హిమాలయ పర్వతాలు.. ఈ పేరు వింటే చాలు చల్లని గాలి తెమ్మర తాకినట్లు ఒళ్లు పులకరిస్తుంది. మన దేశానికి ఉత్తరాన శత్రు దుర్భేద్యంగానే కాదు, దేశంలో ప్రవహించే హిందూ, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులు జీవ నదులుగా ప్రసిద్ధికెక్కడానికి కూడా ఈ మంచు పర్వతాలే కారణం. అలాంటి మహోన్నతైన ఈ హిమాలయాలకు ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్లుగా.. భూతాపం కారణంగా హిమాలయాలపై ఉన్న మంచు పొరలు కరిగి నీరైపోతున్నాయి. కరగడంలో కూడా అలా ఇలా కాదు.. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ మంచు కరగనంత వేగంగా మన హిమాలయాలు కరిగిపోతున్నాయట. ఇది ఇలాగే సాగితే, మరో పాతికేళ్ల తరువాత హిమాలయాలు అసలు కనిపించకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐపిసిసి నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ కరగనంత వేగంగా మన హిమాలయాలపై ఉన్న మంచు పొరలు కరిగిపోతున్నాయి. హిమాలయాలలో మంచు పొరలు కరిగి నీరైపోవడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని, వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయనడానికి, భూతాపం రోజురోజుకి పెరుగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఐపిసిసి ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఈ భూతాపం, హిమాలయాలలో మంచు కరగటం ఇలాగే కొనసాగితే, 2035 నాటికి హిమాలయాలు పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని కూడా ఈ సంస్థ హెచ్చరిస్తోంది.
భారీ ముప్పు..
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావం ఒక్క మనదేశంపైనే కాదు.. యావత్ ఆసియం ఖండంపై ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో వంద కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి బారిన పడనున్నట్లు కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన చర్చాపత్రాన్ని తయారు చేసింది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి. ఆయన పేరు వి.కె.రైనా. " హిమాలయ పర్వతాలపై ఉన్న మంచు పొరలు కరగ డం అనేది చాలా దశాబ్దాల క్రితమే మొదలైంది. అయితే ఈ విషయాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు పంతొమ్మిదో శతాబ్దం మధ్య భాగంలోనే గుర్తించగలిగారు. కానీ గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న అధ్యయనంలో హిమాలయ పర్వత సానువులకంటే కూడా అలస్కా, గ్రీన్‌లాండ్ ప్రాంతాలలో మంచు పొరలు శరవేగంగా కరిగిపోతున్నట్లు తెలుస్తోంది..'' అని రైనా ఆ చర్చాపత్రంలో పేర్కొన్నారు. అంతేకాదు, "మంచు పొరలు కిందికి జారటం, ఆ సమయంలో వచ్చే ఒకరకమైన శబ్దం.. వీటిని బట్టి మంచు పొరలు కరిగిపోతున్నాయని, ఇందుకు కారణం భూతాపమేనని శాస్త్రీయంగా చెప్పలేం. ఎందుకంటే ఈ మంచు పొరలు జారటం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతోంది. అంతెందుకు.. గంగోత్రి పర్వత సానువులనే తీసుకుంటే .. అక్కడ గత రెండు సంవత్సరాలుగా మంచు కరిగిన దాఖలాలు లేవు..'' అని వి.కె.రైనా పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది.
నిపుణులు ఏమంటున్నారు?
వి.కె.రైనా వాదనను, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన చర్చాపత్రంలో పేర్కొన్న విషయాలలో కొన్నింటిని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ చైర్మన్ రాజేంద్ర పచౌరి మాత్రం కొట్టిపారేశారు. " బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి నివేదికలు ఎలా తయారు చేస్తారో నాకు అర్థం కావ డం లేదు..'' అని ఆయన 'ది గార్డియన్' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాదు " అసలు ఆ చర్చాపత్రం అశాస్త్రీయమైనది, ఏకపక్షంగా రూపుదిద్దుకున్నది..'' అంటూ ఢిల్లీలోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టిఇఆర్‌ఐ)కు చెందిన లీడింగ్ గ్లేసియాలజిస్ట్ ప్రొఫెసర్ సయ్యద్ ఇక్బాల్ హస్నయిన్ అభిప్రాయపడుతున్నారు. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల శాతం పెరుగుతోందని 1980 తరువాత ప్రచురితమైన పలు శాస్త్రీయ కథనాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం ఈ చర్చా పత్రాన్ని రూపొందించిందని, హిమాలయ పర్వతసానువుల్లో మంచు పొరలు కరగటానికి ప్రధాన కారణం భూతాపమేనని ఈ శాస్త్రీయ కథనాలలో తగిన ఆధారాలు కూడా ఉన్నాయని హస్నయిన్ తన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. నిజానికి పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ 'హిమాలయాలు-కరుగుతున్న మంచు' అనే అంశంపై తాను రూపొందించిన చర్చాపత్రాన్ని విడుదలకు నెలరోజుల ముందే సమీక్ష కోసం గ్లేసియాలజిస్ట్ సయ్యద్ ఇక్బాల్ హస్నయిన్ వద్దకు పంపించింది. దానిని ఆమూలాగ్రం చదివిన ఆయన తన కామెంట్స్‌ను, వాటికి సంబంధించిన ఆధారాలను సైతం ఆ శాఖకు అందజేశారు. అయినప్పటికీ వాటిని ఆ మంత్రిత్వ శాఖ విస్మరించడమే కాకుండా ఎలాంటి మార్పులు చేయకుండానే చర్చాపత్రాన్ని విడుదల చేసింది.

నిజానికి హిమాలయాలలో మంచు పొరలు కరగడానికి వాతావరణంలోకి విడుదల అవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులలోని ఒక్క కార్బన్‌డయాక్సైడ్ మాత్రమే కారణం కాదని, బ్లాక్ కార్బన్, మీథేన్‌లతోపాటు వాతావరణంలోని ఓజోన్ కూడా ఇందుకు కారణమవుతున్నాయనే ది ప్రముఖ గ్లేసియాలజిస్ట్ ప్రొఫెసర్ ఇక్బాల్ హస్నయిన్ అభిప్రాయం. ఒక్క హస్నయిన్ మాత్రమే కాదు, హిమాలయ పర్వత సానువులలో తూర్పు దిక్కున మంచు పొరలు కరిగి, ఆ నీరంతా పారుతూ వచ్చి నేపాల్, సిక్కిం, భూటాన్ సరిహద్దుల్లో పెద్ద పెద్ద సరస్సులుగా మారుతోందని టిఇఆర్‌ఐకే చెందిన మరో గ్లేసియాలజిస్ట్ శ్రేష్ఠ్ తయాల్ కూడా అభిప్రాయపడుతున్నారు. వీరి అభిప్రాయాలు నిజమనడానికి ప్రతిష్ఠాత్మక సైన్స్ పత్రిక 'నేచర్' ఇటీవల ప్రచురించిన కథనాలే తాజా ఉదాహరణ. నేచర్ కథనాల ప్రకారం.. హిమాలయాలలోని మంచు నిరంతరం కరుగుతూ, ఆ నీరంతా తమ దేశంవైపు ప్రవహిస్తుండడంతో, తమ దేశంలో వరదలు సంభవించకుండా ఆ నీటిని దారి మళ్లిస్తూ భూటాన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు - 2001లో ఉత్తరాఖండ్‌లోని హెచ్‌ఎన్‌బి ఘర్‌వాల్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది జియాలజిస్ట్‌లు రూపొందించిన ఓ శాస్త్రీయ పత్రాన్ని 'కరెంట్ సైన్స్' పత్రిక ప్రచురించింది. ఈ పత్రిక కథనం ప్రకారం.. గత రెండు వందల సంవత్సరాలలో హిమాలయాలలోని గంగోత్రి పర్వత శిఖరం ఎత్తు రెండు కిలోమీటర్ల మేర తగ్గింది. ఇందులో నలభై శాతం తరుగుదల కేవలం గత 25 సంవత్సరాలలోనే సంభవించింది. అంటే.. గత రెండు వందల సంవత్సరాల కంటే ఇటీవలి పాతిక సంవత్సరాలలోనే ఈ శిఖరం ఎక్కువగా కరిగిపోయిందన్నమాట. ఇందుకు కారణం.. ఇంకేముంటుంది 'భూతాపం' తప్ప.
అసలు నిజం.. ఉపగ్రహానికెరుక!
ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఛీనాబ్, పార్వతి, బసవ బేసిన్స్‌లో ఉన్న 466 మంచు కొండలను అధ్యయనం చేసి ఆసక్తి కరమైన విషయాలను కనుగొంది. 1962 నాటితో పోల్చి చూసుకుంటే ప్రస్తుతం ఈ మంచు కొండలన్నీ 21 శాతం తరిగిపోయాయని ఈ బృందం తేల్చింది. ఇదే విషయాన్ని 2007లో తయారు చేసిన ఓ పత్రంలో కూడా అనిల్ కులకర్ణి తదితర శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, ఇటీవల స్పేస్ ఏజెన్సీకి చెందిన శాస్త్రావేత్తల బృందం హిమాలయాలలో కరుగుతున్న మంచు కారణంగా ఎంత నీరు సట్లెజ్ నదిలో చేరుతుందనే విషయంపై కూడా అధ్యయనం జరిపింది. 2040 నాటికి హిమాలయాలలో ఉష్ణోగ్రత ఇప్పుడున్నదానికంటే మరొక్క డిగ్రీ సెల్సియస్ పెరుగుతుందని, దాని వల్ల సట్లెజ్ నదిలో చేరే నీరు ఇప్పుడున్నదానికంటే 8 నుంచి 28 శాతం అధికంగా ఉండొచ్చనేది శాస్త్రవేత్తల అంచనా!