ఫోటోలో కనిపిస్తున్నదేంటో గుర్తుపట్టగలరా? కాసేపు ఆలోచించండి.. అయినా కనుక్కోలేకపోతున్నారు కదూ! క్యారమ్స్ టేబుల్‌లా అనిపిస్తున్నప్పటికీ అది నిజానికి టేబుల్ కానేకాదు.. ఓ కంప్యూటర్. ఏంటలా చూస్తున్నారు? అది నిజంగా కంప్యూటరే. దీనిని 'మైక్రోసాఫ్ట్ సర్ఫేస్'గా వ్యవహరిస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురైదుగురు యూజర్లు ఏకకాలంలో దీనిని ఆపరేట్ చేయగలగడం దీని ప్రత్యేకత.
సాధారణంగా ఇప్పుడున్న డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లను ఒక్కరే ఉపయోగించగలుగుతారు. కానీ ఒకేసారి ఏకకాలంలో నలుగురైదుగురు ఉపయోగించే వీలున్న ఈ కంప్యూటర్ ముందుముందు అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. దీనిలో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దీనికి మరో ప్లస్ పాయింట్. నేటి ఆధునిక యుగపు అద్భుతంగా పేర్కొనదగిన ఈ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్ ఇన్‌కార్పొరేషన్ తయారు చేసింది. చూపులకు ఏదో గ్లాస్ టేబుల్‌లా కనిపించే ఈ కంప్యూటర్ పూర్తిగా టచ్ స్క్రీన్ సదుపాయం కలిగినది. అంటే ఇక మౌస్ క్లిక్‌లు, వేళ్ల నొప్పులు ఉండవన్న మాట. అంతేకాదు గది ఉష్ణోగ్రతతోపాటు దీనిపై పెట్టిన వస్తువులను కూడా ఇది ఇట్టే గ్రహిస్తుంది.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ అంటే..
ఇదొక మల్టీ టచ్ కంప్యూటర్. దీనికి మౌస్‌తో పనిలేదు. కేవలం చేతివేళ్ల స్పర్శ ద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు.అంటే పూర్తి టచ్ స్క్రీన్ అన్నమాట. ఏకకాలంలో నాలుగురైదుగురు యూజర్లు దీనిని ఉపయోగించవచ్చు.
సాధారణ వినియోగదారుల కోసం
మనకు కావలసిన సమాచారాన్ని చిన్నపాటి స్పర్శల ద్వారా పొందవచ్చు. అలాగే టచ్‌స్క్రీన్‌పైన సమాచారాన్ని ఒక చోట నుంచి మరోచోటకు కదిలించవచ్చు. అంటే కంప్యూటర్ స్క్రీన్‌పై దేనినైనా వేలుతో మీ వైపుకు లాగితే అది మీరు కూర్చున్న చోటికి వచ్చేస్తుంది. అలాగే సమాచార బదిలీ కూడా. రెండు మొబైల్ ఫోన్ల మధ్య ఎలాగైతే సమాచారాన్ని బదిలీ చేయవచ్చో.. అదే మాదిరిగా ఈ సర్ఫేస్‌పైన ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ను ఉంచి అందులోని సమాచారాన్ని కంప్యూటర్‌లోకి, కంప్యూటర్‌లోని సమాచారాన్ని ఆ డివైజ్‌లోకి బదిలీ చేసుకోవచ్చు.
వ్యాపార లావాలదేవీల కోసం
కమ్యూనికేషన్స్‌ని వృద్ధి చేసుకునేందుకు ఈ 'సర్ఫేస్' ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. సమాచారాన్ని, వారి సేవలను వారి వారి క స్టమర్లకు చాలా సులభ ంగా అందించే వీలుకలుగుతుంది. ఒకేసారి ఎంతోమంది కలిసి పని చేసే వీలుండడం ఒక సరికొత్త అనుభూతిగా మిగులుతుంది. దీనివల్ల ఒకరికొకరు తమ తమ సమాచారాన్ని సులువుగా పంచుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
ఇందులోఉండే కెమెరాలు చాలా సులభంగా వివిధ రకాలైన వస్తువులను, ఆకృతులను గుర్తిస్తాయి. అంటే.. ఇన్‌పుట్ ద్వారా గ్రహించిన సమాచారాన్ని కంప్యూటర్ ప్రాసెస్ చేసి మనకు కావలసిన సమాచారాన్ని ఔట్‌పుట్ ద్వారా అందిస్తుంది.
దీని ప్రత్యేకతలు ఏమిటంటే...
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌లో ప్రధానంగా నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాధారణ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించిన వారికి సరికొత్త అనుభవాన్ని, అనుభూతిని ఇస్తాయి. అవేమిటంటే..
డైరెక్ట్ ఇంటరాక్షన్: మౌస్ క్లిక్‌లకు స్వస్తి పలికి యూజర్స్ తమకు కావలసిన సమాచారాన్ని కేవలం సున్నితమైన స్పర్శల ద్వారా పొందవచ్చు.
మల్టీ యూజర్ ఎక్స్‌పీరియన్స్: దీనికున్న 30 అంగుళాల పొడవైన స్క్రీన్ వల్ల ఒకేసారి దీనిచుట్టూ అనేకమంది కూర్చుని పనిచేసుకోచ్చు. దీంతో అందరూ ఒకేసారి ముఖాముఖిగా పనిచేసుకునే అనుభవం ప్రతీ ఒక్కరికీ సొంతమవుతుంది.
మల్టీటచ్: అనేక స్పర్శలకు ఒకేసారి ఏకకాలంలో ప్రతిస్పందించడం దీనికున్న మరో ప్రత్యేకత.
ఆబ్టెక్ట్ రికగ్నైజేషన్: ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌పై ఏదైనా ఒక వస్తువుని ఉంచితే అది వెంటనే దానిని గుర్తించి దానితో అనుసంధానమవుతుంది. అలాగే ఇందులోని సమాచారాన్ని మొబైల్స్, ఎంపి3, ఎంపి4 ప్లేయర్లు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరాలు తదితర ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లలోకి బదిలీ చేసుకునే సదుపాయం ఉంది.
ఇన్ని సదుపాయాలు కలిగిన ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ను 2007లోనే మైక్రోసాఫ్ట్ ఉపయోగంలోకి తీసుకొచ్చినా మన దేశంలో దీనికి తగినంత ప్రాచుర్యం లభించకపోవడానికి ఒక కారణం.. దీని ధర అయితే, మరో కారణం.. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు లభించే దుకాణాలలో లభ్యం కాకపోవడం. ప్రపంచం మొత్తంమ్మీద కేవలం కొన్ని దేశాలలో మాత్రమే ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ లభిస్తుంది.. అదీ ముందస్తు అర్డర్‌పైనే. మరిన్ని వివరాలకు www.microsoft.com/surface/Pages/Product/WhatIs.aspx ను చూడండి.
Saturday, 10 October 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
దీనిని గురించి ఇదివరకు ఒకసారి విన్నా, చూడటం మాత్రం ఇప్పుడే.
మంచి సమాచారం.ధన్యవాదాలు.
Post a Comment