
అంగారకుడి రెండు ఉపగ్రహాలలో ఫోబోస్ చాలా చిన్నది. పెద్ద ఆస్టరాయిడ్ అంత కూడా ఉండదు. ద్రవ్యరాశి కూడా చాలా తక్కువ. అంతేకాదు, ఫోబోస్‌పై వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి కూడా పెద్దగా ఉండవు. నిజానికి మన భూమికి ఎంతో దగ్గరగా ఉండే చంద్రునిపైకి వెళ్లాలన్నా, తిరిగి భూమికి చేరుకోవాలన్నా మనకు అత్యంత శక్తివంతమైన భారీ వ్యోమనౌకలు కావలసిందే. అంగారకుడి విషయంలోనూ ఇదే సమస్య. ఇంతకన్నా పెద్ద సమస్య అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడం. నాసా తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అయ్యే ఖర్చు, నిధుల విడుదల విషయమై ఇటీవల అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఒక సమీక్షా సమావేశం జరిగింది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నార్మన్ అగస్టీన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికలోని సూచనలపై ఈ సమావేశంలో చర్చించారు. అదేమిటంటే.. భవిష్యత్తులో చంద్రునిపైకి, లేదంటే అంగారకుడిపైకి నాసా మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టడానికి ఏడాదికి 3 కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. అంగారక యాత్రకు అయ్యే ఖర్చుతో దగ్గరలో ఉన్న ఇతర గ్రహాలకు వెళ్లి, తిరిగి రావచ్చు. పైగా భూమి నుంచి బయలుదేరి అంగారకుడిని చేరడానికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువ. కాబట్టి అంగారకుడిపై కాలు మోపే ముందుగా దాని ఉపగ్రహాలలో ఏదో ఒక దానిపైకి చేరుకుని, అక్కడ కొంత కాలంపాటు ఉండి, అంగారకుడికి సంబంధించిన మరింత సమాచారం సేకరించవచ్చనేది దాని సారాంశం. ఇందుకు ఫోబోస్ అన్ని విధాలా అనుకూలిస్తుందని, ఒక్కసారి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించాక ఫోబోస్‌పై దిగడం, అక్కడి నుంచి అంగారకుడిపైకి చేరడం సులువే కాక ఇదంతా తక్కువ ఖర్చులో సాధ్యపడుతుందని ఆ నివేదిక పేర్కొంది. మరో మాటలో చెప్పాలంటే.. మనం భూమి నుంచి చంద్రునిపైకి వెళ్లడానికి అయ్యే ఖర్చు కంటే భూమి నుంచి ఫోబోస్‌కు వెళ్లడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువన్నమాట!
దిగిన తర్వాత?
ఒక్కసారి ఫోబోస్‌పై దిగామంటే.. ఆ తర్వాత అంతా తేలికే. అక్కడ్నించి అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ల సహాయంతో అంగారక గ్రహం గుట్టుమట్లు తెలుసుకోవచ్చు. లేదంటే రిమోట్ కంట్రోల్ రోవర్లను అంగారకుడిపైకి పంపించి అక్కడి పరిస్థితులను మరింత క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. అయితే ఇక్కడో చిన్న చిక్కు ఉంది. అంగారకుడి రెండు ఉపగ్రహాలలో పెద్దదైన ఫోబోస్ గురించి మనకు పెద్దగా ఏమీ తెలియదు. " ఇప్పటి వరకు మనం మన సౌర కుటుంబంలోని ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకున్నాం, ఒక్క ఫోబోస్ గురించి తప్ప.. అసలు అది ఎలా ఏర్పడిందో మనకు తెలియదు.. కానీ ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఏర్పడింది..'' అని కాలిఫోర్నియాలోని మఫెట్ ఫీల్డ్‌లో ఉన్న మార్స్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ పాస్కల్ లీ అభిప్రాయపడుతున్నారు.
ఒక్కసారి ఫోబోస్‌పైకి చేరామంటే చాలు.. ఆ తర్వాత అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగిపోతాయి. అక్కడ్నించి అంగారక గ్రహ కక్ష్యలోకి చేరేందుకు అవసరమైన కీలకమైన ప్రయోగాలు మొదలవుతాయి. వీటిలో 'ఏరో బ్రేకింగ్' టెక్నిక్ ఒకటి. దీని వల్ల వ్యోమనౌక వేగం చాలా వరకు తగ్గిపోతుంది. భూమి మీద విమానంలో ప్రయాణించిన మాదిరిగా ఆ గ్రహపైనా ప్రయాణించవచ్చు. ఆ తర్వాతేముంది? వివిధ రాకెట్ పరికరాలు, రోబోటిక్ వాహనాలతో ఫోబోస్ ఉపగ్రహం కాస్తా మన అవసరాలు తీర్చే ఓ గోడౌన్ మాదిరిగా మారిపోతుంది.
అక్కడ్నించి డెమోస్‌కు?
నాసా తన 'ఫోబోస్ ప్రాజెక్టు'లో భాగంగా ఆ ఉపగ్రహంపై అద్భుతమైన, అత్యంత ఎత్తైన ఒక స్థూపాన్ని నిర్మించాలని భావిస్తోంది. దీనిపేరు 'మోనోలిత్'. ఫోబోస్ ఉపరితలం నుంచి 90 మీటర్ల ఎత్తు వరకు ఇది నిర్మింపబడుతుంది. ఆ తరువాత మార్స్ వ్యోమనౌక ఫోబోస్ ఉపరితల వాతావరణంలో ఉన్న ఈ మోనోలిత్ స్థూపాన్ని పరీక్షిస్తుంది. తర్వాత ఫోబోస్‌పైనే మరో ప్రదేశానికి చేరుకుని అక్కడి నమూనాలను సేకరించి, ఆనక మార్స్ ఉపగ్రహాలలో చిన్నదైన డెమోస్‌పైకి చేరుకుంటుంది. అక్కడ కూడా అవసరమైన నమూనాలు సేకరించిన తర్వాత వ్యోమనౌక తిరిగి భూమిని చేరుకుంటుంది. "ప్రాజెక్ట్ ఫోబోస్.. చాలా ఉత్కంఠభరితమైనది. అవసరమైన నిధులు సమకూరగానే వచ్చే అయిదేళ్లలో ఈ ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాం.. అయితే ఈ ప్రాజెక్ట్ భవితవ్యం ఇప్పుడు శ్వేతసౌధం చేతుల్లో ఉంది. అగస్టీన్ నివేదికలోని సూచనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం గురించి అందరిలాగే నేనూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను..'' అని మార్స్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ పాస్కల్ లీ వ్యాఖ్యానిస్తున్నారు.
మార్స్‌పైకి 2020లోనే..
"ఫోబోస్‌పైకి వెళ్లడమంటే ఒకరకంగా మార్స్ దగ్గరికి వెళ్లడమే. కానీ మార్స్‌పైకి వెళ్లే యోచన ఇప్పట్లో లేదు. అది 2020లోనే జరుగుతుంది. అయితే అంత దూరం వెళ్లి తీరా మార్స్‌ని చేరకుండా, మార్స్‌పైన కాలుమోపకుండా తిరిగి భూమికి వచ్చేయడం కొంత వరకు రుచించని విషయమే. కానీ తప్పదు.. ఎందుకంటే మా ప్రాజెక్ట్ మార్స్‌పైకి వెళ్లడం కాదు, అంతకన్నా ముందు దాని ఉపగ్రహాలలో పెద్దదైన ఫోబోస్‌ను చేర డం'' అని మాజీ వ్యోమగామి, అగస్టీన్ కమిటీ సభ్యుడైన చియావో పేర్కొంటున్నారు.
0 comments:
Post a Comment