Wednesday 21 April 2010

ఆ రేడియో సంకేతాలు ఎవరివి?!

అంతరిక్షంలో ఇప్పుడో అద్భుతం జరుగుతోంది. మన సౌర కుటుంబానికి సమీపంలో ఉన్న ఓ పాలపుంతలోంచి కొన్ని రేడియో తరంగాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి మనకు తెలియనివి.. ఇప్పటి వరకు మనం చూడనివి. అసలు ఇవి ఏ వస్తువు నుంచి పుట్టుకొస్తున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు.

రేడియో తరంగాలు.. ఈ పదం మనకు కొత్త కాదు. ఎందుకంటే అసలు వాటిని కనిపెట్టిందే మనం. భూమ్మీద మన అవసరాల కోసం, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో భాగంగా మనం ఆకాశంలో గుండా ఒకచోటి నుంచి మరో చోటికి రేడియో తరంగాలను ప్రసారం చేస్తుంటాం. అంతేకాదు, గ్రహాంతర వాసుల అన్వేషణలో భాగంగా ఇప్పటికి ఎన్నోసార్లు మనం భూమి నుంచి రోదసిలోకి రేడియో సంకేతాలు ప్రసారం చేశాం. 1974 నుంచి గత ఏడాది వరకు ఇలా మనం రేడియో తరంగాలను రోదసిలోకి పంపుతూనే ఉన్నాం. అయితే వాటికి అంతరిక్షంలోని ఏ ప్రాంతం నుంచి కూడా నేటి వరకు జవాబు అన్నది రాలేదు. కానీ ఇప్పుడు ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. మన సౌర కుటుంబానికి సమీపంలో ఉన్న M82 అనే పాలపుంతలోంచి కొన్ని రేడియో తరంగాలు నిర్విరామంగా ప్రసారమవుతున్నాయి. బ్రిటన్‌లోని మెక్‌లెస్‌ ఫీల్డ్‌కు సమీపంలో ఉన్న జోడ్రెల్‌ బాంక్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కొందరు ఈ రేడియో తరంగాలను గమనించారు. గత ఏడాది మే నెలలో బ్రిటన్‌లోని మెర్లిన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ రేడియో టెలిస్కోప్‌ల గుండా M82 పాలపుంతలో పేలుడును వీక్షిస్తున్న సమయంలో, ఈ పాలపుంత నుంచి రేడియో తరంగాలు వెలువడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
"అసలు అవి ఏమిటో మాకు అర్థం కాలేదు..'' అని జోడ్రెల్‌ బాంక్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకరైన టామ్‌ ముక్స్‌లో వ్యాఖ్యానిస్తున్నారు. మళ్లీ ఆయనే "మేం మొదట ఒక తెల్లని మచ్చను చూశాం. అది కొన్ని రోజులపాటు కొద్దికొద్దిగా పెద్దది కాసాగింది. సాధారణంగా సూపర్‌నోవా ఏర్పడిన సమయంలో కూడా ఇలాంటి తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి కొన్ని వారాలపాటు ప్రకాశించి, స్పెక్ట్రమ్‌ ఆఫ్‌ రేడియేషన్‌లో మార్పులు వచ్చే కొద్దీ క్రమక్రమంగా వెలుగు తగ్గి, కొన్ని నెలల వ్యవధిలో కనుమరుగవుతాయి. కానీ M82 పాలపుంతలో మేం చూసిన తెల్లని మచ్చ అలా లేదు. ఏడాది కాలంగా మేం దాన్ని గమనిస్తున్నాం. దాని వెలుగులో కొద్దిపాటి మార్పే తప్ప స్పెక్ట్రమ్‌ మాత్రం స్థిరంగా ఉంది..'' అని వివరిస్తున్నారు.

అమిత వేగంతో భూమి వైపు!
అంతేకాదు, ఈ రేడియో తరంగాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటి వేగం కూడా కాంతి వేగానికి నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి వేగం బ్లాక్‌హోల్స్‌ వద్ద మాత్రమే కనిపిస్తుంది. తమ చుట్టూ ఉండే ద్రవ్యరాశిని బ్లాక్‌హోల్స్‌ అమిత వేగంతో తమలోకి లాగేసుకుంటున్న సమయంలో కొంత ద్రవ్యరాశిని బయటికి గెంటుతూ ఉంటాయి. అప్పుడు అక్కడ జనించే వెలుగు ఈ రేడియో తరంగాలలోనూ కనిపిస్తోంది. ఈ తరంగాలు కూడా కొద్దిగా ఒంపుతో కూడి కాంతి వేగంతో మన భూమివైపే ప్రయాణిస్తున్నాయి.

అక్కడ బ్లాక్‌ హోల్‌ ఉందా?
M82 పాలపుంతలో బ్లాక్‌హోల్‌ ఉందా? ఆ బ్లాక్‌హోల్‌లోంచే ఈ రేడియో తరంగాలు పుట్టుకొస్తున్నాయా? ఇవన్నీ ఖగోళ శాస్త్రవేత్తల మదిని తొలుస్తున్న ప్రశ్నలే. బహుశా ఇతర పాలపుంతలలో మాదిరిగా M82 పాలపుంతలో కూడా ఏదైనా సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌హోల్‌ ఉండి ఉండవచ్చనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. లేదా అది చిన్న మైక్రోక్వాజర్‌ కూడా అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అతి పెద్ద నక్షత్రం ఏదైనా పేలినప్పుడు ఏర్పడే బ్లాక్‌ హోల్‌ను మైక్రోక్వాజర్‌గా పిలుస్తారు. ఇలా ఏర్పడిన మైక్రోక్వాజర్‌ ద్రవ్యరాశి మన సూర్యుడి ద్రవ్యరాశి కంటే కంటే 10 నుంచి 20 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ మైక్రోక్వాజర్లు కూడా రేడియో తరంగాలను వెలువరిస్తాయి. అయితే ఇప్పటి వరకు ఈ భూమ్మీద ఇంతటి వెలుగు, వేగంతో కూడిన రేడియో తరంగాలను మనం చూడలేదు. "అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఈ మైక్రోక్వాజర్లు ఒక్క రేడియో తరంగాలనే కాదు, ఎక్స్‌-రేలను కూడా వెలువరిస్తాయి. ఈ లెక్కకొస్తే మరి ఈ M82 పాలపుంతలోంచి రేడియో తరంగాలతోపాటు ఎక్స్‌-రేలు కూడా వెలువడాలి.. కానీ అలా జరగడం లేదు. బహుశా అందరూ భావిస్తున్నట్లుగా ఇది మైక్రోక్వాజర్‌ కూడా అయి ఉండకపోవచ్చు..'' అని ఖగోళ శాస్త్రవేత్త టామ్‌ ముక్స్‌లో అంటున్నారు.
అయితే ఈ సువిశాల విశ్వంలో ఎన్నో పాలపుంతలు, మరెన్నో బ్లాక్‌హోల్స్‌. మన సౌరకుటుంబం ఉన్న పాలపుంత మాదిరిగానే అన్ని పాలపుంతలూ ఉంటాయనుకోవడం మన భ్రమే. బహుశా M82 పాలపుంతలో కనిపించిన ఈ పరిణామాలు బహుశా ఆ పాలపుంతలో సహజమేమో! ఏదేమైనా మనకు తెలియని, మనం చూడని రేడియో తరంగాలు ఈ అనంత విశ్వంలో సుదూరాన ఉన్న పాలపుంత నుంచి వెలువడడం మాత్రం ఇప్పటికి విచిత్రమే!

2 comments:

Anonymous said...

చివరి పేరా చూడండి : అనంతర విశ్వం కాదు, అనంతవిశ్వం.

Ramesh Babu Yenumula said...

థాంక్యూ మిత్రమా.. నా పోస్ట్‌ కూలంకషంగా చదివి, అక్షరదోషం సూచించినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇలాంటి అక్షర దోషాలు దొర్లకుండా మున్ముందు తగిన జాగ్రత్త తీసుకుంటాను.