ఇప్పటి వరకు విద్యుత్తు ఒకచోట నుంచి మరొకచోటకు సరఫరా అవాలంటే వైరు తప్పనిసరి. కానీ భవిష్యత్తులో ఏ వైరు లేకుండానే మీ ఇంట్లో లైటు వెలుగుతుంది.. ఫ్యాన్ తిరుగుతుంది.. టివి మోగుతుంది.. ఫ్రిజ్ పనిచేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 'వైర్‌లెస్ కరెంట్' ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా సోనీ కంపెనీ ఒక కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచింది. దీనిపేరు 'ప్రొటోటైప్ పవర్ సిస్టం'.
మనం ఇప్పటి వరకు 'వైర్‌లెస్ డేటా ట్రాన్స్‌ఫరింగ్' చూశాం. అంటే.. ఒక సెల్‌ఫోన్ నుంచి మరొక సెల్‌ఫోన్‌లోకి ఎలాంటి వైరు లేకుండానే సమాచార మార్పిడి జరగడం. బ్లూటూత్ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలా ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ నుంచి మరొక ఎలక్ట్రానిక్ డివైజ్‌కు సమచారాన్ని బదిలీ చేయడం సర్వసాధారణం అయింది. అయితే ఈ విధానంలో రెండు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు 'వర్కింగ్ మోడ్'లో ఉండేందుకు వాటికి విద్యుత్తు సరఫరా అనేది తప్పనిసరి. ఈ విద్యుత్తు.. ఓ వైరు(ఆల్టర్నేట్ కరెంట్ - దీనిని అఇగా వ్యవహరిస్తారు) ద్వారా సరఫరా కావచ్చు లేదంటే బ్యాటరీ(డైరెక్ట్ కరెంట్ - దీనిని ఈఇ అంటారు) ద్వారా అయినా సరఫరా కావచ్చు. పద్ధతి ఏదైనా సరే.. విద్యుత్తు సరఫరా జరగకుండా ఆ రెండు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వర్కింగ్ మోడ్‌లోకి రావు. వర్కింగ్ మోడ్‌లో లేకుండా సమాచార మార్పిడి అనేది సాధ్యం కాదు.
ఇదే బ్లూటూత్ పరిజ్ఞానాన్ని విద్యుత్తు సరఫరాలో కూడా ఉపయోగిస్తే? అంటే.. టివి వైరు ప్లగ్‌లో పెట్టనక్కర్లేదు, కానీ టివి పనిచేస్తుంది. అలాగే ఫ్రిజ్ వైర్ ప్లగ్‌లో పెట్టనక్కర్లేదు, అయినా ఫ్రిజ్ పనిచేస్తుంది. ఇలా ఏ విద్యుత్తు ఉపకరణానికి వైరు ద్వారా విద్యుత్తు సరఫరా అవకుండానే అవి పనిచేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఇంట్లోని అన్ని గదుల్లో ట్యూబ్‌లైట్లు, బల్బ్‌లు ఉంటాయి కానీ.. ఇంటికి ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది చేయనక్కర్లేదు. అయినా అన్ని గదుల్లో ట్యూబ్‌లైట్లు, బల్బ్‌లు వెలుగుతాయి. ఇది సాధ్యమేనా అన్న అనుమానం మీకు అక్కర్లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ అసాధ్యం అనుకుంటున్నది కాస్తా సుసాధ్యంగా మారనుంది. ఇప్పటికే సోనీ కంపెనీ ఓ కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీని పేరు 'ప్రొటోటైప్ పవర్ సిస్టం'.
ఏమిటీ పరిజ్ఞానం?
ఈ పరిజ్ఞానం సహాయంతో ఎలాంటి వైరు ఉపయోగించకుండా గాలి ద్వారా విద్యుత్తును సరఫరా చేయవచ్చు. సోనీ కంపెనీ ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యుత్తును సరఫరా చేసి 22 అంగుళాల ఎల్‌సిడి టెలివిజన్‌ను 'వర్కింగ్ మోడ్'లోకి వచ్చేలా చేసింది. అంటే.. 'ఆన్' అయ్యేలా చేసిందన్నమాట. దీనికోసం 50 సెంటీమీటర్ల దూరం నుంచి 100 ఓల్టుల సంప్రదాయిక విద్యుత్తును ఆ టెలివిజన్‌కు సరఫరా చేసింది. దీనికి కారణం మాగ్నటిక్ రెజోనెన్స్(అయస్కాంత అనునాదం). ఇందుకోసం ముందుగా నలభై సెంటీమీటర్ల పొడవైన వైరును చతురస్రం ఆకారంలో అమర్చుతారు. దీనిని ప్రైమరీ కాయిల్ అంటారు. ఇప్పుడు ఈ వైరుగుండా విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా ఒక విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తారు. ఈ క్షేత్రంలోకి మరో వైరు(సెకెండరీ కాయిల్)ను తీసుకొచ్చినప్పుడు అందులోని విద్యుత్తు ఆ సెకెండరీ కాయిల్‌కు సరఫరా అవుతుంది. అయితే ఈ విధంనంలో ప్రైమరీ, సెకెండరీ కాయిల్స్ రెండూ ఒకదానికి ఒకటి అభిముఖంగా ఉండాల్సిన అవసరమేం లేదు. కాకపోతే వాటి రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ (అనునాద పౌనఃపున్యం) మాత్రం ఒకే స్థాయిలో ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ ఆయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్‌ను ఉంచినప్పుడు ఆటోమేటిక్‌గా అది విద్యుత్తును గ్రహించి పనిచేయడం ప్రారంభిస్తుందన్నమాట. ఈ విధానంలో సదరు ఎలక్ట్రానిక్ డివైజ్ ఏదైనా లోహంతో తయారైనప్పటికీ అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక్క విద్యుత్తును మాత్రమే తీసుకుంటుంది తప్ప లోహంతో తయారైన దాని బాడీ ఏ మాత్రం వేడెక్కదు.
మరిన్ని ప్రయోగాలు అవసరం..
అయితే సోనీ కంపెనీ అభివృద్ధి పరిచిన 'ప్రొటోటైప్ పవర్ సిస్టం'లో కొన్ని లోపాలు లేకపోలేదు. నూటికి నూరు శాతం కాకుండా ఎనభై శాతం సామర్థ్యం మాత్రమే ఈ పరిజ్ఞానానికి ఉంది. ఎందుకంటే విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడిన తరువాత అందులో అయిదో వంతు విద్యుత్తు వృథా అయిపోతోంది. మరికొంత ప్రైమరీ, సెకెండరీ కాయిల్స్ మధ్యన ఏర్పడే బంధంలో వృథా అవుతోంది. దీంతో ఓరిజినల్‌గా ఎనభై శాతం విద్యుత్తు తయారైనా అందులో పదిహేను శాతం వరకు విద్యుత్తు వృథా అవుతోందన్నమాట. అలాగే ప్రస్తుతం ఏదైనా ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరం విద్యుదయస్కాంత క్షేత్రానికి 50 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే దానికి విద్యుత్తు సరఫరా జరుగుతోంది. ఈ దూరం పెరిగితే ఆగిపోతోంది. అయితే సోనీ కంపెనీ ఈ దూరాన్ని మరింత పెంచేందుకు అవసరమైన పాసివ్ రిలే యూనిట్స్‌ను రూపొందించింది. ఈ పాసివ్ రిలే యూనిట్‌ను ప్రైమరీ, సెకెండరీ కాయిల్స్‌కు మధ్యన ఉంచినప్పుడు ఈ దూరం 80 సెంటీమీటర్లకు పెరిగింది. అంటే 80 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌కు వైరు లేకుండానే విద్యుత్ సరఫరా చేయవచ్చన్నమాట.
Saturday, 10 October 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Nice info. Thanks!
చాలా ఉపయుక్తమైన విషయాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.
Post a Comment