
యాపిల్ కంపెనీ అమెరికాలో ఐఫోన్‌ను విడుదల చేసినప్పుడు.. దాని కోసం యాపిల్ స్టోర్ ఎదురుగా అక్కడి జనం పెద్ద క్యూ కట్టారు. కొంతమంది ముందురోజు రాత్రే వచ్చి క్యూలో నిలబడ్డారు. ఒక్క ఐఫోన్‌కే కాదు, యాపిల్ కంపెనీ ఏ ఉత్పత్తి మార్కెట్‌లోకి తీసుకొచ్చినా దానికి బోలెడంత క్రేజ్ ఉంటోంది. ఇప్పుడు యాపిల్ తాజా ఉత్పత్తి.. ఐప్యాడ్‌కు కూడా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన స్పందన కనిపిస్తోంది. అసలు ఐప్యాడ్‌లో అంత గొప్పతనం ఏముంది అనుకుంటున్నారా? చూడండి.. మీరే!
మ్యాక్, ఐపాడ్, ఐఫోన్.. ఇప్పుడు ఐప్యాడ్. యాపిల్ కంపెనీ తనకు మాత్రమే సాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానంతో యావత్ ప్రపంచాన్నే అలరిస్తోంది. ఐపాడ్ తరవాత అక్షరం మార్పుతో యాపిల్ సృష్టించిన 'ఐప్యాడ్' తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఇదొక టచ్‌స్క్రీన్ టాబ్లెట్ కంప్యూటర్. కంప్యూటర్ చేసే అన్ని పనులూ ఇది చేయగలదు. అంతేకాదు, ఇదొక ఈ-రీడర్ కూడా. దీని సాయంతో బోలెడన్ని ఈ-పుస్తకాలను చదువుకోవచ్చు. అందుకే యాపిల్ ఐప్యాడ్‌కు ప్రపంచమంతా నీరాజనం పలుకుతోంది. ఐప్యాడ్‌లోని ప్రత్యేకతలు ఏమిటంటే..
సులువుగా ఇంటర్నెట్ బ్రౌజింగ్
ఐప్యాడ్‌లో నెట్ బ్రౌజింగ్ గొప్ప వినోదాన్ని అందిస్తుంది. వేళ్ల కదలికలతో వెబ్ పేజీలను ఎలా కావాలంటే అలా తిరగేయొచ్చు. దీని మల్టీ టచ్‌స్క్రీన్‌లో పేజీ మొత్తం అడ్డంగా, నిలువుగా కూడా కనిపిస్తుంది. మీ చేతి వేళ్లతో పేజీలను పైకీ, కిందకీ కదపొచ్చు. వెబ్ పేజీలో ఉండే ఫొటోపై వేలితో రాస్తే చాలు.. ఫోటో పెద్ద సైజుకు మారిపోతుంది. ఐప్యాడ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీరు చూసిన వెబ్ పేజీలన్నీ పక్కనే థంబ్‌నెయిల్స్ వ్యూలోకి చేరుతుంటాయి. అవసరమైనప్పుడు ఏ పేజీ కావాలనుకుంటే ఆ పేజీని వేలితో టచ్ చేయడం ద్వారా మళ్లీ మళ్లీ చూడొచ్చు.
ఈ-మెయిల్.. భలే!
ఐప్యాడ్‌లో ఈ-మెయిల్ అనుభవం గురించి చెప్పడం కాదు, చూడాల్సిందే! మీకు అవసరమైన మెయిల్‌ను జస్ట్ వేలి కొనతో తాకితే చాలు.. అది పెద్దగా మారి స్క్రీన్ అంతటా కనిపిస్తుంది. స్ల్పిట్ స్క్రీన్ వ్యూ.. అంటే ఐప్యాడ్ స్క్రీన్ రెండు భాగాలుగా విడిపోయి, ఒక వైపు మీ ఇన్‌బాక్స్‌లోని మెయిల్స్, మరోవైపు మీరు ఓపెన్ చేసిన మెయిల్ దర్శనమిస్తాయి. ఐప్యాడ్‌ను నిలువుగా తిప్పితే చాలు, అటోమేటిక్‌గా మీ మెయిల్ స్క్రీన్ అంతటా పరుచుకుంటుంది. కంపోజ్ మెయిల్ బటన్‌పైన వేలి కొన ఉంచడమే ఆలస్యం.. స్క్రీన్‌పైన పెద్ద క్యూవెర్టీ కీబోర్డు ప్రత్యేక్షమవుతుంది. ఇన్‌బాక్స్‌లోని ఏదైనా ఈ-మెయిల్ డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ చిన్న 'టచ్'.. అంతే! మెయిల్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఎవరైనా ఈ-మెయిల్ ద్వారా మీకు ఫోటోలు పంపితే, మెయిల్‌తోపాటుగా ఫోటోనీ చూసేయొచ్చు. ఇంకా బిల్ట్ ఇన్ ఫొటోస్ అప్లికేషన్ సాయంతో ఏదైనా ఫొటోను ఈ-మెయిల్‌లో నేరుగాసేవ్ చేయొచ్చు.
ఫొటోలన్నీ ఒక్క 'టచ్'తో!: ఐప్యాడ్‌కున్న పెద్ద స్క్రీన్, దానిలోని సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఫొటోలు చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తాయి. ఫొటోలన్నీ కలిసి ఒక అల్బం మాదిరిగా కనిపిస్తాయి. చూడాలనుకున్నప్పుడు ఆల్బంపైన వేలితో టచ్ చేస్తే చాలు.. ఆ ఆల్బంలో ఉన్న ఫోటోలన్నీ థంబ్‌నెయిల్ వ్యూలో కనిపిస్తాయి. అంతేకాదు, మీరు కోరిన ఫొటోను వేలితో అటూ ఇటూ తిప్పొచ్చు. చిన్నగా, పెద్దగా చేసుకోవచ్చు. కావాలనుకుంటే స్లైడ్ షో చూడొచ్చు. చార్జింగ్ సమయంలో మీ ఐప్యాడ్ ఒక ఫొటోఫ్రేమ్‌గా కనిపిస్తుంది. మీ డిజిటల్ కెమెరాలోని ఫొటోలన్నింటినీ యాపిల్ కెమెరా కనెక్షన్ కిట్ సాయంతో ఐప్యాడ్‌లోకి లాక్కోవచ్చు.
వీడియో.. చూసి తీరాల్సిందే!
హై డెఫినిషన్ మూవీస్ దగ్గర్నించి టీవీ షోల వరకు, పాడ్‌కాస్ట్స్ నుంచి మ్యూజిక్ వీడియోల వరకు ఏ వీడియోనైనా సరే.. ఐప్యాడ్‌కుండే పెద్దదైన, హై రిజల్యూషన్ స్క్రీన్‌మీద మీరు చాలా స్పష్టంగా వీక్షించవచ్చు. జస్ట్ రెండుసార్లు వేలి కొనతో తాకితే.. వైడ్ స్క్రీన్ కాస్తా ఫుల్‌స్క్రీన్‌గా మారిపోతుంది. అంతేకాదు, ఐప్యాడ్‌లో యూట్యూబ్ వీడియోలను వీక్షించడం చాలా సులభం. చూస్తున్నప్పుడు ఐప్యాడ్‌ను అడ్డంగా తిప్పితే చాలు.. ఆటోమేటిక్‌గా వీడియో ఫుల్‌స్క్రీన్‌కు మారిపోతుంది.
వీనులవిందైన సంగీతం
ఐప్యాడ్‌లో ఉండే ఐపాడ్ అప్లికేషన్ ఉపయోగించి మీ వేలికొనల సాయంతో వీనుల వీందైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఐప్యాడ్‌కు ఉండే బిల్ట్ ఇన్ స్పీకర్స్ మీకు శ్రావ్యమైన శబ్దాన్ని అందిస్తాయి. లేదంటే వైర్‌లెస్ బ్లూటూత్ సాయంతో ఇంట్లోని గదుల్లో తిరుగుతూ కూడా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఐప్యాడ్ స్క్రీన్ మీద ఆడియో సాంగ్స్ అన్నీ ఆల్బమ్, సాంగ్, ఆర్టిస్ట్ తదితర కేటగిరీల వారీగా మీకు కనిపిస్తాయి. ఏ పాటనైనా వినాలనుకుంటే జస్ట్ ఆ లింక్‌పైన వేలితో టచ్ చేస్తే చాలు.. సంగీతం మొదలవుతుంది.
ఐట్యూన్స్ స్టోర్‌లో కావలసినన్ని
ఆడియో, వీడియోల కోసం యాపిల్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఐట్యూన్స్ స్టోర్ ఐకాన్ మీ ఐప్యాడ్ స్క్రీన్‌పై ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. జస్ట్ ఒక్క టచ్‌తో మీరు మీకిష్టమైన పాటలు, సినిమాలు ఈ స్టోర్స్ నుంచి కొనుక్కోవచ్చు. ఐట్యూన్స్ స్టోర్‌లో ఉండే లక్షలాది స్టాండర్డ్, హై డెఫినిషన్ ఆడియో, వీడియోల నుంచి మీకు కావలసిన వాటిని మీ ఐప్యాడ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని, మీకిష్టమైన వేళలో తీరికగా వినవచ్చు, వీక్షించవచ్చు. అలాగే మీ పీసీలోగాని, మ్యాక్‌లోగానీ ఐట్యూన్స్ లైబ్రరీలో ఉన్న ఆడియో, వీడియో కలెక్షన్‌ను మీ ఐప్యాడ్‌లోకి లోడ్ చేసుకోవచ్చు.
యాపిల్ స్టోర్‌లో బోలెడ న్ని అప్లికేషన్లు
మీ ఐప్యాడ్‌లో వినియోగించుకునేందుకు దాదాపు లక్షా నలభై వేల అప్లికేషన్లు ఎల్లప్పుడూ యాపిల్ అప్లికేషన్ స్టోర్‌లో సిద్ధంగా ఉంటాయి. గేమ్స్ మొదలుకొని బిజినెస్ అప్లికేషన్స్ వరకు వేటినైనా సరే మీరు ఈ స్టోర్ నుంచి కొనుక్కోవచ్చు. ఐప్యాడ్ స్క్రీన్‌పైన ఉండే అప్లికేషన్ స్టోర్ ఐకాన్‌పై టచ్ చేస్తే చాలు.. బోలెడన్ని అప్లికేషన్లు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా మీ ఐప్యాడ్‌కు సరిపోయే అప్లికేషన్లు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి.
ఈ-పుస్తకాలు అందించే ఐ-బుక్స్
యాపిల్ ఐప్యాడ్‌లో ఇదో సరికొత్త ఫీచర్. ఈ ఫీచర్ మీ ఐప్యాడ్‌ను ఈ-రీడర్‌గా మార్చేస్తుంది. దీని సాయంతో మీరు ఇంటర్నెట్‌లో దొరికే బోలెడు ఈ-బుక్స్ చదువుకోవచ్చు. అంతేకాకుండా యాపిల్ వారి ఐ-బుక్స్ స్టోర్‌లో క్లాసిక్స్ నుంచి బెస్ట్ సెల్లర్స్ వరకు కథలు, నవలలు కొనుక్కొని, మీ ఐప్యాడ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్నవన్నీ బుక్‌షెల్ఫ్ అనే ఫోల్డర్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఐప్యాడ్‌కు ఉండే హై రిజల్యూషన్, ఎల్‌ఇడి బ్యాక్ లైట్ స్క్రీన్‌మీద.. రాత్రిపూట కాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా అక్షరాలు, బొమ్మలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
ఎక్కడ ఏముందో చెప్పే మ్యాప్స్
ఐప్యాడ్‌లో ఉన్న మరో సౌకర్యం మ్యాప్స్. దీని సాయంతో మీరు ఉన్న చోటు నుంచి కదలకుండా ప్రపంచలో ఎక్కడ ఏముందో తెలుసుకోవచ్చు, చూడొచ్చు. హైరిజల్యూషన్ శాటిలైట్ ఇమేజస్ ద్వారా ఏ వీధిలో ఏముందో చాలా స్పష్టంగా చూడొచ్చు. అలాగే మీకు దగ్గర్లో ఎక్కడ రెస్టారెంట్ ఉందో, ఎక్కడ సినిమా థియేటర్ ఉందో.. ఇలాంటి వివరాలన్నీ జస్ట్ ఒక్క టచ్‌తో తెలుసుకోవచ్చు. మీ ఐప్యాడ్‌లోని మ్యాప్స్ అందించే టర్న్ బై టర్న్ డైరెక్షన్స్‌తో మీరు వెళ్లాలనుకున్న చోటికి క్షేమంగా చేరవచ్చు.
ఇవే కాకుండా ఇంకా యాపిల్ ఐప్యాడ్‌లో నోట్స్, క్యాలెండర్, కాంటాక్ట్స్, హోమ్ స్క్రీన్, స్పాట్‌లైట్ సెర్చ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే యాపిల్ ఐప్యాడ్‌కు ఇంత క్రేజ్ మరి!