Thursday 29 April 2010

సైబర్‌ ఎటాక్స్‌లో మనకు మూడోస్థానం!

సాఫ్ట్‌వేర్‌ రంగంలో సూపర్‌ పవర్‌గా ఎదిగేందుకు భారత దేశానికి మరో పదేళ్ల కాలం పట్టవచ్చేమోగానీ, సైబర్‌ ఎటాక్స్‌లో మాత్రం ఈ దేశం ఇప్పటికే మూడో స్థానంలో ఉన్నట్లు ప్రముఖ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సిమాంటెక్‌ ఇటీవలి తన ఇంటర్నెట్‌ సెక్యూరిటీ థ్రెట్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.

వెబ్‌ బేస్డ్‌ అటాక్స్‌ విషయంలో అమెరికా, బ్రెజిల్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్లు ఈ కంపెనీ తెలిపింది. 2008లో పదమూడో స్థానంలో ఉన్న భారత్‌ ఏడాది గడిచే సరికి మూడో స్థానంలో ఉండడం పట్ల సిమాంటెక్‌ విస్మయం వ్యక్తం చేసింది. అన్ని వెబ్‌ ఆధారిత మాలేషియస్‌ ఎటాక్స్‌తోపాటుగా స్పామ్‌(బోగస్‌ ఈ-మెయిల్స్‌) జనరేటింగ్‌లో సైతం ప్రపంచంలోని ఇతర దేశాలలోకెల్లా భారత్‌ మూడో స్థానంలో ఉందట. ప్రపంచం మొత్తంమ్మీద
పుట్టుకొస్తున్న స్పామ్‌ మెయిల్స్‌లో 4 శాతం ఒక్క భారత్‌ నుంచే పుడుతున్నాయట.
అంతేనా, సిమాంటెక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే మన దేశం ఘనత ఇంకా చాలా ఆసియా పసిఫిక్‌ అండ్‌ జపాన్‌ రీజియన్‌లోకొస్తే మన దేశమే నంబర్‌ ఒన్‌. ఈ ప్రాంతంలో పుడుతున్న స్పామ్‌మెయిల్స్‌లో మన దేశం వాటా 21 శాతం. కంప్యూటర్‌ అసలు యజమానికి తెలియకుండా దాన్ని తమ అదుపులోనికి తీసుకుని, దాన్నుంచి ఇతరులకు స్పామ్‌ మెయిల్స్‌ పంపేవారిని 'జాంబీ' అని పిలుస్తారు. ఈ జాంబీలు తాము జొరబడిన ఇతరుల కంప్యూటర్ల నుంచి వారి వారి పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్‌ నంబర్‌లు గ్రహించి ఆర్థిక నేరాలకు కూడా పాల్పడుతుంటారు. స్పామ్‌ మెయిల్స్‌ సృష్టించి, వాటిని ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్న కంప్యూటర్లకు పంపే వారిలో 6 శాతం, ఆసియా పసిఫిక్‌ అండ్‌ జపాన్‌ రీజియన్‌కు పంపేవారు 28 శాతం మన దేశంలోనే నివసిస్తున్నారట.
మరోవైపు ఫిషింగ్‌ కూడా అధిక మవుతుంది. ఇతరులు కంప్యూటర్లలోకి జొరబడి వారి వివరాలను తస్కరించడాన్ని భద్రతా నిపుణులు 'ఫిషింగ్‌'గా పేర్కొంటారు. ఫిషింగ్‌లో భాగంగా స్పామర్లు ఆయా వ్యక్తుల కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అవసరమైతే వారికి సంబంధించిన వివరాలతో వారికే మెయిల్స్‌ పంపుతారు. ఉదాహరణకు పేరు, చిరునామా, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు. తమకు సంబంధించిన వివరాలు కనిపించడంతో ఆయా వ్యక్తులు నిజమే అని భ్రమపడి వాటికి కింద ఉన్న లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా స్పామర్ల ఉచ్చులో పడిపోతారు.
అంతేకాదు, మన దేశం కంప్యూటర్‌ మాల్‌వేర్‌ వార్మ్స్‌, వైరస్‌ల విషయంలో మొదటి స్థానంలోను, ట్రోజన్‌ హార్స్‌ల విషయలో రెండోస్థానంలో ఉందట. ప్రతిరోజూ భారత దేశంలో 788 కంప్యూటర్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళుతున్నాయి. 2009 నాటికి దేశంలోని వివిధ ప్రాంతాలలో 62,623 కంప్యూటర్లు జాంబీల చేతుల్లోకి వెళ్లిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో సగం కంప్యూటర్లు ఒక్క ముంబై నగరంలోనే ఉన్నాయట. ఆ తరువాత జాబితాలో 13 శాతం కంప్యూటర్లతో ఢిల్లీ, 7 శాతం కంప్యూటర్లతో హైదరాబాద్‌, ఉన్నాయి.
సిమాంటెక్‌ నివేదిక ప్రకారం.. మాల్షీషియస్‌ కోడ్‌లలో అధిక భాగం ఫైల్‌ షేరింగ్‌, ఎక్జిక్యూటబుల్‌ (.exe ఫైళ్ళు) ఫైళ్ళ ద్వారానే వ్యాపిస్తున్నాయి. మిగిలినవి ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌, ఈ-మెయిల్‌ ఎటాచ్‌మెంట్స్‌, ఇన్‌స్టంట్‌ మెసెంజర్స్‌, డేటాబేస్‌, బ్యాక్‌డోర్స్‌ ద్వారా జొరబడుతున్నాయి.

0 comments: