500 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి
శివ క్రే టర్‌పై శాసవేత్తల దృష్టి
ఓ భారీ గ్రహశకలం గతితప్పి భూమికేసి దూసుకొచ్చింది. సుమారు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఆ గ్రహ శకలం ముంబైకి సమీపంలో హిందూ మహా సముద్ర జలాల్లో భూ ఉపరితలాన్ని ఢీకొట్టింది. భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో పరిసరప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ ఒక్క సారిగా పేలిపోతే ఎంత శక్తి విడుదలవుతుందో.. పేలుడు సందర్భంగా అంత శక్తి విడుదలైంది. గ్రహశకలం భూమిని గుద్దుకోవడం కారణంగా దాదాపు 500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో భారీ గొయ్యి(క్రేటర్) ఏర్పడింది. ఈ సంఘటన వల్ల అప్పటికి భూమిపై నివసిస్తున్న సమస్త జీవరాశులు తుడిచిపెట్టుకు పోయాయి. ఇదేం సైన్స్‌ఫిక్షన్ సినిమా కాదు.. 6.5 కోట్ల సంవత్సరాల కిత్రం వరకు ఈ భూమిపై తిరుగాడిన రాక్షసబల్లులు ఎలా అంతరించిపోయాయన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానమిది.

ఎలా అంతరించిపోయాయి?
రాక్షసబల్లులు ఎలా అంతరించిపోయాయనే విషయమై ప్రస్తుతం రెండు సిద్ధాంతాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం, మరొకటి.. అగ్నిపర్వతాల పేలుడు. భారీ గ్రహశకలం లేదా తోకచుక్క భూమిని బలంగా ఢీకొట్టడం వల్ల రాక్షసబల్లులన్నీ అంతరించి పోయాయని విశ్వసించే శాస్త్రవేత్తలు చాలా మందే ఉన్నారు. శంకర్ ఛటర్జీ కంటే ముందు కొందరు శాస్త్రవేత్తలు చిక్సులుబ్ క్రేటర్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ భారీ గొయ్యి మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ఉంది. చిక్సులుబ్ విస్తీర్ణాన్ని పరిశీలిస్తే.. ఆ గ్రహశకలానికి భూమి మీదున్న జీవులన్నింటినీ తుడిచిపెట్టేయగలిగిన శక్తి లేదని శాస్త్రవేత్తలు తేల్చిపారేశారు. దీంతో అగ్ని పర్వతాల పేలుళ్లే డైనోసార్ల విలుప్తానికి కారణమన్న వాదనకు ఊతం లభించింది. అయితే.. శంకర్ ఛటర్జీ శివ క్రేటర్‌ను గుర్తించడంతో.. మళ్లీ గ్రహశకల సిద్ధాంతానికి ప్రాచుర్యం లభించింది. దాదాపు 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శివ క్రేటర్ ఇప్పటి వరకు భూమిని గ్రహశకలాలు ఢీకొనడం వల్ల ఏర్పడిన క్రేటర్‌లలో కెల్లా అతి పెద్దది. రాక్షసబల్లుల విలుప్తానికి, శివ క్రేటర్‌కు సంబంధం ఉందని ఛటర్జీ వాదిస్తున్నారు.
భారత్‌తో దగ్గర సంబంధం?
రాక్షసబల్లుల విలుప్తానికి, భారత్‌కు దగ్గర సంబంధం ఉందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. మధ్య భారత దేశంలోని దక్కన్ పీఠభూమి ప్రాంతంలో భారీ అగ్నిపర్వత పేలుళ్ల వల్ల రాక్షసబల్లులు అంతరించాయనేది వారి వాదన. ఇందుకు జబల్‌పూర్ ప్రాంతంలో లభించిన భారీ టైటానోసారిడ్ డైనోసార్ శిలాజాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు.జబల్‌పూర్ సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన తవ్వకాల్లో లావా ప్రవాహం మధ్యలో చిక్కుబడిపోయిన టైటానోసారిడ్‌కు చెందిన ఓ తుంటి భాగం శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సాక్ష్యాల ఆధారంగా గ్రహశకలం ఢీకొట్టడంతోపాటు, అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా రాక్షసబల్లుల విలుప్తానికి కారణమేనని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వాదనలు ఎలా ఉన్నా.. ఇప్పటికీ కొన్ని మౌలిక ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకలేదు. రాక్షసబల్లులు శారీరకంగా చాలా అభివృద్ధి చెందినవి. ఇవి ఉష్ణరక్త జీవులు. వాటితో పోల్చితే.. డైనోసార్లతో సహజీవనం చేసిన ఉభయచరాలు, కొన్ని రకాల పక్షి జాతులు చాలా అల్పమైనవి. గ్రహ శకలం ఢీకొన్నా.. లేదా అగ్నిపర్వతాలు బద్దలైనా వాతావరణంలో తక్షణమే చాలా తీవ్రమైన మార్పులొస్తాయి. విషరసాయనాలు పెద్ద మొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ మార్పులకు కేవలం రాక్షసబల్లులు మాత్రమే బలైపోయి, ఉభయచరాలు, పక్షులు మాత్రం ఎలా బయటపడ గలిగాయనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకు కచ్చితమైన సమాధానం దొరకలేదు.
0 comments:
Post a Comment