Wednesday 23 September 2009

పాతాళంలో కావలసినంత చమురు!



'కూర్చుని తింటుంటే కొండలైనా తరిగిపోతాయి' అనేది పెద్దల మాట. నిజమే ఈ మాట కేవలం మనం ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తిపాస్తులకే కాదు - ఈ భూమ్మీద ప్రకృతి సిద్ధంగా లభించే వనరులకు కూడా సరిపోలుతుంది.
అర్థం కాలేదు కదూ! అయితే మరి కాస్త లోతుగా ఆలోచిద్దాం.
ఇప్పుడు మనమేం చేస్తున్నాం? భూమిలోంచి ముడిచమురును వెలికితీసి దానిని శుద్ధి చేసి పెట్రోలు, డీజిలుగా మార్చుకుని మన కార్లలో పోసుకుని విలాసంగా తిరుగుతున్నాం. అయితే ఇలా ఎంత కాలం? ఇప్పటికే భూమిలోని బొగ్గు నిక్షేపాలు చాలా వరకు తరిగిపోయాయని, భవిష్యత్తులో భూమ్మీద బొగ్గు లభించకపోవచ్చని ఒకవైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దొరుకుతోంది కదా అని ఇలాగే యధేచ్ఛగా వాడుకుంటూ పోతే ఏదో ఒకనాటికి భూమిలోని ముడి చమురు కూడా పూర్తిగా అయిపోతుంది. అప్పుడేం చేస్తాం?

పెట్రోలు, డీజిలు వంటి ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే ముందు అసలు భూమిలో ముడి చమురు నిక్షేపాలు ఎలా తయారయ్యాయో తెలుసుకోవాలి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.. మనం వెలికి తీస్తున్న ముడిచమురు భూమిమీద, నీటిలో జీవించే ఆల్గే (నాచు), ప్లాంక్‌టన్‌ (పూలు పూయని నీటి మొక్కలు) చనిపోవడం ద్వారా తయారవుతోంది. ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోయిన తరువాత ఇవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురవుతాయి. ఇలా కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాలపాటు భూమి లోపలి పొరలలో జరిగే మార్పులకు లోనై హైడ్రోకార్బన్స్‌(ముడి చమురు అణువులు)గా రూపాంతరం చెందుతాయి.

హైడ్రోకార్బన్స్‌ అంటే...
హైడ్రోకార్బన్స్‌ అంటే.. ఉదజని, కర్బన సమ్మిళిత పదార్థం. ఇదే ముడి చమురుకు మూలం. మూడి చమురులో బ్యూటేన్‌, ప్రొపేన్‌ అనే పదార్థాలు ఉంటాయి. అయితే నేటి ఆధునిక యుగంలో.. మానవ మేధస్సు ఇంత పరిణితి చెందిన తరువాత.. అంగారక గ్రహాన్ని కూడా అందుకోవాలని ప్రయత్నిస్తున్న మానవుడు ఈ ముడి చమురును కృత్రిమంగా సృష్టించుకోలేడా? అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోవడం ద్వారా అవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురయి సహజసిద్ధంగా ఏర్పడే ముడి చమురు నిల్వలు పూర్తిగా అయిపోతే అప్పుడు మానవ జీవనమే స్తంభిస్తుంది. ఆ ప్రమాదం రాకమునుపే కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించేందుకు దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

ప్రత్యామ్నాయం ఇదిగో...
ఇలా ఇంధన వనరుల కృత్రిమ సృష్టికి ప్రయోగాలు చేస్తున్న వారిలో వాషింగ్టన్‌లోని కార్నెగి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ గన్‌చరోవ్‌ ఒకరు. ఈయన విశ్వవిద్యాలయంలోని జియో ఫిజికల్‌ లాబొరేటరీలో రష్యా, స్వీడన్‌కు చెందిన ఇతర శాస్త్రవేత్తలతో కలిసి సాగిస్తున్న ప్రయోగాలు కొంతమేర సత్ఫలితాలు ఇచ్చాయి. భూమిలోపలి పొరలలో దాదాపు 100 కిలోమీటర్ల లోతున మీథేన్‌ వాయువు(సహజ వాయువుకు ఇదే ప్రధానం)ను 1200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు తీసుకెళ్లడం ద్వారా కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించవచ్చని డాక్టర్‌ అలెగ్జాండర్‌ బృందం కనుగొంది. ఆ ఉష్ణోగ్రత వద్ద మీథేన్‌ వాయువు ఈథేన్‌, బ్యూటేన్‌, ప్రొపేన్‌, మాలిక్యులార్‌ హైడ్రోజన్‌, గ్రాఫైట్‌లుగా విడిపోవడం శాస్త్రవేత్తలు గమనించారు. మళ్లీ ఈథేన్‌ను లేజర్‌ కిరణాల ద్వారా అదే ఉష్ణోగ్రతకు తీసుకెళ్లినప్పుడు అది మీథేన్‌గా మారడం కూడా గమనించారు. వీటిలో బ్యూటేన్‌, ప్రొపేన్‌లు ముడి చమురుకు మూలమైన పదార్థాలు.
"మా ప్రయోగ ఫలితాలు చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. అంటే.. భూమి ఉపరితలం నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల లోతున ఉండే ఉష్ణోగ్రత వద్ద ఆల్గే, ఫ్లాంక్‌టన్‌లతో సంబంధం లేకుండానే హైడ్రోకార్బన్స్‌ తయారవుతాయి. అంతేకాదు, ఇలా తయారైన హైడ్రోకార్బన్స్‌ను అక్కడి క్రస్ట్‌ పొరలలో పగుళ్లు మధ్యన ఉండే తీవ్రమైన ఒత్తిడి పైకి నెట్టివేస్తూ ఉంటుంది. ఈ చమురు నిక్షేపాలనే వెలికితీసి, శుద్ధి చేసుకుని, దానిని మళ్లీ పెట్రోలు, డీజిలుగా మార్చుకుని మనం ఇన్నాళ్లూ ఉపయోగించుకుంటూ వస్తున్నాం..'' అని డాక్టర్‌ అలెగ్జాండర్‌ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీని ప్రకారం... భూమి మధ్యలోని 'కోర్‌' పొరలకు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల దిగువు నుంచి మొదలయ్యే 'క్రస్ట్‌' పొరలకు మధ్యన మరికొన్ని కిలోమీటర్లపాటు విస్తరించి ఉండే 'మాంటెల్‌' పొరల నడుమ ఉండే పగుళ్లలో అంతులేని చమురు నిల్వలు ఉండే అవకాశం ఉందన్నమాట.
అలాగే శాస్త్రవేత్తలు తమ ప్రయోగంలో మరో విషయాన్ని కూడా గమనించారు. అదేమిటంటే.. లేజర్‌ కిరణాల సాయంతో వేడిచేసినప్పుడు మీథేన్‌ వాయువు నుండి హైడ్రోకార్బన్స్‌తోపాటు చివరలో ఉద్భవించిన గ్రాఫైట్‌, మాలిక్యులార్‌ హైడ్రోజన్‌ తదితర పదార్థాలు కొన్ని రోజుల తరువాత వాటి ఉనికిని కోల్పోతున్నాయిగానీ, ఒక్క హైడ్రోకార్బన్స్‌ మాత్రం చెక్కు చెదరడం లేదు. దీని గురించి శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్‌ కుత్సెరోవ్‌ వ్యాఖ్యానిస్తూ.. "భూమిలోని మాంటెల్‌ పొరలలో ఉద్భవించే హైడ్రోకార్బన్స్‌ అక్కడి పొరలలో ఉండే విపరీతమైన ఒత్తిడి కారణంగా క్రస్ట్‌ పొరలలోకి చేరి చమురు, సహజ వాయు నిక్షేపాలుగా రూపాంతరం చెందుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ తదితర దేశాలలోని చమురు, సహజ వాయు నిక్షేపాలు ఇలా ఏర్పడినవే..'' అంటున్నారు.
అంతేకాదు, ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భూమిలోని మాంటెల్‌ పొరల వరకు గనుక మానవుడు వెళ్లగలిగితే అంతులేని చమురు నిక్షేపాలు సొంతమవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారాయన.

0 comments: