే గనుక జరిగితే ఆ కంపెనీ తయారు చేసే సెల్‌ఫోన్లకు ఛార్జర్ల అవసరమే ఉండదు. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ నోకియా మాత్రం వెనుకంజ వేయడం లేదు. కనీసం తాను తయారు చేసే ఏ సెల్‌ఫోనూ బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోయి 'స్విచ్‌డ్‌ ఆఫ్‌' మోడ్‌లోకి వెళ్లకపోతే అంతేచాలునని.. ఈ ప్రయోగంలో తాను విజయం సాధించినట్లేనని చెబుతోంది. దెన్‌, ఆల్‌ ద బెస్ట్‌ నోకియా!


డ్రాయింగ్‌.. స్కెచ్చింగ్‌.. పెయింటింగ్‌ ఏదైనా క్షణాల్లో... సిద్ధం!


కళాకారులు అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. 'కానీ.. ఎలా? మనకు 'కళ' రాదే..' అని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. పేపరు, పెన్ను, పెన్సిల్‌, కుంచె, రంగులు.. ఇవేమీ లేకుండానే మీరు ఆర్టిస్ట్‌ అయిపోవచ్చు! కానీ ఫొటోలు మాత్రం కావాలండోయ్‌. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే ఒక్కసారి 'ఫొటో ఎఫెక్ట్‌ స్టుడియో' అనే సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని మీ సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీరు 'సగం ఆర్టిస్‌'్ట అయిపోయినట్లే! మిగతా సగం ఆర్ట్‌ను ఆ సాఫ్ట్‌వేరే మీకు నేర్పుతుంది. మిమ్మల్ని 'కుంచె తిరిగిన ఆర్టిస్ట్‌'గా మార్చుతుంది.

ఫొటో ఎఫెక్ట్‌ స్టుడియో సాఫ్ట్‌వేర్‌ సాయంతో మీరు రెడీమేడ్‌ ఆర్టిస్ట్‌ అయిపోవచ్చు. క్షణాల్లో మిమ్మల్ని, మీ ఇంటిని, మీ వీధిని.. అవసరమైతే హైదరాబాద్‌ మొత్తాన్నీ ఏరియల్‌ షాట్‌లో చిత్రించవచ్చు. ఇందుకు మీకు కావలసిందల్లా ఆయా దృశ్యాల ఫొటోలు మాత్రమే. ఇంటర్నెట్‌లో లభించే ఈ ఫొటో ఎఫెక్ట్‌ స్టుడియో-వెర్షన్‌ 5.56 సాఫ్ట్‌వేర్‌ సహాయంతో క్షణాల్లో ఏ దృశ్యాన్ని అయినా పెన్సిల్‌ స్కెచ్‌, పెన్‌ స్కెచ్‌గా, ఔట్‌లైన్‌ డ్రాయింగ్‌గా మార్చుకోవచ్చు. లేదంటే వాటర్‌ కలర్స్‌ వేసిన పెయింటిగ్‌ మాదిరిగా మార్చుకోవచ్చు. దృశ్యాన్ని ఉబ్బెత్తుగా మార్చవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ ట్రయల్‌ వెర్షన్‌ను ఒక్కసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే 100 సార్లు ఉపయోగించుకోవచ్చు

ఫొటో టు స్కెచ్‌ ఇలా..
ఈ సాఫ్ట్‌వేర్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ లేదా రన్‌ చేయండి. వెంటనే ముందుగానే లోడ్‌ చేయబడి ఉన్న ఓ ఫొటోతో ఒక విండో ఓపెన్‌ అవుతుంది. ఆ విండోలో పైన ఫైల్‌, ఎడిట్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌, కలర్‌, కలర్‌ అడ్జస్ట్‌, వెయిన్స్‌, హెల్ప్‌ అని ఆప్షన్స్‌ ఉంటాయి. మొదట 'ఫైల్‌' అనే ఆప్షన్‌లోకి వెళ్లి ఏదైనా ఫొటోను 'ఓపెన్‌' చేసుకోవాలి. మీరు కోరుకున్న ఫొటో ఒక విండోలో కనిపిస్తుంది. అంతే - మీకు కావలసిన స్కెచ్చింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోగానే దానికి సంబంధించిన మరో చిన్న విండో ఓపెన్‌ అవుతుంది. అందులో 'ఓకే' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే మీరు సూచించిన విధంగా ఫొటో మారిపోతుంది. మీకు ఓపిక ఉండాలేగానీ, ఇంటర్నెట్‌లో ఇలా ఫొటోలను రకరకాల స్కెచ్‌లుగా మార్చుకునే సాఫ్ట్‌వేర్‌లు ఇంకా బోలెడు లభిస్తున్నాయి.

ఐ-టెక్‌ వర్చువల్‌ లేజర్‌ కీ-బోర్డు!


డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు ఉపయోగించే వారికి కీబోర్డులు సుపరిచితమే. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న కీబోర్డు భవిష్యత్తులో ఈ రూపంలో ఉండకపోవచ్చంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇప్పటికే వైర్‌లెస్‌ కీబోర్డులు, మౌస్‌లు ఉపయోగిస్తున్న వారు ఎందరో! రాబోయే తరాలలో సాంకేతిక విజ్ఞానం మరింత ముందంజ వేస్తుందనడానికి ఓ గుర్తు వర్చువల్‌ లేజర్‌ కీ బోర్డు. ఈ తరహా పరిజ్ఞానం ఇప్పటికే అభివృద్ధి చెందింది.

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ కీబోర్డులు భౌతికంగా ఉండేవి, పరిమాణంలో పెద్దవి. వర్చువల్‌ లేజర్‌ కీబోర్డుతో ఈ బాధ లేదు. చిన్న సెల్‌ఫోన్‌ పరిమాణంలో ఉండే దీనికి జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్క
డ కీబోర్డు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సాధారణ కీబోర్డులు చొచ్చుకొచ్చినంతగా ఇవి ఇంకా జనసామాన్యంలోకి రాలేదు. అయితే భవిష్యత్తు అంతా ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డులదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఐ-టెక్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఓ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. చూడడానికి చిన్న సెల్‌ఫోన్‌లా కనిపించే ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డు పరికరాన్ని ఆన్‌ చేయగానే దీని నుంచి కొన్ని లేజర్‌ కాంతి పుంజాలు బయటికొస్తాయి. ఇవి ఎదురుగా ఉన్న ప్రదేశంపై కీబోర్డును ఏర్పాటు చేస్తాయి. అంతేకాదు, మామూలు కీబోర్డుపై టైప్‌ చేసేటప్పుడు వచ్చే చప్పుడు ఈ వర్చువల్‌ కీబోర్డ్‌పై టైప్‌ చేసినప్పుడూ వస్తుంది. దీనివల్ల ఆయా కీలను సరిగా నొక్కామా? లేదా? అన్న సంశయం వినియోగదారులకు ఎంతమాత్రమూ కలగదు. ఎంత చీకట్లో అయినా సరే ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డుపై సులువుగా టైప్‌ చేయవచ్చు. బ్లూటూత్‌ సౌకర్యం కలిగిన ఈ వర్చువల్‌ లేజర్‌ కీబోర్డును బ్లాక్‌బెర్రీ, స్మార్ట్‌ఫోన్‌, పర్సనల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌, మ్యాక్‌, టాబ్లెట్‌ పీసీలకు సులువుగా అనుసంధానించుకోవచ్చు. కేవలం 80 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ కీబోర్డుకు బిల్టిన్‌ రీచార్జ్‌ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి పూర్తిస్థాయిలో చార్జి చేసుకుంటే ఏకధాటిగా రెండు గంటలసేపు టైప్‌ చేసుకోవచ్చు.

Wednesday 24 June 2009

తక్కువ ధరలో 'యాపిల్‌ ఐఫోన్‌'!?

యాపిల్‌ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. కొత్తగా 'యాపిల్‌ ఐఫోన్‌' మార్కెట్‌లోకి వచ్చినప్పుడయితే.. సినిమా థియేటర్‌లో టిక్కెట్ల కోసం బారులుదీరినట్లు అమెరికాలో యాపిల్‌ ఐ-స్టోర్స్‌ దగ్గర అక్కడి జనం 'క్యూ' కట్టారు. ఇక మన దేశంలో అయితే సెల్‌ వినియోగదారులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.. ఐఫోన్‌ 3జి ఎప్పుడొస్తుందాని! ఒక్క ఐఫోన్‌ 3జి మాత్రమే కాదు, అసలు యాపిల్‌ కంపెనీ ఏ ఉత్పత్తి తీసుకున్నా 'ఏక్‌ సే ఏక్‌' అన్నట్లు ఉంటాయి మరి. కానీ ఏ లాభం యాపిల్‌ ఐఫోన్‌ 3జి భారత్‌కైతే వచ్చింది కానీ, భారతీయులందరినీ అలరించలేక పోయింది. కారణం - దాని ధర. భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 3జి పంపిణీ బాధ్యతలను ఎయిర్‌టెల్‌, ఒడాఫోన్‌ తమ భుజాలపైన వేసుకున్నాయి. క్వాలిటీ ఉన్నా.. కాస్ట్‌లీ కావడంతో అన్ని వర్గాల ప్రజలు దీనిని అందు'కొనలేక'పోయారు.

అయితే సెల్‌ ప్రియులకు శుభవార్త ఏమిటంటే.. త్వరలో యాపిల్‌ ఐఫోన్‌ ధర తగ్గనుంది. అంటే ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఫోన్‌ 3జి ధర కాదు.. తక్కువ ధరలో యాపిల్‌ కంపెనీ మరో ఐఫోన్‌ను విడుదల చేయబోతోందట. అది కూడా రాబోయే రెండు మూడు నెలల్లోనే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ పుకారు.. షికార్లు చేస్తోంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కూడా ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ వార్త ప్రచురించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యాపిల్‌ ఐఫోన్‌ 3జి రెండు వెర్షన్లలో లభిస్తోంది. 8 జిబి ఫోన్‌ రూ.9,485కు, 16 జిబి ఫోన్‌ రూ.14,225క లభిస్తున్నాయి. అయితే ఈ ధరలు విదేశాలలో మాత్రమే. మన దేశానికి వచ్చేసరికి ఈ రెండు మోడళ్ల ధరలు వరుసగా రూ.30,000, రూ.36,000. కానీ ప్రస్తుతం షికార్లు చేస్తున్న పుకార్ల ప్రకారం... త్వరలో విడుదలకానున్న ఐఫోన్‌ కూడా రెండు మోడళ్లలో లభిస్తుంది. ఒకటి 16 జిబి (ధర రూ.9,485) మరోటి 32 జబి (ధర రూ.14,225). అంతేకాదు, వీటితోపాటు మరో మోడల్‌ విడుదలకు కూడా యాపిల్‌ కంపెనీ సన్నాహాలు చేస్తోందని, అయితే ఈ మూడో మోడల్‌ ఐఫోన్‌లో ఇంటర్నల్‌ మెమరీ ఉండదని, ఇదే గనుక జరిగితే యాపిల్‌ కంపెనీకి చెందిన ఎంట్రీ-లెవల్‌ సెల్‌ఫోన్లలో ఇది స్మార్ట్‌ఫోన్‌ అవుతుందని డచ్‌ టి-మొబైల్‌కు చెందిన ఇన్వెంటరీ సిస్టమ్‌ చెబుతోంది. అయితే ఈ మూడో మోడల్‌ ధర ఎంతనేది మాత్రం ఈ సిస్టమ్‌ చెప్పడం లేదు.

మరో విషయం ఏమిటంటే - ఈసారి విడుదల చేయనున్న ఫోన్లకు యాపిల్‌ కంపెనీ ఏ పేరు నిర్ణయిస్తుందనేది కూడా రహస్యమే. మొట్టమొదటి మోడల్‌కు 'ఐఫోన్‌' అని, రెండోసారి విడుదల చేసిన మోడల్‌కు 'ఐఫోన్‌ 3జి' అని నామకరణం చేసిన ఈ కంపెనీ ఇప్పుడు విడుదల చేయబోయే మోడళ్లకు ఏం పేరు పెడుతుందో అని ప్రపంచ వ్యాప్తంగా సెల్‌ వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టి-మొబైల్‌కు చెందిన ఇన్వెంటరీ సిస్టం తెలిపిన సమాచారం మేరకు.. కొత్త మోడల్‌కు 'ఐఫోన్‌' పేరే ఉంచొచ్చు.. లేదా కాస్త భిన్నంగా ఉండాలని యాపిల్‌ కంపెనీ భావిస్తే గనుక 'ఐఫోన్‌ 2009' అనే పేరు కూడా తెరపైకి రావచ్చు. 'ఇవేవీ కావు.. కొత్తగా రాబోయే ఐఫోన్‌ పేరు 'ఐఫోన్‌ వీడియో', ఎందుకంటే ఇందులో మొట్టమొదటిసారిగా 'వీడియో రికార్డింగ్‌' సౌకర్యాన్ని యాపిల్‌ తన వినియోగదారులకు అందించనుంది.. అంతేకాదు, ఇందులో కొన్ని అప్లికేషన్లను ఎడిట్‌ చేసుకునే సదుపాయాలు కూడా ఉండబోతున్నాయి..' అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ, మన దేశానికి వచ్చేసరికి మాత్రం ఈ పేర్లు, అందులో ఉండబోయే ఫీచర్లు, మెమరీ.. ఇలాంటివేమీ ముఖ్యం కావు.. దాని 'ధరెంత' అన్నదే అసలు పాయింటు.. ఏమంటారు?

సిక్స్‌-డి సినిమా వచ్చేసింది!


మీరెప్పుడైనా త్రి-డి సినిమా చూశారా? పోనీ చూడకపోయినా, కనీసం ఇలాంటి సినిమా గురించి వినే ఉంటారు. అయితే సిక్స్‌-డైమన్షనల్‌ సినిమా గురించి విన్నారా? వినడం కాదు, పోనీ ఇలాంటి సినమా ఒకటి వస్తుందేమో అనే ఆలోచన అయినా చేశారా? మీరే కాదు, ప్రపంచంలో ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. అయితే ఆ అద్భుతం జరిగిపోయింది. సిక్స్‌ డైమన్షనల్‌ సినిమా వచ్చేసింది. బ్రిటన్‌కు చెందిన 'లైట్‌ సినిమా' సంస్థ ఈ సరికొత్త ప్రయోగాన్ని ఆవిష్కరించింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి సిక్స్‌-డైమన్షనల్‌ సినిమాను రొమేనియాలోని బుఖారెస్ట్‌లో ఉన్న థియేటర్‌లో విడుదల చేసింది. యూరప్‌లో హై-ఎండ్‌ డిజిటల్‌ థియేటర్లను ఏర్పాటు చేయడం ఈ 'లైట్‌ సినిమా' సంస్థ ఉద్దేశం. సిక్స్‌ డైమన్షనల్‌ సినిమా ప్రదర్శనలో.. త్రి-డి సినిమాతోపాటుగా వర్షం, గాలి, వాసన కూడా మరో మూడు ఎలిమెంట్‌లుగా పనిచేస్తాయి. ప్రేక్షకులు కూర్చున్న సీట్లు ఎటు కావాలంటే అటు కదలడం మరో విశేషం. ఇందుకోసం బుఖారెస్టలో 40 సీట్లు కలిగి, 8 స్క్రీన్‌లతో కూడిన సినీప్లెక్స్‌ అనే థియేటర్‌ను రూపొందించింది. త్వరలోనే రెండో సిక్స్‌-డి సినిమాను విడుదల చేసేందుకు 'లైట్‌ సినిమా' రెడీ అవుతోంది, అదీ బుఖారెస్ట్‌లోనే!

చైనా కంప్యూటర్లలో 'యాంటీ పోర్న్‌ సాఫ్ట్‌వేర్‌'!


ఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీ సైట్లకు ఉన్న డిమాండ్‌ తెలిసిందే. రోజురోజుకీ విస్తరిస్తున్న ఈ బూతు పురాణానికి అడ్డు కట్ట వేసేందుకు చైనా కృతనిశ్చయంతో ఉంది. చాలారోజుల క్రితమే అడల్ట్‌ వెబ్‌సైట్లు చైనాలో ఓపెన్‌ అవకుండా చేసింది. ఇంటర్నెట్‌లో చైనాకు చెందిన వ్యక్తులు, సంస్థలు ఇలాంటి వెబ్‌సైట్లు ఏమైనా నిర్వహిస్తున్నట్లయితే వాటిని బలవంతంగా మూసివేయించింది. అయినా సరే చైనీయులు నెట్‌ బ్రౌజింగ్‌ సమయంలో పోర్న్‌ వెబ్‌సైట్‌లను సెర్చ్‌ చేయడం గమనించి, అసలు 'పోర్న్‌', 'సెక్స్‌' అనే పదాలు కూడా ఇంటర్నెట్‌లో కనిపించకుండా చేయాలని సంకల్పించింది.

జూలై 1 నుంచి కంప్యూటర్‌ కొన్నప్పుడు దాంతోపాటు బండిల్‌గా ఇచ్చే సాఫ్ట్‌వేర్‌లలో ఇంటర్నెట్‌లో ఇలాంటి పదజాలం, బొమ్మలను, వీడియోలను వడపోసే సాఫ్ట్‌వేర్‌ కూడా తప్పనిసరిగా ఉండాలని పర్సనల్‌ కంప్యూటర్ల తయారీదారులను ఆదేశించింది. ఇప్పటికే జిన్‌ హుయి కంప్యూటర్‌ సిస్టం ఇంజనీరింగ్‌ కంపెనీ 'ది ఫ్రీ గ్రీన్‌ డామ్‌-యూత్‌ ఎస్కార్ట్‌ సాఫ్ట్‌వేర్‌' అనే ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఒకదానిని తయారు చేసినట్లు కూడా చైనా సాంకేతిక, సమాచార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇది ఇతర దేశాలకు చెందిన పర్సనల్‌ కంప్యూటర్ల తయారీదారులకు పెద్ద దెబ్బే. ఎందుకంటే, వారూ ఇంటర్నెట్‌లో బూతు పురాణాన్ని వడపోసే ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను బండిల్‌గా అందజేస్తే తప్ప వారు తయారు చేసిన కంప్యూటర్లను చైనాలో అమ్మలేవు మరి!