
ప్రయాణాలంటే కొందరికి చాలా ఇష్టం. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని.. సరదాగా నాలుగు రోజులు గడిపి సరికొత్త అనుభూతులు మూటకట్టుకోవాలని భావిస్తుంటారు. మీరూ ఇలాంటి పర్యాటకాభిలాషులైతే ప్రయాణాలలో మీకు అవసరమైనవి, మీరు అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా...
ఖర్చెంత?
ఏ ప్రయాణానికైనా ఇదే ముఖ్యమైన అంశం. మొత్తం ప్రయాణంలో ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే ఒక అవగాహన ఉండాలి. టూర్ మొత్తంలో వసతి, ఆహారం, రానుపోను ఛార్జీలు.. ఇలా రోజువారీ ఎంతెంత ఖర్చు అవుతుందో తెలిసుంటే మరీ మంచిది. సరిపడా డబ్బు జేబులో లేకపోయినా డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయి కదా అనే ధైర్యంతో కొందరు టూర్‌లకు సిద్ధమవుతారు. అయితే మీరు వెళ్లే ప్రదేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయా? అన్నది ముందుగానే తెలుసుకోవడం మంచిది. లేకుంటే కొత్త ప్రదేశంలో జేబులో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఏం తీసుకెళ్లాలి?
ప్రయాణం అనగానే చాలు కొంతమంది అవీ, ఇవీ సూట్‌కేస్ లేదా ట్రావెల్‌బ్యాగ్‌లో కుక్కేస్తుంటారు. ఇంత అవసరమా? అని ప్రశ్నిస్తే.. 'ఏమో ఎక్కడ.. ఏది.. ఎప్పుడు.. ఎందుకు అవసరమవుతుందో తెలియదు కదా!..' అంటూ సమర్థించుకుంటారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. సరదాగా టూర్‌కు వెళుతున్నప్పుడు లగేజి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. లేకుంటే ఆ 'మోత బరువు' మీ ఆనందాన్ని హరించి వేస్తుంది. కాబట్టి చిన్న చిన్న వస్తువులు వదిలేసి, 'మరీ ముఖ్యమైనవి, వెళ్లే ప్రదేశంలో దొరకవు..' అనుకున్న వస్తువులను మాత్రమే బ్యాగ్‌లో సర్దుకోవాలి.
వసతి ఎక్కడ?
ఇది కూడా చాల ముఖ్యమైన విషయమే. వెళుతున్నది కొత్త ప్రదేశమైతే.. అక్కడ ఉండడానికి అనువైన వసతి సౌకర్యాన్ని ముందుగానే అరేంజ్ చేసుకోవడం చాలా మంచిది. తీరా అక్కడికి వెళ్లాక వసతి దొరకకపోతే అవస్థలు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణానికి ముందుగానే ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా మీరు ఏ రోజున ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారన్నది మీకు వసతి కల్పించే వారికి కూడా ముందుగానే తెలియజేయాలి.
కమ్యూనికేషన్ ముఖ్యం
ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్లినా మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో 'కమ్యూనికేషన్ ' కొనసాగించడం చాలా మంచిది. సెల్‌ఫోన్లు వచ్చాక ఈ కమ్యూనికేషన్ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కొన్ని సుదూర ప్రాంతాలలో నేటికీ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలతోనైనా సంబంధాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరెవరు, ఏ పనిమీద ఆ ప్రదేశానికి వచ్చారు.. అనే కనీస వివరాలైనా అక్కడి వారికి తెలియడం మీకు చాలా మంచిది.
గైడ్ బుక్స్ ఉండాలి
కొత్త ప్రదేశాలకు వెళుతున్నప్పుడు మీ ట్రావెల్ బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుల్లో ఇదొకటి. మీరు వెళుతున్న ప్రదేశాలకు సబంధించిన గైడ్ బుక్స్ మీ వద్ద ఉండటం క్షేమకరం. కొత్త ప్రదేశంలో ఏ రోడ్డు ఎక్కడికి వెళుతుంది, ఎక్కడెక్కడ ఏమేం దొరుకుతాయి అన్నది మీకు ఈ గైడ్‌బుక్స్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. వీలైతే ప్రయాణానికి ముందే ఈ గైడ్‌బుక్స్‌తో కుస్తీ పట్డండి. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లిన తరువాత మీ పని మరింత సులువు అవుతుంది.
సో, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ!
2 comments:
u r blog is excellent.... keep it up...
u r blog is very much interesting....
Post a Comment