'రొట్టె విరిగి నేతిలో పడ్డాక..' అనే సినిమా పాట ఆ రోజుల్లో ఎందరి నోళ్లలో నానిందో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం 'నెట్ విరిగి భాషలో పడ్డాక..' అనే పాట ఆన్‌లైన్ వీధుల్లో మోగిపోతోంది. దీనికి కారణం.. వెబ్‌సైట్ డొమైన్ పేర్లను ఇకమీదట ఎవరి భాషల్లో వారు పెట్టుకోవచ్చంటూ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ఐకాన్) ఇటీవల సియోల్‌లో కీలక నిర్ణయం తీసుకోవడమే. ఐకాన్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని.. ఇంటర్నెట్ పుట్టి, బుద్ధి ఎరిగిన తరువాత.. ఇన్నేళ్లకు ఏకంగా ఇంటర్నెట్ దశను మార్చివేసే ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణిస్తున్నారు 'నెట్' నిపుణులు.
ఇ

మారుమూలకు వెబ్'సైట్'..
గ్రామీణ ప్రాంతాలకు వెబ్ వెలుగులు నేటికీ పూర్తిగా చేరలేదు. ఫలితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ శాతం కూడా అక్కడ తక్కువే. వెబ్‌సైట్ల డొమైన్ పేర్లు (చిరునామాలు) అధిక భాగం అంగ్లంలో ఉన్న కారణంగా ఆ భాష తెలియని వారు తమ గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లేవారు కారు. భారతీయ భాషలకు సంబంధించిన వెబ్‌సైట్లు, బ్లాగులు ఎన్నో ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఉన్నప్పటికీ వాటి డొమైన్ పేర్లు ఆంగ్లంలో ఉండడం వల్ల ఆ భాష రాని వారికి వాటి గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈ డొమైన్ పేర్లు కూడా భారతీయ భాషల్లో పెట్టుకోగలిగే అవకాశాన్ని 'ఐకాన్' కల్పించడంతో ఇకముందు ప్రాంతీయ భాషలు తెలిసిన ప్రతి ఒక్కరూ వెబ్‌లో వీరవిహారం చేసేందుకు ఆస్కారం ఏర్పడినట్లయింది.
పెరగనున్న సంఖ్య..
ఐకాన్ తీసుకున్న చారిత్రక నిర్ణయం పరోక్షంగా ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ల పెరుగుదలకు దోహదపడనుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారు 160 కోట్ల మంది. వీరిలో సగానికి సగం మంది ఆంగ్ల భాష ఎరుగని వారే. వీరిలో ఎంతోమందికి సొంతగా వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఇంగ్లీష్ రాని కారణంగా వెనకడుగు వేస్తున్న వారు ఎందరో. వెబ్ లేదా బ్లాగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు మొత్తం ఆంగ్లంలోనే జరపాల్సి రావడం, అలాగే ఈ-మెయిల్ కూడా ఆంగ్లంలోనే ఇవ్వాల్సి వస్తుండడం వంటి ఇబ్బందులు వెనక్కి లాగుతున్నాయి. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తే బ్రౌజర్లకు ఇంతకాలం ఉన్న ఇబ్బందులు తొలగిపోవడమేకాక మాతృభాషలో ఈ-మెయిల్స్ పంపుకోగలిగే వీలు కూడా కలుగుతుంది.
ఇబ్బందులూ అనేకం..
అయితే వెబ్ డొమైన్‌లలో కొత్త కొత్త పేర్లు వచ్చి చేరడం వల్ల అయోమయంతోపాటు భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదనేది నెట్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్లను కూడా ప్రభావితం చేయనుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రస్తుతం ఆంగ్లం మాత్రమే కాకుండా కొరియన్, అరబిక్ భాషల్లోనూ సెర్చ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఐకాన్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క సెర్చ్ ఇంజిన్‌లు మాత్రమే కాకుండా ఈ-మెయిల్ ప్రొవైడర్లు కూడా అనేక భాషల్లో తమ సేవలను అందించాల్సి వస్తుంది.
కీబోర్దు కిరికిరి..
ఎవరికి వారు వారి వారి భాషల్లో వెబ్‌సైట్ల డొమైన్ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ ప్రస్తుతం వినియోగంలో ఉన్న కంప్యూటర్ కీబోర్డులు వాటికి ఏ విధంగా సహకరిస్తాయనేది ప్రధాన ప్రశ్న. కంప్యూటర్లను తయారుచేసే కంపెనీలన్నీ ఆల్ఫాబెటికల్(ఎ,బి,సి,డి...లు) ఆర్డర్‌లో ఉన్న కీ బోర్డులను సరఫరా చేస్తున్నాయి. అలాంటప్పుడు వీటిపై జపనీస్, అరబిక్, గ్రీక్, హిబ్రూ తదితర యూరోపియన్ భాషలు టైప్ చేయడం ఎలా? ఒకవేళ ఆయా భాషల్లో కీబోర్డులు తయారైనా వాటిని ఉపయోగించి మరో భాషలో ఉన్న అక్షరాలను ఎలా టైప్ చేయగలం? పోనీ ఎవరి మాతృభాషకు సంబంధించి వారు 'వర్చువల్ కీ బోర్డులు' డౌన్‌లోడ్ చేసుకున్నా ఆంగ్ల అక్షరాలు కలిగి ఉన్న కీ బోర్డు ద్వారా వాటిని ఉపయోగించడం ఎలా?
ఇవన్నీ ప్రస్తుతానికి మాత్రమే సమస్యలు. వీటికి తగిన సమాధానాలు ఇవ్వగలిగేది భవిష్యత్తు ఒక్కటే!
5 comments:
చాలా బాగుంది. ఇలా మీరు ఉపయోగకరమైనవి రాయండి.
ఇది ఒక మంచి ప్రరిణామం. ఇబ్బందలు తొలగిపోవడం కాయం.
Nice explanation and creative usage of words... But lot of redundancy in the matter. Reduce the "Unncecessary" things in your future posts.
Mr.Vivek.. Thank you for your suggestion. I will try my level best.
తప్పకుండా... మీలా సహృదయంతో ప్రోత్సహించే వారుంటే..
Post a Comment