Wednesday 1 July 2009

ఐఫోన్‌ 3Gs - అంతా బాగానే ఉంది కానీ...

యాపిల్‌ ఐఫోన్‌ సరికొత్త మోడల్‌ 'ఐఫోన్‌ 3Gs'భారత్‌లో ఎప్పుడు విడుదల అవుతుందాని సెల్‌ ప్రియులు రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. గతంలో విడుదలైన ఐఫోన్‌ల కంటే అధిక వేగం, మరో 100 కొత్త ఫీచర్లు ఈ కొత్త మోడల్‌ సొంతం. ఐఫోన్‌ 3Gs ఈ ఏడాది ఆగస్టు నెలలో మన దేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌ కంపెనీ తయారు చేసిన 'బ్లాక్‌బెర్రీ' సెల్‌ఫోన్‌తో పోల్చుకుంటే కొన్ని విషయాలలో ఐఫోన్‌ 3Gs సామర్థ్యం తక్కువేనని, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి ఈ ఫోన్‌ ద్వారా కొత్తగా ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

ఐఫోన్‌ 3Gs సాధారణ సెల్‌ వినియోగదారులకు గొప్పగా ఉండొచ్చేమోకానీ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర హై ఎండ్‌ సెల్‌ఫోన్లు ఉపయోగిస్తున్న వారిని అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఫోన్‌ 3Gsలో దాదాపు 6 లోపాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవేమిటంటే...

బ్యాటరీ
ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఏ స్మార్ట్‌ ఫోన్‌లో అయినా చూసుకునేది బ్యాటరీ జీవితకాలమే. ఐఫోన్‌ 3Gsలో బ్యాటరీ జీవిత కాలాన్ని యాపిల్‌ కంపెనీ పెంచినప్పటికీ, బ్లాక్‌బెర్రీ సిరీస్‌లో చాలా మోడళ్ల బ్యాటరీ జీవితకాలానికి ఇది సాటిరాలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐఫోన్‌ 3Gs బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేసుకుంటే 5 గంటలపాటు 3Gలో మాట్లాడుకోవచ్చు లేదా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చేసుకోవచ్చు. అదే బ్లాక్‌బెర్రీ Stormలో అయితే ఐదున్నర గంటలపాటు టాక్‌టైమ్‌, 15 రోజులపాటు స్టాండ్‌బై టైమ్‌ ఉంటాయి.

భద్రత
ఐఫోన్‌ల గురించి ఇంటర్నెట్‌ వెబ్‌సైట్‌లలో ప్రచురితమైన సమీక్షల ప్రకారం... ఇతర కంపెనీల ఫోన్లతో పోల్చుకుంటే ఐఫోన్‌లలో భద్రత తక్కువే. ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు ఐఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఐఫోన్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ OS 3.0కి కూడా ఇప్పటికి 46 భద్రతాపరమైన ప్యాచెస్‌ విడుదల చేశారు. వీటిలో ఎక్కువ భాగం ఐఫోన్‌ సొంత బ్రౌజర్‌ 'సఫారీ', ఓపెన్‌ సోర్స్‌ బ్రౌజర్‌ ఇంజన్‌ 'వెబ్‌కిట్‌'కు సంబంధించినవే.
అయితే భద్రత పరంగా చూసుకున్నప్పుడు యాపిల్‌ ఐఫోన్‌ 3Gsలో ఒక అద్భుతమైన ఫీచర్‌ ఉంది. అదే 'Remote Wipe'. ఒకవేళ మీ ఐఫోన్‌ దొంగిలింపబడితే, అందులోని మీకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఈ టూల్‌ సహాయంతో మీరు చెరిపివేయవచ్చు.

కీబోర్డు
యాపిల్‌ ఐఫోన్‌ 3Gsలో 'ఫిజికల్‌ కీబోర్డు' లేకపోవడం ఒక పెద్ద లోపంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మెసేజెస్‌, మెయిల్స్‌, నోట్స్‌ తదితరాల కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ 'ల్యాండ్‌స్కేప్‌ కీబోర్డు'ను సమకూర్చినప్పటికీ, దీనికంటే కూడా స్లైడర్‌ స్టయిల్‌ (ఫోన్‌ పైభాగాన్ని వేలితో పక్కకు తోయగానే కింద కీబోర్డు కనిపించడం) QWERTY కీబోర్డు ఉంటే వ్యాపార వర్గాల వారికి టైపింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉండేదనేది విశ్లేషకుల భావన. ఇలాంటి కీబోర్డు రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌ కంపెనీ రూపొందించిన బ్లాక్‌బెర్రీ సిరీస్‌ ఫోన్లలో ఉంటుంది.

వీడియో రికార్డింగ్‌
ఇప్పటి వరకు యాపిల్‌ ఐఫోన్‌లలో ఉన్న అతి పెద్ద లోపం.. వీడియో రికార్డింగ్‌ సదుపాయం లేకపోవడం. అయితే కొత్త మోడల్‌ 3Gsలో యాపిల్‌ కంపెనీ ఈ లోపాన్ని సరిదిద్దుకున్నప్పటికీ ఫోన్‌ ముందు భాగంలో కెమెరాను అమర్చకపోవడం వల్ల వినియోగదారులకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ సదుపాయం లభించదు. అంటే వీడియోను చూడగలం, రికార్డు చేయగలం కానీ దానిని Wi-Fi, లేదా సెల్యులార్‌ నెట్‌వర్క్‌ ద్వారా మరొకరికి పంపలేం, ఇతరుల నుంచి అందుకోలేం. ఇతర హై ఎండ్‌ సెల్‌ఫోన్లలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సదుపాయం ఉన్నప్పటికీ ఐఫోన్‌ 3Gsలో అది లేకపోవడం దానిని ఇష్టపడే వ్యాపార వర్గాల వారికి పెద్ద నిరాశే.

ఎడిటింగ్‌
ఐఫోన్‌లో మరో పెద్ద నిరాశ.. వర్డ్‌ డాక్యుమెంట్‌ అప్లికేషన్‌ను ఎడిట్‌ చేసుకోలేక పోవడం. అంటే.. వర్డ్‌ డాక్యుమెంట్‌లను చదవగలమే కానీ అందులో తప్పొప్పులను సరిచేయలేమన్న మాట. ఫోన్‌ ఎంత బాగున్నప్పటికీ, ఇతర ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నప్పటికీ.. ఇలాంటి కొన్ని లోపాల కారణంగా యాపిల్‌ ఐఫోన్‌ నేటికీ చాలామంది దరికి చేరలేకపోతోంది. ఎడిటింగ్‌ సౌకర్యం ఉన్న ఇతర ఫోన్లు ఎన్నో మార్కెట్‌లో ఉన్న తరుణంలో యాపిల్‌ కూడా ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కనీసం ఎడిటింగ్‌ సౌకర్యాన్ని కల్పించే థర్డ్‌ పార్టీ అప్లికేషన్లను అందించడం ద్వారా అయినా ఐఫోన్‌లో ఉన్న ఈ లోపాన్ని యాపిల్‌ సరిదిద్దవచ్చు.

ఫ్లాష్‌ సపోర్ట్‌
ఐఫోన్‌లలో మరో లోపం.. అవి ఫ్లాష్‌ ఫార్మేట్‌లో ఉన్న మల్టీమీడియా ఫైల్స్‌ను ప్లే చేయలేకపోవడం. ఐఫోన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ 3Gsలో సైతం ఫ్లాష్‌ సపోర్ట్‌ లేకపోవడం అభిమానులను బాధించే అంశమే. ఐఫోన్‌లలో ఫ్లాష్‌ అప్లికేషన్‌ అతి తక్కువ వేగంతో పనిచేయడం వల్లే దానిని చేర్చడం లేదని గతంలోనే యాపిల్‌ ప్రకటించింది. అయినా సరే, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సమయంలో ఫ్లాష్‌ కంటెంట్‌ను మిస్‌ అవడం తమను తప్పక నిరాశకు గురిచేసే అంశమేనని ఐఫోన్‌ అభిమానులు పేర్కొంటున్నారు.
మరి, ఇన్ని లోపాలతో కూడిన ఐఫోన్‌ 3ఎఖిను భారతదేశంలో ఎంతమంది ఇష్టపడతారో వేచి చూడాల్సిందే!

0 comments: