Thursday 29 April 2010

ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌

ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌ను ఎల్‌జి డిస్‌ప్లే కంపెనీ లిమిటెడ్‌ ఆవిష్కరించింది. దీని వెడల్పు 19 అంగుళాలు. అంటే దాదాపు ఎ3 సైజు న్యూస్‌పేపర్‌ లా ఉంటుందన్నమాట. విశేషం ఏమిటంటే.. ఈ ఈ-పేపర్‌ను మడతబెట్టేయొచ్చు లేదంటే చుట్టలా చుట్టి పట్టుకెళ్లవచ్చు. ప్రస్తుతం మనకు 6 అంగుళాల ఈ-బుక్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎల్‌జి డిస్‌ప్లే ఆవిష్కరించిన ఈ ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌ పరిమాణంలో చాలా పెద్దది. 0.3 మిల్లీమీటర్ల మందం ఉండే ఈ ఈ-పేపర్‌ కేవలం 130 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ ఫ్లెక్సిబుల్‌ ఈ-పేపర్‌ తయారీలో ఎల్‌జి డిస్‌ప్లే మెటల్‌ ఫాయిల్‌ మీద గాజుకు బదులుగా థిన్‌ ఫిల్మ్‌ ట్రన్సిస్టర్‌(TFT) ని ఉపయోగించింది. అందువల్లే దీన్ని ఎటు పడితే అటు మడతేయొచ్చు. అలాగే దీని తయారీలో గేట్‌ ఇన్‌ ప్యానల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీని ధర ఇతర వివరాలను ఎల్‌జి ఇంకా ప్రకటించలేదు. అయితే మొదట 11.5 అంగుళాల ఫ్లెక్సిబుల్‌ ఈ పేపర్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని, ఆ తరువాతే ఈ ఎ3 సైజ్‌ ఈ-పేపర్‌ను విడుదల చేయాలని ఎల్‌జి డిస్‌ప్లే కంపెనీ లిమిటెడ్‌ భావిస్తోంది.

0 comments: