విశ్వంలోకి దూసుకుపోతున్నాం.. భూగోళాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆరాటపడుతున్నాం.. చివరికి ప్రకృతిని కూడా మనకు నచ్చినట్లు మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అన్నీ కృత్రిమంగా మనమే తయారు చేసుకుంటున్నాం. చివరికి మానవ మెదడు, గుండె, రక్తం.. వీటిని కూడా ప్రయోగశాలలోనే పండించేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఇన్నేళ్లు గడిచినా జీవశాస్త్రవేత్తలకు అర్థం కానిది, వారు కృత్రిమంగా తయారు చేయలేనిది ఒకటి మిగిలే ఉంది. అదే - ప్రాణం.. అంటే 'జీవం'. అయితే భవిష్యత్తులో 'జీవం' గుట్టు కూడా మనుషుల చేతులకు చిక్కబోతోంది. ఈ దిశగా ఇప్పటికే అనేక ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి.
కృత్రిమ జీవం ఆవిర్భావం దిశగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుకు ముద్దుగా 'సింథటిక్ లైఫ్' అని పేరు పెట్టారు. ఎందుకంటే.. సింథియా అనేది ఈ భూమ్మీద బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక జీవ జాతి శాస్త్రీయనామం. మైకోప్లాస్మా జెనిటాలియం అనే సూక్ష్మజీవిలోని డిఎన్‌ఎ ఆధారంగా శాస్త్రవేత్తలు ఒక బ్యాక్టీరియాను సృష్టించడానికి సకల యత్నాలూ చేశారు.
జీనోమిక్స్‌లో అగ్రగణ్యుడిగా భావిస్తున్న జీవశాస్త్రవేత్త క్రెయిగ్ వెంటర్ ఓ అడుగు ముందుకేసి, 2008 జనవరిలో ఒక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో సింథటిక్ మైకోప్లాస్మా జెనిటాలియంను తన ప్రయోగశాలలో సృష్టించబోతున్నానన్నది ఆ ప్రకటన సారాంశం. నిజానికి అప్పట్లో క్రెయిగ్ ప్రకటనను ఎవరూ పెద్దగా విశ్వసించలేదు. కానీ కొన్ని నెలల క్రితం జీనోమ్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ ద్వారా వేర్వేరు మైకోప్లాస్మా జాతులకు చెందిన బ్యాక్టీరియా కణాలలో డిఎన్‌ఎను ప్రవేశపెట్టగలిగినట్లు క్రెయిగ్ బృందం ప్రకటించడమేకాక, ఆ ప్రక్రియను విజయవంతంగా ప్రదర్శించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది.
నిజానికి ఈ ప్రయోగంలో క్రెయిగ్ బృందం అనేక ఒడి దొడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. తన లోకి ప్రవేశించిన కొత్త డిఎన్‌ఎను నిర్వీర్యం చేసేందుకు బ్యాక్టీరియా కణం కొన్ని ఎంజైములను విడుదల చేయడం, ఆ పరిస్థితులను తట్టుకుని సింథియా డిఎన్‌ఎ మనుగడ సాధించడం.. మొత్తం ఈ ప్రక్రియనంతా క్రెయిగ్ బృందం చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి వచ్చింది. నాణేనికి మరోవైపు..
మరోవైపు మరికొందరు జీవ శాస్త్రవేత్తలు కృత్రిమ జీవ కణానికి సంబంధించిన పదార్థాలను సృష్టించే పనిలో నిమగ్నులైపోయారు. హర్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త జార్జ్ చర్చ్ తన బృందం ఇప్పటికే ప్రొటీన్‌ను రూపొందించే స్వయం నిర్మాణ రైబోజోమ్‌ను సృష్టించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. అంతేకాదు, తన తదుపరి ప్రయోగం సజీవ రైబోజోమ్‌ను సృష్టించడమేనని, అది కూడా 2010లోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఏ నిమిషానికి ఏమి జరుగునో ..' అన్నట్లు ఒకవేళ జీనోమ్స్ అగ్రగణ్యుడు క్రెయిగ్ వెంటర్ తాను అనుకున్నది 2010లో సాధించగలిగితే.. నిజంగా ప్రయోగశాలలో 'జీవం' ఆవిర్భవిస్తే, మానవుడే.. మాధవుడు అనుకోవలసిందే కదా!
2012 కల్లా 40 శాతం వినియోగదారుల చేతుల్లో టచ్‌స్క్రీన్ మొబైల్ ఫోన్లు ఉంటాయని సెల్‌ఫోన్ల దిగ్గజం నోకియా జోస్యం చెబుతోంది. చెప్పటమే కాదు, టచ్‌స్క్రీన్ మొబైల్స్ మార్కెట్‌లో తన వాటాను పెంచుకునే దిశగా పావులు చకచకా కదుపుతోంది. యాపిల్ ఐఫోన్ హవాకు అడ్డుకట్ట వేయాలన్న తపనతో ఇంతకుముందే 5230 పేరిట టచ్ స్క్రీన్ ఫోన్‌ను విడుదల చేసిన నోకియా ఇప్పుడు మళ్లీ 5530 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ పేరిట తాజాగా మరో టచ్‌స్క్రీన్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది నోకియా గతంలో ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ పేరిట విడుదల చేసిన 5800 టచ్‌స్క్రీన్ ఫోన్‌ను పోలి ఉన్నప్పటికీ దీని ప్రత్యేకతలు దీనివే. ఆపరేటింగ్ సిస్టం : సింబయాన్ వెర్షన్ 9.4 డిస్‌ప్లే : 2.9 అంగుళాల టిఎఫ్‌టి రెసిస్టివ్ టచ్‌స్క్రీన్ (16 మిలియన్ కలర్స్) కెమెరా : 3.15 మెగా పిక్సెల్ ఆటోఫోకస్ విత్ ఎల్‌ఇడి ఫ్లాష్ ఇతర ఫీచర్లు : ఆటో టర్న్-ఆఫ్, ఆటో రొటేట్, హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్, స్టీరియో స్పీకర్స్ విత్ 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్‌బి, బ్లూటూత్, జిపిఆర్‌ఎస్, ఎడ్జ్, వైఫై, స్టీరియో ఎఫ్‌ఎం రేడియో విత్ ఆర్‌డిఎస్, ఆడియో, వీడియో ప్లేబ్యాక్, ఫోటో ఎడిటర్, డాక్యుమెంట్ వ్యూయర్, ఫ్లాష్ లైట్ 3.0 తదితర ఫీచర్లు ఉన్నాయి. ధర : రూ.14,029
ఎప్పుడో ప్రాచీన కాలంలో వచ్చిన డెస్క్‌టాప్‌లు, ఆ 'మధ్య'యుగంలో వచ్చిన ల్యాప్‌టాప్‌లు.. నిన్న మొన్న వచ్చిన నెట్‌బుక్‌లపైన మోజు తగ్గిపోయిందా? 'లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఏదైనా వస్తే బాగుండు..' అనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే 'నోషన్ ఇంక్' కంపెనీ తాజాగా ఓ 'స్మార్ట్ ప్యాడ్'ను సిద్ధం చేసింది. 2010లో జరిగే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఆరంగేట్రం చేయనున్న ఈ లేటెస్ట్ డివైజ్‌కు ఇంకా పేరే పెట్టలేదు. మరి దీని ప్రత్యేకతలేమిటో ఓ లుక్కేద్దామా...
చూడడానికి ల్యాప్‌టాప్‌లా ఉన్నా 'షేపు' కొంచెం అదో టైపులో ఉంది కదూ! అప్పుడే ఏముంది? ఈ స్మార్ట్ ప్యాడ్ ప్రత్యేకతలు వింటే మీరే హాశ్చర్యపోతారు. Nvidia Tegra T20 చిప్‌సెట్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ప్యాడ్‌ను పగలు ఒకలా, రాత్రిపూట మరోలా కనిపించే డిస్‌ప్లే స్క్రీన్ Pixel Qi Transflective Displayతో రూపొందించారు. దీనికున్న 10.1 అంగుళాలు డిస్‌ప్లే స్క్రీన్ 1080 పిక్సెల్స్ హై డెఫినిషన్ వీడియోను సపోర్ట్ చేయడమేకాక గది వెలుతురులో సాధారణ ఎల్‌సిడి మాదిరిగానే పనిచేస్తుంది. అదే పగటిపూట సూర్యకాంతి మీదపడినప్పుడు ఈ స్క్రీన్ ఆటోమేటిక్‌గా తన రంగులు కొంత తగ్గించుకుని ఇ-ఇంక్ ప్యానల్ మాదిరిగా మారిపోతుంది. అంటే.. పగటిపూట ఎండలోనూ టెక్స్‌ట్ మ్యాటర్, ఇమేజెస్, వీడియోలను స్పష్టంగా చూడగలిగే విధంగా మారుతుందన్నమాట. వేలిముద్రలు, గీతలు పడకుండా ఉండేందుకు ఈ డిస్‌ప్లే తయారీలో యాంటీ గ్లేరింగ్, ఫింగర్‌ప్రింట్ స్క్రాచ్ రెసిస్టెంట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ప్యాడ్‌కు USB Portతోపాటుగా లేటెస్ట్‌గా వస్తున్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌ను అనుసంధానం చేసుకునేందుకు వీలుగా HDMI Ports, 3.5 ఎంఎం స్టీరియో హెడ్‌ఫోన్ జాక్ అండ్ మైక్రోఫోన్ ఇన్‌పుట్, 3 మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటోఫోకస్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, వాటర్ అండ్ యాంబియంట్ లైట్ సెన్సర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. 16 జిబి, 32 జిబి స్టోరేజి సామర్థ్యంతో వెలువడే నోషన్ ఇంక్ స్మార్ట్‌ప్యాడ్‌లో కంపాస్, జిపిఎస్, వైఫై, బ్లూటూత్ అండ్ సెల్యులార్ (హైస్పీడ్ డేటా పాకెట్ యాక్సెస్) అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే.. ఒక్కసారి పూర్తిస్థాయిలో రీఛార్జ్ చేసుకుంటే 8 గంటలపాటు హైడెఫినిషన్ వీడియో చూడవచ్చు లేదంటే 16 గంటలపాటు వైఫై బ్రౌజింగ్ చేయవచ్చు. స్టాండ్‌బై టైం వచ్చేసి 48 గంటలు, అంటే.. రెండ్రోజులు ఉంటుంది. ఇన్ని సదుపాయాలున్న ఈ 'అనామిక' ధర ఎంత ఉంటుందో తెలియాలంటే ఒకటి, రెండు నెలలు నిరీక్షించాల్సిందే మరి!
ఈ ఫోన్ పేరు AF11. ఎయిర్‌ఫోన్ మొబైల్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో ఎఫ్‌ఎం రేడియోతోపాటు ఎంపి3 పాటలు వినగలిగే సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 7 గంటలపాటు మాట్లాడుకోవచ్చు. అలాగే స్టాండ్‌బై టైం 4 గంటలు ఉంటుంది. బ్లాక్ అండ్ గ్రే, బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ కాంబినేషన్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇన్ని సదుపాయాలు ఉన్న ఈ ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా? కేవలం రూ.1,499 మాత్రమే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్. అంటే.. ఒకే ఫోన్‌లో రెండు సిమ్ కార్డులు వేసుకోవచ్చన్నమాట. ఇంత తక్కువ ధరకే ఇన్ని ఫీచర్స్ ఉన్న డ్యూయల్ సిమ్ ఫోన్ అంటే మన వాళ్లు ఊరుకుంటారేంటీ.. ఎగబడిపోరూ!?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ తయారైంది. దీనిని 'ఐఫోన్ త్రీజి సుప్రీమ్' అని పిలుస్తున్నారు. ఈ ఫోన్ ఖరీదు రూ.14.7 కోట్లు. దీనిని బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన గోల్డ్ స్టిక్కర్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ తయారు చేసింది. స్టువార్ట్ హ్యూ అనే డిజైనర్ ఈ ఐఫోన్‌కు రూపకల్పన చేశారు. 22 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ ఐఫోన్‌లో 200 వజ్రాలు తాపడం చేశారు. ఈ ఫోన్ ఫ్రంట్ ప్యానల్‌పై 136 వజ్రాలు ఉండగా, అందులో 53 వజ్రాల వరకు ఒక్క ఐఫోన్ లోగోలోనే పొందుపరిచారు. ముందు భాగంలో ఉన్న నావిగేషన్ బటన్‌కు 7.1 క్యారెట్ల విలువైన వజ్రాన్ని తాపడం చేశారు. మొత్తంమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ గోల్డెన్ ఐఫోన్ తయారీకి దాదాపు పది నెలలు పట్టింది.