Saturday 31 October 2009

కంప్యూటర్‌ కాదు.. మొబైల్‌ఫోనే!


హైలైట్...
120 జిబి హార్డ్‌డిస్క్‌, 1జిబి ర్యామ్‌, 4.8 అంగుళాల డిస్‌ప్లే, పూర్తిస్థాయి టచ్‌స్క్రీన్‌, క్యూవెర్టీ కీబోర్డ్‌


ఇకమీదట మీరు మీ పనులన్నీ మొబైల్‌తోనే చక్కబెట్టుకోవచ్చు. మీ వ్యక్తిగత పనులు, ఆఫీసు పనులు అన్నీ జస్ట్‌.. మీ వేళ్ల కదలికలపై జరిగిపోతాయి. మరో మాటలో చెప్పాలంటే ఇది ఫోన్‌ కాదు.. బుల్లి కంప్యూటర్‌. ఇలాంటి మొబైల్‌ఫోన్‌ను చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీనిపేరు ఎక్స్‌పీ ఫోన్‌. ఇప్పుడు మొబైల్‌ఫోన్ల రంగంలో ఇదో పెద్ద సంచలనం.

చాలా కొద్దిరోజుల్లోనే మీరు ఓ పర్సనల్‌ కంప్యూటర్‌ను మీ జేబులో వేసుకుని తిరగొచ్చు. అది సరిగ్గా మీ మొబైల్‌ ఫోన్‌ సైజులో ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇంకా దీని గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టడం ఖాయం. చైనాకు చెందిన మొబైల్‌ఫోన్ల తయారీదారు ఇన్‌ టెక్నాలజీ గ్రూప్‌(ఐటిజి) కంప్యూటర్‌లాంటి ఈ అద్భుత మొబైల్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పర్సనల్‌ కంప్యూటర్లలో ఉండే అన్ని రకాల సదుపాయాలు ఈ 3జి (థర్డ్‌ జనరేషన్‌) ఫోన్‌లో ఉంటాయి. 4.8 అంగుళాల ఫుల్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ ప్రత్యేకత. అంతేకాదు.. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ల మాదిరిగా ఈ ఫోన్‌లో 120 గిగాబైట్‌ల స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది. అలాగే 1 జిబి ర్యామ్‌ కూడా. 'అబ్బ.. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఓ కీబోర్డు కూడా ఉంటే ఇంకా బాగుండేది..' అనుకుంటున్నారా? ఆగండి.. అక్కడికే వస్తున్నాం. ఈ స్లయిడర్‌ ఫోన్‌ అడుగుభాగాన 'క్యూవెర్టీ' కీబోర్డు కూడా అమర్చారు. ఇంకేం కావాలి? ఎంత పెద్ద మెసేజ్‌లైనా కంప్యూటర్‌ కీబోర్డుపై టకటకలాడించినట్లు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు.. చూపులకు చిన్నగా ఉన్నా పనితనంలో మాత్రం ఈ ఎక్స్‌పీ మొబైల్‌ యమ ఫాస్ట్‌. ఎలాగంటే కంప్యూటర్లలో ఉన్న మాదిరిగానే ఇందులో ఎఎండి ప్రాసెసర్‌, మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం ఉంటాయి మరి. అంతేనా? ఇంకా ఇందులో.. 1.3 మెగాపిక్సెల్‌ కెమెరా, జిపిఎస్‌ నావిగేషన్‌, బ్లూటూత్‌, యుఎస్‌బి అండ్‌ విజిఎ సపోర్ట్‌.. ఇలా ఆధునిక తరానికి కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయి. ఇవే కాకుండా.. హై స్పీడ్‌ డౌన్‌లింక్‌ పాకెట్‌ యాక్సెస్‌ (హెచ్‌ఎస్‌డిపిఎ), హై స్పీడ్‌ అప్‌లింక్‌ పాకెట్‌ యాక్సెస్‌ (హెచ్‌ఎస్‌డిపిఎ) తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకో సదుపాయం గురించి చెబితే మీరు ఎగిరి గంతేస్తారు. ఈ ఎక్స్‌పీ ఫోన్‌ను కేవలం జిఎస్‌ఎం వినియోగదారులు మాత్రమే కాదు.. సిడిఎంఎ వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌ రెండు రకాల నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుందన్నమాట. ఇక టాక్‌టైమ్‌ విషయనికొస్తే.. ఒకసారి బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుని అయిదు గంటలపాటు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. ఫోన్‌ను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచితే అయిదు రోజులపాటు ఉంటుంది. మరి ఇంతకన్నా అద్భుతమైన ఫోన్‌ ఇంకోటి ఉంటుందా? ప్రస్తుతం ఈ ఫోన్‌ ప్రి-ఆర్డర్‌ (ముందుగా ఆర్డర్‌ చేసి తెప్పించుకోవడం) ద్వారా మాత్రమే లభిస్తోంది. ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు, ఆర్డర్‌ చేసే విధానం తెలుసుకుకోవాలంటే http://www.xpphone.com/en/index.htmlలో చూడాల్సిందే.

0 comments: