Saturday 26 December 2009

2010లో ' కృత్రిమ జీవం' పుడుతుందా!?


విశ్వంలోకి దూసుకుపోతున్నాం.. భూగోళాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆరాటపడుతున్నాం.. చివరికి ప్రకృతిని కూడా మనకు నచ్చినట్లు మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అన్నీ కృత్రిమంగా మనమే తయారు చేసుకుంటున్నాం. చివరికి మానవ మెదడు, గుండె, రక్తం.. వీటిని కూడా ప్రయోగశాలలోనే పండించేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఇన్నేళ్లు గడిచినా జీవశాస్త్రవేత్తలకు అర్థం కానిది, వారు కృత్రిమంగా తయారు చేయలేనిది ఒకటి మిగిలే ఉంది. అదే - ప్రాణం.. అంటే 'జీవం'. అయితే భవిష్యత్తులో 'జీవం' గుట్టు కూడా మనుషుల చేతులకు చిక్కబోతోంది. ఈ దిశగా ఇప్పటికే అనేక ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి.

కృత్రిమ జీవం ఆవిర్భావం దిశగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుకు ముద్దుగా 'సింథటిక్‌ లైఫ్‌' అని పేరు పెట్టారు. ఎందుకంటే.. సింథియా అనేది ఈ భూమ్మీద బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక జీవ జాతి శాస్త్రీయనామం. మైకోప్లాస్మా జెనిటాలియం అనే సూక్ష్మజీవిలోని డిఎన్‌ఎ ఆధారంగా శాస్త్రవేత్తలు ఒక బ్యాక్టీరియాను సృష్టించడానికి సకల యత్నాలూ చేశారు.
జీనోమిక్స్‌లో అగ్రగణ్యుడిగా భావిస్తున్న జీవశాస్త్రవేత్త క్రెయిగ్‌ వెంటర్‌ ఓ అడుగు ముందుకేసి, 2008 జనవరిలో ఒక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో సింథటిక్‌ మైకోప్లాస్మా జెనిటాలియంను తన ప్రయోగశాలలో సృష్టించబోతున్నానన్నది ఆ ప్రకటన సారాంశం. నిజానికి అప్పట్లో క్రెయిగ్‌ ప్రకటనను ఎవరూ పెద్దగా విశ్వసించలేదు. కానీ కొన్ని నెలల క్రితం జీనోమ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ప్రక్రియ ద్వారా వేర్వేరు మైకోప్లాస్మా జాతులకు చెందిన బ్యాక్టీరియా కణాలలో డిఎన్‌ఎను ప్రవేశపెట్టగలిగినట్లు క్రెయిగ్‌ బృందం ప్రకటించడమేకాక, ఆ ప్రక్రియను విజయవంతంగా ప్రదర్శించడంతో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది.
నిజానికి ఈ ప్రయోగంలో క్రెయిగ్‌ బృందం అనేక ఒడి దొడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. తన లోకి ప్రవేశించిన కొత్త డిఎన్‌ఎను నిర్వీర్యం చేసేందుకు బ్యాక్టీరియా కణం కొన్ని ఎంజైములను విడుదల చేయడం, ఆ పరిస్థితులను తట్టుకుని సింథియా డిఎన్‌ఎ మనుగడ సాధించడం.. మొత్తం ఈ ప్రక్రియనంతా క్రెయిగ్‌ బృందం చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి వచ్చింది.
నాణేనికి మరోవైపు..
మరోవైపు మరికొందరు జీవ శాస్త్రవేత్తలు కృత్రిమ జీవ కణానికి సంబంధించిన పదార్థాలను సృష్టించే పనిలో నిమగ్నులైపోయారు. హర్వార్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త జార్జ్‌ చర్చ్‌ తన బృందం ఇప్పటికే ప్రొటీన్‌ను రూపొందించే స్వయం నిర్మాణ రైబోజోమ్‌ను సృష్టించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. అంతేకాదు, తన తదుపరి ప్రయోగం సజీవ రైబోజోమ్‌ను సృష్టించడమేనని, అది కూడా 2010లోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఏ నిమిషానికి ఏమి జరుగునో ..' అన్నట్లు ఒకవేళ జీనోమ్స్‌ అగ్రగణ్యుడు క్రెయిగ్‌ వెంటర్‌ తాను అనుకున్నది 2010లో సాధించగలిగితే.. నిజంగా ప్రయోగశాలలో 'జీవం' ఆవిర్భవిస్తే, మానవుడే.. మాధవుడు అనుకోవలసిందే కదా!

0 comments: