
మీ కారు రాగానే మెయిన్ గేటు దానంతట అదే తెరుచుకుంటుంది. అక్కడ్నించి పార్కింగ్ స్లాట్‌లోకి వెళ్లే వరకు దారి పొడవునా లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతూ మీకు దారి చూపిస్తాయి. మీరు కారు పార్క్ చేసి వచ్చి మీ ఫ్లాట్‌లోకి అడుగు పెట్టగానే.. మీ అడుగుల సవ్వడికి హాల్లోని లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. స్ప్లిట్ ఏసీ నిశ్శబ్దంగా ఆన్ అయి చల్లటి గాలిని వెదజల్లి మిమ్మల్ని సేద తీరుస్తుంది. మీరు హాల్లోంచి బెడ్ రూమ్‌లోకి వెళ్లగానే లైట్లు ఆరిపోయి, బెడ్‌రూమ్‌లోని లైట్లు వెలుగుతాయి. బెడ్‌రూమ్‌లోంచి బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే బెడ్‌రూమ్‌లోని లైట్లు ఆరిపోయి, బాత్‌రూమ్‌లోని లైట్లు వెలుగుతాయి. ఇంట్లో మీరు ఏ గదిలో ఉంటే ఆ గదిలో వీనుల విందైన సంగీతం మంద్రస్థాయిలో వినిపిస్తూ ఉంటుంది. ఉదయం పూట బయట ఎండ మొదలవగానే మీ ఇంట్లోని విండో కర్టెన్లు వాటంతట అవే మూసుకుంటాయి. సాయంత్రం బయట వాతావరణం చల్లబడగానే తిరిగి తెరుచుకుంటాయి. మీ ఇంటికి ఎవరైనా వస్తే.. ఆ వచ్చింది ఎవరన్నది మీ హాల్లోని ఎల్‌సిడి స్క్రీన్ మీకు చూపిస్తుంది. మీరు ఓకే బటన్‌పై ప్రెస్ చేస్తేనే మీ ఇంటి ముఖద్వారా తెరుచుకుంటుంది.
ఇదంతా చదివాక 'అబ్బ.. ఇదేదో మాయా ద్వీపంలో మాంత్రికుడి కోటలా ఉందే..' అని మీరనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇదంతా 'హోమ్ ఆటోమేషన్ మాయాజాలం. ఇలాంటి అధునాతన సదుపాయాలు ఉన్న ఇళ్లనే 'స్మార్ట్‌హోమ్స్' అని పిలుస్తున్నారు. అచ్చ తెలుగులో 'సాంకేతిక గృహాలు'గా కూడా చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లూ ఇలాంటి స్మార్ట్ హోమ్స్ విదేశాలకే పరిమితం.. కానీ ఇప్పుడు మన దేశానికే కాదు రాష్ట్రానికీ వచ్చేశాయి. ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలని భావించేవారు దానికయ్యే డబ్బుకు మరికాస్త అదనంగా ఖర్చు చేయగలిగితే ఈ 'స్మార్ట్‌హోమ్'ను సొంతం చేసుకోవచ్చు.
ఏమిటీ 'ఈ' మాయ!
ఇది మాయ కాదు, ఇందులో ఎలాంటి మర్మం లేదు. ఎలక్ట్రానిక్స్ బాగా అభివద్ధి చెందడంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఈ హోమ్ ఆటోమేషన్ విధానంలో ఎనర్జీ సేవింగ్ ఫీచర్స్, సెక్యూరిటీ ఫీచర్స్, ఈజీ లైఫ్ ఫీచర్స్.. మీ జీవితాన్నిన మరింత సౌఖ్యంగా మార్చుతాయి. ఎనర్జీ సేవింగ్ ఫీచర్స్ అనేవి ముఖ్యంగా ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ మిషన్‌కు సంబంధించినవి. ఈ విధానంలో ప్రతి గదిలో ఉండే లైటు, ఫ్యాను బెడ్‌రూమ్‌లోని స్ప్లిట్ ఏసీ వద్ద ఎలక్ట్రానిక్ సెన్సర్లు అమర్చుతారు. ఫలితంగా గదిలోకి ఎవరైనా ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్‌గా లైట్లు వెలగడం, ఫ్యాన్లు తిరగడం, ఏసీ ఆన్ అవడం వంటివి జరుగుతాయి. అదేవిధంగా గదిలోంచి బయటికి వెళ్లిపోగానే లైట్లు, ఫ్యాన్లు, ఏసీ.. అన్నీ వాటంతట అవే ఆరిపోతాయి. కావాలనుకుంటే ఏ లైటు ఎన్ని గంటలకు వెలగాలో, ఎన్ని గంటలకు ఆరిపోవాలో కూడా ముందుగానే టైం సెట్ చేసుకోవచ్చు. ఈ విధానంలో విద్యుత్తు చాలావరకు ఆదా అవుతుంది.
సెక్యూరిటీ ఫీచర్లు..
సెక్యూరిటీ అంశాల విషయానికొస్తే.. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారెవరన్నది ముందుగానే మీ ఇంట్లోని ఎల్‌సిడి ప్యానల్ మీకు చూపించడం, మీకిష్టమై ఓకే బటన్ ప్రెస్ చేస్తేనే ఇంటి ముఖద్వారా తెరుచుకుంటుంది. అలాగే ఆదివారం పూట మీరు వంటింట్లో బిజీగా ఉన్నప్పుడు కూడా ఎల్‌సిడి స్క్రీన్ ద్వారా సెల్లార్‌లో ఆడుకుంటున్న మీ అబ్బాయిని ఓ కంట కనిపెడుతూ ఉండొచ్చు. అందరూ కలిసి ఏదైనా పిక్నిక్ ప్రోగ్రాం వేసుకుని బయటికి వెళ్లినప్పుడు ఇంటిని గురించి బెంగ పడనక్కర్లేదు. మళ్లీ మీరొచ్చి మీ దగ్గర ఉండే ఐడి కార్డు చూపించే వరకు మీ ఇంటి మెయిన్ డోర్ తెరుచుకోదు. ఒకవేళ మీరు ఇంట్లో లేనప్పుడు బలవంతంగా ఇంటి తలుపుగాని, కిటికీలుగాని తెరవాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. వెంటనే సైరన్ మోగడంతోపాటు మీరెక్కడ ఉన్నా మీ సెల్‌ఫోన్‌కు ఆటోమేటిక్‌గా ఎస్సెమ్మెస్ వస్తుంది. ఇలాంటి అధునాతన ఫీచర్లు ఎన్నో హోమ్ ఆటోమేషన్‌లోని సెక్యూరిటీ ఆప్షన్స్‌లో ఉంటాయి.
లైఫ్ ఈజీ ఫీచర్లు..
మీరు మీ ఇంట్లోని ఏ గదిలోకి వెళ్తే ఆ గదిలో మీకిష్టమైన సంగీతం వినిపిస్తుంది. సాయంత్రం అవగానే మీరు తెరవాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోని అన్ని కిటికీల కర్టెన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. చీకటి పడే వేళకి మీ ఇంటి ముందు వరండాలో, ఇంటి వెనుక, చుట్టుపక్కల లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. మళ్లీ ఉదయం మీరు లేచి అన్ని లైట్లను ఆర్పేయాల్సిన అవసరం ఉండదు. తెల్లవారగానే వాటంతట అవే ఆరిపోతాయి. దీంతో 'అరే.. లైట్లు ఆర్పలేదే.. కరెంటు ఎక్కవ కాలుతుందేమో..' అనే ఆందోళనే ఉండదు.
ఎక్కడున్నాయి?
ఇన్నాళ్లూ విదేశాలకే పరిమితమైన ఈ హోమ్ ఆటోమేషన్ పరిజ్ఞానం ఇప్పుడు మన దేశంలోని ప్రధాన నగరాలలోనే కాకుండా మన రాష్ట్రంలోనూ లభిస్తోంది. మన రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలో ఇప్పటికే ఈ తరహా సాంకేతిక గృహాలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో ఉన్న మదీనాగూడలో జనప్రియ 'నైల్ వ్యాలీ' పేరుతో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో ఫుల్లీ ఆటోమేషన్, సెమీ ఆటోమేషన్ ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే షేక్‌పేట్‌లో ఉన్న 'ఏలియన్స్ స్పేస్‌స్టేషన్' అపార్ట్‌మెంట్లలో కూడా ఈ హోమ్ ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక్క అపార్ట్‌మెంట్ ఫ్లాట్లలోనే కాదు, ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా ఈ తరహా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. సంపన్న వర్గానికి చెందిన కొందరు తమ ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా ఈ హోమ్ ఆటోమేషన్ సౌకర్యాలను కల్పించుకుంటున్నారు. విద్యుత్తును చాలావరకు ఆదా చేయగలగడమే కాకుండా సెక్యూరిటీ ఫీచర్స్ ఉండడం, ఒకే ఒక్క రిమోట్ సాయంతో ఇంట్లో ఎన్నో పనులు చేసుకునే వీలు ఉండడంతో ఈ హోమ్ ఆటోమేషన్ విధానం పట్ల ఎంతోమంది మక్కువ చూపుతున్నారు.
తక్కువ ఖర్చులోనే..
ఈ హోమ్ ఆటోమేషన్‌కు మరీ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజుల్లో హైదరాబాద్ వంటి నగరంలో ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.20-40 లక్షలు వెచ్చించాల్సిందే. ఇక బాగా ఖరీదైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.40-80 లక్షల వరకు పెట్లాల్సిందే. ఇంత డబ్బు పోసి ఇల్లు కొనేటప్పుడు.. సొంత ఇంటిని మరింత సౌఖ్యంగా మార్చివేసే 'హోమ్ ఆటోమేషన్'కు కనీసం రూ.2-3 లక్షలు ఖర్చు చేయడం మరీ అంత కష్టమేం కాదు కదా? అందుకే సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాల వారు ముందుకు రావడం వల్లే ఇప్పుడు మన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలోనూ హోమ్ ఆటోమేషన్ పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ హోమ్స్ హవా మొదలైంది.
0 comments:
Post a Comment