Tuesday 11 May 2010

ఆకాశంలో 'లేజర్‌ మేఘాలు'!

ఆకాశం మేఘావృతం కావడం.. ఆపైన వర్షం పడడం మామూలే! మేఘాలు లేని చోట వర్షం కోసం కృత్రిమ మేఘాలను మనమే సృష్టించు కుంటున్నాం.. వర్షం కురిసేలా చేస్తున్నాం. దీనినే 'మేఘ మథనం' అని పిలుచు కుంటున్నాం. కానీ భవిష్యత్తులో మేఘమథనం ఇలా ఉండదు. ఆకాశాన్ని 'లేజర్‌ మేఘాలు' కమ్ముకుంటాయి. కావలసినంత వర్షాన్ని కురిపిస్తాయి.

వర్షాకాలంలో వర్షాలు కురవడం సర్వసాధారణం. అయితే ఎంత వర్షాకాలమైనా కొన్ని ప్రదేశాలలో వర్షం కురవదు. ఫలితంగా ఆ ప్రాంతంలో పంటలు పండవు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు, ఆయా ప్రదేశాలలో వర్షాలు కురిపించేందుకు వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా 'మేఘ మథనం' విధానాన్ని అవలంభిస్తున్నారు. అసలు వర్షమే కురవని చోట కృత్రిమంగా మేఘాలను సృష్టించి వర్షాలు కురిపించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం.
మేఘ మథనం ఇలా..
ఈ మేఘ మథనం అనేది చాలా ఏళ్లుగా జరుగుతున్నదే. ఈ విధానంలో మేఘాలను చల్లబరిచేందుకు సిల్వర్‌ అయొడైడ్‌ క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తారు. వాతావరణంలో చాలా ఎత్తున ఉండే మేఘాలపైన విమానాల ద్వారా ఈ సిల్వర్‌ అయొడైడ్‌ క్రిస్టల్స్‌ను చల్లగానే ఆ మేఘాలలో ఉండే నీటి ఆవిరి ఘనీభవించి నీరుగా మారుతుంది. ఆపైన అది వర్షంగా మారి కురుస్తుంది. అయితే ఈ విధానం నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని చెప్పలేం. ఒకోసారి మేఘమథనం జరిపినా వర్షం కురవదు. అప్పడేం చేయాలి?
ప్రత్యామ్నాయంగా.. 'లేజర్‌'!
తాజా పరిశోధనల్లో మేఘమథనానికి 'లేజర్‌ కిరణాలు' ఉపయోగించవచ్చని వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవాకు చెందిన పరిశోధకుడు జెరోమ్‌ కాస్పరియన్‌ తన సహ పరిశోధకులతో కలిసి లేజర్‌ కిరణాల ద్వారా వర్షాలు కురిపించే పద్ధతిని అభివృద్ధి చేశారు. తమ పరిశోధనలో భాగంగా కాస్పరియన్‌ బృందం ప్రయోగశాలలో కృత్రిమ మేఘాలను సృష్టించారు. అంతేకాదు, ఇటీవల జర్మనీ రాజధాని బెర్లిన్‌లోనూ లేజర్‌ ద్వారా విజయవంతంగా మేఘాలను సృష్టించగలిగారు. ఇందులో భాగంగా దాదాపు 60 మీటర్ల వరకు ఆకాశంలోకి వారు లేజర్‌ కిరణాలను పంపించారు. ఆ సమయంలో బెర్లిన్‌ నగరంపైన ఆకాశంలో ఏర్పడిన మేఘాలు కంటికి కనిపించకపోయినా వాతావరణాన్ని కొలిచే లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ (లిడార్‌) అనే పరికరం మాత్రం మేఘాలు ఏర్పడినట్లు, వాటిలో ఉన్న నీటి పరమాణువుల సాంద్రత, వాటి పరిమాణం పెరిగినట్లు గుర్తించింది.
ఎలా చేశారంటే..
తమ ప్రయోగంలో భాగంగా ప్రయోగశాలలో కాస్పరియన్‌ బృందం ఒక క్లౌడ్‌ ఛాంబర్‌ను రూపొందించారు. అందులో మైనస్‌ 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరిని ఉంచి, ఆపైన అందులోకి తక్కువ పౌనఃపున్యం కలిగిన ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్‌ కిరణాలను పంపించారు. ఈ లేజర్‌ కిరణాలు తొలుత క్లౌడ్‌ ఛాంబర్‌లోని నీటి ఆవిరి అణువుల నుంచి ఎలక్ట్రాన్‌లను విడగొట్టి, హైడ్రాక్సిల్‌ రాడికల్స్‌ను ఏర్పరిచాయి. ఇవి ఛాంబర్‌లోని వాతావరణంలో ఉన్న సల్ఫర్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌డయాక్సైడ్‌ వాయువులను నీటి పరమాణువులుగా మార్చివేశాయి. లేజర్‌ కిరణాల ప్రవాహాన్ని ఆపివేసిన తర్వాత ఛాంబర్‌లోకి తొంగి చూస్తే.. ఆ ఛాంబర్‌ చుట్టూ నీటి బొట్లు సగానికి సగం పెరిగి ఉన్నాయి.
బయటి వాతావరణంలో సాధ్యమేనా?
అయితే కాస్పరియన్‌ బృందం సాధించిన విజయం పట్ల ఇటు అభినందనలతోపాటు అటు విమర్శలు కూడా కురుస్తున్నాయి. "తక్కువ ఉష్ణోగ్రత వద్ద అధిక తేమను సృష్టించడం ప్రయోగశాలలో సాధ్యమేమో కానీ, బయట వాతావరణంలో సాధ్యం కాదు.. లేజర్‌ కిరణాలు ఉపయోగించి ప్రయోగశాలలో కొన్ని నీటి బొట్లు సృష్టించిన మాత్రాన.. బయటి వాతావరణంలోనూ అలాగే జరుగుతుందనుకుంటే పొరపాటు..'' అని జెరూసలేంలో ఉన్న హిబ్రూ యూనివర్సిటీకి చెందిన వాతావరణ పరిశోధకులు డానియెల్‌ రోసెన్‌ఫెల్డ్‌ వ్యాఖ్యానిస్తుండగా కాస్పరియన్‌ బృందం ఆయన మాటలను కొట్టివేస్తున్నారు. తమ ప్రయోగం బయటి వాతావరణంలోనూ సాధ్యపడుతుందని చెప్పడానికి బెర్లిన్‌ నగరంపై కమ్ముకున్న మేఘాలే నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు, కాస్పరియన్‌ బృందం ఇప్పుడు మరో ప్రయోగంలో నిమగ్నమయ్యారు. లేజర్‌ కిరణాల వేవ్‌ లెంగ్త్‌ను మరింతగా పెంచి, ఎక్కువ సేపు ఆకాశంలోకి వాటిని ప్రయోగించడం ద్వారా మేఘాలలోని నీటి ఆవిరి మరింత త్వరితగతిన ఘనీభవనం చెంది పెద్ద పెద్ద నీటిబొట్లుగా మారే ందుకు గల అవకాశాలను పరీక్షిస్తున్నారు.
ఇదే గనుక జరిగితే భవిష్యత్తులో ఎక్కడ కావాలంటే అక్కడ ఆకాశం నిండా లేజర్‌ మేఘాలు కమ్ముకోవడం.. చాలనేంత వరకు వర్షాలు కురవడం ఖాయం కదూ!

1 comments:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

ఇదే జరిగితే ఒక అద్బుతం అనుకోవచ్చు