Saturday 31 October 2009

ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు.. ఇలా!


ఏళ్ల తరబడి Windows Xp ఆపరేటింగ్‌ సిస్టంపై పనిచేసి బోర్‌ కొడుతుందా? సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవల విడుదల చేసిన కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7కు మారాలని భావిస్తున్నారా? అయితే Windows Xp నుంచి Windows 7కు ఎలా మారాలో మేం చెబుతాం. ఫాలో అవండి మరి!

ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోదారులందరూ ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌-7 విజయవంతంగా మార్కెట్లోకి విడుదలైంది. 2000 సంవత్సరంలో విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం విడుదల తర్వాత మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో సమర్ధమంతమైన ఆపరేటింగ్‌ సిస్టం మార్కెట్లోకి రాలేదనే చెప్పాలి. రెండేళ్ల క్రితం మరో ఆపరేటింగ్‌ సిస్టం Windows Vista వచ్చినా.. కంప్యూటర్‌ వినియోగదారులను ఆకట్టుకోవడంలో, వారి అవసరాలు తీర్చడంలో అది దాదాపు విఫలమైనట్లే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోగదారులందరూ మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌-7పైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టంను ఉపయోగిస్తున్న వారంతా కొత్తగా వచ్చిన విండోస్‌-7కు మారడానికి ఇదే సరైన తరుణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు ఎలా మారాలో చూద్దాం.

Memory ప్రధానం..
విండోస్‌-7 సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజి మీరు కొన్నట్లయితే, అందులో 32-బిట్‌, 64-బిట్‌ ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌లు రెండు ఉంటాయి. వీటిలో 64-బిట్‌ సాఫ్ట్‌వేర్‌ చాలా కంప్యూటర్లకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే మీ కంప్యూటర్‌లో కనీసం 4 జిబి మెమరీ ఉండాలి. అంత మెమరీ లేని వారు 32-బిట్‌ ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను ఎంచుకోవడం మంచిది.

ఇలా చెక్‌ చేయండి..
మీ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ గురించి మీకు కచ్చితంగా తెలియనప్పుడు, కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7 మీ కంప్యూటర్‌లో లోడ్‌ అవుతుందో లేదో తెలుసుకునేందుకు ఇలా చేయండి. మీ కంప్యూటర్‌ డెస్క్‌టాప్‌పైన కనిపించే My Computer ఐకాన్‌పై మీ మౌస్‌ పాయింటర్‌ను ఉంచి రైట్‌ బటన్‌ క్లిక్‌ చేసిPropertiesను సెలక్ట్‌ చేసుకోండి. అక్కడ కనిపించే సమాచారంలో "x64 Edition" అని కనిపిస్తే మీరు మీ కంప్యూటర్‌లో 64-బిట్‌ వెర్షన్‌ విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టంను ఉపయోగిస్తున్నారని అర్థం. లేదంటే మీ కంప్యూటర్‌ 32-బిట్‌ వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టంను కలిగి ఉందని అర్థం. అక్కడ మీకు ఏది కనిపిస్తే కొత్త ఆపరేటింగ్‌ సిస్టంలో కూడా దానికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను మాత్రమే ఎంచుకోండి. మీరు ఏ బిట్‌ వెర్షన్‌ ఉపయోగిస్తున్నారన్నదానిపై మీకు స్పష్టత లభించకపోతే మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి free Windows 7 Upgrade Advisorను మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని రన్‌ చేసి చూడండి. ఆపైన Windows 7కు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు మీ సిస్టంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో Upgrade Advisor మీకు తెలియజేస్తుంది.

Backup ముఖ్యం..
విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసుకునే ముందు మీ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్‌, ఫోల్డర్స్‌ను వేరొక లొకేషన్‌లో భద్రంగా పదిలపరచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. దీనికోసం Windows Easy Transfer Application ను మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్త ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత తిరిగి మీ బ్యాకప్‌ ఫైల్స్‌ను చాలా సులువుగా మీ కంప్యూటర్‌లోకి తీసుకురావచ్చు. ఈ పద్ధతి వద్దనుకుంటే మీ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్‌, ఫోల్డర్స్‌ అన్నింటినీ సీడీ, డివిడి, యుఎస్‌బి ఫ్లాష్‌డ్రైవ్‌, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌.. వీటిలో ఏదో ఒకదానిలో వాటిని భద్రపరుచుకోవచ్చు.

ఇంటర్నెట్‌ అవసరం..
కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7ను ఇన్‌స్టాలేషన్‌ చేసుకోవడానికి ముందుగానే మీ కంప్యూటర్‌ను ఇంటర్నెట్‌తో అనుసంధానించండి. ఆ తరువాతే మీ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజిలో ఉన్న 32-బిట్‌ లేదా 64-బిట్‌ ఈ రెండింటిలో మీ కంప్యూటర్‌కు ఏది సరిపోతుందో ఎంపిక చేసుకోండి.

ఇన్‌స్టాలేషన్‌ ఇలా..
ఎంచుకున్న విండోస్‌ 7 ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను మీ సిపియుకు ఉన్న డిస్క్‌డ్రైవ్‌లో ఉంచి సెటప్‌ను ఒకే చేస్తే ఇన్‌స్టాలేషన్‌ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే.. .. Start Menuలోకి వెళ్లి My Computer ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. వచ్చిన విండోలో కనిపించే డివిడి డ్రైవ్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. వచ్చే మరో విండోలో కనిపించే setup.exe ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. దీంతో ఇన్‌స్టాలేషన్‌ మొదలవుతుంది.
తరువాత Install Windows Page పేరుతో ఓ విండో ఓపెన్‌ అవుతుంది. అందులో కనిపించే Install Now అనే బటన్‌పై క్లిక్‌ చేయండి. వెంటనే ఎటువంటి ఇన్‌స్టాలేషన్‌ను మీరు కోరుతున్నారు? అనే ప్రశ్న వస్తుంది. అందులో Custom అనే ఆప్షన్‌ను ఎంచుకుని దానిపై క్లిక్‌ చేయండి. వచ్చే విండోలో Windows Xp Partition Containingను ఎంచుకుని, Next బటన్‌ను క్లిక్‌ చేయండి. మరో డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది. దానిపై OK బటన్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

బ్యాకప్‌ ఫైల్స్‌ను తెచ్చుకోవడం..
కొత్త ఆపరేటింగ్‌ సిస్టం ఇన్‌స్టాలేషన్‌ పూర్తయిన తర్వాత Windows Easy Transfer Applicationను మరోసారి రన్‌ చేసుకోండి. ఫైల్స్‌, సెట్టింగ్స్‌ను కంప్యూటర్‌లోకి తీసుకురండి. ఈ అప్లికేషన్‌ను రన్‌ చేసే ముందుగానే ప్రోగ్రామ్స్‌ను రీ-ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఎందుకంటే Windows Easy Transfer Application మీ ఫైళ్లను ఇంతకు మందు అవి ఏ ఏ ప్రోగ్రామ్స్‌లో అయితే ఉన్నాయో, అవే స్థానాల్లోకి తీసుకొస్తుంది. ఒకవేళ మీ బ్యాకప్‌ ఫైల్స్‌ ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌లో ఉన్నట్లయితే దాన్ని మొదట మీ కంప్యూటర్‌కు అనుసంధానించండి. తరువాత Start Menu లోకి వెళ్లి కడ My Computer ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. ఆపైన కనిపించే ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేసి దానిని ఓపెన్‌చేయండి. అందులో కనిపించే Windows Easy Transfer Application ను మరోసారి రన్‌ చేసి ఏఏ ఫైళ్లను ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు తీసుకురావాలో ఎంపిక చేసుకుని, వాటిని ఒకే చేసుకుంటే మీరనుకున్న పని పూర్తవుతుంది.

సెట్టింగ్స్‌, ఫైళ్లు కంప్యూటర్‌లోకి వచ్చిన వెంటనే ప్రోగ్రామ్స్‌ను రీ-ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఒకసారి అప్‌డేషన్‌ను చెక్‌ చేసుకోండి. దీంతో విండోస్‌ -7 ఆపరేటింగ్‌ సిస్టం ఇన్‌స్టాలేషన్‌ సంపూర్ణం అయినట్లే!


0 comments: