Wednesday 21 April 2010

బ్లాగరూ.. మీ 'రేటింగ్‌' ఎంత?

మీరు బ్లాగరా? అయితే మీ బ్లాగ్‌ రేటింగ్‌ ఎంతో మీకు తెలుసా?

ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్‌లో బ్లాగ్‌లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. రానురాను ఇవి వెబ్‌సైట్లను మించిపోతున్నాయి. 'కాదేదీ బ్లాగ్‌కు అనర్హం..' అన్నట్లుగా తయారైంది పరిస్థితి. మరి ఇంత పెద్ద బ్లాగ్‌లోకంలో మీ రాతలను ఎందరు చదువుతున్నారు? నిజానికి చాలామంది బ్లాగర్లు 'నాకూ ఓ బ్లాగ్‌ ఉంది..' అని చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారని బ్లాగులపై ఇటీవల జరిపిన ఓ అధ్యయనం పేర్కొంటోంది. ఇటీవల జరిగిన బ్రిటీష్‌ సైకలాజికల్‌ సొసైటీ సాంవత్సరిక సమావేశంలో భాగంగా ఈ అధ్యయనం జరిగింది. బ్రిటన్‌కు చెందిన పరిశోధకుడు సుసాన్‌ జామిసన్‌-పావెల్‌ ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన 75 మంది బ్లాగర్లు, వారి బ్లాగుల గురించి ఈ అధ్యయనం జరిపారు. ఆనక ఆయన తన అధ్యయన విశేషాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఇంటర్నెట్‌లో బ్లాగులు ఎక్కువేకానీ, తమ బ్లాగ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువట.

అదే ప్రామాణికం..
బ్లాగులోకంలో బ్లాగ్‌ ఉండడం ప్రామాణికం కాదని, దాన్ని ఎంత తరచుగా అప్‌డేట్‌ చేస్తున్నారన్నది ప్రామాణికమని బ్రిటన్‌ పరిశోధకుల కొత్త అధ్యయనం తెలుపుతోంది. మీ బ్లాగ్‌ ఎంత అందంగా ఉన్నా, ఎంత విలువైనదైనా ఉపయోగం ఏముంది అందులో కొత్త పోస్టింగ్‌లు లేనప్పుడు? తన అధ్యయనంలో భాగంగా పావెల్‌ ఒక్కో బ్లాగర్‌కు మొత్తం ఎన్ని బ్లాగులు ఉన్నాయి? వాటిల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? సదరు పోస్టుల్లో ఉన్న మొత్తం పదాలు ఎన్ని? ఆయా పోస్టులకు ఎన్ని కామెంట్లు వచ్చాయి? వాటిలో పాజిటివ్‌ కామెంట్‌లు ఎన్ని? నెగిటివ్‌ కామెంట్‌లు ఎన్ని? అనే విషయాలపై అధ్యయనం జరిపారు. అంతేకాకుండా బ్లాగర్లందరిచేత ఇతర బ్లాగర్లకు పరస్సరం రేటింగ్స్‌ కూడా ఇప్పిచారు. చివరికి ఈ అధ్యయనంలో 'స్నేహితులు ఎక్కువగా ఉన్న బ్లాగర్లే తమ బ్లాగుల్లో తరచూ కొత్త పోస్టింగ్‌లు ఉంచుతున్నారని, వీరి బ్లాగులే అందరినీ ఆకట్టుకుంటున్నాయి..' అని తేలింది.
ఇంకేం, మీరూ ఓసారి మీ స్నేహితుల జాబితా చూసుకోండి మరి!

2 comments:

శ్రీవాసుకి said...

మీరన్నట్టు ఇదేదో బాగానే ఉంది. ముందు స్నేహితుల సంఖ్య పెంచాలన్నమాట.

Ramesh Babu Yenumula said...

శ్రీవాసు గారూ.. నా పోస్ట్‌ చదివినందుకు మీకు నా ధన్యవాదాలు.