ఇకమీదట ఇంటర్‌నెట్‌లో 'పుల్లయ్య డాట్ కాం', 'వెర్రి వెంగళప్ప డాట్ కాం'.. లాంటి పేర్లు కనిపిస్తే.. ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ఏ భాషలోనైనా డొమైన్‌పేర్లు సృష్టించుకునేందుకు వీలు కల్పిస్తూ ఇంటర్‌నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐకాన్) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్ వాడకందారులందరికీ ఆన్‌లైన్ చిరునామాలను కేటాయించేది ఈ సంస్థే.

వెబ్‌సైట్ డొమైన్ పేర్లు ఇన్నాళ్లూ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటూ వస్తున్నాయి. ఇకపై ప్రపంచంలోని ఏ భాషలోనైనా డొమైన్ పేర్లు పెట్టుకోడానికి అనుమతించాలని సియోల్‌లో జరిగిన ఓ సమావేశంలో 'ఐకాన్' నిర్ణయించింది. ఇంగ్లీషు రాని వాళ్లు ఇంటర్‌నెట్ చూడాలంటే ఇన్నాళ్లూ ఉన్న ఇబ్బంది దీంతో తొలగిపోనుంది. ఇంటర్‌నెట్ వాడకందారుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'ఐకాన్' ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాడ్ బెక్‌స్ట్రామ్ తెలిపారు. ప్రధానంగా ఆసియా, మధ్యప్రాచ్యం, రష్యాలాంటి ప్రాంతాలకు ఇది ఉపయోగకరమన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ను వాడుతున్నారని, వీరిలో సగానికిపైగా ఇంగ్లీషేతర భాషల్లో రాస్తారని.. అందువల్ల ఈ మార్పు తప్పనిసరి అయ్యిందని రాడ్ బెక్‌స్ట్రామ్ వివరించారు. ఇంటర్నెట్ వ్యవస్థలో ఇదొక చారిత్రక అడుగుగా ఆయన అభివర్ణించారు. ఈనెల16వ తేదీ నుంచి ఇది వివిధ దశల్లో అమలు కానుందని 'ఐకాన్' వర్గాలు పేర్కొన్నాయి.
2 comments:
Yep. here is the relevant link:
http://www.icann.org/en/announcements/announcement-30oct09-en.htm
ఆహ్వాని౦చదగిన పరిణామ౦
Post a Comment