Wednesday 24 June 2009

తక్కువ ధరలో 'యాపిల్‌ ఐఫోన్‌'!?

యాపిల్‌ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. కొత్తగా 'యాపిల్‌ ఐఫోన్‌' మార్కెట్‌లోకి వచ్చినప్పుడయితే.. సినిమా థియేటర్‌లో టిక్కెట్ల కోసం బారులుదీరినట్లు అమెరికాలో యాపిల్‌ ఐ-స్టోర్స్‌ దగ్గర అక్కడి జనం 'క్యూ' కట్టారు. ఇక మన దేశంలో అయితే సెల్‌ వినియోగదారులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.. ఐఫోన్‌ 3జి ఎప్పుడొస్తుందాని! ఒక్క ఐఫోన్‌ 3జి మాత్రమే కాదు, అసలు యాపిల్‌ కంపెనీ ఏ ఉత్పత్తి తీసుకున్నా 'ఏక్‌ సే ఏక్‌' అన్నట్లు ఉంటాయి మరి. కానీ ఏ లాభం యాపిల్‌ ఐఫోన్‌ 3జి భారత్‌కైతే వచ్చింది కానీ, భారతీయులందరినీ అలరించలేక పోయింది. కారణం - దాని ధర. భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 3జి పంపిణీ బాధ్యతలను ఎయిర్‌టెల్‌, ఒడాఫోన్‌ తమ భుజాలపైన వేసుకున్నాయి. క్వాలిటీ ఉన్నా.. కాస్ట్‌లీ కావడంతో అన్ని వర్గాల ప్రజలు దీనిని అందు'కొనలేక'పోయారు.

అయితే సెల్‌ ప్రియులకు శుభవార్త ఏమిటంటే.. త్వరలో యాపిల్‌ ఐఫోన్‌ ధర తగ్గనుంది. అంటే ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఫోన్‌ 3జి ధర కాదు.. తక్కువ ధరలో యాపిల్‌ కంపెనీ మరో ఐఫోన్‌ను విడుదల చేయబోతోందట. అది కూడా రాబోయే రెండు మూడు నెలల్లోనే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ పుకారు.. షికార్లు చేస్తోంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కూడా ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ వార్త ప్రచురించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యాపిల్‌ ఐఫోన్‌ 3జి రెండు వెర్షన్లలో లభిస్తోంది. 8 జిబి ఫోన్‌ రూ.9,485కు, 16 జిబి ఫోన్‌ రూ.14,225క లభిస్తున్నాయి. అయితే ఈ ధరలు విదేశాలలో మాత్రమే. మన దేశానికి వచ్చేసరికి ఈ రెండు మోడళ్ల ధరలు వరుసగా రూ.30,000, రూ.36,000. కానీ ప్రస్తుతం షికార్లు చేస్తున్న పుకార్ల ప్రకారం... త్వరలో విడుదలకానున్న ఐఫోన్‌ కూడా రెండు మోడళ్లలో లభిస్తుంది. ఒకటి 16 జిబి (ధర రూ.9,485) మరోటి 32 జబి (ధర రూ.14,225). అంతేకాదు, వీటితోపాటు మరో మోడల్‌ విడుదలకు కూడా యాపిల్‌ కంపెనీ సన్నాహాలు చేస్తోందని, అయితే ఈ మూడో మోడల్‌ ఐఫోన్‌లో ఇంటర్నల్‌ మెమరీ ఉండదని, ఇదే గనుక జరిగితే యాపిల్‌ కంపెనీకి చెందిన ఎంట్రీ-లెవల్‌ సెల్‌ఫోన్లలో ఇది స్మార్ట్‌ఫోన్‌ అవుతుందని డచ్‌ టి-మొబైల్‌కు చెందిన ఇన్వెంటరీ సిస్టమ్‌ చెబుతోంది. అయితే ఈ మూడో మోడల్‌ ధర ఎంతనేది మాత్రం ఈ సిస్టమ్‌ చెప్పడం లేదు.

మరో విషయం ఏమిటంటే - ఈసారి విడుదల చేయనున్న ఫోన్లకు యాపిల్‌ కంపెనీ ఏ పేరు నిర్ణయిస్తుందనేది కూడా రహస్యమే. మొట్టమొదటి మోడల్‌కు 'ఐఫోన్‌' అని, రెండోసారి విడుదల చేసిన మోడల్‌కు 'ఐఫోన్‌ 3జి' అని నామకరణం చేసిన ఈ కంపెనీ ఇప్పుడు విడుదల చేయబోయే మోడళ్లకు ఏం పేరు పెడుతుందో అని ప్రపంచ వ్యాప్తంగా సెల్‌ వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టి-మొబైల్‌కు చెందిన ఇన్వెంటరీ సిస్టం తెలిపిన సమాచారం మేరకు.. కొత్త మోడల్‌కు 'ఐఫోన్‌' పేరే ఉంచొచ్చు.. లేదా కాస్త భిన్నంగా ఉండాలని యాపిల్‌ కంపెనీ భావిస్తే గనుక 'ఐఫోన్‌ 2009' అనే పేరు కూడా తెరపైకి రావచ్చు. 'ఇవేవీ కావు.. కొత్తగా రాబోయే ఐఫోన్‌ పేరు 'ఐఫోన్‌ వీడియో', ఎందుకంటే ఇందులో మొట్టమొదటిసారిగా 'వీడియో రికార్డింగ్‌' సౌకర్యాన్ని యాపిల్‌ తన వినియోగదారులకు అందించనుంది.. అంతేకాదు, ఇందులో కొన్ని అప్లికేషన్లను ఎడిట్‌ చేసుకునే సదుపాయాలు కూడా ఉండబోతున్నాయి..' అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ, మన దేశానికి వచ్చేసరికి మాత్రం ఈ పేర్లు, అందులో ఉండబోయే ఫీచర్లు, మెమరీ.. ఇలాంటివేమీ ముఖ్యం కావు.. దాని 'ధరెంత' అన్నదే అసలు పాయింటు.. ఏమంటారు?

0 comments: