Wednesday 1 July 2009

దుమ్ము అంటుకోని దుస్తులు!

ఎక్కడ పడితే ఆక్కడ కూర్చుంటే దుస్తులు మాసిపోతాయేమోని ఒకరు అనుకుంటే, ఐస్‌క్రీమ్‌, చాక్లెట్‌ మరకలు కనిపిస్తే అమ్మ ఒళ్లు చీరేస్తుంది అని పిల్లలు భయపడుతుంటారు. అయితే ఇకముందు మాత్రం ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, దుమ్మును, మరకలను వాటంతట అవే శుభ్రం చేసుకునే దుస్తులు వచ్చేశాయి మరి. నమ్మకం కలగడం లేదా? అయితే మీరే చదవండి.

ఇప్పుడు మార్కెట్లో కొన్ని రకాల పెయింట్లు, రూఫ్‌లు, కిటికీ అద్దాలు లభిస్తున్నాయి. దుమ్ము, ధూళి కారణంగా వీటికి ఎలాంటి మరకలు అంటుకోవు. ఒకవేళ అంటుకున్నా, కాసిని నీళ్లు పోసి తుడవగానే మరకలు, ముద్రలు అన్నీ మటుమాయం అవుతాయి. అయితే ఎందుకని వీటికి మరకలు అంటుకోవు? ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణ వెనుక ఉన్నది మన జాతీయ పుష్పం 'కమలం' అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ! కానీ ఇది నిజం.
కమలం సాధారణంగా చిన్న చెరువుల్లో, మురికినీటి గుంతల్లోని బురదలోంచి పురుడుపోసుకుంటుంది. కానీ దానిని చూసిన వారు అది బురదలో పుట్టిందంటే ఎంత మాత్రమూ నమ్మలేనంతగా ఉంటుంది. ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా మెరిసిపోతుంటుంది. దీనికి కారణం అది తనంత తానుగా (సెల్ఫ్‌ క్లీనింగ్‌) శుభ్రం చేసుకుంటుండడమే.

లోటస్‌ ఎఫెక్ట్‌
కమలం ఆకులను ఎప్పుడైనా పరీక్షగా గమనించినట్టయితే మనకో విషయం బోధపడుతుంది. దానిపై నీటి చుక్కలు ఏమాత్రం నిలవవు. కమలం ఆకులపై ఎన్ని బకెట్ల నీళ్లు కుమ్మరించినా కూడా కేవలం ఒకటి రెండు చుక్కలే దాని ఆకులపై నిలబడతాయి. కచ్చితంగా ఇదే విషయం జర్మనీకి చెందిన వృక్షశాస్త్ర నిపుణుడు 'విల్‌ హెలమ్‌ బార్తోలోట్‌' దృష్టిని ఆకర్షించింది. అంతే.. దీని గురించి ఆయన విస్తృతంగా పరిశోధనలు జరిపి అనేక విషయాలను కనుగొన్నాడు. తాను కనుగొన్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి ఆయన 'లోటస్‌ ఎఫెక్ట్‌' అని నామకరణం చేశాడు.

ఎందుకు తడవదు?
కమలం ఆకులు వర్షంలో ఎంతగా తడిసి ముద్దయినప్పటికీ దాని ఆకులపైన కేవలం ఒకటి రెండు నీటి బిందువులు మాత్రమే నిలబడడానికి కారణం వాటిపై ఉండే మైనం లాంటి పదార్థం, చిన్నచిన్న బొడిపెలు, సన్నటి నూగు మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి 1970లో బార్తోలోట్‌ కమలం ఆకులను స్కానింగ్‌ చేశాడు. ఈ పరిశోధనలో ఆసక్తి కరమైన అంశాలు ఎన్నో బయటికి వచ్చాయి. మొత్తం వర్షపు చినుకుల్లో కేవలం 2-3 శాతం బిందువులు మాత్రమే కమలం ఆకుల ఉపరితలంపై నిలబడి, మిగతావి కిందికి జారి పోతాయి. క్యూటిన్‌ అని పిలిచే ఒకరకమైన పదార్థమే కమలం ఆకుపై మైనంలా పరుచుకొని ఉంటుందని, దీనివల్లే నీటి బిందువులు ఆకులపై నిలబడటం లేదని బార్తోలోట్‌ గ్రహించాడు. ఈ కారణంగానే నీటి బిందువులు అతి తక్కువ సంఖ్యలో ఆకుపై కూర్చుంటాయి. అది కూడా కమలం ఆకు 90 డిగ్రీల కన్నా ఎక్కువ కోణంలో ఉన్నప్పుడే. అంతకంటే తక్కువ ఉంటే ఆకుపై నీటి బిందువులు నిలువలేవు. మరోవైపు ఆకుపై ఉండే లెక్కలేనన్ని బొడిపెలు ఈ కోణాన్ని 150 డిగ్రీలకు పెంచేస్తాయి. దీనివల్ల ఆకులు 'సూపర్‌- హైడ్రోఫోబిక్‌'గా తయారవుతాయి. ఇంకోవైపు సన్నటి నూగులాంటి నిర్మాణాలు ఈ కోణాన్ని మరో 16 డిగ్రీలు పెంచేస్తాయి. ఈ కారణంగానే నీటి బిందువులు కమలం ఆకుపై నిలువ కుండా దొర్లిపోతాయి. అయితే నిలబడే కొద్దిపాటి నీటి బిందువుల కూడా ఆకుపై ఉండే బొడిపెలపై నిలుచుంటాయి. ఒక మనిషి మేకుల మంచంపై పడుకుంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఇదే విధంగా బురద, దుమ్ము కూడా ఆకుమీద బొడిపెలపై మాత్రమే నిలబడుతుంది. వర్షపు చుక్కలు ఆకుమీద పడి కిందికి జారిపోతున్నప్పుడు దానిమీద ఉన్న దుమ్ము, ధూళి, బాక్టీరియాను కూడా అవి తమతోపాటు కిందికి లాగేసుకుంటాయి. ఈ కారణంగానే కమలం ఎప్పుడూ స్వచ్ఛంగా కనిపిస్తుంది.

వ్యాపారంగా
ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టిన బార్తోలోట్‌ మొదట దీనిని కమర్షియల్‌గా ఉపయోగించుకోవచ్చనే విషయం గురించి పట్టించుకోలేదు. కానీ 1980లో ఆయనలో ఈ ఆలోచన మొగ్గతొడిగింది. కొద్దిగా ముతక గా, మైనంతో కూడిన ఉపరితలాన్ని సింథసైజ్‌ చేసినట్టయితే కృత్రిమ 'లోటస్‌ ఎఫెక్ట్‌'ను తయారు చెయ్యవచ్చనే నిర్ధారణ కొచ్చాడు. 1997లో తన 'లోటస్‌ ఎఫెక్ట్‌'కు పేటెంట్‌ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇదే టెక్నాలజీని ఉపయోగించి 'డాకర్స్‌ అండ్‌ గ్యాప్‌' సంస్థ 'సెల్ఫ్‌ క్లీనింగ్‌ క్లోత్స్‌( తమను తామే శుభ్రపరుచుకునే దుస్తులు) ను ఉత్పత్తి చేస్తోంది.

ఎలా చేస్తారు?
ఈ దుస్తుల తయారీలో 'అనటాస్‌ టైటానియమ్‌ డైయాక్సైడ్‌' కాంపౌండ్‌ నానో క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి ఫొటోకెటాలటిక్‌ను డీగ్రేడ్‌ చేయగలవు. ఇవి దుస్తులకు అంటిన దుమ్ము, ధూళిని సులభంగా తొలగిస్తాయి. అంతేకాక ఎంతో శక్తివంతమైన హానిచేసే 'మైక్రోఆర్గాజమ్స్‌'ను కూడా తొలగిస్తాయి.

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌
సెల్ఫ్‌ క్లీనింగ్‌ దుస్తులు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి పెరుగుతున్న ముప్పుకూడా చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ దుస్తులు అందుబాటులోకి వస్తే రసాయలనాలు, విద్యుత్తు, నీళ్లు తదితరాల వినయోగం తగ్గుతుంది. తద్వారా పర్యావరణాన్ని కొంత వరకు పరిరక్షించుకోవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు డ్రై క్లీనింగ్‌కు అయ్యే ఖర్చునుంచి కూడా ప్రజలు ఉపశమనం పొందొచ్చన్నమాట. ఈ టెక్నాలజీ మరింత విస్తృతమైతే ఇకముందు దుస్తులు ఉతికేందుకు మహిళలు ఏమాత్రం కష్టపడనక్కర్లేదు. ముఖ్యంగా పిల్లలు తమకిష్టమైన ఆహార పదార్థాలు దుస్తులపై పడతాయేమో అనే భయం లేకుండా తినేయొచ్చు. అలాగే ఎక్కడైనా సరే దుమ్ము ఆలోచన లేకుండా కూర్చోవచ్చు. అయితే డిటర్జెంట్‌ సబ్బులు తయారు చేసే కంపెనీలకు మాత్రం పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. ఈ సెల్ఫ్‌ క్లీనింగ్‌ దుస్తులు గనుక అందుబాటులోకి వసే తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే విషయంలో ఈ కంపెనీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఈ దుస్తులు కొనేద్దామని మార్కెట్‌కు మాత్రం వెళ్లకండి. ఎందుకంటే ఇవి రావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చు.
చూద్దాం.. భవిష్యత్తులో మానవ జీవితంలో ఇంకా ఏమేం విచిత్రాలు చోటుచేసుకుంటాయో!




0 comments: