Thursday 25 March 2010

ప్చ్‌.. ఎక్కడా ఎవరూ లేరేమో!?

ఈ అనంత విశ్వంలో లెక్కలేనన్ని నక్షత్రాలు.. ఎన్నెన్నో సౌర కుటుంబాలు.. ఒక్కో సౌర కుటుంబంలో ఎన్నెన్నో గ్రహాలు.. మళ్లీ వాటికి బోలెడు ఉపగ్రహాలు.  వాటిలో ఒక్కగానొక్క గ్రహం మన భూమి.  ఆ భూమిపై మనం. అంతేనా? ఇంకెక్కడా.. ఏ గ్రహం మీదా.. ఎవరూ లేరా? ఒకవేళ ఉంటే.. వారు మనలాగే ఉంటారా? నేటికీ ఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలివి.  ఎక్కడైనా, ఎవరైనా ఉన్నారేమో.. అనే చిన్న ఆశ ఇంకా మినుకుమినుకుమంటూనే ఉంది.  అందుకే ఏలియన్స్‌(గ్రహాంతర వాసులు)కు మన ఉనికిని తెలియజేసేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.  ఇంతకాలం గడిచినా వారి ప్రయత్నాలకు ఎలాంటి స్పందన కనిపించడం లేదు.  బహుశా ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేమో! ఇంకెక్కడా ఎవరూ లేరేమో!!
 గ్రహాంతర వాసులు, వారు తిరిగే ఎగిరే పళ్ళాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నో కథనాలు, సినిమాలు వచ్చాయి.  అయితే 'ఇదిగో తోక అంటే అదుగో పులి..' అన్నట్లుగా ఇవన్నీ ఒట్టి ఊహాగానాలుగా మిగిలాయే తప్ప, ఇప్పటి వరకు విశ్వంలో ఎక్కడా «గ్రహాంతర వాసులకు సంబంధించిన ఉనికి లభించలేదు. 
 
భూమ్మీదే ఉన్నారా?
గ్రహాంతర వాసులు ఉన్న మాట నిజమేనని, కోట్ల సంవత్సరాల క్రితమే వారు భూమ్మీదికి వచ్చారని, ఇప్పుడు భూమ్మీద ఉన్న జనాభా మొత్తం గ్రహాంతర వాసులనే వాదనలూ లేకపోలేదు. ఎగిరే పళ్ళాలతోపాటు కొంతమంది గ్రహాంతర వాసులను అమెరికా బంధించిందని, ఏరియా-51 అనే ప్రాంతంలో ఉంచి, రహస్యంగా పరిశోధనలు జరుపుతోందని అటు వెండితెరపైనా, ఇటు బుల్లితెరపైనా అనేక కథనాలు అప్పడప్పుడూ చూస్తూనే ఉన్నాం.
పోనీ మన ఉనికి తెలిపితే?గ్రహాంతర వాసుల గురించి మనం వెదికే బదులు, అసలు మన ఉనికే వారికి తెలియజేస్తే పోలా.. అనే వాదన శాస్త్రవేత్తల్లో బయలుదేరినప్పుడు అందరూ 'అవును, నిజమే..' అన్నారు.  అనడమే కాదు, ఆ దిశగా ప్రయత్నాలూ మొదలెట్టారు.  ఇందులో భాగంగా గత ముప్ఫై ఏళ్లుగా పలుమార్లు రేడియో సిగ్నల్స్‌, మెసేజ్‌లు అనంత విశ్వంలోని అనేక నక్షత్రాలు, గ్రహాలకు పంపించారు.  కానీ ఇప్పటి వరకు ఏ గ్రహాంతర వాసి ఈ మెసేజ్‌లకు స్పందించ లేదు.  వారి ఉనికి మనకు, మన ఉనికి వారికి తెలియలేదు.  అయినా ఈ నిరంతర వెదుకులాట సాగుతూనే ఉంటుంది.  
ఆ నమ్మకమే..
ఈ అనంత విశ్వంలో ఎక్కడో ఒకచోట గ్రహాంతరవాసులు ఉండే ఉంటారనే ఒక చిన్న నమ్మకమే ఖగోళ శాస్త్రవేత్తలను ఇంతకాలం ఉత్తేజపరుస్తూ వస్తోంది.  సువిశాల విశ్వంలో మన లాంటి సౌర కుటుంబాలు ఇంకా బోలెడు ఉన్నాయని తెలిసినప్పుడు, భూమ్మీది శక్తివంతమైన టెలిస్కోప్‌లకు అచ్చు భూమిని పోలిన గ్రహాలు చిక్కినప్పుడు, అంతులేని జలరాసులు నిండి ఉన్న గ్రహాల ఉనికి బయటపడినప్పుడల్లా  భూమ్మీది మానవుల్లో ఏదో తెలియని ఉత్కంఠ..  ఎక్కడైనా, ఎవరైనా ఉన్నారేమోనని.  బహుశా ఇదొక అంతులేని నిరీక్షణ కావచ్చు!  
ఎప్పుడెప్పుడు? ఏయే మెసేజ్‌లు?
1974 - Arecibo Message :
భూమి మీద మన ఉనికిని గ్రహాంతరవాసులకు తెలియజేసే మొట్టమొదటి మెసేజ్‌ ఇది. Arecibo రేడియో టెలిస్కోప్‌ ద్వారా దీనిని భూమికి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత 'గ్లోబులార్‌ క్లస్టర్‌ M13' కు పంపారు. ఇది అక్కడికి చేరేసరికి మనం 26,974 సంవత్సరంలో ఉంటాం.
1986 - పొయెటికా వెజినల్‌ :
బ్యాలే నృత్యకారిణుల పొత్తికడుపు కండరాల కదలికలు శబ్దాలు, మానవుల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చిత్రాలతో కూడిన మెసేజ్‌ ఇది. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన మిల్‌స్టోన్‌ హిల్‌ రాడార్‌ ద్వారా దీనిని మన భూమికి 10-12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న Epsilon Eridani, Tau Ceti అనే రెండు నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుని పంపించారు. ఈ మెసేజ్‌ Epsilon Eridani నక్షత్రానికి 1996లో చేరగా, Tau Ceti నక్షత్రానికి 1998లో చేరింది.
1999 - కాస్మిక్‌ కాల్‌ 1 :
ఇది ఇంటర్‌ స్టెల్లార్‌ రొసెట్టా స్టోన్‌ పరిజ్ఞానం కలిగిన, గణిత, సామాన్య శాస్త్రాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిన్న టెక్స్‌ట్‌ మెసేజ్‌. ఉక్రెయిన్‌లోని ఆర్‌టి-70 రేడియో ఆస్ట్రానామికల్‌ టెలిస్కోప్‌ ద్వారా దీనిని విశ్వంలోకి పంపించారు.
2001 - టీన్‌ ఏజ్‌ మెసేజ్‌ :
రష్యన్‌ ఆకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన రేడియో ఇంజనీర్‌ అలెగ్జాండర్‌ జెయిత్సెవ్‌ ఆధ్వర్యంలో రష్యాలోని కొంతమంది యువతీయువకులు పంపిన మెసేజ్‌ ఇది. మొత్తం ఆరు నక్షత్రాలకు చేరే విధంగా దీన్ని పంపించారు. వాటిలో ఒక నక్షత్రమైన 47 ఉర్సే మజొరిస్‌ మనలాంటి సౌర కుటుంబాన్ని కలిగి ఉంది. 2047లోగాని ఈ మెసేజ్‌ అక్కడికి చేరదు.
2003 - కాస్మిక్‌ కాల్‌ 2 :
ఇంటర్‌ స్టెల్లార్‌ రొసెట్టా స్టోన్‌ పరిజ్ఞానంతో కూడిన రెండో మెసేజ్‌ ఇది. టీమ్‌ ఎన్‌కౌంటర్‌ అనే కంపెనీ ఆర్థిక సాయం చేయగా, కొన్ని ఫొటోలు, మల్టీమీడియా ఫైల్స్‌తో కూడిన ఈ మెసేజ్‌ మరో అయిదు నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుని పంపించారు.
2005 - క్రెయిగ్స్‌ లిస్ట్‌ :
ఈ ప్రాజెక్టులో భాగంగా అక్షరాలు, బొమ్మలు కాకుండా ఏకంగా ఓ వెబ్‌సైట్‌నే విశ్వంలోకి పంపించారు. క్రెయిగ్స్‌ లిస్ట్‌ అనేది క్లాసిఫైడ్స్‌ సర్వీస్‌ అందించే వెబ్‌సైట్‌. డీప్‌ స్పేస్‌ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ అనే కంపెనీ అనేక మెసేజ్‌లతో కూడిన ఈ వెబ్‌సైట్‌ను ఫలానా నక్షత్రం, గ్రహం అని కాకుండా విశ్వంలోకి పంపించింది.
2008 - ఎక్రాస్‌ ది యూనివర్స్‌ :
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' ఆవిర్భవించి యాభై ఏళ్లు గడిచిన సందర్భంగా 2008 ఫిబవ్రరిలో ప్రముఖ పాప్‌ గాయక బృందం 'బీటిల్స్‌' ఆలపించిన గీతమే మెసేజ్‌గా విశ్వంలోకి పంపించింది. ఈ మెసేజ్‌ లక్ష్యం ధ్రువ నక్షత్రమైన 'పోలారిస్‌'. బీటిల్స్‌ పాట 2439వ సంవత్సరంలో అక్కడికి చేరుతుంది.
2008 - ఎ మెసేజ్‌ ఫ్రమ్‌ ఎర్త్‌ :
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ 'బెబో ' 2008లో ఎ మెసేజ్‌ ఫ్రమ్‌ ఎర్త్‌' పేరిట ఒక పోటీ నిర్వహించింది. సామాన్యులు మొదలుకొని అనేకమంది సెలబ్రిటీల వరకు ఈ పోటీలో పాల్గొన్నారు. మొత్తంమ్మీద ది బెస్ట్‌ అనిపించుకున్న 501 మెసేజ్‌లు ఎంపిక చేసి, వాటిని ఉపరితలాన అంతులేని జలరాసులతో, అచ్చు మన భూమిలాగే ఉన్న గ్రహం Gliese 581cను లక్ష్యంగా చేసుకుని, ఆర్‌టి-70 రేడియో ఆస్ట్రానామికల్‌ టెలిస్కోప్‌ ద్వారా ఈ మెసేజ్‌ను పంపించారు. ఇది అక్కడికి చేరడానికి మరో పద్ధెనిమిది ఏళ్లు పడుతుంది.
2008 - డోరిటోస్‌ అడ్వెర్ట్‌ :
ఆర్కిటిక్‌ సర్కిల్‌లోని రాడార్ల ద్వారా 6 గంటలపాటు ఈ మెసేజ్‌ను పంపించారు. దీని లక్ష్యం మనలాంటి సౌర కుటుంబాన్ని కలిగి ఉన్న 47 ఉర్సే మజొరిస్‌ అనే నక్షత్రం. మళ్లీ ఏడాది తరువాత ఏకంగా 'ది డే ది ఎర్త్‌ స్టుడ్‌ స్టిల్‌' అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను సుదూరాన ఉన్న నక్షత్ర సముదాయం 'ఆల్ఫా సెంటారీ'కి పంపించారు.
2009 - హలో ఫ్రమ్‌ ఎర్త్‌ :
గత ఏడాది ఆగస్టు నెలలో కాస్మోస్‌ అనే మ్యాగజైన్‌ ఒక పోటీ నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన అసంఖ్యాక మెసేజ్‌ల నుంచి కొన్నింటిని ఎంపిక చేయగా, వాటిని గుదిగుచ్చి భూమిని పోలిన మరో గ్రహం Gliese 581d ను లక్ష్యంగా చేసుకుని ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా డీప్‌ స్పేస్‌ కమ్యూనికేషన్‌ కాంప్లెక్స్‌ నుండి ఈ మెసేజ్‌ను పంపించారు. మరో తొమ్మిదేళ్ల తరువాత అంటే.. 2029లో ఈ మెసేజ్‌ ఆ గ్రహాన్ని చేరుతుంది.
2009 - రుబిస్కో మెసేజ్‌ :
గ్రహాంతర వాసులను కనుగొనడమే లక్ష్యంగా విశ్వంలోకి మొట్టమొదటి రేడియో మెసేజ్‌ను పంపి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రుబిస్కో మెసేజ్‌ను పంపించారు. RuBisCo అనేది భూమ్మీద మొక్కల్లో విరివిగా లభ్యమయ్యే ఒక ఎంజైమ్‌. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ఎంజైమ్‌ జెనెటిక్‌ కోడ్‌ను విశ్వంలోకి ట్రాన్స్‌మిట్‌ చేశారు.