Saturday, 10 October 2009
పర్యావరణ పరిరక్షణలో 'నోకియా' టాప్
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదిక 'గ్రీన్‌పీస్ కార్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'లో నోకియా కంపెనీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో హానికారకాలను వినియోగించకుండా ఉండడం, పర్యావరణ హానికారకాల విడుదలను తగ్గించడం, వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేయడం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని గ్రీన్‌పీస్ ఏటా ఈ నివేదికను రూపొందిస్తోంది.
గత త్రైమాసికంలో సాధించిన స్థానాన్ని నోకియా యథాతథంగా నిలబెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల కేంద్రాలను ఏర్పాటు చేసి వాడి పడేసిన మొబైల్ ఫోన్లను నోకియా సేకరిస్తుండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదికలో సామ్‌సంగ్ రెండో స్థానంలో నిలిచింది. సోనీ ఎరిక్సన్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్, తోషిబా ఇంతకుముందు కంటే మెరుగైన స్థానాలు సాధించగా యాపిల్ కంపెనీ మాత్రం ఆఖరి వరుసలో నిలిచింది. ఈ నివేదిక సోనీఎరిక్సన్ కంపెనీకి వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. ఎందుకంటే హానికారక రసాయనాల వినియోగాన్ని తగ్గించడంలో ఆ కంపెనీ తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవని నివేదిక పేర్కొంది. అలాగే డెల్, హ్యూలెట్‌ప్యాకార్డ్, లెనెవో కంపెనీలు గత నివేదికలో కంటే ఒక్కో పాయింట్‌ను కోల్పోయాయి. ఫ్యూజీ కంపెనీ ఉత్పాదనలు ఏ ఒక్కటీ క్షేమకరం కాదని గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ తాజా త్రైమాసిక నివేదిక స్పష్టం చేసింది.
ఆఖరి వరుసలో 'యాపిల్'!
అయితే గ్రీన్‌పీస్ నివేదిక పట్ల యాపిల్, లెనెవో కంపెనీలు సంతృప్తిగా లేవు. వాడి పడేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను తిరిగి సేకరించి శుద్ధి చేయడంలో యాపిల్ చర్యలు చాలా కనిష్ట స్థాయిలో ఉన్నాయని నివేదిక పేర్కొన్నప్పటికీ యాపిల్ కంపెనీ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. " హానికారక లోహాలైన మెర్క్యురీ, కాడ్మియం, హెక్సావాలెంట్ క్రోమియంలను నిషేధించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ మా కంపెనీ ఈ రంగంలో బలమైన స్థానంలోనే ఉంది. అలాగే మా ఉత్పత్తుల శ్రేణిలోంచి క్యాథోడ్ రే ట్యూబ్ (సిఆర్‌టి) మానిటర్ల వాడకాన్ని పూర్తిగా తొలగించేశాం'' అని యాపిల్ కంపెనీ ప్రతినిధి పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నివేదికపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరముందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Wednesday, 30 September 2009
భవిష్యత్తు.. చంద్రుడే!
ఖగోళ శాస్త్రవేత్తల అంచనా నిజమైంది. నలభై సంవత్సరాల వారి సుదీర్ఘ కృషికి ఫలితం లభించింది. మొత్తానికి 'జాబిల్లి' జల రహస్యం వీడిపోయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగం చంద్రునిపై అపార జలరాసులు దాగున్నట్లు సమాచారం అందించింది. ఒక్క చంద్రుడిపైనే కాదు, మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలలో నీటి జాడలు కొనుగొనే దిశగా మరిన్ని పరిశోధనలు జరపడానికి ఇది స్ఫూర్తిదాయకం కానుంది. రాబోయే రోజుల్లో చంద్రమండలం ఒక్క మానవ ఆవాసంగానే కాదు, భవిష్యత్తులో గ్రహాంతర యానాలకు కేంద్ర బిందువుగా కూడా మారనుంది.

1969లో మానవుడు తొలిసారిగా చంద్రుడిపై కాలుమోపినప్పుట్నించి నేటివరకు చంద్రుడి గురించి అనేక పరిశోధన, అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి ఖగోళ శాస్త్రవేత్తలు మొన్నమొన్నటి వరకు జరిపిన ప్రయోగాలు చంద్రుడుకేవలం శిలా సమూహమనే సమాచారాన్నే వెల్లడించాయి. దీంతో చంద్రుడికి సంబంధించిన అనేక అంశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే 1994లో ప్రారంభించిన క్లెమెంటైన్ మిషన్, 1999లో ప్రయోగించిన 'కాసిని ఉపగ్రహం', 2008లో ప్రయోగించిన లూనార్ రికొనైసెన్స్ అబ్జర్వర్ ఉపగ్రహ ప్రయోగాలు చంద్రుడికి సంబంధించిన మరిన్ని వివరాలను మనకు అందించాయి. అయితే తాజాగా 'ఇస్రో' చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగం మాత్రం చంద్రుడిపై ఉన్న నీటి జాడలను పసిగట్టి ఆ వివరాలు అందించి ఇన్నాళ్లూ శాస్త్రవేత్తలలో చంద్రుడి గురించి ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది. చంద్రయాన్-1 తీసిన ఫొటోల ఆధారంగా చంద్రుడిపై ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకూ 10 డిగ్రీల పరిధిలో నీరు మందంగా పరుచుకుని ఉందని, పగటి వేళలో సూర్యుడి నుంచి వచ్చే అమిత వేడి కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న నీరు ఆవిరవుతోందని అర్థమవుతోంది. అలాగే సూర్యుడి వేడి సోకని ప్రాంతాలలో నీరు గడ్డకట్టి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ జాబిల్లి జల రాసులను ఇంటికి తెచ్చుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.
చంద్రుడిపై నీరు ఎలా?
చంద్రుడిపై జలరాసులు ఎలా ఏర్పడి ఉంటాయనే విషయంలో ఖగోళ శాస్త్రవేత్తలు రెండు వాదనలు వినిపిస్తున్నారు. 390 కోట్ల సంవత్సరాలకు పూర్వం తోకచుక్కలు, ఉల్కాపాతాలు భూమి, చంద్రుడి ని పెద్ద ఎత్తున ఢీకొడుతుండేవి. వీటి ద్వారానే చంద్రుడిపైకి నీరు చేరి ఉంటుందని, సూర్యుడి వేడి తీవ్రతకు అందులో కొంత శాతం ఆవిరైనప్పటికీ ఇంకా కొంత మిగిలి ఉంటుందనేది మొదటి వాదన. హైడ్రోజన్ ఐయాన్లు, ప్రొటాన్లతో కూడిన సౌర పవనాలు ఒక్క సెకనుకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టడం వల్ల రసాయన చర్య ద్వారా చంద్రుడిపై నీటి నిల్వలు ఏర్పడి ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల మరో వాదన.
'ఎం3'.. రియల్లీ గ్రేట్!
నీటి ఆచూకీ కనుక్కున్న చంద్రయాన్-1లోని 'ది మూన్ మినరాలజీ మ్యాపర్ (ఎం3) పరికరాన్ని అమెరికాకు చెందిన 'నాసా' ప్రొపల్షన్ లాబొరేటరీ, బ్రౌన్ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించాయి. చంద్రుడిపై వెలుగున్న ప్రాంతంలో నీటి నిల్వలను ఈ ఎం3 పరికరం పసిగట్టింది. నిజానికి చంద్రుడి గురించి ఇప్పటి వరకూ మనకు తెలిసిన సమాచారం కన్నా ఈ ఎం3 అందించిన సమాచారం మరింత స్పష్టమైనది. ఈ పరిశోధనా ఫలితాలను నాసా.. గతంలో తన ఉపగ్రహాలు అందించిన సమాచారంతో పోల్చి చూసి «ద్రువీకరించింది. ఈ విషయమై బ్రౌన్ యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రజ్ఞుడిగా పనిచేస్తున్న కార్లే పీటర్స్ మాట్లాడుతూ "ఈ విజయం ఇస్రోదే.. చంద్రయాన్ సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు..'' అని వ్యాఖ్యానించారు.
నీరు ఉంటే ఏంటి?
చంద్రుడిపై నీటి జాడలు బయటపడ్డాయి కదా, ఇక చంద్రమండలంపై మానవ నివాసం కూడా సాధ్యమవుతుందా? అంటే అది అనుకున్నంత సులువేం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే భూమిపై ఉన్నటువంటి వాతావరణం.. చంద్రుడిపై లేదు. పైపెచ్చు సూర్యుడి నుంచి వచ్చే అమితమైన వేడి నిరంతరం చంద్రుడిని తాకుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నివాసం అనుకున్నంత సులువేం కాదని, ఈ విషయలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందనేది వారి అభిప్రాయం. అయితే చంద్రుడిపై జలాన్ని హైడ్రోజన్ ఇంధనంగా, ప్రాణవాయువైన ఆక్సిజన్‌గా మార్చుకునే వీలుంది. ఇలా తయారైన ఆక్సిజన్ భవిష్యత్తులో అక్కడ నివాసం ఏర్పరుచుకునే మానవులకు ప్రాణాధారంగా మారుతుంది. అలాగే హైడ్రోజన్ రాకెట్లుకు ఇంధనంగా పనికొస్తుంది.
భవిష్యత్తు ప్రయోగశాల.. చంద్రుడే!
నేషనల్ స్పేస్ సొసైటీ ప్రెసిడెంట్ సురేష్‌నాయక్ మాట్లాడుతూ "చంద్రుడిపై ఉన్న నీటిని రాకెట్‌కు అవసరమైన ఇంధనంగా మార్చుకోవచ్చు..'' అని చెబుతున్నారు. అంతేకాదు "భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి చాలా (1/6 వంతు)తక్కువ.. కాబట్టి ఇప్పుడు మనం భూమి నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాలను చంద్రుడిపై నుంచి ప్రయోగించడం చాలా తేలిక.. ప్రస్తుతం భూమిపై నుంచి ప్రయోగించే ఉపగ్రహాలు సెకనుకు 11 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళుతున్నాయి.. అదే చంద్రుడిపై నుంచి అయితే మరింత వేగంగా వెళ్లగలవు'' అని వివరిస్తున్నాయరాయన.
నేడు ఖగోళ శాస్త్రజ్ఞుల ముందున్నవి రెండు ప్రధాన లక్ష్యాలు. ఒకటి ప్రాణాధారమైన జలం. రెండు జీవనాధారమైన ఇంధనం. ఈ రెండింటి కోసమే మానవుడి నిత్యశోధన . జాబిల్లిపై జలరాసులను స్పష్టంగా గుర్తించడం ద్వారా ఈ అన్వేషణను చంద్రయాన్-1 సరికొత్త మలుపు తిప్పింది. ఇది భారతదేశ పరిశోధనా సామర్థ్యానికి ఒక ప్రతీక. నీటి నిల్వలను కనుక్కోవడం ద్వారా తన విధులను చంద్రయాన్-1 సమర్థవంతంగా నిర్వర్తించిందని ఆ ప్రాజెక్టు డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై పేర్కొంటున్నారు. ఈ విజయం అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇతర దేశాలకు భారత్‌కు మధ్యనున్న సహకారానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
ఆకాశం నుంచి 'అరుదైన నేస్తం'!
రాత్రిపూట అలా రోడ్డుమీద నడిచి వెళ్తుంటే ఎక్కడో దూరాన ఆకాశంలోంచి ఓ చుక్క తెగి భూమ్మీద పడిపోతున్నట్లు అనిపిస్తుంది. 'అరే.. భలే ఉందే! ఇంతకీ అది ఎక్కడ పడి ఉంటుందో..' అనే ఆలోచనతో మనం నడుస్తూ వెళతాం. అయితే ఆ దృశ్యం మాత్రం మన మదిలో చాలారోజులు ఉండిపోతుంది. ఖగోళ పరిభాషలో వీటినే 'ఉల్కలు'గా వ్యవహరిస్తారు. కానీ ఇదే దృశ్యం ఖగోళ శాస్త్రవేత్తలకు కనిపిస్తే మాత్రం వారి ఆలోచనలు పరిపరివిధాలా సాగుతాయి. ఇంతకీ ఆ ఉల్క ఎక్కడి నుంచి వచ్చింది? భూమ్మీద పడి ఉంటుందా? పడితే ఎక్కడ పడి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు వారి మదిని తొలుస్తుంటాయి. ప్రసుతం ఆస్ట్రేలియాలో దొరికిన ఓ అరుదైన ఉల్కా శకలం కూడా శాస్త్రవేత్తల్లో సరిగ్గా ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది.

పశ్చిమ ఆస్ట్రేలియా ఏడారిలో లభించిన ఓ
అరుదైన ఉల్కా శకలం ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలకు పెను సవాల్‌గా మారింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే దీనిగురించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని ఈ పరిశోధన కు నాయకత్వం వహిస్తున్న లండన్‌లోని ఇంపీరియల్ కాలేజిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఫిల్‌బ్లాండ్ పేర్కొంటున్నారు. ఇది సౌరకుటుంబంలో ఏ ప్రాంతం నుంచి వచ్చిందనే విషయం తెలుసుకోవడమే తమ ప్రస్తుత కర్తవ్యమని, అనంతరం దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి, వాటి ఆధారంగా.. అసలు ఈ ఉల్కాశకలం ఎలా ఏర్పడిందో తెలుసుకుంటామని, అంతకన్నా ముందు రోదసిలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండేవో తెలుసుకోగలిగితే.. సౌరకుంటుంబం రహస్యం వీడిపోతుందని, అసలు సౌరకుటుంబం ఏర్పడక ముందు, ఏర్పడిన కొత్తలో రోదసి ఎలా ఉండేదన్న కీలక ప్రశ్నకు సమాధానం లభించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొంటున్నారు.
ఇప్పటి వరకు 1100 ఉల్కలు
గత రెండు శతాబ్దాల్లో దాదాపు పదకొండు వందల ఉల్కలు ఇలా రోదసి నుంచి రాలి భూమిపై పడి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో కేవలం ఓ డజను ఉల్కా శకలాలు, వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా పశ్చిమ ఆ్రస్టేలియా ఎడారిలో లభించిన ఉల్కాశకలం చూసిన ఖగోళ పరిశోధకులు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఇది దాదాపు రాయిని పోలి ఉంది. దీంతో ఇప్పటి వరకు లభించిన ఉల్కా శకలాలలోకెల్లా ఇది అత్యంత అరుదైన ఉల్కా శకలంగా వారు పేర్కొంటున్నారు. దీని గురించిన వివరాలు ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే అయినా పరిశోధనల అనంతరం అన్ని విషయాలు బయటపడతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉల్కలను పట్టేద్దాం..
రోదసి నుంచి రాలి భూమ్మీద పడే ఉల్కా శకలాలను వెంట వెంటనే గుర్తించి, వాటిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించడం ద్వారా మన సౌర కుటుంబానికి చెందిన మరిన్ని రహస్యాలు తెలుసుకోగలమనేది శాస్త్రవేత్తల ఆలోచన. ఈ ఆలోచనతోనే 2006లో వారు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజి, చెక్ రిపబ్లిక్‌లోని అండ్రెజోవ్ అబ్జర్వేటరీ, ఆస్ట్రేలియన్ మ్యూజియంలతో సంయుక్తంగా ఉల్కాపాతాన్ని గుర్తించే ట్రయల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని నల్లార్‌బార్ ఎడారిలో అత్యంత శక్తివంతమైన కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలు అమర్చిన తరువాత శాస్త్రవేత్తలకు లభించిన మొట్టమొదటి ఉల్కా శకలం ఇదే కావడం గమనార్హం.
ప్రస్తుతం లభించిన ఉల్కా శకలం క్రికెట్ బాల్ పరిమాణంలో ఉంది. ఈ కెమెరాలను ఉపయోగించి భవిష్యత్తులోనూ భూమ్మీదికి వచ్చిపడే ఉల్కా శకలాలను గుర్తించడం, అవి సౌర కుటుంబంలోని ఏ ప్రదేశానికి చెందినవో తెలుసుకోవడం వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన మొట్టమొదటి రోజే ఈ ఉల్కా శకలాన్ని వీరు కనుగొనగలిగారు. కొన్ని పరికరాల సాయంతో ఉల్కా శకలం పడిన ప్రదేశాన్ని గుర్తించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని కూడా వారు పేర్కొంటున్నారు.

ఇదేం కొత్త కాదు..
ఆకాశం నుంచి దూసుకు వచ్చి భూమ్మీద పడే ఉల్కా శకలాలను గుర్తించే ఈ పరిజ్ఞానం కొత్తదేం కాదు. గతంలోనూ చాలామంది శాస్త్రవేత్తలు ఇలాంటి కెమెరాల నెట్ వర్క్‌ను ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. "అయితే మేం ఉపయోగించిన విధానం మాత్రం కొత్తది. గతంలో ఉపయోగించి పరిజ్ఞానానికి చిన్న చిన్న ఉల్కా శకలాలను గుర్తించే శక్తి ఉండేది కాదు. ఇప్పుడు మేం ఉపయోగించిన ట్రయల్ నెట్‌వర్క్‌కు ఆ శక్తి ఉంది. దీని ద్వారా ఎంత చిన్న పరిమాణంలో ఉన్న ఉల్కా శకలాలనైనా సులువుగా గుర్తించవచ్చు. అలాగే ఈ కెమెరాల నెట్‌వర్క్ ఏర్పాటుకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని నల్లార్‌బార్ ఎడారే సరైన ప్రదేశమని కూడా మేం భావించాం. మేం ఏర్పాటు చేసిన నెట్ వర్క్‌లోని కెమెరాలు ప్రతీరాత్రి ఆకాశాన్ని జల్లెడ పడతాయి. అరుదైన దృశ్యం ఏదైనా వాటి కంట పడితే వెంటనే ఫోటోలు తీస్తాయి..'' అని పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ బ్లాండ్ వివరించారు.
మన సౌర కుటుంబంలోనిదే..
ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలో కనుగొన్న ఉల్కా శకలం మన సౌర కుటుంబానికి చెందినదేనని, సూర్యుని చుట్టూ ఉన్న ఏదో ఓ ప్రాంతం నుంచి ఇది రాలి పడి ఉండొచ్చని ఖగోళ పరిశోధకులు భావిస్తున్నారు. ఇది అంగారక గ్రహం, బృహస్పతి గృహం మధ్యన ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్‌కు సంబంధించిన దై ఉండొచ్చని, ఇది క్రమంగా అక్కడి కక్ష్య నుంచి బయటకి వచ్చి సూర్యుని కక్ష్యలోకి ప్రవేశించి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ ఉల్కా శకలానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేదుకు గతంలో భూమ్మీదకొచ్చి పడిన పలు ఉల్కా శకలాల వివరాలతో వారు పోల్చి చూస్తున్నారు. మొత్తంమ్మీద పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో లభించిన ఉల్కా శకలం అత్యంత అరుదైనదేనని, ఎందుకంటే అది అగ్నిపర్వతంలో ఉండే శిల మాదిరిగా ఉందని వారు పేర్కొంటున్నారు.
మొత్తంమ్మీద నల్లార్‌బార్ ఎడారిలో తమ మొదటి అన్వేషణ ఫలించిందని, ఈ పరిశోధన భవిష్యత్తులో ఉల్కా పాతాలకు సంబంధించి మరిన్ని విజయాలను చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Thursday, 24 September 2009
మైక్రోసాఫ్ట్ నుంచి మొబైల్‌ఫోన్లు!?
సాఫ్ట్‌వేర్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' త్వరలోనే రెండు స్మార్ట్ ఫోన్‌లు విడుదల చేయనుందనే పుకార్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో షికార్లు చేస్తున్నాయి. వీటిల్లో నిజం ఎంతో తెలియదుకానీ, కొన్ని వెబ్‌సైట్లు ఓ అడుగు ముందుకేసి మరీ ఈ పుకార్ల షికారులో పాలుపంచుకుంటున్నాయి.

2010లో జరగనున్న 'ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో'లో మైక్రోసాఫ్ట్ 'టర్టిల్', 'ప్యూర్' అనే పేర్లతో రెండు స్లయిడర్ స్మార్ట్ ఫోన్‌లతోపాటు ఒక 'సర్ఫేస్ టాబ్లెట్ పిసి'ని కూడా ప్రదర్శించనుందని 'ఎన్‌గాడ్జెట్' అనే వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ 'పిసి వరల్డ్' తన వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఒక కథనాన్ని ఉంచింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ 'షార్ప్' భాగస్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్లను తయారు చేయనుందనేది ఆ పుకార్ల సమాచారం.
తన మొబైల్‌ఫోన్ల ప్రాజెక్టుకు మైక్రోసాఫ్ట్ ' ప్రాజెక్ట్ పింక్' అనే కోడ్‌నేమ్ పెట్టుకుందని కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మైక్రోసాఫ్ట్ 'ప్రాజెక్ట్ పింక్'కు సంబంధించిన పుకార్లు వెలువడ్డాయి. ఆమధ్య యాపిల్ కంపెనీ 'ఐ-ఫోన్' విడుదల చేయడంతో అందుకు ధీటుగా మైక్రోసాఫ్ట్ తన 'ప్రాజెక్ట్ పింక్'కు సన్నాహాలు ప్రారంభించిందని, అయితే 'విండోస్ మొబైల్ 7' సాఫ్ట్‌వేర్ ఇంకా విడుదల కాకపోవడంతో
ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగానే రూపుదిద్దుకోనున్న 'ప్రాజెక్ట్ పింక్' ఆలస్యం అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ గతంలో హైటెక్ కంప్యూటర్స్ (హెచ్‌టిసి) భాగస్వామ్యంతో మొబైల్‌ఫోన్లు తయారు చేయాలని భావించిందని, కానీ తరువాత ఎందుకో ఆ ప్రతిపాదన విరమించుకుందని, ఇప్పుడు తాజాగా తన 'ప్రాజెక్ట్ పింక్' భాగస్వామిగా 'షార్ప్' కంపెనీని ఎంచుకుందని సమాచారం.
సర్ఫేస్ టాబ్లెట్ పిసి కూడా..
2007 మే నెలలోనే మల్టీ టచ్ 'సర్ఫేస్' టేబుల్ పిసిని విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ తాజాగా ఈ శ్రేణిలోనే ఒక 'టాబ్లెట్ పిసి' విడుదలకు కూడా సన్నాహాలు సాగిస్తోంది. ఒకేసారి అనేక మంది యూజర్లు ఉపయోగించగలిగే సర్ఫేస్ టేబుల్ తరహాలోనే ఈ మల్టీ టచ్ సర్ఫేస్ టాబ్లెట్ పిసి కూడా ఉండొచ్చని టెక్ పరిశీలకులు ఊహిస్తున్నారు. యాపిల్ కంపెనీ 'వెబ్ టాబ్లెట్' పేరిట మల్టీటచ్ సదుపాయం కలిగిన కంప్యూటర్‌ను తయారు చేయబోతోందనే వార్త ఆమధ్య దావానలంలా వ్యాపించింది. ఇందుకు పోటీగానే మైక్రోసాఫ్ట్ మల్టీ టచ్ సర్ఫేస్ టాబ్లెట్ పిసి రూపకల్పనకు నడుంబిగించిందని, పరిస్థితులు అనుకూలిస్తే.. 2010లో జరగనున్న 'ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో'లో తన మొబైల్ ఫోన్లతోపాటు దీనిని కూడా ప్రదర్శించాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని టెక్ పరిశీలకులు పేర్కొంటున్నారు.

అయితే ఇవన్నీ కేవలం పుకార్లేనా? లేక సమీప కాలంలో నిజాలుగా మారే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!
Wednesday, 23 September 2009
పాతాళంలో కావలసినంత చమురు!

'కూర్చుని తింటుంటే కొండలైనా తరిగిపోతాయి' అనేది పెద్దల మాట. నిజమే ఈ మాట కేవలం మనం ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తిపాస్తులకే కాదు - ఈ భూమ్మీద ప్రకృతి సిద్ధంగా లభించే వనరులకు కూడా సరిపోలుతుంది.
అర్థం కాలేదు కదూ! అయితే మరి కాస్త లోతుగా ఆలోచిద్దాం.
ఇప్పుడు మనమేం చేస్తున్నాం? భూమిలోంచి ముడిచమురును వెలికితీసి దానిని శుద్ధి చేసి పెట్రోలు, డీజిలుగా మార్చుకుని మన కార్లలో పోసుకుని విలాసంగా తిరుగుతున్నాం. అయితే ఇలా ఎంత కాలం? ఇప్పటికే భూమిలోని బొగ్గు నిక్షేపాలు చాలా వరకు తరిగిపోయాయని, భవిష్యత్తులో భూమ్మీద బొగ్గు లభించకపోవచ్చని ఒకవైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దొరుకుతోంది కదా అని ఇలాగే యధేచ్ఛగా వాడుకుంటూ పోతే ఏదో ఒకనాటికి భూమిలోని ముడి చమురు కూడా పూర్తిగా అయిపోతుంది. అప్పుడేం చేస్తాం?
పెట్రోలు, డీజిలు వంటి ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే ముందు అసలు భూమిలో ముడి చమురు నిక్షేపాలు ఎలా తయారయ్యాయో తెలుసుకోవాలి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.. మనం వెలికి తీస్తున్న ముడిచమురు భూమిమీద, నీటిలో జీవించే ఆల్గే (నాచు), ప్లాంక్‌టన్ (పూలు పూయని నీటి మొక్కలు) చనిపోవడం ద్వారా తయారవుతోంది. ఆల్గే, ప్లాంక్‌టన్ చనిపోయిన తరువాత ఇవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురవుతాయి. ఇలా కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాలపాటు భూమి లోపలి పొరలలో జరిగే మార్పులకు లోనై హైడ్రోకార్బన్స్(ముడి చమురు అణువులు)గా రూపాంతరం చెందుతాయి.
హైడ్రోకార్బన్స్ అంటే...
హైడ్రోకార్బన్స్ అంటే.. ఉదజని, కర్బన సమ్మిళిత పదార్థం. ఇదే ముడి చమురుకు మూలం. మూడి చమురులో బ్యూటేన్, ప్రొపేన్ అనే పదార్థాలు ఉంటాయి. అయితే నేటి ఆధునిక యుగంలో.. మానవ మేధస్సు ఇంత పరిణితి చెందిన తరువాత.. అంగారక గ్రహాన్ని కూడా అందుకోవాలని ప్రయత్నిస్తున్న మానవుడు ఈ ముడి చమురును కృత్రిమంగా సృష్టించుకోలేడా? అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఆల్గే, ప్లాంక్‌టన్ చనిపోవడం ద్వారా అవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురయి సహజసిద్ధంగా ఏర్పడే ముడి చమురు నిల్వలు పూర్తిగా అయిపోతే అప్పుడు మానవ జీవనమే స్తంభిస్తుంది. ఆ ప్రమాదం రాకమునుపే కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించేందుకు దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

ప్రత్యామ్నాయం ఇదిగో...
ఇలా ఇంధన వనరుల కృత్రిమ సృష్టికి ప్రయోగాలు చేస్తున్న వారిలో వాషింగ్టన్‌లోని కార్నెగి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అలెగ్జాండర్ గన్‌చరోవ్ ఒకరు. ఈయన విశ్వవిద్యాలయంలోని జియో ఫిజికల్ లాబొరేటరీలో రష్యా, స్వీడన్‌కు చెందిన ఇతర శాస్త్రవేత్తలతో కలిసి సాగిస్తున్న ప్రయోగాలు కొంతమేర సత్ఫలితాలు ఇచ్చాయి. భూమిలోపలి పొరలలో దాదాపు 100 కిలోమీటర్ల లోతున మీథేన్ వాయువు(సహజ వాయువుకు ఇదే ప్రధానం)ను 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు తీసుకెళ్లడం ద్వారా కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించవచ్చని డాక్టర్ అలెగ్జాండర్ బృందం కనుగొంది. ఆ ఉష్ణోగ్రత వద్ద మీథేన్ వాయువు ఈథేన్, బ్యూటేన్, ప్రొపేన్, మాలిక్యులార్ హైడ్రోజన్, గ్రాఫైట్‌లుగా విడిపోవడం శాస్త్రవేత్తలు గమనించారు. మళ్లీ ఈథేన్‌ను లేజర్ కిరణాల ద్వారా అదే ఉష్ణోగ్రతకు తీసుకెళ్లినప్పుడు అది మీథేన్‌గా మారడం కూడా గమనించారు. వీటిలో బ్యూటేన్, ప్రొపేన్‌లు ముడి చమురుకు మూలమైన పదార్థాలు.
"మా ప్రయోగ ఫలితాలు చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. అంటే.. భూమి ఉపరితలం నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల లోతున ఉండే ఉష్ణోగ్రత వద్ద ఆల్గే, ఫ్లాంక్‌టన్‌లతో సంబంధం లేకుండానే హైడ్రోకార్బన్స్ తయారవుతాయి. అంతేకాదు, ఇలా తయారైన హైడ్రోకార్బన్స్‌ను అక్కడి క్రస్ట్ పొరలలో పగుళ్లు మధ్యన ఉండే తీవ్రమైన ఒత్తిడి పైకి నెట్టివేస్తూ ఉంటుంది. ఈ చమురు నిక్షేపాలనే వెలికితీసి, శుద్ధి చేసుకుని, దానిని మళ్లీ పెట్రోలు, డీజిలుగా మార్చుకుని మనం ఇన్నాళ్లూ ఉపయోగించుకుంటూ వస్తున్నాం..'' అని డాక్టర్ అలెగ్జాండర్ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీని ప్రకారం... భూమి మధ్యలోని 'కోర్' పొరలకు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల దిగువు నుంచి మొదలయ్యే 'క్రస్ట్' పొరలకు మధ్యన మరికొన్ని కిలోమీటర్లపాటు విస్తరించి ఉండే 'మాంటెల్' పొరల నడుమ ఉండే పగుళ్లలో అంతులేని చమురు నిల్వలు ఉండే అవకాశం ఉందన్నమాట.
అలాగే శాస్త్రవేత్తలు తమ ప్రయోగంలో మరో విషయాన్ని కూడా గమనించారు. అదేమిటంటే.. లేజర్ కిరణాల సాయంతో వేడిచేసినప్పుడు మీథేన్ వాయువు నుండి హైడ్రోకార్బన్స్‌తోపాటు చివరలో ఉద్భవించిన గ్రాఫైట్, మాలిక్యులార్ హైడ్రోజన్ తదితర పదార్థాలు కొన్ని రోజుల తరువాత వాటి ఉనికిని కోల్పోతున్నాయిగానీ, ఒక్క హైడ్రోకార్బన్స్ మాత్రం చెక్కు చెదరడం లేదు. దీని గురించి శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ కుత్సెరోవ్ వ్యాఖ్యానిస్తూ.. "భూమిలోని మాంటెల్ పొరలలో ఉద్భవించే హైడ్రోకార్బన్స్ అక్కడి పొరలలో ఉండే విపరీతమైన ఒత్తిడి కారణంగా క్రస్ట్ పొరలలోకి చేరి చమురు, సహజ వాయు నిక్షేపాలుగా రూపాంతరం చెందుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాలలోని చమురు, సహజ వాయు నిక్షేపాలు ఇలా ఏర్పడినవే..'' అంటున్నారు.
అంతేకాదు, ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భూమిలోని మాంటెల్ పొరల వరకు గనుక మానవుడు వెళ్లగలిగితే అంతులేని చమురు నిక్షేపాలు సొంతమవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారాయన.
Friday, 17 July 2009
రోడ్డు ప్రమాదమా.. అబ్బే జరగదు!
మీరు మీ కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారు. అర కిలోమీటరు దూరంలో భయంకరమైన మూల మలుపు ఉంది. అవతలి నుంచి కూడా ఓ కారు వేగంగా వస్తోంది. ఆ విషయం మీకు తెలియదు. సరిగ్గా మూల మలుపు దగ్గరకొచ్చేసరికి రెండు కార్లు హఠాత్తుగా ఎదురెదురుగా వచ్చాయి. అప్పుడేం జరుగుతుంది? మామూలుగా అయితే అంత వేగంలో రెండు కార్లూ ఒకదానినొకటి 'ఢీ'కొంటాయి. కానీ ఇకమీదట అలా జరగదు. ఎందుకంటే- మీరు గమనించకపోయినా మీ కారు జరగబోయే ప్రమాదాన్ని పసిగడుతుంది. ఎదురుగా వస్తున్న కారుతో ముందుగానే మాట్లాడుకుంటుంది. ప్రమాదాన్ని అరికట్టి మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుస్తుంది.

ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! త్వరలోనే ఇలాంటి రోబోటిక్ కార్లు రాబోతున్నాయి. ఈ విషయంలో మనం శాస్త్రవేత్తలకు 'థాంక్స్' చెప్పాల్సిందే. ఎందుకంటే - ఈ కార్లు మాట్లాడుకోవడానికి అవసరమయ్యే అల్గారిథమ్స్‌ను వారే రూపొందించారు కాబట్టి. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ పసిఫిక్‌కు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అల్గారిథమ్స్‌ను రూపొందించింది. ఇక్కడ భారతీయులమైన మనం కాస్త గర్వపడాలి. ఎందుకంటే- ఈ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్నది మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ భీబయ్య శర్మ, డాక్టర్ ఉతేష్ చంద్. ఈ బృందం రూపొందించిన కొన్ని గణిత సూత్రాలు భవిష్యత్తులో రానున్న రొబోటిక్ కార్లు తాము ప్రయాణిస్తున్న దారిని ఎప్పుడు, ఎలా మార్చుకోవాలో తెలియజేస్తాయట.
ఎలాగంటే..
ప్రతి రొబోటిక్ కారును అందులో ఉండే సెంట్రలైజ్డ్ బ్రెయిన్ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ బ్రెయిన్‌కు శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్స్ ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటాయి. ప్రతి కారులోనూ సెంట్రలైజ్డ్ బ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇవి పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయి. ఎప్పుడన్నా మరీ దగ్గరగా వచ్చినా, ఎదురెదురుపడినా పరస్పరం సంభాషించుకుని సురక్షిత మార్గం ఏదో గుర్తించి ఆ దిశగా కదులుతాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తవు.
ఇప్పటికే కంప్యూటర్ సిములేషన్ ద్వారా ఈ అల్గారిథమ్స్ పనితీరును ప్రదర్శించిన శాస్త్రవేత్తల బృందం ఇప్పుడు దీనిని రోబోట్‌లపై పరీక్షించి చూడాలని భావిస్తోంది. ఇందుకోసం రెండు చక్రాలు కలిగి ఉన్న రోబోట్లను వీరు ఎంచుకున్నారు.
ఫ్లకింగ్ ద్వారా...
సాధారణంగా రోబోట్‌లు వేటికవే విడివిడిగా పనిచేస్తాయి. వాటిని రూపొందించేటప్పుడే వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఆ రకంగా సమకూరుస్తారు. అయితే కొన్ని రోబోట్‌లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఎలా? ఇందుకోసం శాస్త్రవేత్తలు ఫ్లకింగ్ అనే టెక్నిక్‌ను వాడతారు. దీని వాడకం వలన ఒకటికన్నా ఎక్కువ రోబోట్‌లు బృందంగా ఏర్పడి తమకు అప్పగించిన విధులను నిర్వర్తిస్తాయి. ఈ రోబోటిక్ కార్లలో కూడా శాస్త్రవేత్తలు ఈ తరహా పరిజ్ఞానాన్ని సమకూర్చనున్నారు. దీనివలన ఒకటి కన్నా ఎక్కువ కార్లు లైను మారాల్సి వచ్చినప్పుడు వాటిలో ఒక కారు ఇందుకు నాయకత్వం వహిస్తుంది. మిగిలిన కార్లన్నీ తమ నాయకుడ్ని అనుసరిస్తాయి. దీంతో ఇక రోడ్డు ప్రమాదాలకు తావుండదు.
ప్రమాదమే జరగదా?
కార్లు రెండూ ఎదురెదురుగా వచ్చినప్పుడు మాత్రం జరగదు. అలా కాకుండా కార్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒకదాని పక్కకు ఒకటి అత్యంత సమీపంలోకి వచ్చినా, లేదంటే కారు మరీ రోడ్డు పక్కకు వచ్చినా ప్రమాదం జరగదని చెప్పలేం. అదేంటి అలా- అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే. ఎందుకంటే - రోబోటిక్ కార్లలో ఉండే సెంట్రలైజ్డ్ బ్రెయిన్‌లకు సూచనలు అందించే అల్గారిథమ్స్ రూపకల్పనలో శాస్త్రవేత్తలు ' ఎట్రాక్షన్ టువార్డ్స్ ది టార్గెట్' అన్న నియమాన్ని పాటించారట. అంటే.. ఎదురెదురుగా వచ్చే రోబోటిక్ కార్ల నడుమ మాత్రమే సమాచార బదిలీ జరుగుతుంది. పక్కపక్కన ప్రయాణించే కార్లు పరస్పరం సభాషించుకోలేవు, సమాచారం ఇచ్చిపుచ్చుకోలేవు మరి. అయినా ఏం ఫర్వాలేదు.. ఇలా కార్లు పక్కపక్కనే ప్రయాణిస్తూ పరస్పరంఅత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, లేదంటే కారు బాగా రోడ్డు పక్కకు వచ్చేసినప్పుడు అందులో ఉండే సెంట్రలైజ్డ్ బ్రెయిన్ ఏం చేయాలనే దానిపై ఈ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం మల్లగుల్లాలు పడుతోంది. బహుశా త్వరలోనే ఈ సమస్యకూ వీరు విరుగుడు కనుగొనే అవకాశం ఉంది. అయినా ఇంత వరకు వచ్చారంటే ఇది మాత్రం గొప్ప విజయం కాదూ? అందుకు శాస్త్రవేత్తలను అభినందిద్దాం.
Wednesday, 1 July 2009
ఐఫోన్ 3Gs - అంతా బాగానే ఉంది కానీ...
యాపిల్ ఐఫోన్ సరికొత్త మోడల్ 'ఐఫోన్ 3Gs'భారత్‌లో ఎప్పుడు విడుదల అవుతుందాని సెల్ ప్రియులు రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. గతంలో విడుదలైన ఐఫోన్‌ల కంటే అధిక వేగం, మరో 100 కొత్త ఫీచర్లు ఈ కొత్త మోడల్ సొంతం. ఐఫోన్ 3Gs ఈ ఏడాది ఆగస్టు నెలలో మన దేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రీసెర్చ్ ఇన్ మోషన్ కంపెనీ తయారు చేసిన 'బ్లాక్‌బెర్రీ' సెల్‌ఫోన్‌తో పోల్చుకుంటే కొన్ని విషయాలలో ఐఫోన్ 3Gs సామర్థ్యం తక్కువేనని, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి ఈ ఫోన్ ద్వారా కొత్తగా ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

ఐఫోన్ 3Gs సాధారణ సెల్ వినియోగదారులకు గొప్పగా ఉండొచ్చేమోకానీ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర హై ఎండ్ సెల్‌ఫోన్లు ఉపయోగిస్తున్న వారిని అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఫోన్ 3Gsలో దాదాపు 6 లోపాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవేమిటంటే...
బ్యాటరీ
ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఏ స్మార్ట్ ఫోన్‌లో అయినా చూసుకునేది బ్యాటరీ జీవితకాలమే. ఐఫోన్ 3Gsలో బ్యాటరీ జీవిత కాలాన్ని యాపిల్ కంపెనీ పెంచినప్పటికీ, బ్లాక్‌బెర్రీ సిరీస్‌లో చాలా మోడళ్ల బ్యాటరీ జీవితకాలానికి ఇది సాటిరాలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐఫోన్ 3Gs బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 5 గంటలపాటు 3Gలో మాట్లాడుకోవచ్చు లేదా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అదే బ్లాక్‌బెర్రీ Stormలో అయితే ఐదున్నర గంటలపాటు టాక్‌టైమ్, 15 రోజులపాటు స్టాండ్‌బై టైమ్ ఉంటాయి.
భద్రత
ఐఫోన్‌ల గురించి ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లలో ప్రచురితమైన సమీక్షల ప్రకారం... ఇతర కంపెనీల ఫోన్లతో పోల్చుకుంటే ఐఫోన్‌లలో భద్రత తక్కువే. ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు ఐఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఐఫోన్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ OS 3.0కి కూడా ఇప్పటికి 46 భద్రతాపరమైన ప్యాచెస్ విడుదల చేశారు. వీటిలో ఎక్కువ భాగం ఐఫోన్ సొంత బ్రౌజర్ 'సఫారీ', ఓపెన్ సోర్స్ బ్రౌజర్ ఇంజన్ 'వెబ్‌కిట్'కు సంబంధించినవే.
అయితే భద్రత పరంగా చూసుకున్నప్పుడు యాపిల్ ఐఫోన్ 3Gsలో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. అదే 'Remote Wipe'. ఒకవేళ మీ ఐఫోన్ దొంగిలింపబడితే, అందులోని మీకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఈ టూల్ సహాయంతో మీరు చెరిపివేయవచ్చు.
కీబోర్డు
యాపిల్ ఐఫోన్ 3Gsలో 'ఫిజికల్ కీబోర్డు' లేకపోవడం ఒక పెద్ద లోపంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మెసేజెస్, మెయిల్స్, నోట్స్ తదితరాల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ 'ల్యాండ్‌స్కేప్ కీబోర్డు'ను సమకూర్చినప్పటికీ, దీనికంటే కూడా స్లైడర్ స్టయిల్ (ఫోన్ పైభాగాన్ని వేలితో పక్కకు తోయగానే కింద కీబోర్డు కనిపించడం) QWERTY కీబోర్డు ఉంటే వ్యాపార వర్గాల వారికి టైపింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉండేదనేది విశ్లేషకుల భావన. ఇలాంటి కీబోర్డు రీసెర్చ్ ఇన్ మోషన్ కంపెనీ రూపొందించిన బ్లాక్‌బెర్రీ సిరీస్ ఫోన్లలో ఉంటుంది.
వీడియో రికార్డింగ్
ఇప్పటి వరకు యాపిల్ ఐఫోన్‌లలో ఉన్న అతి పెద్ద లోపం.. వీడియో రికార్డింగ్ సదుపాయం లేకపోవడం. అయితే కొత్త మోడల్ 3Gsలో యాపిల్ కంపెనీ ఈ లోపాన్ని సరిదిద్దుకున్నప్పటికీ ఫోన్ ముందు భాగంలో కెమెరాను అమర్చకపోవడం వల్ల వినియోగదారులకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం లభించదు. అంటే వీడియోను చూడగలం, రికార్డు చేయగలం కానీ దానిని Wi-Fi, లేదా సెల్యులార్ నెట్‌వర్క్ ద్వారా మరొకరికి పంపలేం, ఇతరుల నుంచి అందుకోలేం. ఇతర హై ఎండ్ సెల్‌ఫోన్లలో వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ఉన్నప్పటికీ ఐఫోన్ 3Gsలో అది లేకపోవడం దానిని ఇష్టపడే వ్యాపార వర్గాల వారికి పెద్ద నిరాశే.
ఎడిటింగ్
ఐఫోన్‌లో మరో పెద్ద నిరాశ.. వర్డ్ డాక్యుమెంట్ అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోలేక పోవడం. అంటే.. వర్డ్ డాక్యుమెంట్‌లను చదవగలమే కానీ అందులో తప్పొప్పులను సరిచేయలేమన్న మాట. ఫోన్ ఎంత బాగున్నప్పటికీ, ఇతర ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నప్పటికీ.. ఇలాంటి కొన్ని లోపాల కారణంగా యాపిల్ ఐఫోన్ నేటికీ చాలామంది దరికి చేరలేకపోతోంది. ఎడిటింగ్ సౌకర్యం ఉన్న ఇతర ఫోన్లు ఎన్నో మార్కెట్‌లో ఉన్న తరుణంలో యాపిల్ కూడా ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కనీసం ఎడిటింగ్ సౌకర్యాన్ని కల్పించే థర్డ్ పార్టీ అప్లికేషన్లను అందించడం ద్వారా అయినా ఐఫోన్‌లో ఉన్న ఈ లోపాన్ని యాపిల్ సరిదిద్దవచ్చు.
ఫ్లాష్ సపోర్ట్
ఐఫోన్‌లలో మరో లోపం.. అవి ఫ్లాష్ ఫార్మేట్‌లో ఉన్న మల్టీమీడియా ఫైల్స్‌ను ప్లే చేయలేకపోవడం. ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ 3Gsలో సైతం ఫ్లాష్ సపోర్ట్ లేకపోవడం అభిమానులను బాధించే అంశమే. ఐఫోన్‌లలో ఫ్లాష్ అప్లికేషన్ అతి తక్కువ వేగంతో పనిచేయడం వల్లే దానిని చేర్చడం లేదని గతంలోనే యాపిల్ ప్రకటించింది. అయినా సరే, ఇంటర్నెట్ బ్రౌజింగ్ సమయంలో ఫ్లాష్ కంటెంట్‌ను మిస్ అవడం తమను తప్పక నిరాశకు గురిచేసే అంశమేనని ఐఫోన్ అభిమానులు పేర్కొంటున్నారు.
మరి, ఇన్ని లోపాలతో కూడిన ఐఫోన్ 3ఎఖిను భారతదేశంలో ఎంతమంది ఇష్టపడతారో వేచి చూడాల్సిందే!
దుమ్ము అంటుకోని దుస్తులు!
ఎక్కడ పడితే ఆక్కడ కూర్చుంటే దుస్తులు మాసిపోతాయేమోని ఒకరు అనుకుంటే, ఐస్‌క్రీమ్, చాక్లెట్ మరకలు కనిపిస్తే అమ్మ ఒళ్లు చీరేస్తుంది అని పిల్లలు భయపడుతుంటారు. అయితే ఇకముందు మాత్రం ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, దుమ్మును, మరకలను వాటంతట అవే శుభ్రం చేసుకునే దుస్తులు వచ్చేశాయి మరి. నమ్మకం కలగడం లేదా? అయితే మీరే చదవండి.

ఇప్పుడు మార్కెట్లో కొన్ని రకాల పెయింట్లు, రూఫ్‌లు, కిటికీ అద్దాలు లభిస్తున్నాయి. దుమ్ము, ధూళి కారణంగా వీటికి ఎలాంటి మరకలు అంటుకోవు. ఒకవేళ అంటుకున్నా, కాసిని నీళ్లు పోసి తుడవగానే మరకలు, ముద్రలు అన్నీ మటుమాయం అవుతాయి. అయితే ఎందుకని వీటికి మరకలు అంటుకోవు? ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణ వెనుక ఉన్నది మన జాతీయ పుష్పం 'కమలం' అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ! కానీ ఇది నిజం.
కమలం సాధారణంగా చిన్న చెరువుల్లో, మురికినీటి గుంతల్లోని బురదలోంచి పురుడుపోసుకుంటుంది. కానీ దానిని చూసిన వారు అది బురదలో పుట్టిందంటే ఎంత మాత్రమూ నమ్మలేనంతగా ఉంటుంది. ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా మెరిసిపోతుంటుంది. దీనికి కారణం అది తనంత తానుగా (సెల్ఫ్ క్లీనింగ్) శుభ్రం చేసుకుంటుండడమే.
లోటస్ ఎఫెక్ట్
కమలం ఆకులను ఎప్పుడైనా పరీక్షగా గమనించినట్టయితే మనకో విషయం బోధపడుతుంది. దానిపై నీటి చుక్కలు ఏమాత్రం నిలవవు. కమలం ఆకులపై ఎన్ని బకెట్ల నీళ్లు కుమ్మరించినా కూడా కేవలం ఒకటి రెండు చుక్కలే దాని ఆకులపై నిలబడతాయి. కచ్చితంగా ఇదే విషయం జర్మనీకి చెందిన వృక్షశాస్త్ర నిపుణుడు 'విల్ హెలమ్ బార్తోలోట్' దృష్టిని ఆకర్షించింది. అంతే.. దీని గురించి ఆయన విస్తృతంగా పరిశోధనలు జరిపి అనేక విషయాలను కనుగొన్నాడు. తాను కనుగొన్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి ఆయన 'లోటస్ ఎఫెక్ట్' అని నామకరణం చేశాడు.
ఎందుకు తడవదు?
కమలం ఆకులు వర్షంలో ఎంతగా తడిసి ముద్దయినప్పటికీ దాని ఆకులపైన కేవలం ఒకటి రెండు నీటి బిందువులు మాత్రమే నిలబడడానికి కారణం వాటిపై ఉండే మైనం లాంటి పదార్థం, చిన్నచిన్న బొడిపెలు, సన్నటి నూగు మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి 1970లో బార్తోలోట్ కమలం ఆకులను స్కానింగ్ చేశాడు. ఈ పరిశోధనలో ఆసక్తి కరమైన అంశాలు ఎన్నో బయటికి వచ్చాయి. మొత్తం వర్షపు చినుకుల్లో కేవలం 2-3 శాతం బిందువులు మాత్రమే కమలం ఆకుల ఉపరితలంపై నిలబడి, మిగతావి కిందికి జారి పోతాయి. క్యూటిన్ అని పిలిచే ఒకరకమైన పదార్థమే కమలం ఆకుపై మైనంలా పరుచుకొని ఉంటుందని, దీనివల్లే నీటి బిందువులు ఆకులపై నిలబడటం లేదని బార్తోలోట్ గ్రహించాడు. ఈ కారణంగానే నీటి బిందువులు అతి తక్కువ సంఖ్యలో ఆకుపై కూర్చుంటాయి. అది కూడా కమలం ఆకు 90 డిగ్రీల కన్నా ఎక్కువ కోణంలో ఉన్నప్పుడే. అంతకంటే తక్కువ ఉంటే ఆకుపై నీటి బిందువులు నిలువలేవు. మరోవైపు ఆకుపై ఉండే లెక్కలేనన్ని బొడిపెలు ఈ కోణాన్ని 150 డిగ్రీలకు పెంచేస్తాయి. దీనివల్ల ఆకులు 'సూపర్- హైడ్రోఫోబిక్'గా తయారవుతాయి. ఇంకోవైపు సన్నటి నూగులాంటి నిర్మాణాలు ఈ కోణాన్ని మరో 16 డిగ్రీలు పెంచేస్తాయి. ఈ కారణంగానే నీటి బిందువులు కమలం ఆకుపై నిలువ కుండా దొర్లిపోతాయి. అయితే నిలబడే కొద్దిపాటి నీటి బిందువుల కూడా ఆకుపై ఉండే బొడిపెలపై నిలుచుంటాయి. ఒక మనిషి మేకుల మంచంపై పడుకుంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఇదే విధంగా బురద, దుమ్ము కూడా ఆకుమీద బొడిపెలపై మాత్రమే నిలబడుతుంది. వర్షపు చుక్కలు ఆకుమీద పడి కిందికి జారిపోతున్నప్పుడు దానిమీద ఉన్న దుమ్ము, ధూళి, బాక్టీరియాను కూడా అవి తమతోపాటు కిందికి లాగేసుకుంటాయి. ఈ కారణంగానే కమలం ఎప్పుడూ స్వచ్ఛంగా కనిపిస్తుంది.
వ్యాపారంగా
ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టిన బార్తోలోట్ మొదట దీనిని కమర్షియల్‌గా ఉపయోగించుకోవచ్చనే విషయం గురించి పట్టించుకోలేదు. కానీ 1980లో ఆయనలో ఈ ఆలోచన మొగ్గతొడిగింది. కొద్దిగా ముతక గా, మైనంతో కూడిన ఉపరితలాన్ని సింథసైజ్ చేసినట్టయితే కృత్రిమ 'లోటస్ ఎఫెక్ట్'ను తయారు చెయ్యవచ్చనే నిర్ధారణ కొచ్చాడు. 1997లో తన 'లోటస్ ఎఫెక్ట్'కు పేటెంట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇదే టెక్నాలజీని ఉపయోగించి 'డాకర్స్ అండ్ గ్యాప్' సంస్థ 'సెల్ఫ్ క్లీనింగ్ క్లోత్స్( తమను తామే శుభ్రపరుచుకునే దుస్తులు) ను ఉత్పత్తి చేస్తోంది.
ఎలా చేస్తారు?
ఈ దుస్తుల తయారీలో 'అనటాస్ టైటానియమ్ డైయాక్సైడ్' కాంపౌండ్ నానో క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి ఫొటోకెటాలటిక్‌ను డీగ్రేడ్ చేయగలవు. ఇవి దుస్తులకు అంటిన దుమ్ము, ధూళిని సులభంగా తొలగిస్తాయి. అంతేకాక ఎంతో శక్తివంతమైన హానిచేసే 'మైక్రోఆర్గాజమ్స్'ను కూడా తొలగిస్తాయి.
క్లీన్ అండ్ గ్రీన్
సెల్ఫ్ క్లీనింగ్ దుస్తులు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి పెరుగుతున్న ముప్పుకూడా చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ దుస్తులు అందుబాటులోకి వస్తే రసాయలనాలు, విద్యుత్తు, నీళ్లు తదితరాల వినయోగం తగ్గుతుంది. తద్వారా పర్యావరణాన్ని కొంత వరకు పరిరక్షించుకోవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు డ్రై క్లీనింగ్‌కు అయ్యే ఖర్చునుంచి కూడా ప్రజలు ఉపశమనం పొందొచ్చన్నమాట. ఈ టెక్నాలజీ మరింత విస్తృతమైతే ఇకముందు దుస్తులు ఉతికేందుకు మహిళలు ఏమాత్రం కష్టపడనక్కర్లేదు. ముఖ్యంగా పిల్లలు తమకిష్టమైన ఆహార పదార్థాలు దుస్తులపై పడతాయేమో అనే భయం లేకుండా తినేయొచ్చు. అలాగే ఎక్కడైనా సరే దుమ్ము ఆలోచన లేకుండా కూర్చోవచ్చు. అయితే డిటర్జెంట్ సబ్బులు తయారు చేసే కంపెనీలకు మాత్రం పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. ఈ సెల్ఫ్ క్లీనింగ్ దుస్తులు గనుక అందుబాటులోకి వసే తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే విషయంలో ఈ కంపెనీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఈ దుస్తులు కొనేద్దామని మార్కెట్‌కు మాత్రం వెళ్లకండి. ఎందుకంటే ఇవి రావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చు.
చూద్దాం.. భవిష్యత్తులో మానవ జీవితంలో ఇంకా ఏమేం విచిత్రాలు చోటుచేసుకుంటాయో!
Saturday, 27 June 2009
మొన్న మొన్నటి వరకు... అంగారకుడిపై నీరు?!
అంగారక గ్రహంపై ఒకప్పుడు పుష్కలంగా నీరు ఉండేది. అక్కడ ఒకప్పుడు సముద్రాలు కూడా ఉండేవి.
అవును, ఇందులో కొత్తేం ఉంది? ఇది అందరికీ తెలిసిన విషయమే కదా!
నిజమేకానీ, ఎప్పుడో వందల, వేల కోట్ల సంవత్సరాల క్రితం కాదు.. 1.25 కోట్ల సంవత్సరాల క్రితం కూడా అక్కడ నీరు ప్రవహించింది. (గ్రహాల ఆవిర్భావం నాటితో పోల్చుకుంటే ఈ 1.25 కోట్ల సంవత్సరాలు అనేది మొన్నమొన్నటి కిందే లెక్క మరి). ఇదీ సరికొత్త విషయం!
ఆ...

ఏవిటీ ఆధారం?
మార్స్ రికొనైసెన్స్ ఆర్బిటార్ తాజాగా అందించిన ఛాయాచిత్రాలే ఇందుకు ఆధారం. అంగారక గ్రహంపై నీటి జాడలను పసిగట్టేందుకు నాసా శాస్త్రజ్ఞులు ప్రయోగించిన ఈ ఆర్బిటార్ ఇటీవల ఆ గ్రహం మీదుగా వెళుతూ అక్కడి భూమిని నిశితంగా గమనించింది. మార్స్ రికొనైసెన్స్ ఆర్బిటార్ ఇటీవల భూమికి పంపించిన ఛాయచిత్రాలను బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జే డిక్సన్ బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ విషయం బయటపెట్టింది.
గతంలో ఏమైంది?
నిజానికి అంగారకుడిపై నీటి జాడలకు సంబంధించి రికొనైసెన్స్ ఆర్బిటార్ గతంలోనే కొన్ని ఛాయ చిత్రాలను పంపింది. వీటిని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు గతంలో ఆ గ్రహంపై నీరు పరవళ్లు తొక్కిందని, సముద్రాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని తేల్చిపారేశారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తే ఏర్పడే లోయలను బట్టి వారు ఈ రకమైన నిర్ధారణకు వచ్చారు. అంతేకాక నీరు ఉండే చోట 'జీవం' ఆవిర్భవానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి.. అంగారకుడిపై ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందనే అనుమానానికి బీజం పడింది. ఈ నేపథ్యంలో అంగారక గ్రహం ఉత్తర «ద్రువానికి నాసా శాస్త్రజ్ఞులు 'ఫీనిక్స్ ల్యాండర్'ను పంపించడం, అది తన మరచేయి సహాయంతో అక్కడి భూ ఉపరితలాన్ని తవ్వి కొన్ని సెంటీమీటర్ల లోపల ఉన్న మంచును గుర్తించడంతో శాస్త్రజ్ఞుల ఆలోచనలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
అయితే ఇప్పుడేమిటీ?
తాజాగా జే డిక్సన్ బృందం అంగారక గ్రహంలో.. లాయట్ అనే ప్రదేశంలో ఉన్న అతి పెద్దదైన లోయను గుర్తించారు. ఇందులో మళ్లీ దాదాపు 20 వరకు చిన్న చిన్న లోయలు ఉన్నాయి. ఉత్తర «ద్రువం వద్ద భూమికి కొన్ని సెంటీమీటర్ల దిగువున ఉన్న మంచు కరిగి, నీరుగా మారి ఈ ప్రాంతం వైపు ప్రవహించిన ఉంటుందని, అందువల్లే ఈ ప్రాంతంలో ఏటవాలుగా ఉండే ఈ లోయలు ఏర్పడి ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు 3.5 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు పుష్కలంగా ఉండేదని శాస్త్రజ్ఞులు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ గణాంకాలు మారాయి. జే డిక్సన్ బృందం జరిపిన అధ్యయనం మేరకు 1.25 కోట్ల సవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ నీరు ఉధృతంగా ప్రవహించింది. "మేం కనుగొన్న ఈ లాయట్ ప్రాంతం.. అంగారకుడిపై గతంలో నీరు ప్రవహించిందని చెబుతున్న ప్రాంతాల కంటే వయసులో చాలా చిన్నది.. అంటే.. బహుశా ఆఖరి బిలియన్ (కోటి) సంవత్సరాల క్రితం ఈ లోయలు ఏర్పడి ఉండొచ్చు..'' అని కూడా జే డిక్సన్ వ్యాఖ్యానిస్తున్నారు. మరి, ఈ లెక్కన నీరు ఉండే చోట 'జీవం' ఆవిర్భవానికి కూడా అవకాశం ఉంటుందన్న శాస్త్రజ్ఞుల వాదన సరైనదే అయితే బహుశా అంగారకుడిపై 1.25 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కూడా 'జీవం' ఉనికి ఉండేదేమో!
చంద్రునికి ఓ 'మొక్క'!

చంద్రునిపై ఓ మొక్క మొలిచింది. ఏమిటీ విచిత్రం.. అనుకుంటున్నారు కదూ! మొలిచిన ఆ మొక్క కాస్తా పెరిగి పెద్దదైంది.. మొగ్గలు తొడిగి, పూలు కూడా పూసింది.
'ఛ.. క తలు చెప్పొద్దు బాస్..' అంటారా? మీరే కాదు, ఎవరైనా అలాగే అంటారు. కానీ చెప్పక తప్పదు.. 'మ్యాటర్' అలాంటిది మరి. నమ్మకపోతే మీరే చదవండి...
ఈ భూమిపై జనాభా విస్ఫోటం పెరిగిపోతోంది. ఇలా పెరుగుతూ పోతే తలదాచుకోడానికి కాస్త చోటు కూడా దొరక్కపోవచ్చు. ఇప్పుడు కాకపోయినా కొన్ని వందల సంవత్సరాలకైనా సరే మనం ఈ భూమిని వదిలిపెట్టి మరో గ్రహానికి వెళ్లాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చు. అంగారక గ్రహంపై ఒకవేళ 'జీవం' ఆవిర్భవించినా ఇప్పుడక్కడ జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు లేనేలేవు. నవ గ్రహాలలో ఒక్క చంద్రుడు తప్ప మరో గ్రహమేదీ సులువుగా వెళ్లగలిగేంత చేరువలో లేదు. ఇంకేం చేస్తాం.. ఎప్పటికైనా చంద్రమండలం వెళ్లక తప్పదు. ఒకవేళ అక్కడికి వెళ్లి బతకాల్సిన పరిస్థితే వచ్చిందనుకోండి.. ఏం తిని బతుకుతారు? ప్రతిదీ భూమి నుంచే తీసుకెళతారా?? ఎన్నిసార్లు తిరుగుతారు భూమి నుంచి చంద్రుడికి - చంద్రుడి నుంచి భూమికి???
'వామ్మో.. ఇంత కథ ఉందా? నిజమే బాస్.. మాకీ ఆలోచనే రాలేదు..' అంటారా.. అనకండి. ఎందుకంటే ఈ ఆలోచన వచ్చినా మీరు, మేము ఏం చేయలేం.. ఒక్క ఖగోళ శాస్త్రవేత్తలు తప్ప. వారికి మాత్రం ఈ ఆలోచన ఎప్పుడో వచ్చేసింది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై ఇప్పుడే ఓ మొక్కను మొలిపించడం మంచిదనుకున్నారు.. అదీ 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్' ద్వారా.
ఎవరిదీ ఆలోచన?
అంతరిక్ష ప్రయోగాలకు ప్రైవేటు సంస్థలు కూడా ఇప్పుడు 'సై' అంటున్నాయి. స్పేస్ టూరిజంలో భాగంగా అంతరిక్ష నౌకల నిర్మాణానికి నడుం బిగించాయి. ఆన్‌లైన్ దిగ్గజం 'గూగుల్' ప్రకటించిన పోటీతో ఈ ప్రయోగాలు మరింత ఊపందుకున్నాయి. ఏ సంస్థ అయితే 2012 లోపల చంద్రమండలంపై రొబోటిక్ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి, చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్ల దూరం ల్యాండర్‌ను తిప్పి, అక్కడి ఫొటోలను భూమికి చేరవేయగలుగుతుందో ఆ సంస్థకు 2 కోట్ల డాలర్లు బహుమతిగా ఇస్తామంటూ గూగుల్ ప్రకటించడం పెద్ద సంచలనమైంది. ఈ ప్రయోగంలో ఆరిజోనా రాష్ట్రంలోని టుక్సన్ నగరంలో ఉన్న ఒడెస్సీ మూన్ లిమిటెడ్ కూడా పోటీ పడుతోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 'లూనార్ ల్యాండర్' నిర్మాణం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే 2012 కల్లా ఈ సంస్థ పంపే 'లూనార్ ల్యాండర్' చంద్రమండలంపై కాలు మోపుతుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ సంస్థ అనేక ఇతర సంస్థల సహాయ సహ కారాలను కూడా తీసుకుంటోంది. పనిలో పనిగా చంద్రునిపై 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్' ద్వారా ఓ మొక్కను కూడా మొలిపించేందుకు ఓడెస్సీ మూన్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. 'లూనార్ ఒయాసిస్'గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు బాధ్యతలను ఆరిజోనాలోని టుక్సన్‌లోనే ఉన్న మరో ప్రైవేటు సంస్థ పారగాన్ స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించింది. "ఏదో ఒక రోజు చంద్రమండలంపైకి మానవులు వెళ్లడం తథ్యం.. అయితే భూమిపై ఉండే వాతావరణానికి చంద్రునిపై ఉండే వాతావరణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.. అందుకే ముందుగా అక్కడికి ప్రాణం ఉన్న ఓ మొక్కను పంపించదలుచుకున్నాం..'' అని ఒడెస్సీ మూన్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ రిచర్డ్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ మొక్కే ఎందుకు?
చంద్రమండలంపైకి పంపే మినీ గ్రీన్ హౌస్ 'లూనార్ ఒయాసిస్' కోసం ఒడెస్సీ మూన్ లిమిటెడ్ కొన్ని వందల రకాల మొక్కలను పరిశీలించి చివరికి క్యాబేజి, కాలీఫ్లవర్ జాతికి చెందిన 'బ్రస్సికా' మొక్కను ఎంపిక చేసింది. ఈ మొక్క జీవితం కాలం చాలా స్వల్పం. కేవలం 14 రోజులు మాత్రమే. ఈ పధ్నాలుగు రోజుల్లోనే అది మొలకెత్తడం, పెరగడం, మొగ్గలు తొడగడం, పూలు పూయడం అన్నీ జరిగిపోతాయి. అమావాస్యకు, పౌర్ణమికి మధ్య వ్యవధి కూడా 14 రోజులే కాబట్టి చంద్రునిపై పౌర్ణమి రోజు నాటికి ఈ మొక్క పెరిగి పెద్దదై పూలు పూస్తుందనేది శాస్త్రవేత్తలు మరో ఆలోచన. ఇంకా ఈ మొక్కను ఎంపిక చేసుకోవడానికి మరో కారణం ఏమిటంటే.. ఈ 'బ్రస్సికా' మొక్కను శాస్త్రవేత్తలు భూమి మీద కూడా రకరకాల ప్రయోగాలలో ఉపయోగిస్తుంటారు. భూమి మీద ఇది మొలకెత్తే విధానం, పెరిగే విధానం, మొగ్గొలు తొడిగి పూలు పూసే విధానం.. అన్నీ శాస్త్త్రవేత్తలు బాగా తెలుసు. ఇదే మొక్క చంద్రమండలంపై ఎలా పెరుగుతుంది? ఏమైనా 'తేడా' కనిపిస్తుందా? ఈ విషయాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు మరింత సులువు అవుతుంది కూడా.
"తప్పదు.. చంద్రమండలాన్ని మనం ఎనిమిదో ఖండంగా గుర్తించాల్సిందే. మరి ఈ ఖండంలో బతకదలచుకున్న వారు తమకు అవసరమైన వాటినన్నింటినీ అక్కడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.. ఎందుకంటే భూమ్మీద నుంచి మనం ఏదీ ఎక్కువగా తీసుకెళ్లలేం కాబట్టి..'' అని చమత్కరిస్తారు బాబ్ రిచర్డ్స్.
ఇప్పటి వరకు లూనార్ ల్యాండర్ ప్రయోగంలో ఈ గ్రీన్‌హౌస్‌తోపాటుగా చిన్న టెలిస్కోప్, మట్టిని విశ్లేషించే స్పెక్ట్రోమీటర్, మానవ చితాభస్మం వంటివి చేరాయి. ప్రయోగం జరిగే నాటికి ఈ జాబితాలో మరిన్ని పరికరాలు కూడా చేరే అవకాశం ఉంది.
ఇదేం కొత్త కాదు..
గ్రీన్‌హౌస్ పద్ధతిలో అంతరిక్షంలో మొక్కలు పెంచడం పారగాన్ స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కొత్త కాదు. ఇప్పటికే ఈ సంస్థ రెండు గ్రీన్‌హౌస్‌లను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండగా, మరొకటి మరో అంతరిక్ష నౌకలో ఉంది. భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి కూడా గ్రీన్‌హౌస్‌ను పంపేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా వ్యోమగాములు ధరించే 'అత్యంత ఆధునిక స్పేస్ సూట్‌లు' రూపొందించే కాంట్రాక్టును కూడా ఈ సంస్థ 'నాసా' నుంచి దక్కించుకుంది.
నిజానికి ఓడెస్సీ మూన్ లిమిటెడ్ కూడా గూగుల్ పోటీకి ముందే చంద్రమండల యాత్ర ప్రయత్నాలలో మునిగి ఉంది. ఎప్పుడైతే గూగుల్ 'లూనార్ ఎక్స్ ప్రైజ్' పోటీ ప్రకటించిందో అప్పుడు వెంటనే ఈ పోటీపై దృష్టి సారించింది. "లూనార్ ల్యాండర్ ప్రాజెక్టుతోపాటుగా మేం మరో నాలుగు చిన్న ప్రాజెక్టులను కూడా చేపట్టాం.. వీటికి సంబంధించిన పనులు కూడా ఏక కాలంలో జరుగుతున్నాయి. అంతేకాదు, ప్రయోగం జరిగే నాటికి ఈ ప్రాజెక్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది..'' అని ఒడెస్సీ మూన్ సిఇఒ బాబ్ రిచర్డ్స్ వివరిస్తున్నారు.
గూగుల్ 'డెడ్‌లైన్' దాటితే...
అయితే గూగుల్ ప్రకటించిన 'లూనార్ ఎక్స్ ప్రైజ్' పోటీలో ఓ విచిత్రమైన షరతు ఉంది. అదేమిటంటే.. 2012లోగా ఒడెస్సీ మూన్ లిమిటెడ్ 'లూనార్ ల్యాండర్'ను చంద్ర మండలంపై దింపక పోయినా, తీరా చంద్రమండలంపై కాలుమోపిన ల్యాండర్ కదలనంటూ మొరాయించినా, అక్కడి నుంచి ఒక్క ఫొటో కూడా భూమికి చేరకపోయినా.. ముందు ప్రకటించిన బహుమతి మొత్తంలో సగం తగ్గిపోతుంది. అంటే.. బహుమతి కాస్తా 3 కోట్ల డాలర్ల నుంచి 1.5 కోట్ల డాలర్లకు తగ్గిపోతుంది. ఈ పోటీలో ఈ షరతు కాస్త క్లిష్టమైంది.
"అందుకే ఇతర ప్రయోగాలకంటే 'లూనార్ ల్యాండర్' ప్రయోగంపైనే మేం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం.. పరిస్థితులు అనుకూలిస్తే 2011 ఆఖర్లోనే ల్యాండర్‌ను ప్రయోగిస్తాం.. నిజానికి మేం ఈ ప్రయోగం చేస్తున్నది గూగుల్ ఇచ్చే డబ్బు కోసం కాదు.. ఇదేదో నలుగురు వ్యామగాములను అంతరిక్షానికి పంపినంత సులువూ కాదు.. ఈ భూమ్మీద జీవిస్తున్న యావత్ మానవ జాతి భవిష్యత్తును నిర్దేశించే ప్రయోగం ఇది.. అందుకే ఇంత కష్టపడుతున్నాం..'' అని వ్యాఖ్యానిస్తున్నారు బాబ్ రిచర్డ్స్.
Friday, 26 June 2009
టూర్ వెళుతున్నారా?.. ఒక్క నిమిషం!

ప్రయాణాలంటే కొందరికి చాలా ఇష్టం. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని.. సరదాగా నాలుగు రోజులు గడిపి సరికొత్త అనుభూతులు మూటకట్టుకోవాలని భావిస్తుంటారు. మీరూ ఇలాంటి పర్యాటకాభిలాషులైతే ప్రయాణాలలో మీకు అవసరమైనవి, మీరు అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా...
ఖర్చెంత?
ఏ ప్రయాణానికైనా ఇదే ముఖ్యమైన అంశం. మొత్తం ప్రయాణంలో ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే ఒక అవగాహన ఉండాలి. టూర్ మొత్తంలో వసతి, ఆహారం, రానుపోను ఛార్జీలు.. ఇలా రోజువారీ ఎంతెంత ఖర్చు అవుతుందో తెలిసుంటే మరీ మంచిది. సరిపడా డబ్బు జేబులో లేకపోయినా డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయి కదా అనే ధైర్యంతో కొందరు టూర్‌లకు సిద్ధమవుతారు. అయితే మీరు వెళ్లే ప్రదేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయా? అన్నది ముందుగానే తెలుసుకోవడం మంచిది. లేకుంటే కొత్త ప్రదేశంలో జేబులో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఏం తీసుకెళ్లాలి?
ప్రయాణం అనగానే చాలు కొంతమంది అవీ, ఇవీ సూట్‌కేస్ లేదా ట్రావెల్‌బ్యాగ్‌లో కుక్కేస్తుంటారు. ఇంత అవసరమా? అని ప్రశ్నిస్తే.. 'ఏమో ఎక్కడ.. ఏది.. ఎప్పుడు.. ఎందుకు అవసరమవుతుందో తెలియదు కదా!..' అంటూ సమర్థించుకుంటారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. సరదాగా టూర్‌కు వెళుతున్నప్పుడు లగేజి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. లేకుంటే ఆ 'మోత బరువు' మీ ఆనందాన్ని హరించి వేస్తుంది. కాబట్టి చిన్న చిన్న వస్తువులు వదిలేసి, 'మరీ ముఖ్యమైనవి, వెళ్లే ప్రదేశంలో దొరకవు..' అనుకున్న వస్తువులను మాత్రమే బ్యాగ్‌లో సర్దుకోవాలి.
వసతి ఎక్కడ?
ఇది కూడా చాల ముఖ్యమైన విషయమే. వెళుతున్నది కొత్త ప్రదేశమైతే.. అక్కడ ఉండడానికి అనువైన వసతి సౌకర్యాన్ని ముందుగానే అరేంజ్ చేసుకోవడం చాలా మంచిది. తీరా అక్కడికి వెళ్లాక వసతి దొరకకపోతే అవస్థలు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణానికి ముందుగానే ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా మీరు ఏ రోజున ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారన్నది మీకు వసతి కల్పించే వారికి కూడా ముందుగానే తెలియజేయాలి.
కమ్యూనికేషన్ ముఖ్యం
ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్లినా మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో 'కమ్యూనికేషన్ ' కొనసాగించడం చాలా మంచిది. సెల్‌ఫోన్లు వచ్చాక ఈ కమ్యూనికేషన్ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కొన్ని సుదూర ప్రాంతాలలో నేటికీ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలతోనైనా సంబంధాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరెవరు, ఏ పనిమీద ఆ ప్రదేశానికి వచ్చారు.. అనే కనీస వివరాలైనా అక్కడి వారికి తెలియడం మీకు చాలా మంచిది.
గైడ్ బుక్స్ ఉండాలి
కొత్త ప్రదేశాలకు వెళుతున్నప్పుడు మీ ట్రావెల్ బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుల్లో ఇదొకటి. మీరు వెళుతున్న ప్రదేశాలకు సబంధించిన గైడ్ బుక్స్ మీ వద్ద ఉండటం క్షేమకరం. కొత్త ప్రదేశంలో ఏ రోడ్డు ఎక్కడికి వెళుతుంది, ఎక్కడెక్కడ ఏమేం దొరుకుతాయి అన్నది మీకు ఈ గైడ్‌బుక్స్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. వీలైతే ప్రయాణానికి ముందే ఈ గైడ్‌బుక్స్‌తో కుస్తీ పట్డండి. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లిన తరువాత మీ పని మరింత సులువు అవుతుంది.
సో, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ!
Thursday, 25 June 2009
ఇది 'ఎల్ నినో' ప్రభావమేనా?
ఇది వర్షాకాలం. కానీ వానలు లేవు. నైరుతి రుతుపవనాల రాకతో ఈనెల మొదటి వారం నుంచే వర్షాలు పడాల్సి ఉండగా, ఒకట్రెండు వర్షాలు పడగానే కథ అడ్డం తిరిగింది. ఈసారి గతంలో కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయని వాతావరణ పరిశోధకులు మే నెలలోనే తీపి కబురు అందించడంతో వర్షం పడకపోయినా పడినంత ఆనందం వ్యక్తం చేశారు అందరూ. కానీ ఏవీ వర్షాలు? ఇదిగో వస్తున్నాయి.. అదిగో వచ్చేస్తున్నాయంటూ రుతుపవనాల గురించి ఏరోజుకారోజు జోస్యం చెబుతున్నారే తప్ప నిజానికి వర్షాల జాడే లేదు. ఎందుకని ఈ పరిస్థితి? కొంపదీసి 'ఎల్-నినో' ప్రభావం కాదు కదా?

చావు కబురు చల్ల గా చెప్పడమంటే ఇదేనేమో.. రుతుపవనాల రాకలో ఆలస్యానికి కారణం 'ఎల్-నినో' ప్రభావం అయి ఉండొచ్చంటూ ప్రపంచ మెటరోలాజికల్ ఆర్గనైజేషన్ తాజాగా అనుమానం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు చెందిన ఈ వాతావరణ సంస్థ ఈ ఏడాది 'ఎల్-నినో' ప్రభావం తలెత్తడానికి 50 శాతం కంటే ఎక్కువే అవకాశాలు ఉన్నాయని సెలవిస్తోంది. ఈ సంస్థ అంచనాల ప్రకారం చూసుకుంటే జూన్ మొదటి వారలోనే నైరుతి రుతుపవనాలు మన దేశ తీరాన్ని తాకాల్సి ఉంది. కానీ దాదాపు మూడు వారాలు గడిచినా రుతుపవనాల జాడ కనిపించడం లేదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ కాస్తో కూస్తో స్థిరంగా ఉందంటే అందుకు కారణం గత రెండు సీజన్‌లలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరగడమేనని ఆర్థిక నిపుణులు పేర్కొటున్నారు. ఇక ముందు కూడా వ్యవసాయ రంగంలో ఈ పెరుగుదల రేటు ఇలాగే ఉండొచ్చని భావించిన వారంతా తాజాగా వరల్డ్ మెటరోలాజికల్ ఆర్గనైజేషన్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు.
నిజానికి జూన్ మాసం మొదటి అర్థ భాగలో మన దేశంలో వర్షపాతం 39.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. నిజానికి సాధారణ వర్షపాతం 72.5 మిల్లీమీటర్లు. సాధారణ వర్షపాతంతో పోల్చుకున్నా ఈ ఏడాది జూన్ మాసంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం 45 శాతం తక్కువే. దేశంలో ఉన్న 36 వర్షపాత నమోదు కేంద్రాలలో దాదాపు 28 కేంద్రాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది.
"గతంలో అనుభవాలతో పోల్చుకుని చూస్తే ఈసారి 'ఎల్ నినో' ప్రభావం తలెత్తేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయిదు నెలలుగా మారుతున్న వాతావరణ పరిస్థితులను గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది..'' అని భారత వాతావరణ పరిశోధనా సంస్థ నిపుణుడొకరు పేర్కొంటున్నారు.
'ఎల్ నినో' అంటే...?
వాతావరణంలో కలిగే ఒక రకమైన మార్పునే 'ఎల్ నినో' ప్రభావంగా పేర్కొంటారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వేడెక్కడం వలన వాతావరణంలో ఈ ఎల్ నినో ప్రభావం ఏర్పడుతుంది. ఇది లాటిన్ అమెరికా నుంచి ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలను అడ్డుకుని వాటి వేగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వర్షాలు సకాలంలో పడవు. ఫలితంగా ఆ ఏడాది వ్యవసాయం దెబ్బతింటుంది. అందుకే ఎల్ నినో ప్రభావం ఏర్పడిన సంవత్సరాన్ని 'బ్యాడ్ ఇయర్'గా పిలుస్తారు.
ఏం చేస్తుంది?
మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు వేడెక్కేకొద్దీ ఆ ప్రాంతంలో ఉండే వాతావరణంలోని ఉష్ణోగ్రత కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా అక్కడి వాతావరణంలో పొడిగా ఉండే గాలులు అధికమవుతాయి. ఈ పొడి గాలులు ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో రుతుపవనాల గమనం మందగించి ఆయా దేశాలకు రుతు పవనాల రాక మరింత ఆలస్యమవుతుంది.
గతంలో ఎప్పుడెప్పుడు?
2004 సంవత్సరంలో మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలను వాతావరణంలో ఏర్పడిన ఈ 'ఎల్ నినో' ప్రభావమే అడ్డుకుంది. దీంతో ఆ ఏడాది మన దేశంలో సాధారణం కంటే 10 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. దీంతో సాంకేతికంగా 2004ను కరవు సంవత్సరంగా ప్రకటించారు.
ఎందుకీ చింత?
అయిదు మాసాలుగా పసిఫిక్ సముద్రంలో జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతున్నాయి. దీంతో వాతావరణంలో 'ఎల్ నినో' ప్రభావం ఏర్పడి జూన్ మొదటి వారంలో వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. దీని ప్రభావం మన దేశ వ్యసాయంపై కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. నిజానికి మన దేశంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు వేసే పంటల్లో 65 శాతం ఒక్క నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురవకపోతే లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటాయి. చివరికి దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే బియ్యం ధరలు పెరిగిపోయాయంటూ గగ్గోలు పెడుతున్నాం. ఇప్పుడీ 'ఎల్ నినో' ప్రభావం వీటి ధరలను చుక్కల దగ్గరికి చేరుస్తుందేమో!
గుడ్‌బై.. ఇంక సెలవు!
రాక్షస బల్లులు.. గండభేరుండ పక్షులు.. ఇలాంటి భారీ జంతువులు, పక్షుల గురించి సింద్‌బాద్ సాహసయాత్రలు వంటి కథల పుస్తకాలలో చదువుకున్నాం. స్పీల్‌బర్గ్ పుణ్యమాని రాక్షస బల్లుల(డైనోసార్‌లు)ను ఆ మధ్యన 'జురాసిక్ పార్క్' సినిమాలో చూసి .. హాశ్చర్యపోయాం. అయితే ఇన్నాళ్లూ ఈ భూమ్మీద ఉన్న సముద్ర జలాలలో తిరుగాడిన «ద్రువపు ఎలుగుబంటి, వాల్‌రస్ వంటి జీవులను కూడా భవిష్యత్తులో మనం "ఇదిగో.. «ద్రువపు ఎలుగుబంటి అంటే ఇదే.. అదేమో వాల్‌రస్''.. అంటూ పాఠ్య పుస్తకాల్లో చూడాల్సి వచ్చేటట్టుంది. ఎందుకంటే ఈ రెండు జీవులు కూడా త్వరలోనే డైనోసార్‌ల దగ్గరికి వెళ్లిపోతున్నాయి మరి!

««ద్రువపు ఎలుగబంట్లను ఆంగ్లంలో పోలార్ బేర్స్ అంటారు. ఇవి రెండు రకాలు. అలస్కాలో.. కెనడాను అనుకుని ఉండే దక్షిణ బే ఫోర్ట్ సముద్ర
పరీవాహక ప్రాంతంలో కనిపించేవి ఒక రకమైతే, రష్యాను ఆనుకుని ఉన్న చుక్చీ/బేరింగ్ సముద్ర పరీవాహక ప్రాంతంలో కనిపించేవి మరో రకం. ఇక పసిఫిక్ వాల్‌రస్ (అతి పెద్ద చేపల్లా ఉంటాయి) జీవులు మాత్రం రష్యాని అనుకుని ఉండే చుక్చీ/బేరింగ్ సముద్ర పరీవాహక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి.
అయితే ఏంటి?
దక్షిణ బే ఫోర్ట్ ప్రాంతంలో కనిపించే ««ద్రువపు ఎలుగుబంట్ల సంఖ్య 1397. వీటిలో మానవ కృతకాల వల్ల ప్రతియేటా 54 మరణిస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చర్యల ద్వారా బతికి బయటపడుతున్నవి 22. బేరింగ్ సముద్ర ప్రాంతంలో వీటి సంఖ్య 2000. ప్రతీయేటా మానవ చర్యల ద్వారా
మరణించేవి 37. అలాగే రష్యాలో ప్రతీయేటా వేటగాళ్ల బారిన పడి మరణిస్తున్న ఎలుగుల సంఖ్య 150 నుంచి 250 వరకూ ఉంటోంది. సంరక్షక చర్యల ద్వారా బతికి బయటపడుతున్నవి 30.
ఇక పసిఫిక్ వాల్‌రస్‌ల జనాభా 15,164. వీటిలో 4 వేల నుంచి 5,500 వరకూ మానవుల జిహ్వ చాపల్యానికి మూల్యం చెల్లించుకుంటున్నాయి.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా ఏటా 607 జీవాల వరకూ మృత్యుపాశం నుంచి బయటపడగలుగుతున్నాయి.
ఎందుకిలా?
ఆర్కిటిక్ ఐకాన్‌లుగా పిలుచుకునే «ద్రువపు ఎలుగుబంట్లు, వాల్‌రస్ చేపల జీవన విధానం అంతా అక్కడి సముద్రంలోని మంచుగడ్డలతోనే ముడిపడి ఉంది. ఇప్పుడు అక్కడి మంచు పూర్తిగా కరిగిపోయే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఈ జీవుల పాలిట పెనుశాపంగా పరిణమించింది. గ్లోబల్ వార్మింగ్ (భూ తాపం) ఈ జీవాల పాలిట మృత్యుపాశంలా తయారైంది మరి. అంతేకాక, ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణ, చేపల వేట, బోటింగ్, షిప్పింగ్, మిలిటరీ కార్యక్రమాలు.. ఇలాంటివన్నీ కూడా «ద్రువపు ఎలుగుబంటి, వాల్‌రస్‌ల మనుగడకు ప్రతికూల పరిస్థితులు కల్పిస్తున్నాయి. వాతావరణంలో రోజురోజుకు పెరుగుతున్న కార్బన్‌డయాక్సైడ్ భూ తాపాన్ని విపరీతంగా పెంచుతోంది. పర్యవసానంగా పెరుగుతున్న వేడిసెగల కారణంగా «ద్రువ ప్రాంతాలలోని మంచు సైతం కరిగి నీరవుతోంది. దీనికి తోడు వాటి ఆవాస ప్రాంతం అలస్కాలో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం
జరుగుతోన్న అన్వేషణ కూడా అక్కడి జీవాల అంతానికి కారణమవుతోంది.
అమెరికా వన్యప్రాణుల సంరక్షణ, చేపల అభివృద్ధి సేవల సంస్థ తాజా నివేదిక ప్రకారం.. «ద్రువపు ఎలుగుబంట్ల జనాభా క్రమేణా తగ్గిపోతోంది. వాల్‌రస్ చేపలైతే అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. "«ద్రువపు ఎలుగుబంట్లు, వాల్‌రస్‌లు అంతరించిపోయే జీవుల జాబితాలోకి వచ్చేశాయి. గ్రీన్‌హౌస్ కాలుష్యం, సముద్రంలో చమురు నిక్షేపాల అన్వేషణ, వెలికితీత వంటి చర్యలు వీటి మనుగడను క్లిష్టంగా మార్చేశాయి. వీటి మనుగడకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో «ద్రువపు ఎలుగులు, వాల్‌రస్‌లు మనకు కనిపించవు..'' అని సెంటర్ ఫర్ బయొలాజికల్ డైవర్సిటీకి చెందిన ఓషన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రెండన్ కమ్మింగ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏం చేయలేమా?
«ద్రువపు ఎలుగు, వాల్‌రస్, వేల్స్, డాల్ఫిన్స్, సీల్స్ తదితర సముద్ర క్షీరదాల సంఖ్య కేవలం అంచనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇవి సముద్ర జలాలలో, మంచుగడ్డలపై నివసిస్తూ అప్పుడప్పుడు బయటికి కనిపిస్తుండడంతో వీటి కచ్చిత జనాభా సంఖ్యను తెలుసుకోవడం కష్టం. అయితే గతంలోకంటే వీటి సంఖ్య బాగా తగ్గిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. సముద్ర క్షీరదాల సంరక్షణ చట్టం అమల్లో ఉన్నా.. ఏ యేటికాయేడు వీటి సంఖ్య తగ్గిపోతోంది. ప్రతీయేటా అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్న సముద్ర క్షీరదాల జనాభా వివరాలను సేకరించాల్సిన బాధ్యత ఆయా సంస్థలదే. వేల్స్, డాల్ఫిన్స్, సీల్స్ సంరక్షణ బాధ్యత నేషనల్ మెరైన్ ఫిషరీస్ సర్వీసెస్‌ది కాగా, «ద్రువపు ఎలుగుబంట్లు, వాల్‌రస్ చేపలు తదితర జీవుల సంరక్షణ బాధ్యతలు ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీసెస్ ఏజెన్సీది.
సముద్ర జీవుల జనాభా వివరాల సేకరణ, వెల్లడి, సంరక్షణ విషయాలలో ఈ రెండు ఏజెన్సీలు వాటి బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, దీంతో చాలా సముద్ర జీవులు అంతరించిపోయే జీవుల జాబితాలోకి వచ్చేశాయని సెంటర్ ఫర్ బయొలాజికల్ డైవర్సిటీ వ్యాఖ్యానిస్తోంది. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ధ్రువపు ఎలుగులు, వాల్‌రస్‌లు అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకునే దిశగా ఇది పావులు కదుపుతోంది.
గాలిలోంచే 'ఛార్జింగ్'!

సెల్‌ఫోన్, లాప్‌టాప్, వీడియో కెమెరా... ఏది పనిచేయాలన్నా వాటిలో 'పవర్' ఉండాల్సిందే. విద్యుత్తు సాయంతో వాటి బ్యాటరీలను ఛార్జింగ్ చేసి తీరాల్సిందే. లాప్‌టాప్, వీడియో కెమెరాల సంగతేమోగానీ, నోకియా కంపెనీ సెల్‌ఫోన్‌లకు మాత్రం.. ఇక మీదట ఛార్జర్ల అవసరం ఉండదు. ఎందుకంటే, వాటిలో ఉండే బ్యాటరీలు గాలిలోంచే తమకు అవసరమైన విద్యుత్తును గ్రహించి రీఛార్జ్ అయిపోతాయి మరి!
మనందరికీ తెలిసిన విషయం తీగ గుండా విద్యుత్తు ప్రవహిస్తుందని. అయితే తీగ లేకుండా కూడా విద్యుత్తును ప్రవహింపజేయవచ్చని ఇటీవలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చెబుతోంది. దీనిని 'వైర్‌లెస్ పవర్'గా పిలుస్తున్నారు. ఈ విధానంలో విద్యుత్తు కొంత దూరం వరకు కిరణాల రూపంలో ప్రవహిస్తాయి. మార్గంలో ఉండే లైట్లను వెలిగిస్తాయి.
అయితే సెల్‌ఫోన్ దిగ్గజం నోకియా ఒకడుగు కాదు, పది అడుగులు ముందుకేసింది. తన ప్రయోగాలతో భవిష్యత్తులో ఓ సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించబోతోంది. ఛార్జర్ అవసరం లేకుండా, గాలిలోని రేడియో తరంగాలలో ఉండే విద్యుదయస్కాంత శక్తిని గ్రహించి దానిని విద్యుత్తుగా మార్చుకుని సెల్‌ఫోన్ల బ్యాటరీలు వాటంతట అవే రీఛార్జ్ అయ్యేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రయోగాలు జరిపిన నోకియా ప్రస్తుతం గాలి నుంచి 5 మిల్లీ వాట్ల విద్యుత్తును సృష్టించగలిగింది. భవిష్యత్తులో దీనిని 20 మిల్లీ వాట్లకు, ఆపైన 50 మిల్లీ వాట్లకు పెంచే దిశగా ప్రయోగాలు చేస్తోంది.
ఇదే గనుక జరిగితే ఆ కంపెనీ తయారు చేసే సెల్‌ఫోన్లకు ఛార్జర్ల అవసరమే ఉండదు. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ నోకియా మాత్రం వెనుకంజ వేయడం లేదు. కనీసం తాను తయారు చేసే ఏ సెల్‌ఫోనూ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి 'స్విచ్‌డ్ ఆఫ్' మోడ్‌లోకి వెళ్లకపోతే అంతేచాలునని.. ఈ ప్రయోగంలో తాను విజయం సాధించినట్లేనని చెబుతోంది. దెన్, ఆల్ ద బెస్ట్ నోకియా!
డ్రాయింగ్.. స్కెచ్చింగ్.. పెయింటింగ్ ఏదైనా క్షణాల్లో... సిద్ధం!
కళాకారులు అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. 'కానీ.. ఎలా? మనకు 'కళ' రాదే..' అని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. పేపరు, పెన్ను, పెన్సిల్, కుంచె, రంగులు.. ఇవేమీ లేకుండానే మీరు ఆర్టిస్ట్ అయిపోవచ్చు! కానీ ఫొటోలు మాత్రం కావాలండోయ్. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే ఒక్కసారి 'ఫొటో ఎఫెక్ట్ స్టుడియో' అనే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చేసుకోండి. మీరు 'సగం ఆర్టిస్'్ట అయిపోయినట్లే! మిగతా సగం ఆర్ట్‌ను ఆ సాఫ్ట్‌వేరే మీకు నేర్పుతుంది. మిమ్మల్ని 'కుంచె తిరిగిన ఆర్టిస్ట్'గా మార్చుతుంది.


ఫొటో ఎఫెక్ట్ స్టుడియో సాఫ్ట్‌వేర్ సాయంతో మీరు రెడీమేడ్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. క్షణాల్లో మిమ్మల్ని, మీ ఇంటిని, మీ వీధిని.. అవసరమైతే హైదరాబాద్ మొత్తాన్నీ ఏరియల్ షాట్‌లో చిత్రించవచ్చు. ఇందుకు మీకు కావలసిందల్లా ఆయా దృశ్యాల ఫొటోలు మాత్రమే. ఇంటర్నెట్‌లో లభించే ఈ ఫొటో ఎఫెక్ట్ స్టుడియో-వెర్షన్ 5.56 సాఫ్ట్‌వేర్ సహాయంతో క్షణాల్లో ఏ దృశ్యాన్ని అయినా పెన్సిల్ స్కెచ్, పెన్ స్కెచ్‌గా, ఔట్‌లైన్ డ్రాయింగ్‌గా మార్చుకోవచ్చు. లేదంటే వాటర్ కలర్స్ వేసిన పెయింటిగ్ మాదిరిగా మార్చుకోవచ్చు. దృశ్యాన్ని ఉబ్బెత్తుగా మార్చవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ట్రయల్ వెర్షన్‌ను ఒక్కసారి డౌన్‌లోడ్ చేసుకుంటే 100 సార్లు ఉపయోగించుకోవచ్చు
ఫొటో టు స్కెచ్ ఇలా..
ఈ సాఫ్ట్‌వేర్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ లేదా రన్ చేయండి. వెంటనే ముందుగానే లోడ్ చేయబడి ఉన్న ఓ ఫొటోతో ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో పైన ఫైల్, ఎడిట్, బ్లాక్ అండ్ వైట్, కలర్, కలర్ అడ్జస్ట్, వెయిన్స్, హెల్ప్ అని ఆప్షన్స్ ఉంటాయి. మొదట 'ఫైల్' అనే ఆప్షన్‌లోకి వెళ్లి ఏదైనా ఫొటోను 'ఓపెన్' చేసుకోవాలి. మీరు కోరుకున్న ఫొటో ఒక విండోలో కనిపిస్తుంది. అంతే - మీకు కావలసిన స్కెచ్చింగ్ ఆప్షన్‌ను ఎంచుకోగానే దానికి సంబంధించిన మరో చిన్న విండో ఓపెన్ అవుతుంది. అందులో 'ఓకే' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగానే మీరు సూచించిన విధంగా ఫొటో మారిపోతుంది. మీకు ఓపిక ఉండాలేగానీ, ఇంటర్నెట్‌లో ఇలా ఫొటోలను రకరకాల స్కెచ్‌లుగా మార్చుకునే సాఫ్ట్‌వేర్‌లు ఇంకా బోలెడు లభిస్తున్నాయి.
ఐ-టెక్ వర్చువల్ లేజర్ కీ-బోర్డు!
డెస్క్‌టాప్ కంప్యూటర్లు ఉపయోగించే వారికి కీబోర్డులు సుపరిచితమే. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న కీబోర్డు భవిష్యత్తులో ఈ రూపంలో ఉండకపోవచ్చంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇప్పటికే వైర్‌లెస్ కీబోర్డులు, మౌస్‌లు ఉపయోగిస్తున్న వారు ఎందరో! రాబోయే తరాలలో సాంకేతిక విజ్ఞానం మరింత ముందంజ వేస్తుందనడానికి ఓ గుర్తు వర్చువల్ లేజర్ కీ బోర్డు. ఈ తరహా పరిజ్ఞానం ఇప్పటికే అభివృద్ధి చెందింది.
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్ కీబోర్డులు భౌతికంగా ఉండేవి, పరిమాణంలో పెద్దవి. వర్చువల్ లేజర్ కీబోర్డుతో ఈ బాధ లేదు. చిన్న సెల్‌ఫోన్ పరిమాణంలో ఉండే దీనికి జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్క
డ కీబోర్డు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సాధారణ కీబోర్డులు చొచ్చుకొచ్చినంతగా ఇవి ఇంకా జనసామాన్యంలోకి రాలేదు. అయితే భవిష్యత్తు అంతా ఈ వర్చువల్ లేజర్ కీబోర్డులదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా ఐ-టెక్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ ఓ వర్చువల్ లేజర్ కీబోర్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. చూడడానికి చిన్న సెల్‌ఫోన్‌లా కనిపించే ఈ వర్చువల్ లేజర్ కీబోర్డు పరికరాన్ని ఆన్ చేయగానే దీని నుంచి కొన్ని లేజర్ కాంతి పుంజాలు బయటికొస్తాయి. ఇవి ఎదురుగా ఉన్న ప్రదేశంపై కీబోర్డును ఏర్పాటు చేస్తాయి. అంతేకాదు, మామూలు కీబోర్డుపై టైప్ చేసేటప్పుడు వచ్చే చప్పుడు ఈ వర్చువల్ కీబోర్డ్‌పై టైప్ చేసినప్పుడూ వస్తుంది. దీనివల్ల ఆయా కీలను సరిగా నొక్కామా? లేదా? అన్న సంశయం వినియోగదారులకు ఎంతమాత్రమూ కలగదు. ఎంత చీకట్లో అయినా సరే ఈ వర్చువల్ లేజర్ కీబోర్డుపై సులువుగా టైప్ చేయవచ్చు. బ్లూటూత్ సౌకర్యం కలిగిన ఈ వర్చువల్ లేజర్ కీబోర్డును బ్లాక్‌బెర్రీ, స్మార్ట్‌ఫోన్, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్, మ్యాక్, టాబ్లెట్ పీసీలకు సులువుగా అనుసంధానించుకోవచ్చు. కేవలం 80 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ కీబోర్డుకు బిల్టిన్ రీచార్జ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి పూర్తిస్థాయిలో చార్జి చేసుకుంటే ఏకధాటిగా రెండు గంటలసేపు టైప్ చేసుకోవచ్చు.
Wednesday, 24 June 2009
తక్కువ ధరలో 'యాపిల్ ఐఫోన్'!?

యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కొత్తగా 'యాపిల్ ఐఫోన్' మార్కెట్‌లోకి వచ్చినప్పుడయితే.. సినిమా థియేటర్‌లో టిక్కెట్ల కోసం బారులుదీరినట్లు అమెరికాలో యాపిల్ ఐ-స్టోర్స్ దగ్గర అక్కడి జనం 'క్యూ' కట్టారు. ఇక మన దేశంలో అయితే సెల్ వినియోగదారులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.. ఐఫోన్ 3జి ఎప్పుడొస్తుందాని! ఒక్క ఐఫోన్ 3జి మాత్రమే కాదు, అసలు యాపిల్ కంపెనీ ఏ ఉత్పత్తి తీసుకున్నా 'ఏక్ సే ఏక్' అన్నట్లు ఉంటాయి మరి. కానీ ఏ లాభం యాపిల్ ఐఫోన్ 3జి భారత్‌కైతే వచ్చింది కానీ, భారతీయులందరినీ అలరించలేక పోయింది. కారణం - దాని ధర. భారత్‌లో యాపిల్ ఐఫోన్ 3జి పంపిణీ బాధ్యతలను ఎయిర్‌టెల్, ఒడాఫోన్ తమ భుజాలపైన వేసుకున్నాయి. క్వాలిటీ ఉన్నా.. కాస్ట్‌లీ కావడంతో అన్ని వర్గాల ప్రజలు దీనిని అందు'కొనలేక'పోయారు.
అయితే సెల్ ప్రియులకు శుభవార్త ఏమిటంటే.. త్వరలో యాపిల్ ఐఫోన్ ధర తగ్గనుంది. అంటే ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఫోన్ 3జి ధర కాదు.. తక్కువ ధరలో యాపిల్ కంపెనీ మరో ఐఫోన్‌ను విడుదల చేయబోతోందట. అది కూడా రాబోయే రెండు మూడు నెలల్లోనే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ పుకారు.. షికార్లు చేస్తోంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ కూడా ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ వార్త ప్రచురించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యాపిల్ ఐఫోన్ 3జి రెండు వెర్షన్లలో లభిస్తోంది. 8 జిబి ఫోన్ రూ.9,485కు, 16 జిబి ఫోన్ రూ.14,225క లభిస్తున్నాయి. అయితే ఈ ధరలు విదేశాలలో మాత్రమే. మన దేశానికి వచ్చేసరికి ఈ రెండు మోడళ్ల ధరలు వరుసగా రూ.30,000, రూ.36,000. కానీ ప్రస్తుతం షికార్లు చేస్తున్న పుకార్ల ప్రకారం... త్వరలో విడుదలకానున్న ఐఫోన్ కూడా రెండు మోడళ్లలో లభిస్తుంది. ఒకటి 16 జిబి (ధర రూ.9,485) మరోటి 32 జబి (ధర రూ.14,225). అంతేకాదు, వీటితోపాటు మరో మోడల్ విడుదలకు కూడా యాపిల్ కంపెనీ సన్నాహాలు చేస్తోందని, అయితే ఈ మూడో మోడల్ ఐఫోన్‌లో ఇంటర్నల్ మెమరీ ఉండదని, ఇదే గనుక జరిగితే యాపిల్ కంపెనీకి చెందిన ఎంట్రీ-లెవల్ సెల్‌ఫోన్లలో ఇది స్మార్ట్‌ఫోన్ అవుతుందని డచ్ టి-మొబైల్‌కు చెందిన ఇన్వెంటరీ సిస్టమ్ చెబుతోంది. అయితే ఈ మూడో మోడల్ ధర ఎంతనేది మాత్రం ఈ సిస్టమ్ చెప్పడం లేదు.
మరో విషయం ఏమిటంటే - ఈసారి విడుదల చేయనున్న ఫోన్లకు యాపిల్ కంపెనీ ఏ పేరు నిర్ణయిస్తుందనేది కూడా రహస్యమే. మొట్టమొదటి మోడల్‌కు 'ఐఫోన్' అని, రెండోసారి విడుదల చేసిన మోడల్‌కు 'ఐఫోన్ 3జి' అని నామకరణం చేసిన ఈ కంపెనీ ఇప్పుడు విడుదల చేయబోయే మోడళ్లకు ఏం పేరు పెడుతుందో అని ప్రపంచ వ్యాప్తంగా సెల్ వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టి-మొబైల్‌కు చెందిన ఇన్వెంటరీ సిస్టం తెలిపిన సమాచారం మేరకు.. కొత్త మోడల్‌కు 'ఐఫోన్' పేరే ఉంచొచ్చు.. లేదా కాస్త భిన్నంగా ఉండాలని యాపిల్ కంపెనీ భావిస్తే గనుక 'ఐఫోన్ 2009' అనే పేరు కూడా తెరపైకి రావచ్చు. 'ఇవేవీ కావు.. కొత్తగా రాబోయే ఐఫోన్ పేరు 'ఐఫోన్ వీడియో', ఎందుకంటే ఇందులో మొట్టమొదటిసారిగా 'వీడియో రికార్డింగ్' సౌకర్యాన్ని యాపిల్ తన వినియోగదారులకు అందించనుంది.. అంతేకాదు, ఇందులో కొన్ని అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే సదుపాయాలు కూడా ఉండబోతున్నాయి..' అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అన్నీ బాగానే ఉన్నాయి కానీ, మన దేశానికి వచ్చేసరికి మాత్రం ఈ పేర్లు, అందులో ఉండబోయే ఫీచర్లు, మెమరీ.. ఇలాంటివేమీ ముఖ్యం కావు.. దాని 'ధరెంత' అన్నదే అసలు పాయింటు.. ఏమంటారు?
సిక్స్-డి సినిమా వచ్చేసింది!
మీరెప్పుడైనా త్రి-డి సినిమా చూశారా? పోనీ చూడకపోయినా, కనీసం ఇలాంటి సినిమా గురించి వినే ఉంటారు. అయితే సిక్స్-డైమన్షనల్ సినిమా గురించి విన్నారా? వినడం కాదు, పోనీ ఇలాంటి సినమా ఒకటి వస్తుందేమో అనే ఆలోచన అయినా చేశారా? మీరే కాదు, ప్రపంచంలో ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. అయితే ఆ అద్భుతం జరిగిపోయింది. సిక్స్ డైమన్షనల్ సినిమా వచ్చేసింది. బ్రిటన్‌కు చెందిన 'లైట్ సినిమా' సంస్థ ఈ సరికొత్త ప్రయోగాన్ని ఆవిష్కరించింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి సిక్స్-డైమన్షనల్ సినిమాను రొమేనియాలోని బుఖారెస్ట్‌లో ఉన్న థియేటర్‌లో విడుదల చేసింది. యూరప్‌లో హై-ఎండ్ డిజిటల్ థియేటర్లను ఏర్పాటు చేయడం ఈ 'లైట్ సినిమా' సంస్థ ఉద్దేశం. సిక్స్ డైమన్షనల్ సినిమా ప్రదర్శనలో.. త్రి-డి సినిమాతోపాటుగా వర్షం, గాలి, వాసన కూడా మరో మూడు ఎలిమెంట్‌లుగా పనిచేస్తాయి. ప్రేక్షకులు కూర్చున్న సీట్లు ఎటు కావాలంటే అటు కదలడం మరో విశేషం. ఇందుకోసం బుఖారెస్టలో 40 సీట్లు కలిగి, 8 స్క్రీన్‌లతో కూడిన సినీప్లెక్స్ అనే థియేటర్‌ను రూపొందించింది. త్వరలోనే రెండో సిక్స్-డి సినిమాను విడుదల చేసేందుకు 'లైట్ సినిమా' రెడీ అవుతోంది, అదీ బుఖారెస్ట్‌లోనే!
చైనా కంప్యూటర్లలో 'యాంటీ పోర్న్ సాఫ్ట్‌వేర్'!
ఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీ సైట్లకు ఉన్న డిమాండ్ తెలిసిందే. రోజురోజుకీ విస్తరిస్తున్న ఈ బూతు పురాణానికి అడ్డు కట్ట వేసేందుకు చైనా కృతనిశ్చయంతో ఉంది. చాలారోజుల క్రితమే అడల్ట్ వెబ్‌సైట్లు చైనాలో ఓపెన్ అవకుండా చేసింది. ఇంటర్నెట్‌లో చైనాకు చెందిన వ్యక్తులు, సంస్థలు ఇలాంటి వెబ్‌సైట్లు ఏమైనా నిర్వహిస్తున్నట్లయితే వాటిని బలవంతంగా మూసివేయించింది. అయినా సరే చైనీయులు నెట్ బ్రౌజింగ్ సమయంలో పోర్న్ వెబ్‌సైట్‌లను సెర్చ్ చేయడం గమనించి, అసలు 'పోర్న్', 'సెక్స్' అనే పదాలు కూడా ఇంటర్నెట్‌లో కనిపించకుండా చేయాలని సంకల్పించింది.
జూలై 1 నుంచి కంప్యూటర్ కొన్నప్పుడు దాంతోపాటు బండిల్‌గా ఇచ్చే సాఫ్ట్‌వేర్‌లలో ఇంటర్నెట్‌లో ఇలాంటి పదజాలం, బొమ్మలను, వీడియోలను వడపోసే సాఫ్ట్‌వేర్ కూడా తప్పనిసరిగా ఉండాలని పర్సనల్ కంప్యూటర్ల తయారీదారులను ఆదేశించింది. ఇప్పటికే జిన్ హుయి కంప్యూటర్ సిస్టం ఇంజనీరింగ్ కంపెనీ 'ది ఫ్రీ గ్రీన్ డామ్-యూత్ ఎస్కార్ట్ సాఫ్ట్‌వేర్' అనే ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఒకదానిని తయారు చేసినట్లు కూడా చైనా సాంకేతిక, సమాచార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇది ఇతర దేశాలకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీదారులకు పెద్ద దెబ్బే. ఎందుకంటే, వారూ ఇంటర్నెట్‌లో బూతు పురాణాన్ని వడపోసే ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను బండిల్‌గా అందజేస్తే తప్ప వారు తయారు చేసిన కంప్యూటర్లను చైనాలో అమ్మలేవు మరి!
Subscribe to:
Posts (Atom)
