
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం.. వర్షాకాలంలో వర్షాలు పడకపోవడం.. నదులు ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లను ముంచేయడం.. ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరగడం.. అక్కడి జంతుజాలం అంతరించిపోవడం.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలుసా? ఈ మార్పులన్నింటికీ కారణం వాతావరణ కాలుష్యమే. అవును, వాతావరణంలోకి నిరంతరాయంగా వెలువడుతున గ్రీన్‌హౌస్ వాయువుల కారణంగా భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ గ్రీన్ హౌస్ వాయువులలో కార్బన్‌డయాక్సైడ్ కూడా ఒకటి. వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ 350 పిపిఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉన్నంత వరకే మనం ఈ భూమిపై సురక్షితంగా జీవించగలం. కానీ ఇప్పుడు ఈ కార్బన్‌డయాక్సైడ్ 387 పిపిఎంకు చేరుకుంది. అంటే.. మనం నివసిస్తున్న ఈ భూగోళం పెను ప్రమాదంలో పడిందన్నమాట!
ఎందుకిలా?
వాతావరణంలో మార్పులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలంటే దానికంటే ముందు అసలు గ్రీన్‌హౌస్ వాయువులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. నీటి ఆవిరి, కార్బన్‌డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పర్‌ఫ్లూరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ తదితరాలను గ్రీన్‌హౌస్ వాయువులుగా పిలుస్తారు. వీటిలో కొన్ని వాయువులు సహజసిద్ధంగా గాలిలో కలుస్తుండగా, మరికొన్ని వాయువులు మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. చెత్తాచెదారం, వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలు, కలపతోపాటు చమురు, సహజ వాయువు, బొగ్గులను మండించడం వల్ల వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ మీథేన్ తదితర వాయువులు విడుదల అవుతున్నాయి.
గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ అంటే..
ఈ గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోని వేడిని గ్రహించడాన్ని 'గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్'గా వ్యవహరిస్తారు. అయితే ఈ వేడిని గ్రహించడంలో అన్ని వాయువుల సామర్థ్యం ఒకేలా ఉండదు. ఉదాహరణకు.. హైడ్రోఫ్లోరోకార్బన్స్, పర్‌ఫ్లూరోకార్బన్స్‌కు వాతావరణంలోని వేడిని గ్రహించే సామర్థ్యం అధికంగా ఉంటుంది. అయితే వాతావరణంలోకి సహజసిద్ధంగా వెలువడే వాయువులు అలా కాదు. కార్బన్‌డయాక్సైడ్ వాయువు కంటే 270 రెట్లు అధికంగా నైట్రస్ ఆక్సైడ్ వాయువు వాతావరణంలోని వేడిని గ్రహిస్తుంది. అలాగే మీథేన్ వాయువు 21 రెట్లు అధికంగా వేడిని గ్రహిస్తుంది. విషాదం ఏమిటంటే.. వాతావరణంలో వేడిని గ్రహించే సామర్థ్యం అంతగా లేని కార్బన్ డయాక్సైడ్ వాయువు అధికంగా వాతావరణంలోకి చేరుతుండడం. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ 350 పిపిఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉన్నంత వరకే ఫర్వాలేదు. కానీ ఇప్పుడు దీని శాతం 387 పిపిఎంకు
చేరుకుంది.
అప్పుడేం జరుగుతుంది?
వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ పరిమాణం విపరీతంగా పెరిగిపోవడం వల్ల మొత్తం పర్యావరణం దెబ్బతింటుంది. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా ఇంకా పెరుగుతుంది. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు, వరదలు, కరువులు అధికమవుతాయి. కొత్త కొత్త బ్యాక్టీరియా, వైరస్‌లు పుట్టుకొస్తాయి. కొత్తకొత్త వ్యాధులు ప్రబలుతాయి. ఫలితంగా విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవిస్తుంది. భవిష్యత్తు తరాల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
ఇప్పుడేం చేయాలి?
ఈ భూమిపై నివసిస్తున్న ప్రతి మనిషి ముందున్న ప్రశ్న ఇది. దీనికి జవాబు ఒక్కటే. మళ్లీ వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ను వీలైనంత త్వరగా 350 పిపిఎం(పార్ట్స్ పర్ మిలియన్)కు తీసుకురావాలి. భవిష్యత్తులో అంతకంటే పెరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ దిశగా అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలలో ఆయా దేశాలు వేటికవే పలు రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా ఫలితం కానరావడం లేదు. దీంతో పర్యావరణ పరిరక్షణ కోసం కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధానం రూపొందించి దాన్ని అమలు చేసేందుకు వచ్చే డిసెంబర్‌లో ప్రపంచ దేశాల నాయకులు, మేధావులు కోపెన్‌హాగన్, డెన్మార్క్‌లలో సమావేశం కాబోతున్నారు. డిసెంబర్ 7 నుంచి 18 వరకు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో 15వ సదస్సు నిర్వహించనున్నారు. 2013-2020 మధ్య కాలానికి సంబంధించి కొత్త విధానానికి రూపకల్పన చేయడం, వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్ వాయువు విడుదల నుంచి భూగోళాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా దేశాల అధినేతలు, రాజకీయ నాయకులపై అవసరమైన ఒత్తిడి తీసుకురావడం వీరి ఉమ్మడి లక్ష్యం.

24న ఏం జరగబోతోంది?
ఈ నెల 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలలో 'గ్లోబల్ యాక్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్' పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మన దేశంలో ఈ బాధ్యతను ఇండియన్ యూత్ క్లైమేట్ నెట్‌వర్క్ (ఐవైసిఎన్) తన భుజస్కందాలపై వేసుకుంది. మన రాష్ట్రంలో ఈ సంస్థకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎపి చాప్టర్ వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ సురక్షిత స్థాయులకు గుర్తు అయిన '350'ని ఫోకస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ప్రతి ఒక్కరి దృష్టి ఈ 350పైన పడేట్లు చేయాలని నిశ్చయించుకుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో చార్మినార్, బుద్ధ విగ్రహం, ఐమ్యాక్స్ థియేటర్, గోల్కొండ తదితర ప్రాంతాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నాలుగైదు రకాల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఇండియన్ యూత్ క్లైమేట్ నెట్‌వర్క్ (ఐవైసిఎన్) జాతీయ సమన్వయకర్త చైతన్య, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రాంతీయ సమన్వయకర్త ఎం.రంగప్రసాద్‌లు పేర్కొన్నారు. ఇందుకోసం తాము తొమ్మిదంచెల ప్రణాళికను రూపొందించామని, ప్రజలందరి దృష్టి 350 మీద పడేలా చేయడం, కార్బన్‌డయాక్సైడ్ కారణంగా వాతావరణంలో కలుగుతున్న మార్పుల పట్ల వారిని చైతన్యవంతులను చేయడం, భూగోళాన్ని కాపాడుకోవడంలో ఎవరికి వారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించేలా చేయడం అందులోని కొన్ని అంశాలని వారు వివరించారు. ఈ పర్యావరణ ఉద్యమానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు తమ వెబ్‌సైట్ www.ap350.orgను చూడవచ్చని, లేదంటే గూగుల్, యూట్యూబ్‌లలో 350 అని టైప్ చేస్తే చాలని చైతన్య, రంగప్రసాద్‌లు తెలిపారు.
2 comments:
మానవమనుగడకోసం చేస్తున్న మహాప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నాను.
దుర్గేశ్వర గారూ.. మీ కామెంట్‌కు ధన్యవాదాలు. ఆసక్తి ఉంటే ఈ మహా ప్రయత్నంలో మీరూ భాగస్వాములు కావచ్చు. మన రాష్ట్రంలో '350' కార్యక్రమం ప్రాంతీయ సమన్వయకర్త రంగప్రసాద్ గారిని 9490121212 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.
- రమేష్‌బాబు
Post a Comment