Friday 17 July 2009

రోడ్డు ప్రమాదమా.. అబ్బే జరగదు!

మీరు మీ కారును వేగంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళుతున్నారు. అర కిలోమీటరు దూరంలో భయంకరమైన మూల మలుపు ఉంది. అవతలి నుంచి కూడా ఓ కారు వేగంగా వస్తోంది. ఆ విషయం మీకు తెలియదు. సరిగ్గా మూల మలుపు దగ్గరకొచ్చేసరికి రెండు కార్లు హఠాత్తుగా ఎదురెదురుగా వచ్చాయి. అప్పుడేం జరుగుతుంది? మామూలుగా అయితే అంత వేగంలో రెండు కార్లూ ఒకదానినొకటి 'ఢీ'కొంటాయి. కానీ ఇకమీదట అలా జరగదు. ఎందుకంటే- మీరు గమనించకపోయినా మీ కారు జరగబోయే ప్రమాదాన్ని పసిగడుతుంది. ఎదురుగా వస్తున్న కారుతో ముందుగానే మాట్లాడుకుంటుంది. ప్రమాదాన్ని అరికట్టి మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుస్తుంది.

















ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! త్వరలోనే ఇలాంటి రోబోటిక్‌ కార్లు రాబోతున్నాయి. ఈ విషయంలో మనం శాస్త్రవేత్తలకు 'థాంక్స్‌' చెప్పాల్సిందే. ఎందుకంటే - ఈ కార్లు మాట్లాడుకోవడానికి అవసరమయ్యే అల్గారిథమ్స్‌ను వారే రూపొందించారు కాబట్టి. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ పసిఫిక్‌కు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అల్గారిథమ్స్‌ను రూపొందించింది. ఇక్కడ భారతీయులమైన మనం కాస్త గర్వపడాలి. ఎందుకంటే- ఈ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్నది మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ భీబయ్య శర్మ, డాక్టర్‌ ఉతేష్‌ చంద్‌. ఈ బృందం రూపొందించిన కొన్ని గణిత సూత్రాలు భవిష్యత్తులో రానున్న రొబోటిక్‌ కార్లు తాము ప్రయాణిస్తున్న దారిని ఎప్పుడు, ఎలా మార్చుకోవాలో తెలియజేస్తాయట.

ఎలాగంటే..
ప్రతి రొబోటిక్‌ కారును అందులో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌కు శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్స్‌ ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటాయి. ప్రతి కారులోనూ సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్స్‌ ఉంటాయి కాబట్టి ఇవి పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయి. ఎప్పుడన్నా మరీ దగ్గరగా వచ్చినా, ఎదురెదురుపడినా పరస్పరం సంభాషించుకుని సురక్షిత మార్గం ఏదో గుర్తించి ఆ దిశగా కదులుతాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తలెత్తవు.
ఇప్పటికే కంప్యూటర్‌ సిములేషన్‌ ద్వారా ఈ అల్గారిథమ్స్‌ పనితీరును ప్రదర్శించిన శాస్త్రవేత్తల బృందం ఇప్పుడు దీనిని రోబోట్‌లపై పరీక్షించి చూడాలని భావిస్తోంది. ఇందుకోసం రెండు చక్రాలు కలిగి ఉన్న రోబోట్లను వీరు ఎంచుకున్నారు.

ఫ్లకింగ్‌ ద్వారా...
సాధారణంగా రోబోట్‌లు వేటికవే విడివిడిగా పనిచేస్తాయి. వాటిని రూపొందించేటప్పుడే వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఆ రకంగా సమకూరుస్తారు. అయితే కొన్ని రోబోట్‌లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఎలా? ఇందుకోసం శాస్త్రవేత్తలు ఫ్లకింగ్‌ అనే టెక్నిక్‌ను వాడతారు. దీని వాడకం వలన ఒకటికన్నా ఎక్కువ రోబోట్‌లు బృందంగా ఏర్పడి తమకు అప్పగించిన విధులను నిర్వర్తిస్తాయి. ఈ రోబోటిక్‌ కార్లలో కూడా శాస్త్రవేత్తలు ఈ తరహా పరిజ్ఞానాన్ని సమకూర్చనున్నారు. దీనివలన ఒకటి కన్నా ఎక్కువ కార్లు లైను మారాల్సి వచ్చినప్పుడు వాటిలో ఒక కారు ఇందుకు నాయకత్వం వహిస్తుంది. మిగిలిన కార్లన్నీ తమ నాయకుడ్ని అనుసరిస్తాయి. దీంతో ఇక రోడ్డు ప్రమాదాలకు తావుండదు.

ప్రమాదమే జరగదా?
కార్లు రెండూ ఎదురెదురుగా వచ్చినప్పుడు మాత్రం జరగదు. అలా కాకుండా కార్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒకదాని పక్కకు ఒకటి అత్యంత సమీపంలోకి వచ్చినా, లేదంటే కారు మరీ రోడ్డు పక్కకు వచ్చినా ప్రమాదం జరగదని చెప్పలేం. అదేంటి అలా- అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే. ఎందుకంటే - రోబోటిక్‌ కార్లలో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌లకు సూచనలు అందించే అల్గారిథమ్స్‌ రూపకల్పనలో శాస్త్రవేత్తలు ' ఎట్రాక్షన్‌ టువార్డ్స్‌ ది టార్గెట్‌' అన్న నియమాన్ని పాటించారట. అంటే.. ఎదురెదురుగా వచ్చే రోబోటిక్‌ కార్ల నడుమ మాత్రమే సమాచార బదిలీ జరుగుతుంది. పక్కపక్కన ప్రయాణించే కార్లు పరస్పరం సభాషించుకోలేవు, సమాచారం ఇచ్చిపుచ్చుకోలేవు మరి. అయినా ఏం ఫర్వాలేదు.. ఇలా కార్లు పక్కపక్కనే ప్రయాణిస్తూ పరస్పరంఅత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, లేదంటే కారు బాగా రోడ్డు పక్కకు వచ్చేసినప్పుడు అందులో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌ ఏం చేయాలనే దానిపై ఈ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం మల్లగుల్లాలు పడుతోంది. బహుశా త్వరలోనే ఈ సమస్యకూ వీరు విరుగుడు కనుగొనే అవకాశం ఉంది. అయినా ఇంత వరకు వచ్చారంటే ఇది మాత్రం గొప్ప విజయం కాదూ? అందుకు శాస్త్రవేత్తలను అభినందిద్దాం.

0 comments: