Saturday 10 October 2009

పర్యావరణ పరిరక్షణలో 'నోకియా' టాప్‌



పర్యావరణ పరిరక్షణకు సంబంధించి గ్రీన్‌పీస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదిక 'గ్రీన్‌పీస్‌ కార్డ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌'లో నోకియా కంపెనీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో హానికారకాలను వినియోగించకుండా ఉండడం, పర్యావరణ హానికారకాల విడుదలను తగ్గించడం, వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేయడం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని గ్రీన్‌పీస్‌ ఏటా ఈ నివేదికను రూపొందిస్తోంది.  



గత త్రైమాసికంలో సాధించిన స్థానాన్ని నోకియా యథాతథంగా నిలబెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల కేంద్రాలను ఏర్పాటు చేసి వాడి పడేసిన మొబైల్‌ ఫోన్లను నోకియా సేకరిస్తుండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదికలో సామ్‌సంగ్‌ రెండో స్థానంలో నిలిచింది. సోనీ ఎరిక్సన్‌, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌, తోషిబా ఇంతకుముందు కంటే మెరుగైన స్థానాలు సాధించగా యాపిల్‌ కంపెనీ మాత్రం ఆఖరి వరుసలో నిలిచింది. ఈ నివేదిక సోనీఎరిక్సన్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. ఎందుకంటే హానికారక రసాయనాల వినియోగాన్ని తగ్గించడంలో ఆ కంపెనీ తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవని నివేదిక పేర్కొంది. అలాగే డెల్‌, హ్యూలెట్‌ప్యాకార్డ్‌, లెనెవో కంపెనీలు గత నివేదికలో కంటే ఒక్కో పాయింట్‌ను కోల్పోయాయి. ఫ్యూజీ కంపెనీ ఉత్పాదనలు ఏ ఒక్కటీ క్షేమకరం కాదని గ్రీన్‌పీస్‌ ఇంటర్నేషనల్‌ తాజా త్రైమాసిక నివేదిక స్పష్టం చేసింది.


ఆఖరి వరుసలో 'యాపిల్‌'!
అయితే గ్రీన్‌పీస్‌ నివేదిక పట్ల యాపిల్‌, లెనెవో కంపెనీలు సంతృప్తిగా లేవు. వాడి పడేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను తిరిగి సేకరించి శుద్ధి చేయడంలో యాపిల్‌ చర్యలు చాలా కనిష్ట స్థాయిలో ఉన్నాయని నివేదిక పేర్కొన్నప్పటికీ యాపిల్‌ కంపెనీ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. " హానికారక లోహాలైన మెర్క్యురీ, కాడ్మియం, హెక్సావాలెంట్‌ క్రోమియంలను నిషేధించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ మా కంపెనీ ఈ రంగంలో బలమైన స్థానంలోనే ఉంది. అలాగే మా ఉత్పత్తుల శ్రేణిలోంచి క్యాథోడ్‌ రే ట్యూబ్‌ (సిఆర్‌టి) మానిటర్ల వాడకాన్ని పూర్తిగా తొలగించేశాం'' అని యాపిల్‌ కంపెనీ ప్రతినిధి పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నివేదికపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరముందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

0 comments: