సమయం : మధ్యాహ్నం 2:28 గంటలు
ప్రదేశం : ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్, లాంచ్‌ప్యాడ్ 39-ఎ.
విషయం : ఆరుగురు వ్యోమగాములు, అంతరిక్ష కేంద్రానికి చేరవేయాల్సిన వివిధ పరికరాలతో వ్యోమనౌక అట్లాంటిస్ సిద్ధంగా ఉంది. అఖరుసారి అన్ని తనిఖీలు విజయవంతంగా నిర్వహించిన తరువాత గ్రౌండ్ కంట్రోల్ నుంచి మిషన్ కౌంట్ డౌన్ మొదలైంది.
5... 4... 3... 2... 1... 0... బ్లాస్ట్!
నిప్పులు చిమ్ముకుంటూ అట్లాంటిస్ నింగికి ఎగసింది.

ఏం చేస్తారు...?
అంతరిక్షంలోకి వెళ్లి రావడం మనం అనుకునేంత సులువేం కాదు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా ఎంతో కఠోర శిక్షణ పొందినా.. వెళ్లేటప్పుడున్నంత ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు వ్యోమగాముల్లో కనిపించదు. కారణం.. అంతరిక్షంలో గడిపేది కొద్దిరోజులే అయినా.. అప్పటికే వారి కండరాలు బాగా క్షీణిస్తాయి. అందువల్లే అంతరిక్ష కేంద్రంలో కొన్ని రోజులపాటు విధులు నిర్వర్తించిన వ్యోమగాములను భూమిమీదికి చేర్చడం.. వారి స్థానంలో ఇతర వ్యోమగాములను పంపించడం. అయితే రోదసిలో మానవ కండరాల క్షీణత ఎలా జరుగుతుందనేది నేటికీ అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు పూనుకున్నారు. సోమవారం అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన వ్యోమనౌక అట్లాంటిస్‌లో వ్యోమగాములతోపాటు కొన్ని వేల వానపాము లార్వాలను కూడా పంపించారు. ఇవి ఎంత చిన్నవి అంటే.. మైక్రోస్కోప్ కింద చూస్తే తప్ప కనిపించని పరిమాణంలో ఉంటాయి. అసలు అంతరిక్షంలో ఏం జరుగుతుంది? ఈ కండరాల క్షీణత కేవలం మానవుల్లోనేనా? లేక ప్రాణమున్న ప్రతి జీవిలోనూ జరుగుతుందా? దేని ప్రభావం వల్ల ఇలా జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వానపాము లార్వాలే జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి భూమ్మీదికి తిరిగొచ్చాక వీటి శరీరంలో వచ్చిన మార్పులపై నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు అవసరమైన పరిశోధనలు నిర్వహిస్తారు. దీంతో అసలు జీవుల్లో కండరాలు నిర్మింపబడడానికి, క్షీణించడానికి కారణాలేమిటో తెలిసిపోతాయన్నది జీవ శాస్త్రవేత్తల అంచనా.

వ్యోమనౌక అట్లాంటిస్ బుధవారం నాటికి అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. ఆ తరువాత ప్రత్యేకమైన సెల్ కల్చర్ బ్యాగ్స్‌లో.. సుషుప్తావస్థలో.. ఉన్న ఈ వానపాము లార్వాలను అంతరిక్ష కేంద్రంలోని జపాన్‌కు చెందిన జీవ ప్రయోగశాల 'కిబో'కు చేరుస్తారు. అక్కడ వీటిని మళ్లీ జాగృతావస్థలోకి తీసుకొచ్చి.. వ్యోమగాముల మాదిరిగానే వీటిని కూడా భార రహిత స్థితికి గురిచేస్తారు. నాలుగు రోజులపాటు వీటిని అంతరిక్ష వాతావరణంలో ఉంచి తిరిగి సుషుప్తావస్థకు చేరుస్తారు. తిరిగి భూమ్మీదికి తీసుకొచ్చాక నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలకు చేర్చి, అంతరిక్షంలో గడిపిన సమయంలో వాటి శరీరాలలో వచ్చిన మార్పులపై అధ్యయనం చేస్తారు.
ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న కిబో ప్రయోగశాలలో బయోమెడిసిన్, మెటీరియల్ సైన్స్ తదితర విషయాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఇక్కడికి చేరే వానపాము లార్వాలపై నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ నాథానియేల్ పరిశోధనలు జరుపుతారు. ముఖ్యంగా వానపాము లార్వాల శరీరాలలోని కండరాలలో ప్రొటీన్ విచ్ఛిన్నానికి కారణమయ్యే సంకేతాలేమిటో ఈయన అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధనలు గనుక ఫలిస్తే.. కండరాల క్షీణతకు గురయ్యే రోగుల శరీరాలలో దీర్ఘకాలం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయంపై శాస్త్రవేత్తలకు మరింత అవగాహన కలుగుతుంది. అలాగే వృద్ధాప్యం మీద పడి కదలలేని స్థితిలో మంచంపైనే ఉండేవారు, మధుమేహ రోగగ్రస్థుల శరీరాలలో కండరాలు క్షీణించడానికి కారణాలేమిటో కూడా తెలుస్తుంది.
అవే ఎందుకని...?
అంతరిక్షంలో మానవ కండరాల క్షీణతపై జరిపే పరిశోధనలలో వానపాము లార్వాలనే ఎంచుకోవడానికి ఒక కారణముంది. ఈ వానపాము లార్వాలు సి-ఎలిగాన్స్ అనే రకానికి చెందినవి. ఇవి ఈ భూమిపై ఆవిర్భవించిన మొట్టమొదటి బహుకణ జీవులు. వీటి శరీరంలో ఉండే కండరాలు అచ్చు మానవ శరీరంలో ఉండే కండరాల మాదిరిగానే ఉంటాయి. వీటి జన్యువులలో అధికభాగం మానవ డిఎన్‌ఎలోని జన్యువులు నిర్వర్తించే విధులనే నిర్వర్తిస్తుంటాయి. మానవ శరీర నిర్మాణానికి వీటి శరీర నిర్మాణానికి చాలా దగ్గరి పోలికలు ఉండడంతో జీవ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు వీటినే ఎంచుకున్నారు. ఈ వానపాము లార్వాలను బ్రిస్టల్‌లోని ఓ చెత్త కుప్ప నుంచి సేకరించారు. సి-ఎలిగాన్స్ ఆర్‌ఎన్‌ఎఐ ఇన్ స్పేస్ ఎక్స్‌పెరిమెంట్ (సిఇఆర్‌ఐఎస్‌ఇ) గా పిలుస్తున్న ఈ పరిశోధనలన్నీ జపాన్‌లోని సెండాయ్‌లో ఉన్న టొహొకు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అత్సుషి హిగాషితాని ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈయనే ఈ ప్రాజెక్టుకు ముఖ్య పరిశోధకుడు. " ఈ భూమ్మీద మనకు తెలియని కొన్ని విషయాలు అంతరిక్షంలో తెలుస్తాయి. అంతరిక్షంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా మన శరీరం ఎలాంటి మార్పులకు గురవుతుందో వానపాము లార్వాలపై జరిపే ఈ పరిశోధనల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం..'' అని ప్రొఫెసర్ అత్సుషి హిగాషితాని వ్యాఖ్యానిస్తున్నారు.
0 comments:
Post a Comment